ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందని ఉపకార వేతనాలు, ఫీజులు
రూ.450 కోట్లు తన వాటాగా విడుదల చేసిన కేంద్రం
దాదాపు నెలన్నర కావస్తున్నా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర నిధులు సకాలంలో వినియోగించుకోకుంటే వెనక్కే..!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది.
ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎదురుచూస్తూనే ఉన్నారు.
రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా..
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది.
అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఆన్‌లైన్‌లో తాజా దరఖాస్తుల ప్రక్రియ
మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్‌సైట్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment