![Madakasira CI Ramaiah Over Action With Women In Police Station](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/CI-Ragiri-Ramaiah.jpg.webp?itok=YYiLmngI)
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాడిపత్రి వీఆర్వో వేధింపుల ఘటన మరువకముందే మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మడకశిరలో సీఐ.. ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. దీంతో, బాధితురాలు పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, యువతులపై వేధింపులు పెరిగాయి. కూటమి నేతల అండతో కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలపై కొందరు ఉద్యోగుల లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. దీంతో, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా మడకశిర పోలీసు స్టేషన్‌లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన బయటకు వచ్చింది.
అయితే, కేసుతో సంబంధం లేకుండా సదరు సీఐ.. ఓ మహిళను రాత్రి 10 గంటల వరకు తన చాంబర్‌లోనే ఉంచారు. విచారణ పేరుతో ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. అనంతరం, బాధితురాలు.. ధైర్యం చేసుకుని సీఐ తనను లైంగికంగా వేధించారని పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సీఐ అరాచకం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా.. తాడిపత్రి వీఆర్వో చంద్రశేఖర్ వేధింపుల ఘటన కూడా తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ మహిళలను వేధించిన మడకశిర సీఐ, తాడిపత్రి వీఆర్వోలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, బాధితులు, ప్రజలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/15_28.png)
Comments
Please login to add a commentAdd a comment