రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ప్రఖ్యాత అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు (scholarship) 2024-25 బ్యాచ్‌కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులను రిలయన్స్ ఫౌండేషన్ ఎంపిక చేసింది.
విద్యలో నాణ్యత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్షిప్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. విద్యను సమాన అవకాశాలను అందించేందుకు మార్గంగా మార్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతను ఈ ప్రోగ్రామ్ నొక్కిచెబుతోంది.
దేశం నలుమూలల నుంచి ఎంపికైన 5000 మంది విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, ఇతర విద్యా ఖర్చుల కోసం ఈ కార్యక్రమం ద్వారా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల్లో 70% మంది రూ. 2.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలనుంచి రావడం విశేషం.
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల (Telugu states) విద్యార్ధులు తమ ప్రతిభతో 2024-25 బ్యాచ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్ధులు (25.22%) స్కాలర్షిప్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment