- తీవ్ర మనోవేదనతో కాలువలో దూకి ఆత్మహత్యకు బాధితురాలు నిర్ణయం
- అప్రమత్తమై రక్షించిన తల్లిదండ్రులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా.. ‘పచ్చ’నేత ఒకరు ఓ బాలికను మానసికంగా, లైంగికంగా వేధించాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్చెల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తమై తమ కుమార్తెను కాపాడుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. యర్రగుంటలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న సదరు బాలికపై కన్నేశాడు. వివాహితుడైనప్పటికీ ఉచ్ఛనీచాలు మరిచి నాలుగు నెలలుగా ఆమెను వేధించసాగాడు.
ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా తరచూ బాలిక వెంటబడేవాడు. ‘ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నా వెంట పడొద్దు’ అని ఆ బాలిక చాలాసార్లు చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా.. ‘నా వెంట రావడానికి నీకెంత కావాలి? చెప్పు.. డబ్బులు పడేస్తా’ అంటూ నీచంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్‌కెళ్లకుండా హెచ్చెల్సీ కాలువ వైపు వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. స్కూల్‌కెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావని ఆరా తీయగా.. జరిగిందంతా చెప్పి బోరున విలపించింది. నాలుగు నెలల నుంచి అతను వేధిస్తున్నాడని, స్కూల్ ఎక్కడ మాన్పిస్తారోనన్న భయంతో చెప్పలేకపోయానని, ఇప్పుడతని మాటలతో చచ్చిపోదామనుకున్నానని కన్నీరు పెట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఉన్న ముక్కన్నను పట్టుకుని చితకబాదారు. అనంతరం గ్రామస్తులు అతన్ని ఊళ్లోకి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు.
కామాంధుడికి పోలీసుల వత్తాసు?
మరోవైపు.. కామాంధుడు టీడీపీ నాయకుడు కావడంతో అతన్ని ఎలాగైనా కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నాయకుల ఒత్తిళ్లతో నిందితుని నుంచి కూడా కౌంటర్ ఫిర్యాదు తీసుకుని అతనిని రక్షించాలని చూస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment