సంగీత మృతదేహం (ఇన్‌సెట్) సంగీత (ఫైల్)
వేలూరు: ఆర్కాడు సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆర్కాడు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా ఆర్కాడు తాలుకా తాయనూర్ సత్రం గ్రామానికి చెందిన టీకారామన్. ఇతనికి, మొదటి భార్య కస్తూరికి ముగ్గురు కుమార్తెలు. టీకారామన్ రాధ అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు నవీన్‌కుమార్, కుమార్తె సంగీత(16) ఉన్నారు. రాధ 15 సంవత్సరాల క్రితం ఇటుకల బట్టీలో పనిచేస్తున్న సమయంలో ఆర్కాడు మాసుపేటకు చెందిన పయణితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో రాధ, భర్త టీకారామన్‌ను వదిలి ఇంటి నుంచి కుమార్తె సంగీతతో వెళ్లిపోయి పయణిని వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2013వ సంవత్సరంలో పయణి మృతిచెందాడు. సంగీత కే వేలూరు గ్రామంలో ప్లస్‌ఒన్ చదువుతుంది. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా రాధ నాలుగు నెలల క్రితం మృతి చెందింది. దీంతో అగ్రవరంలో ఉంటున్న అన్న నవీన్‌కుమార్‌తో కలిసి ఉంటోంది.
సోమవారం మధ్యాహ్నం బ్యాంకు పాసుపుస్తకం నకళ్లు అందజేసేందుకు అమ్మ రాధ నివశిస్తున్న గ్రామానికి వెళ్లింది. మధ్యాహ్నం అన్న ఫోన్‌చేస్తే పాసుపుస్తకం ఇచ్చి వస్తానని తెలిపింది. సాయంత్రం 4 గంటలకు ఫోన్‌చేస్తే ఫోన్ స్వీచ్‌ఆఫ్‌లో ఉండడంతో అనుమానం వచ్చిన అన్న నవీన్‌కుమార్ అగ్రవరంలోని పిన్ని రాణికి ఫోన్ చేసి సంగీత గురించి అడగడంతో అక్కడికి కూడా రాలేదని తెలిపింది. వెంటనే నవీన్‌కుమార్ ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో సంగీత బ్లైడుతో చేతులు, కాళ్లు, గొంతు భాగాల్లో కోసిన స్థితిలో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి కేకలు వేశాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే సంగీత మృతి చెంది ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు ఆర్కాడు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ పగలవన్, డీఎస్పీ కలైసెల్వం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంగీత సెల్‌ఫోన్‌లోని నంబర్ ఆధారంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment