
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీకి (Nita Ambani) అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆమె దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేసింది. మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే చేతుల మీదుగా నీతా అంబానీ ఈ ప్రశస్తిని అందుకున్నారు.
మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రం గురించి తెలియజేస్తూ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, మహిళా సాధికారత వంటి వివిధ రంగాలలో నీతా అంబానీ గణనీయమైన ప్రభావాన్ని చూపారంటూ రిలయన్స్ ఫౌండేషన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తెలిపింది.
"మా వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీని దార్శనిక నాయకురాలిగా, వితరణశీలిగా, అసలైన గ్లోబల్ గేమ్‌ఛేంజర్‌గా గుర్తిస్తూ మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే ప్రతిష్టాత్మక గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు" అని రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్‌లో వివరించింది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నీతా అంబానీ చేతితో నేసిన అద్భుతమైన శికార్గా బనారసి చీర ధరించి పాల్గొన్నారు. భారతీయ కళా నైపుణ్యానికి ఉదాహరణగా నిలిచే ఈ చీర అధునాతన కడ్వా నేత నైపుణ్యం, సాంప్రదాయ కోన్యా హంగులను సంతరించుకుంది. నీతా అంబానీ ఈ చీరను ధరించడం ద్వారా భారతదేశ కళాత్మక వారసత్వ వైభవాన్ని మరోసారి అంతర్జాతీయంగా చాటారు.
Comments
Please login to add a commentAdd a comment