బాలిక హత్యకేసులో ఐటీ దంపతుల అరెస్టు
సేలం: బాలికను కొట్టి చంపి, సూట్ కేస్‌లో పెట్టి సేలం జిల్లా సంగగిరిలో పడవేసిన ఐటీ దంపతులను పోలీసులు మంగళవారం భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని వైకుందం ప్రాంతంలో రోడ్డు పక్కన గత సెప్టెంబర్ 30వ తేదీ అనుమానాస్పదస్థితిలో ఒక సూట్‌కేసు కనిపించింది. సంగగిరి పోలీసులు తనిఖీ చేయగా అందులో 15 ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు పంచనామా నిర్వహించారు. సంగగిరి పోలీసులు కేసు నమోదు చేసి టోల్ గేట్ మార్గంలో వెళ్లిన కార్లను తనిఖీ చేశారు. అప్పుడు బెంగళూరులోని ఐటీ సంస్థలో పని చేస్తున్న దంపతులకు చెందిన కారుపై వారికి అనుమానం కలిగింది. ఆ కారు నంబర్ ఆధారంగా విచారణ జరిపారు.
అందులో ఆ కారు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చెందిన అభినేష్ సాహు, అతని భార్య అశ్విన్‌పట్టిల్‌కు చెందినదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆ కారు అభినేష్ సాహు, అశ్విన్‌పట్టిల్ దంపతులు బెంగళూరు ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లు గుర్తించారు. వారికి ఐదేళ్ల కుమార్తె ఉండడంతో ఆ పాపను చూసు కోవడం పని మనిషి అవసరమైంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్, ముండమన్ ప్రాంతానికి చెందిన సుమైనా (15) బాలిక ఒడిశాలో ఉన్న అనాథ ఆశ్రమంలో పెరుగుతూ వచ్చింది. ఆ ఆశ్రమాన్ని అభిషేక్ సాహు తండ్రి నడుపుతున్నారు.
దీంతో సుమైనాను ఇంటి పని కోసం అభిషేక్ సాహు బెంగళూరుకు తీసుకువచ్చినట్టు తెలిసింది. ఆ బాలిక సరిగ్గా పని చేయలేదని, చిన్నారికి పెట్టే ఆహారం తింటున్నట్టు ఆరోపిస్తూ బాలికను వేధింపులకు గురిచేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఒక రోజు వేడి నీళ్లు తీసుకురమ్మన్ని కోరగా, ఆ బాలిక వేడినీళ్లు ఇచ్చిన సమయంలో అశ్విన్‌పట్టిల్‌పై పడిందని, దీంతో తీవ్ర ఆవేశానికి గురై ఆ బాలికపై దాడి చేయడంతో ఆమె మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆ బాలిక మృతదేహాన్ని సూట్ కేస్‌లో పెట్టి సేలం జిల్లా సంగగిరి ప్రాంతంలో వారు పడవేసి వెళ్లినట్టు తేలింది. దీంతో పోలీసులు అభినేష్ సాహును గత 26వ తేదీ అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం అశ్విన్‌పట్టిల్‌ను అరెస్టు చేసినట్టు బుధవారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment