వాయిస్ ఇండియా కిడ్స్ రియాలిటీ షోలో షకీనా ముఖియా
ప్రతిభ కన్నా పద్ధతి ముఖ్యం అనుకుంది ఒక స్కూలు. పద్ధతిదేముందీ, ప్రతిభే ముఖ్యం అనుకుంది ఇంకో స్కూలు. దాంతో ప్రతిభ ఉన్న ఒక బాలికకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆల్ బాయ్స్ స్కూల్లో సీటు లభించింది! అది పూర్తిగా బాయ్స్ స్కూల్. 92 ఏళ్ల నుంచీ ఉంది. మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అక్కడే చదువుకున్నారు. బాలీవుడ్ నటుడు రాజ్‌కపూర్ చదివిన స్కూల్ కూడా అదే. ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్‌లో ఉన్న కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్ అది. ఈ ఆల్ బాయ్స్ స్కూల్‌లో తొలిసారిగా ఇప్పుడు షకీనా ముఖియా అనే బాలిక చేరింది. పదకొండేళ్ల ముఖియా రియాలిటీ షో ద్వారా దేశానికి సుపరిచితమైన గాయని.
ఎందుకు చేరాల్సి వచ్చింది?
షకీనా ముఖియా డెహ్రాడూన్‌లోని సెయింట్ థామస్‌లో ఆరవ తరగతి వరకు చదివింది. సరిపడా హాజరు లేకపోవడంతో ఆమెను ఏడవ తరగతికి ప్రమోట్ చేయడానికి ససేమిరా అనేసింది స్కూల్ యాజమాన్యం. ‘వాయిస్ ఇండియా కిడ్స్’ రియాలిటీ షో కోసం ఆమె తరచూ స్కూలుకు ఆబ్సెంట్ అవుతుండేది షకీనా. ‘ఆమె ఎంత చురుకైన విద్యార్థి అయినప్పటికీ మా రూల్స్ మాకుంటాయి కదా, అటెండెన్స్ తగినంత లేకపోతే విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయడం కుదరదు. మళ్లీ అదే క్లాసు చదవాల్సిందే’ అని కరాఖండిగా చెప్పేసింది యాజమాన్యం.
చదివిందే చదవడమా!
‘నాకు సిలబస్‌లో పాఠాలు రాకపోతే కదా మళ్లీ చదవాల్సింది, నాకు పాఠాలన్నీ వచ్చు ఇంకెందుకు చదవాలి’.. ఇదీ షకీనా ఆశ్చర్యం. ఆమె తల్లిదండ్రులక్కూడా తమ బిడ్డ ఒక ఏడాదిని వదులుకోవడం ఇష్టంలేకపోయింది. దాంతో డెహ్రాడూన్‌లోని కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్‌ను సంప్రదించారు. ఆ స్కూలు ‘ఓన్లీ బాయ్స్’ అనే నిబంధనను పక్కన పెట్టి, ‘ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం’ అన్నట్లు షకీనాకు పరీక్ష పెట్టింది. షకీనా పాసయింది. సీట్ ఖరారైంది. రేపటి నుంచి (ఏప్రిల్ 12) క్లాసులు మొదలవుతాయి. ఇప్పుడిక షకీనా ఏడవ తరగతి విద్యార్థిని. ఆల్ బాయ్స్ స్కూల్‌లో షకీనాకు సీటిచ్చి స్కూలు యాజమాన్యం రికార్డు బ్రేక్ చేసింది కానీ.. ఆమెకు యూనిఫామ్ డిజైన్ చేయించడం వంటి ఇతర సౌకర్యాలేవీ సాధ్యం కాదనేసింది! అబ్బాయిల్లాగానే ప్యాంటు, షర్టు వేసుకోవాలని చెప్పింది. ‘అదసలు సమస్యే కాద’నేసింది షకీనా. గుడ్.
తల్లిదండ్రుల సంశయం
ఇప్పటి వరకు కో ఎడ్యుకేషన్‌లో చదివిన అమ్మాయి, ఇప్పుడు స్కూలు మొత్తానికి ఒక్కతే అమ్మాయి! ఇబ్బంది పడుతుందేమోనని తల్లిదండ్రులు వికాస్, ధీరా ముఖియా సందేహించారు. షకీనా మాత్రం ‘సింగర్‌గా ఎదగాలి, కాంపిటీషన్‌లలో పాల్గొనాలి, అదే సమయంలో చదువు పూర్తి చేసుకోవాలి. ఇదే నా ఆకాంక్ష. అందుకు అనుమతించిన గ్రేట్ స్కూల్ ఇది. ఎంతోమంది గొప్ప వాళ్లు చదివిన స్కూల్‌లో నేను చదువుతున్నాను’ అని సంతోషంగా చెబుతోంది. షకీనా రేపటి రోజున పెద్ద సింగర్ అయిన తర్వాత వచ్చిన కొత్త తరం విద్యార్థులు... ‘మాది సింగర్ షకీనా చదివిన స్కూల్’ అని చెప్పుకుంటారేమో! ఇప్పుడు మనం షకీనా చేరింది వి.పి. సింగ్, రాజ్‌కపూర్‌లు చదివిన స్కూల్ అని చెప్పుకున్నట్లుగా.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment