రఘురామను సస్పెండ్ చెయ్యాలి | Ongoing protests across the state | Sakshi
Sakshi News home page

రఘురామను సస్పెండ్ చెయ్యాలి

Published Tue, Sep 24 2024 5:45 AM | Last Updated on Tue, Sep 24 2024 5:45 AM

Ongoing protests across the state

జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలి.. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, నేతల డిమాండ్‌

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు

దళిత సంఘాల నాయకుల గృహ నిర్బంధం 

పలుచోట్ల రఘురామ దిష్టిబొమ్మలు దహనం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న నేతలు

కలెక్టర్లకు వినతిపత్రాలు, పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/చిలకలపూడి (మచిలీపట్నం)/తణుకు అర్బన్‌/భీమవరం/పాలకొల్లు సెంట్రల్‌/నగరి/తిరుపతి కల్చరల్‌/మంగళగిరి/ కోటవురట్ల/కాకినాడ క్రైం :  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫ్లెక్సీని చింపి ఆయన్ను అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘు­రామకృష్ణరాజు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని దళిత సంఘాలు, నేతలు డిమాండ్‌ చేశారు. అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోమ­వారం పలు చోట్ల రఘురామ దిష్టి బొమ్మను దహనం చేశారు. 

అలాగే దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకున్న చంద్రబాబు.. రఘు­రామపై చర్యలు తీసుకోవడా­నికి ఎందుకు వెనక­డుగు వేస్తున్నారని ప్రశ్నించారు. దళిత వర్గాలకు ఒక న్యాయం, అగ్రవర్ణాల వారికి ఒక న్యాయమా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. పలుచోట్ల పోలీస్‌ స్టేషన్లలో దళిత నేతలు ఫిర్యాదు చేశారు.  

ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా నిరసనలు
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఉమ్మడి పశ్చిమ జిల్లావ్యాప్తంగా సోమవారం నిరస­నలు వెల్లువెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యే రఘు­రామ తీరు­పై దళిత సంఘాలు నిరసన కార్య­క్రమాలు చేపడుతుంటే అణచివేత ధోరణిలో ప్రభుత్వం పోలీసులతో కేసులు నమోదు చేయిస్తోందని దళిత నేతలు మండిపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో రఘురామ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషే­కాలు చేశారు. భీమవ­రంలో దళిత సంఘాలు తలపెట్టిన భారీ ధర్నాను అడ్డుకునేలా హౌస్‌అరెస్టులు కొనసాగాయి. 

రఘురామను బర్తరఫ్‌ చేయాలి
కృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్నాచౌక్‌ వద్ద దళిత యాక్షన్‌ కమిటీ నాయకులు నిరసన తెలిపారు. రఘురామను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జక్కుల ఆనంద్‌­బాబు మాట్లాడుతూ.. ఎస్సీ­లను  నోటికొచ్చి­నట్లు మాట్లాడి రఘురామకృష్ణరాజు అవమానించార­న్నారు. ఆ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలన్నారు. 

న్యాయవాదుల రాస్తారోకో.. 
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం చట్టం కింద, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని పార్టీ నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆలిండియా పూలే–అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది పొట్ల సురేశ్‌ డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసిన వారిపై ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా తణుకులో సోమవారం బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. 
 
కూటమి ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేయాలి 
కూటమి ఎమ్మెల్యేల కుల దుహంకార చర్యలను నిరసిస్తూ అంబేడ్కర్‌ భవన్‌ అసోసియేషన్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తిరుపతిలోని బాలాజీ కాలనీలో పూలే విగ్రహం వద్ద ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 

రఘురామపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి 
ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రా­సిటీ కేసు నమోదు చేయాలని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌ గుర్రం రామారావు డిమాండ్‌ చేశారు. సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేశా­రు. 

రఘురామ దిష్టిబొమ్మ దహనం
చిత్తూరు జిల్లా, నగరి బస్టాండు వద్ద అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆలిండియా అంబేడ్కర్‌ యువజన సంఘం నేతలు రఘురామ కృష్ణరాజు దిష్టిబొమ్మను చెప్పు­లతో కొట్టి దహనం చేశారు. సత్యవేడు ఎమ్మె­ల్యే ఆదిమూలంపై నిందపడగానే సస్పెండ్‌ చేసిన చంద్రబాబు.. అంబేడ్కర్‌ను అవమానించిన రఘు­రామ­ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ప్రశ్నించారు. 

రఘురామ, నానాజీపై కఠిన చర్యలు తీసుకోండి
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘు­రామకృష్ణరాజుపై, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవా­లని అనకాపల్లి జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు ఎం.అప్పలరాజు, అంబేడ్కర్‌ గ్లోబల్‌ మిషన్‌ నాయకుడు కంచా లోవరాజు 
డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే నానాజీపై నిరసనలు వద్దు..
వైద్యులు, వైద్య విద్యార్థులకు పోలీస్, వైద్య శాఖల అధికారుల ఫోన్లు
సాక్షి, అమరావతి: రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఉమా­మహే­శ్వరావుపై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమే­షాలు లెక్కిస్తోంది. ఈ వ్యవహారాన్ని నీరుగా­ర్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం తరఫున పోలీసులు, వైద్య శాఖ ఉన్నతాధికా­రులతో వైద్యు­లు, వైద్య విద్యార్థులకు ఫోన్లు చేయిస్తూ నిరస­నలు ఆపాలంటూ ఒత్తిడి తెస్తోంది.

ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారని.. ఇక్కడితో ఈ విష­యాన్ని వదిలేయాలంటూ సయోధ్య కుది­­ర్చేందుకు పోలీసులు, వైద్య శాఖ అధికా­రులు ప్రయ­త్నిస్తున్నారు. మరోవైపు నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలు, ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వైద్యులకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోతోందంటూ నినాదాలు చేశారు. 

ఊరుకుంటే.. ఉద్యమిస్తాం
డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై ఇంతటి దాష్టీకం జరిగినా ప్రభుత్వ అధినేతలెవరికీ చీమకుట్టినట్ట­యినా లేదని వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నానాజీని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాడిలో పాల్గొన్న తూము బన్నీ సహా ఇతర అనుచరులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఇంత జరుగుతున్నా పట్టనట్టు ఊరుకుంటే మాత్రం ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం హోరు వానలో కాకినాడ జీజీహెచ్‌  వద్ద వైద్యులు నిరసన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement