scholarship
-
రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది. అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో తాజా దరఖాస్తుల ప్రక్రియ మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల పోరు దీక్ష
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/తిరుపతి కల్చరల్: ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.3,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని, జీవో 77ను రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు పోరు దీక్ష చేశాయి. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఏ, ఏఐవైఎఫ్ సోమవారం ఒక రోజు పోరుదీక్ష చేపట్టాయి.విద్యార్థుల దీక్షలను వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. తిరుపతిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్ పిలుపు మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రిలయన్స్ స్కాలర్షిప్లో మెరిసిన తెలుగు విద్యార్థులు
రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ప్రఖ్యాత అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు (scholarship) 2024-25 బ్యాచ్‌కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులను రిలయన్స్ ఫౌండేషన్ ఎంపిక చేసింది.విద్యలో నాణ్యత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్షిప్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. విద్యను సమాన అవకాశాలను అందించేందుకు మార్గంగా మార్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతను ఈ ప్రోగ్రామ్ నొక్కిచెబుతోంది.దేశం నలుమూలల నుంచి ఎంపికైన 5000 మంది విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, ఇతర విద్యా ఖర్చుల కోసం ఈ కార్యక్రమం ద్వారా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల్లో 70% మంది రూ. 2.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలనుంచి రావడం విశేషం.రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల (Telugu states) విద్యార్ధులు తమ ప్రతిభతో 2024-25 బ్యాచ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్ధులు (25.22%) స్కాలర్షిప్ సాధించారు. -
ఎడతెగని ఎదురుచూపు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన సంగీత గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో దరఖాస్తు చేయగా.. 2023 ఆగస్టులో ఆమెకు అడ్మిషన్ లభించింది. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని పీజీ కోర్సులో చేరిపోయింది. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పు చేసి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెస్ మొదటి సంవత్సరం పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో రెండో సంవత్సరం కూడా పూర్తవుతుంది. కానీ విద్యానిధి పథకానికి ఆమె అర్హత సాధించిందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత తండ్రి మాసాబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగా.. అర్హుల జాబితా ఇంకా సిద్ధంకాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనకు అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు.. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులివి.సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతి బా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హుల ఎంపిక ఏడా దిన్నరగా నిలిచిపోయింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణే తప్ప అర్హులను తేల్చటంలేదు. దీంతో ఈ స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకొన్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సగం కోర్సు కూడా పూర్తిచేశారు. కానీ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు సీజన్లలో వచ్చిన దరఖాస్తుల విషయం ఎటూ తేల్చకుండానే.. ఇప్పుడు మరోమారు దరఖాస్తుల స్వీకరణ సైతం చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ నాన్చుడు ధోరణి వల్ల దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కూడా ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని అందిస్తున్నాయి. ఆ శాఖలు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి స్కాలర్షిప్లు అందిస్తుండగా, బీసీ సంక్షేమ శాఖలో మాత్రం ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.డిమాండ్ ఎక్కువ.. కోటా తక్కువపూలే విదేశీ విద్యానిధి పథకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర శాఖలతో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖలో వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ అని ఏటా రెండుసార్లు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మొదటి దఫా, జనవరిలో రెండో దఫా దరఖాస్తులను సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత... విద్యార్థుల డిగ్రీ మార్కులతోపాటు జీఆర్ఈ/జీమ్యాట్‌లో మార్కులు, ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖలవారీగా ప్రత్యేక కమిటీలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక ఆలస్యం లేకుండా సాగిపోతున్నది. బీసీ సంక్షేమ శాఖలోవిపరీతమైన పోటీ ఉండడంతో ఉప కులాలవారీగా కోటాను విభజిస్తూ అర్హులను ఎంపిక చేస్తున్నారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు. ఏటా (రెండు సీజన్లు కలిపి) 300 మందికి స్కాలర్షిప్లు ఇస్తారు. ఒక్కో సీజన్‌కు సగటున 3 వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన గత రెండు సీజన్లలో 6 వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. కోటా పెంపు కోసమేనట!పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రస్తుతం 300 యూనిట్లుగా ఉన్న కోటాను కనీసం వెయ్యికి పెంచాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కోటా పెంపు ప్రతిపాదనలు పంపింది. ఏటా కనీసం 800 మంది విద్యార్థులకైనా ఈ పథకం కింద స్కాలర్íÙప్లు ఇవ్వాలని సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైలు సీఎం వద్దకు చేరి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కోటా పెంపు తర్వాతే అర్హుల ఎంపిక చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ప్రస్తుత పరిస్థితి2023–24 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు 6 వేలకుపైగా ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్షిప్ రూ.20 లక్షలు సంవత్సరానికి ఇచ్చే మొత్తం స్కాలర్íÙప్లు 300 -
1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్
ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం మహీంద్రా గ్రూప్ ఉపకారవేతనాలు అందిస్తుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని ‘మహీంద్రా సార్థి అభియాన్’ పేరుతో స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన 1000 మంది విద్యార్థినులకు పైచదువుల కోసం రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నారు.మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు వినోద్ సహాయ్ మాట్లాడుతూ..‘మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం సాయం చేస్తున్నాం. మహిళాసాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పదో తరగతి పూర్తయి పైచదువులు చదివాలనుకునే ప్రతి ట్రక్ డ్రైవర్ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000 ఇవ్వడంతోపాటు గుర్తింపు సర్టిఫికెట్ కూడా అందిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా కావడం విశేషం అని అధికారులు తెలిపారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించిన కంపెనీ ఇప్పటివరకు 10,029 మందికి ఉపకారవేతనాలు అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ట్రాన్స్పోర్ట్ హబ్‌లను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. విద్యార్థినుల మెరిట్, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్ చేసి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. -
5100 మందికి రూ.లక్షల్లో స్కాలర్షిప్లు
దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి తమ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది.దేశ వృద్ధిలో కీలకమైన యువతను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్ 2022లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా పదేళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్లు అందించడం లక్ష్యం. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ మొత్తం 5100 మందికి స్కాలర్షిప్లు అందించనుంది.ఈ విద్యా సంవత్సరంలో అందించే స్కాలర్‌షిప్‌లలో 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్, 100 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ అవకాశం కల్పిస్తోంది. ఈ స్కాలర్షిప్ కింద అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.6 లక్షల వరకు సాయం అందించనుంది. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు అక్టోబర్ 6వ తేదీ. -
కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్: బాలికలకు స్కాలర్షిప్స్..
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలలో భాగంగా కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఈఎఫ్) తమ కన్య స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా 500 మందికి స్కాలర్షిప్లను ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికల ఉన్నత విద్యార్జనకు వీలుగా ఏటా రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని 4–5 సంవత్సరాల పాటు అందిస్తామని చెప్పారు. రూ.6లక్షల లోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారై, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఆ పైన మార్కులు సాధించిన వారు ఈ స్కాలర్షిప్స్ దరఖాస్తుకు అర్హత పొందుతారని తెలియజేశారు.ఇవి చదవండి: ‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు.. -
ఏడుగురు భారత సంతతి విద్యార్థులకు ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లు!
ఏడుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మక నైట్స్ హెనెస్సీ స్కాలర్షిప్ను పొందారు. ప్రంచంలోనే అతిపెద్ద గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ అయిన ఈ స్కాలర్షిప్ కోసం 90 మంది స్కాలర్లను ఎంపిక చేయగా, వారిలో ఆంక్ అగర్వాల్, వాసన్ కుమార్, అనీష్ పప్పు, ఇషా సంఘ్వి, కృతిక సింగ్, కృష్ణ పాఠక్, రాహుల్ పెనుమాక ఉన్నారు. ఆ విద్యార్థులంతా వైద్యం,సాంకేతికత, ఇంజనీరింగ్, న్యాయ రంగాలు తదితర విభాగాల్లో ఈ స్కాలర్షిప్లను పొందారు. వాళ్లంతా ఆ యూనివర్సిటీలో పీహెచ్డీ, ఎండీఏ, ఎండీ డిగ్రీలు చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా 30 దేశాలకు చెందిన 90 మంది విద్యార్థులు స్టాన్ఫోర్డ్లోని ఏడు పాఠాశాలల్లో 45 గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు చేయడానికి రావడం విశేషం. ఈ ఏడాది ఆ విద్యార్థుల్లో ఆస్ట్రియా, బహ్రెయిన్, బెలారస్, బొలీవియా, బల్గేరియా, ఫ్రాన్స్, శ్రీలంక విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక ఎంపికైన విద్యార్థుల బ్యాచ్‌లో దాదాపు 47% మంది యూఎస్ యేతర పాస్‌పోర్ట్‌లు కలిగిఉన్నారు. ఈ మేరకు నైట్-హెన్నెస్సీ స్కాలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీనా సీలిగ్ మాట్లాడుతూ..ప్రతి స్కాలర్ తన నేపథ్య సమాజానికి ఆదర్శంగా ఉండటమేగాక ప్రత్యేక దృక్పథాన్ని తీసుకొస్తారు. అలాగే ప్రపంచంలోని అన్ని సవాళ్లను అధిగమించేలా విభిన్న సంస్కృతుల భావజాలన్ని ఆకళింపు చేసుకునేలా జ్ఞానాన్ని సముపార్జించి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. కాగా, ఈ ఫెలోషిప్తో విద్యార్థులు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల గ్రాడ్యేయేట్ అధ్యయనాన్ని కొనసాగించేలా ఆర్థిక సాయం అందుకుంటారు .(చదవండి: భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!) -
