ఒకప్పుడు అన్న చదివిన పుస్తకాన్నే తమ్ముడు చదివేవాడు, అక్క చదివిన పుస్తకాన్నే చెల్లెలు చదివేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక ఒక పుస్తకాన్ని మరొకరు చదవడానికి వాళ్లు పెట్టుకున్న నిబంధనలు అంగీకరించడం లేదు. ‘‘మా పెద్ద పిల్లాడు చదివింది కూడా మీ స్కూల్లోనే, మీ కౌంటర్‌లో కొన్న పుస్తకాలే ఇవి. చిన్న పిల్లాడిని ఈ పుస్తకాలతో చదువుకోనివ్వండి’’అని పేరెంట్స్ మొత్తుకున్నా సరే, ప్రైవేటు స్కూళ్ల రూల్స్ ఒప్పుకోవు. ‘‘అంతగా ఆ పుస్తకాలు బాగున్నాయనుకుంటే మీ చిన్న పిల్లవాడికి రెండో సెట్‌గా ఉంటాయి. ఇంట్లో ఉంచుకోండి. ఒకవేళ ఇప్పుడు కొన్న పుస్తకాల్లో ఏవైనా పోతే అవి పనికొస్తాయి’’ అని.. స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. పేరెంట్స్ ఇంకేం చేస్తారు? ఓ ఏడాది పాటు దాచి, అవీఇవీ అన్నీ కలిపి పాత పేపర్లు కొనేవాళ్లకు తూకానికి వేసేస్తారు!
ప్రభుత్వ ఉద్యమం!
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల పుస్తకాల పొదుపు ఉద్యమం మొదలు పెట్టింది! వాడిన పుస్తకాలు వెళ్లాల్సింది పాత పేపర్ల దుకాణానికి కాదని, మరో పేద విద్యార్థికి అవి జ్ఞానాన్ని అందించాలనీ ప్రభుత్వం సంకల్పించి పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’ నుంచి ఢిల్లీలోని అన్నీ స్కూళ్లకు ఆదేశాలు వెళ్లాయి. వాటి ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థికి పెద్ద తరగతికి వెళ్లినప్పుడు కొత్త పుస్తకాలు ఇచ్చే టైమ్‌లో అతడికి గత ఏడాది ఇచ్చిన పాత పుస్తకాలను స్కూలు సిబ్బంది వెనక్కి తీసుకోవాలి. వాటితో ఓ బ్యాంకు తయారు చేయాలి. పాత పుస్తకాలలో జారిపోతున్న పేజీలను అతికించి, పెన్సిల్ రాతలను చెరిపేసి వాటిని మళ్లీ వాడుకునే విధంగా సిద్ధం చేయాలి. కొంతమంది పిల్లలు పుస్తకాలను పూర్తిగా పనికి రానంతగా చించేసినా సరే వాటిని మెరుగుపరచాలి. దీనివల్ల సగం పుస్తకాలైనా బుక్ బ్యాంకుకు చేరతాయి. అంటే ప్రభుత్వం తిరిగి పుస్తకాలు ముద్రించాల్సిన ఖర్చులో ఏటా çసగానికి సగం ఆదా అవుతుంది. అంతకంటే ముఖ్యంగా కాగితం తయారీకి అవసరమైన సహజ వనరులు ఆదా అవుతాయి.
పేరెంట్స్ సహకారం
తాజాగా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అక్కడి ప్రభుత్వ పాఠశాల సిబ్బంది పాత పాఠ్య పుస్తకాలను విద్యార్థుల నుంచి సేకరించి ఒకచోట అందుబాటులో ఉంచుతారు. ఆ పుస్తకాలను తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. అలాకూడా కొనలేని పిల్లలకు వాటిని ఉచితంగా ఇస్తారు. ఈ విధానాన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఆచరిస్తే పేద తల్లిదండ్రులు ఆర్థికంగా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు కొత్త పుస్తకాల ముద్రణ తగ్గుతుంది కనుక పర్యావరణానికీ మేలు జరుగుతుంది. పేరెంట్స్ కూడా పూనుకుని తమ పిల్లలు చదివేసిన పాఠ్యపుస్తకాలను కాలనీలలో ఉండే లైబ్రరీలకు ఇస్తే.. పుస్తకాలు కొనలేని వాళ్లు వాటిని తీసుకుంటారు. ఏడాది మధ్యలో పిల్లలు పుస్తకాలు పోగొట్టినప్పుడు లైబ్రరీలో ఉండే ఈ పుస్తకాలు పెద్ద ఆసరా అవుతాయి.
అక్షరం అమూల్యం
టెక్ట్స్ బుక్ జీవితకాలం తొమ్మిది నెలలో ఏడాదో కాదు. వాటికి దక్కాల్సిన గౌరవం కాగితం తూగే బరువుతో కాదు. పుస్తకం విలువ వెలకట్టలేనంత విలువైన సమాచారం. అమూల్యమైన వాటిని అంతే అమూల్యంగా వాడుకోవాలి. ఢిల్లీలో మొదలైన ఈ బుక్ బ్యాంక్ ఉద్యమం అన్ని రాష్ట్రాలకూ విస్తరించాలి. పాఠ్య పుస్తకాల జీవితకాలం ఎంత ఉంటుంది? ఏడాది అనుకుంటాం కదా! ఏడాది అన్నది విద్యాసంవత్సరానికి మాత్రమే కానీ, పుస్తకానికి కాల పరిమితి అంటూ ఉండదు. పాత విద్యార్థులు వెళ్లిపోయి, కొత్త విద్యార్థులు వచ్చినా మళ్లీ ఇదే పుస్తకాన్నే కదా చదవాలి. అందుకే జాగ్రత్తగా వాడుకున్నంత కాలం, వాడుకోవడం తెలిసినంత కాలం పాఠ్యపుస్తకాలు నిలిచి ఉంటాయి. సిలబస్ మారే వరకు పాఠ్యపుస్తకాలు కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విద్యార్థులే.
Comments
Please login to add a commentAdd a comment