ఎటూ తేలని జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి దరఖాస్తులు
కోర్సులు ముగుస్తున్నా విడుదల కాని అర్హుల జాబితా
ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే.. 6 వేల మంది ఎదురుచూపు
కోటా పెంపు పేరిట అధికారుల కాలయాపన
అప్పులు చేసి విదేశాలకు విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు
ఆరు నెలలుగా సీఎం కార్యాలయం వద్దే ఫైల్
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన సంగీత గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో దరఖాస్తు చేయగా.. 2023 ఆగస్టులో ఆమెకు అడ్మిషన్ లభించింది. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని పీజీ కోర్సులో చేరిపోయింది.
స్కాలర్‌షిప్ వస్తుందన్న ఆశతో అప్పు చేసి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెస్ మొదటి సంవత్సరం పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో రెండో సంవత్సరం కూడా పూర్తవుతుంది. కానీ విద్యానిధి పథకానికి ఆమె అర్హత సాధించిందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
సంగీత తండ్రి మాసాబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగా.. అర్హుల జాబితా ఇంకా సిద్ధంకాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనకు అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు.. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులివి.
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతి బా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హుల ఎంపిక ఏడా దిన్నరగా నిలిచిపోయింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణే తప్ప అర్హులను తేల్చటంలేదు. దీంతో ఈ స్కాలర్‌షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకొన్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సగం కోర్సు కూడా పూర్తిచేశారు. కానీ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు సీజన్లలో వచ్చిన దరఖాస్తుల విషయం ఎటూ తేల్చకుండానే.. ఇప్పుడు మరోమారు దరఖాస్తుల స్వీకరణ సైతం చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ నాన్చుడు ధోరణి వల్ల దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కూడా ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని అందిస్తున్నాయి. ఆ శాఖలు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి స్కాలర్‌షిప్‌లు అందిస్తుండగా, బీసీ సంక్షేమ శాఖలో మాత్రం ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.
డిమాండ్ ఎక్కువ.. కోటా తక్కువ
పూలే విదేశీ విద్యానిధి పథకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర శాఖలతో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖలో వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ అని ఏటా రెండుసార్లు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మొదటి దఫా, జనవరిలో రెండో దఫా దరఖాస్తులను సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత... విద్యార్థుల డిగ్రీ మార్కులతోపాటు జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో మార్కులు, ఐఈఎల్‌టీఎస్/టోఫెల్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖలవారీగా ప్రత్యేక కమిటీలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక ఆలస్యం లేకుండా సాగిపోతున్నది. బీసీ సంక్షేమ శాఖలోవిపరీతమైన పోటీ ఉండడంతో ఉప కులాలవారీగా కోటాను విభజిస్తూ అర్హులను ఎంపిక చేస్తున్నారు.
బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు. ఏటా (రెండు సీజన్లు కలిపి) 300 మందికి స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. ఒక్కో సీజన్‌కు సగటున 3 వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన గత రెండు సీజన్లలో 6 వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు.
కోటా పెంపు కోసమేనట!
పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రస్తుతం 300 యూనిట్లుగా ఉన్న కోటాను కనీసం వెయ్యికి పెంచాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కోటా పెంపు ప్రతిపాదనలు పంపింది.
ఏటా కనీసం 800 మంది విద్యార్థులకైనా ఈ పథకం కింద స్కాలర్íÙప్‌లు ఇవ్వాలని సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైలు సీఎం వద్దకు చేరి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కోటా పెంపు తర్వాతే అర్హుల ఎంపిక చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ప్రస్తుత పరిస్థితి
2023–24 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు 6 వేలకుపైగా ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్‌షిప్ రూ.20 లక్షలు సంవత్సరానికి ఇచ్చే మొత్తం స్కాలర్íÙప్‌లు 300
Comments
Please login to add a commentAdd a comment