జాతీయ ఉపకార వేతనాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షి, అమరావతి: కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే ‘సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్’లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చినట్లు ఇంటర్మిడియెట్ విద్యామండలి కమిషనర్ సౌరభ్ గౌర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమాచారాన్ని డీవీఈవోలు, ఆర్ఐవోలు అన్ని మేనేజ్మెంట్స్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు తెలియజేయాలన్నారు. విద్యార్థుల డేటాను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, వివరాల ఆధారంగా http://www.scholarships.gov.in వెబ్సైట్లో స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్‌లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్‌లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్‌లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
ఒక్కొక్కరికి రూ. 2లక్షలు.. 5వేల విద్యార్థులకు అవకాశం - రిలయన్స్ ఫౌండేషన్
రిలయన్స్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. దీని కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు 2023 అక్టోబర్ 15లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అన్ని బ్రాంచ్‌లలోని మొదటి సంవత్సరం రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్షిప్ మెరిట్ ఆధారంగా చేసుకుని అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇందులో మహిళా విద్యార్థులకు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. 2022 - 23 విద్యాసంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీని కోసం అప్పుడు లక్ష మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం! రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.scholarships.reliancefoundation.org వెబ్సైట్ సందర్శించవచ్చు. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) బంపరాఫర్ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్ఇన్ (CERT-In)తో గూగుల్ క్లౌడ్ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్ట్ఇన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) రూ.లక్ష స్కాలర్షిప్ కూడా.. 'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్ల నిర్వహణ వంటివి గూగుల్ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్షిప్ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది. ‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట్ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. -
మైనారిటీ స్కాలర్షిప్ పేరిట రూ.144 కోట్ల కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీ స్కాలర్షిప్ కార్యక్రమంలో అవకతవకలపై విచారణ చేపట్టిన సీబీఐ ఈ మొత్తం విద్యా సంస్థల్లో 53 శాతం బోగస్ సంస్థలేనని తేల్చింది. మైనారిటీలకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో కింద యాక్టివ్‌గా ఉన్న విద్యా సంస్థలలో దాదాపు 53 శాతం నకిలీవేనని గుర్తించారు సీబీఐ అధికారులు. గత ఐదేళ్ళలో 18 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 830 సంస్థల్లో భారీగా అవినీతి జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఈ కుంభకోణంలో దాదాపుగా రూ.144.83 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించింది సీబీఐ. అనుమానిత నిందితుల్లో ఈ 830 సంస్థలకు చెందిన ప్రభుత్వాధికారులు, అనేక PSU బ్యాంకుల అధికారులు ఉన్నారని తెలిపింది సీబీఐ. ఏటా సుమారు 65 లక్షల మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయా పథకాల క్రింద మైనారిటీ స్కాలర్షిప్లను పొందుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారాసీలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేవారు. Central Bureau of Investigation (CBI) registers case against unknown officials in connection with alleged minority scholarship scam of Rs 144 crores — ANI (@ANI) August 29, 2023 ఇది కూడా చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ.. -
పేద బాలికలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చేయూత
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు చెందిన సామాజిక సేవా సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిరుపేద విద్యారి్థనులకు రూ.100 కోట్లతో ‘స్టెమ్ స్టార్’ స్కాలర్షిప్ను అందిస్తున్నట్టు ప్రకటించింది. మొదటి దశలో 2,000 మంది బాలికలకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. పేరొందిన విద్యా సంస్థల్లో.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్ (స్టెమ్) విభాగాల్లో కోర్సులు చేసే, ఆర్థికంగా బలహీన వర్గాల వారు ఇందుకు అర్హులని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. స్టెమ్ స్టార్ స్కాలర్షిప్ అన్నది ట్యూషన్ ఫీజులు, నివాస వ్యయాలను చెల్లించడంతోపాటు, రూ.లక్ష వరకు స్టడీ మెటీరియల్ కోసం ఇస్తుంది. ‘‘పేదరికం ఎంతో యువతను విద్యకు దూరం చేస్తోంది. బాలికలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మహిళలు విద్యావంతులు అయితే వారి పిల్లల స్కూలింగ్‌పై సానుకూల ప్రభావం చూపించడాన్ని గమనించొచ్చు. అందుకే స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్ కార్యక్రమం ఉన్నత విద్య చదువుకోవాలనే బాలికలకు సాధికారతను కలి్పంచనుంది’’అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాణి తెలిపారు. -
జీఆర్టీ జ్యువెలర్స్ చేయూత: రూ. 50 లక్షల స్కాలర్షిప్స్
హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థుల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ‘జీఆర్టీ జ్యువెలర్స్’ చేయూత అందించింది. ఈ విద్యా సంవత్సరం(2023-24) మొదటి లేదా రెండో ఏడాది ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులు చదువుతున్న వారికి స్కాలర్ షిప్స్ అందించింది. అర్హులైన 100 మంది విద్యార్థులకు రూ.50 లక్షల ఉపకార వేతనాలు మంజూరు చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయితే డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని వెల్లడించింది. ఉన్నత విద్య ద్వారానే సామాజిక చైత్యనం అభివృద్ధి చెందుతుందని కంపెనీ తెలిపింది. -
పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందుడుగు వేశారు. తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రతిభగల పేద విద్యార్ధులకు అండగా నిలిచారు. తాను చదువుకున్న కళశాలలో ప్రస్తుతం అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందించారు. కళాశాల పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి నాట్స్ అధ్యక్షునిగా ఎన్నికై తాను చదువుకున్న కళాశాలలోనే పేద విద్యార్థులకు సహాయ,సహకారాలు అందించడం మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని పలువురు అభినందించారు. మెరిట్ స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ గల విద్యార్ధులను మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సాహిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. (చదవండి: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం) -
5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 5,000 మంది విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు. 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 2022–23 సంవత్సరానికి రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లను ప్రదానం చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు రూ.2 లక్షల వరకు గ్రాంట్‌ని అందుకుంటారని వివరించింది. స్కాలర్షిప్స్ అందుకునే విద్యార్థుల్లో ఇంజనీరింగ్/టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, కామర్స్, ఆర్ట్స్, బిజినెస్/మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్, ఇతర ప్రొఫెషనల్ డిగ్రీలకు చెందినవారు ఉన్నారు. స్కాలర్స్‌లో 51 శాతం మంది బాలికలు. 4,984 విద్యా సంస్థలలో చదువుతున్న దాదాపు 40,000 మంది దరఖాస్తుదారుల నుండి కఠినమైన ప్రక్రియ ద్వారా వీరి ఎంపిక జరిగింది. ఇందులో ఆప్టిట్యూడ్ టెస్ట్, 12వ తరగతి మార్కు లు, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అర్హుల జాబితా రూపొందింది. పదేళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్స్ అందజేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ 2022 డిసెంబర్లో ప్రకటించింది. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
ఎస్సీ స్కాలర్‌షిప్‌లకు అందని కేంద్ర సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులకు కేంద్ర నిధులు అందడం లేదు. దీనికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్లుగా నిధుల విడుదలను నిలిపివేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపితేనే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. దీనితో గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సిన రూ.775 కోట్లు ఆగిపోయాయి. అంతేకాదు ఇలా నిలిచిన నిధులను తదుపరి ఏడాది ఇచ్చే (క్యారీ ఫార్వర్డ్) అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని.. అంటే భారమంతా రాష్ట్రంపై పడినట్టేనని అధికారులు చెప్తున్నారు. కేంద్ర నిధులు విడుదలకాక రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులను సర్దుబాటు చేయాల్సి రావడంతో విద్యార్థులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందంటున్నారు. నేరుగా ఇచ్చేందుకే కేంద్రం పట్టు.. ఎస్సీవర్గాల వారికి నేరుగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్ల కింద నిబంధన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అందించే సాయం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం కాకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం.. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ నిర్దేశిత ఫార్మాట్లో వివరాలను అందజేసినా.. ఉపకార వేతన దరఖాస్తులు స్వీకరించిన వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ఆ ఫార్మాట్లో వివరాల సమర్పణకు, ఇతర నిబంధనలకు రాష్ట్రం అంగీకరించకపోవడం, వివరాలు పంపకపోవడంతో కేంద్రం నిధుల విడుదలను ఆపేసింది. మూడేళ్లలో ఇప్పటివరకు రూ.775 కోట్లు ఇలా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థి ఖాతాలో జమచేస్తుండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పొంగులేటి కొత్త పార్టీ.. పేరు అదేనా? -
విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
విజయనగర్ కాలనీ: పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడంతో పాటు 16 లక్షల కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అంజి, నీల వెంకటేశ్, రామకృష్ణ నాయకత్వంలో మాసాబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను వేలాది మంది విద్యార్థులతో కలిసి ముట్టడించారు. ముట్టడిలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, ఇటీవల పెరిగిన నిత్యావసర ధరల నూనెలు, పప్పులు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. హోటల్లో ఒక్క పూట భోజనం కనీసం రూ.60 ఉందని, హాస్టల్ విద్యార్థులకు పూటకు రూ.10 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు రూ.950 ఇవ్వడంలో ఏమైనా న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. 2013 వరకు కోర్సు ఫీజులు మంజూరు చేశారని, 2014 నుంచి ప్రభుత్వం పూర్తి ఫీజు స్కీమ్‌కు పరిమితులు విధిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుపతి, అనిల్, అనంతయ్యలతో పాటు వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు జీఆర్టీ జ్యువెలర్స్ అండ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన జీఆర్టీ జ్యువెలర్స్.. ఎంతో కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇందుకోసం అందిన వెయ్యి దరఖాస్తులను పరిశీలించి 71 మంది అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసింది. ఒకటో సెమిస్టర్‌కు అర్హులైన విద్యార్థులకు రూ.25 లక్షలు అందజేసింది. రెండో సెమిస్టర్‌కు కూడా ఉపకార వేతనాలను అందిస్తామని.. డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని సంస్థ ఎండీ జీఆర్ ‘ఆనంద్’అనంతపద్మనాభన్ స్పష్టం చేశారు. -
నిజమైన హిందూధర్మ పరిరక్షకుడు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన హిందూ ధర్మపరిరక్షకుడని మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. కొంతమంది రాజకీయాల కోసం హిందూమతాన్ని వాడుకుంటున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం అలోచించే సీఎం కేసీఆర్ అని, బ్రాహ్మణులపట్ల అపార గౌరవం కలిగిన నేత అని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ సమాజ్ సామూహిక భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారని అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ‘వివేకానంద విదేశీ విద్యాపథకం’అర్హులకు స్కాలర్షిప్ మంజూరు పత్రాలను అందించే కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు అర్చకులకు పుణ్యకార్యం జరిగితేనే జీతాలు వచ్చే పరిస్థితి ఉండేదని, కానీ ముఖ్యమంత్రి కృషితో ప్రతీనెల అర్చకులకు జీతాలు సమయానికి వచ్చే వ్యవస్థ ఏర్పాటైందని వివరించారు. దేవాలయాల కోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. విదేశీవిద్య కోసం ఈ ఏడాది 121 మందికి రూ.24.20 కోట్లు మంజూరయ్యాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వేద విద్యార్ధులకు నెలకు రూ.250, వేదవిద్య పూర్తయ్యాక వృత్తిలో నిలదొక్కుకునేందుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో కొత్త బ్రాహ్మణభవన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన ధరల మేరకు స్కాలర్షిప్ ఇవ్వాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): పెరిగిన ధరల మేరకు విద్యార్థులకు ఇచ్చే ఉప కారవేతనాలను కూడా పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రెండేళ్లుగా బకాయి ఉన్న రూ.3,500 కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలో 16 బీసీ సంఘాలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ రూ.1,800 నుంచి రూ. 5,000కు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,500 నుంచి 1,800కు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీబంధు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. జూనియర్ అడ్వొకేట్లకు స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు. -
బీసీలకు బర్లు, గొర్లు కాదు, బడులు కావాలె
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాడానికి స్కాలర్ షిప్‌లు, ఫీజులు ఇవ్వాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గొర్లను, బర్లను ఇస్తూ బీసీలను మళ్లీ కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘పాలమూరు నుంచి పట్నం వరకు’పేరిట డిసెంబర్ రెండో తేదీన చేపట్టిన బీసీల పోరుయాత్ర గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించిన బీసీల పోరుగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని, స్కాలర్షిప్లు, మెస్‌చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆసరా పింఛన్‌దారులకు రూ.2016 రూపాయలు ఇస్తుండగా, హాస్టల్ విద్యార్థులకేమో రూ.1,500 ఇస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరు రవికృష్ణ గౌడ్, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు స్వామిగౌడ్, పాలకూరి కిరణ్, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం: ఆర్.కృష్ణయ్య
పంజగుట్ట (హైదరాబాద్): వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. సోమ వారం బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కో విద్యార్థికి రూ.20 వేల స్కాలర్షిప్, పాఠశాల విద్యార్థులకు రూ.15 వేలు, మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని తెలిపారు. లోటుబడ్జెట్లో ఉన్న రాష్ట్రమే ఇస్తుండగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఎనిమిదేళ్లుగా 5.70 లక్షల మంది బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కరికీ మంజూరు చేయలేదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకుడు జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.