నిందితుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశామన్న మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు.
నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్
పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్
పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment