సాక్షి, అనంతపురం: జిల్లాలో పోలీసులు దారి తప్పారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై దాష్టీకం చూపారు. సమాచారం అడిగితే విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసుల వైనం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అనంతపురం నగరానికి చెందిన యువకుడు ఇంతియాజ్ అహ్మద్ బెంగళూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద నివసించే ఇంతియాజ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇదే సమయంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
తల్లికి ఇడ్లీ తెచ్చేందుకు సూర్యా నగర్ రోడ్డులోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ నారాయణస్వామి, హోం గార్డు దాదాపీర్ కనిపించడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ వారితో మాట్లాడారు. తన ఇంట్లో చోరీ జరిగిందని.. తాను ఉన్న ఇళ్లు ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగారు. తన మూడ్ బాలేదని... తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని కానిస్టేబుల్ నారాయణస్వామి.. ఇంతియాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు కానిస్టేబుల్. విచారించాల్సిన హోంగార్డు కూడా కానిస్టేబుల్ నారాయణస్వామికి మద్దతు ఇవ్వటంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ పై దాడి చేసి కొట్టారు. అనంతపురం పోలీసుల దాష్టీకం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
పోలీసుల చేతిలో గాయపడిన ఇంతియాజ్ అహ్మద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, ఇతర పార్టీ నేతలు డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి పై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దాడి చేశారు. అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ పై దాడి చేయడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది.
ఇదీ చదవండి: తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
Comments
Please login to add a commentAdd a comment