
తండ్రితో కలిసి స్కూల్‌కు వెళ్తుండగా ప్రమాదం
షేక్‌పేట ప్రధాన రహదారిలో ఘటన
ఫిలింనగర్: ‘మమ్మీ బాయ్..’ అంటూ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరిన చిన్నారిని అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన లారీ బలితీసుకుంది. తన కళ్లెదుటే కుమార్తె లారీ చక్రాల కిందపడి ఛిద్రం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ఫిల్మ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షేక్‌పేట ప్రధాన రహదారిలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్‌పేట మై హోం రెయిన్ బో రెసిడెన్స్‌లో నివసించే గడ్డం హేమ సుందర్‌రెడ్డి కుమార్తె అథర్వి (10) మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఐదో తరగతి చదువుతోంది.
ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8.00 గంటల సమయంలో హేమ సుందర్‌రెడ్డి తన కుమార్తెను స్కూల్‌లో దింపడానికి యాక్టీవా వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం 8.10 గంటలకు షేక్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి చక్కెర లోడ్‌తో వచి్చన లారీ హేమ సుందర్‌రెడ్డి నడుపుతున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ధాటికి తండ్రీకుమార్తె వాహనం పైనుంచి ఇద్దరు కిందపడ్డారు. అథర్వి లారీ వెళ్తున్న వైపు పడటంతో దాని వెనుక చక్రాలు ఆమె పైనుంచి వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయింది.
హేమ సుందర్‌రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్తసిక్తమైంది. మరికొద్దిసేపట్లో కూతుర్ని స్కూల్ దగ్గర దింపాల్సి ఉండగా కళ్లెదుటే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న అథర్వి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేని వేళల్లో అక్రమంగా సిటీలోకి లారీతో ప్రవేశించి, చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment