
పోలీస్‌స్టేషన్ ముందు విషం తాగిన ఇద్దరు చెల్లెల్లు
ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
మహిళా సీఐ వీఆర్‌కు బదిలీ
సేలం : తంజావూరులో అరెస్టు చేసిన అన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు చెల్లెల్లలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వ్యవహారంగా నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ షర్మిలను అధికారులు వెయిటింగ్ లిస్ట్‌కు బదిలీ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా నడుక్కవేరిలోని అరసమర వీధికి చెందిన వ్యక్తి దినేష్ (32). అతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు.
ఇదిలా ఉండగా దినేష్ బంధువు ఏప్రిల్ 8వ తేదీన మరణించాడు. దినేష్ తన బంధువులతో కలిసి నడుక్కావేరి బస్‌స్టాప్ వద్ద సంతాప కార్యక్రమానికి హాజరు కావడానికి నిలబడి ఉండగా, నడుక్కవేరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సబ్–ఇన్‌స్పెక్టర్ సంఘటనా అక్కడికి చేరుకుని, దినేష్‌పై కేసు నమోదు చేసినట్లు, విచారణకు రావాలని చెప్పి, దినేష్‌ను మోటార్ సైకిల్ పై నడుక్కావేరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దినేష్ చెల్లెల్లు కూడా వారిని అనుసరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ తమ సోదరుడిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
దినేష్ సోదరీమణులలో ఒకరికి పెళ్లి చూపులకు వరుడి తరపు వారు వస్తున్నారని తెలిపినప్పటికీ స్టేషన్‌లో ఉన్న పోలీసులు వినిపించుకోకుండా బహిరంగ ప్రదేశంలో కత్తితో బెదిరించాడంటూ దినేష్‌పై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు దినేష్ సోదరీమణులను ఏకవచనంతో మాట్లాడి దూషించి బయటకు పంపించారని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు ఇంటికి వెళ్లి పురుగుమందు తెచ్చి నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ముందు ఉంచి, తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వారిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో బుధవారం ఓ చెల్లెలు మరణించింది. మరో చెల్లెలికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
బంధువుల ఆందోళన
ఈ విషయం తెలుసుకున్న దినేష్ బంధువులు తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అప్పుడు దినేష్ సోదరి మరణానికి న్యాయం జరగాలని, ఆ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, పుదుక్కోట జైలు నుంచి దినేష్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈతంజావూరు నగర డీఎస్పీ సోమసుందరం, ఇన్‌స్పెక్టర్లు చంద్ర, జగతీశ్వరన్ ఆసుపత్రి ముందు నిరసనకారులతో చర్చించారు. ఈ స్థితిలో నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ షర్మిలను వీఆర్‌కు బదిలీ చేస్తూ తంజావూరు జిల్లా సూపరింటెండెంట్ రాజారాం గురువారం ఆదేశాలు జారీ చేశారు.