Foreign education
-
ఎడతెగని ఎదురుచూపు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన సంగీత గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో దరఖాస్తు చేయగా.. 2023 ఆగస్టులో ఆమెకు అడ్మిషన్ లభించింది. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని పీజీ కోర్సులో చేరిపోయింది. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పు చేసి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెస్ మొదటి సంవత్సరం పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో రెండో సంవత్సరం కూడా పూర్తవుతుంది. కానీ విద్యానిధి పథకానికి ఆమె అర్హత సాధించిందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత తండ్రి మాసాబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగా.. అర్హుల జాబితా ఇంకా సిద్ధంకాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనకు అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు.. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులివి.సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతి బా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హుల ఎంపిక ఏడా దిన్నరగా నిలిచిపోయింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణే తప్ప అర్హులను తేల్చటంలేదు. దీంతో ఈ స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకొన్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సగం కోర్సు కూడా పూర్తిచేశారు. కానీ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు సీజన్లలో వచ్చిన దరఖాస్తుల విషయం ఎటూ తేల్చకుండానే.. ఇప్పుడు మరోమారు దరఖాస్తుల స్వీకరణ సైతం చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ నాన్చుడు ధోరణి వల్ల దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కూడా ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని అందిస్తున్నాయి. ఆ శాఖలు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి స్కాలర్షిప్లు అందిస్తుండగా, బీసీ సంక్షేమ శాఖలో మాత్రం ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.డిమాండ్ ఎక్కువ.. కోటా తక్కువపూలే విదేశీ విద్యానిధి పథకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర శాఖలతో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖలో వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ అని ఏటా రెండుసార్లు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మొదటి దఫా, జనవరిలో రెండో దఫా దరఖాస్తులను సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత... విద్యార్థుల డిగ్రీ మార్కులతోపాటు జీఆర్ఈ/జీమ్యాట్‌లో మార్కులు, ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖలవారీగా ప్రత్యేక కమిటీలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక ఆలస్యం లేకుండా సాగిపోతున్నది. బీసీ సంక్షేమ శాఖలోవిపరీతమైన పోటీ ఉండడంతో ఉప కులాలవారీగా కోటాను విభజిస్తూ అర్హులను ఎంపిక చేస్తున్నారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు. ఏటా (రెండు సీజన్లు కలిపి) 300 మందికి స్కాలర్షిప్లు ఇస్తారు. ఒక్కో సీజన్‌కు సగటున 3 వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన గత రెండు సీజన్లలో 6 వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. కోటా పెంపు కోసమేనట!పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రస్తుతం 300 యూనిట్లుగా ఉన్న కోటాను కనీసం వెయ్యికి పెంచాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కోటా పెంపు ప్రతిపాదనలు పంపింది. ఏటా కనీసం 800 మంది విద్యార్థులకైనా ఈ పథకం కింద స్కాలర్íÙప్లు ఇవ్వాలని సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైలు సీఎం వద్దకు చేరి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కోటా పెంపు తర్వాతే అర్హుల ఎంపిక చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ప్రస్తుత పరిస్థితి2023–24 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు 6 వేలకుపైగా ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్షిప్ రూ.20 లక్షలు సంవత్సరానికి ఇచ్చే మొత్తం స్కాలర్íÙప్లు 300 -
విదేశీ విద్యకు సాయమందించండి
సాక్షి, హైదరాబాద్: తమ పిల్లలు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లారని, వారికి అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద సాయమందించాలని పలువురు తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. గురువారం గాందీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన మల్లు భట్టి విక్రమార్కను సామాన్య ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. విదేశీ విద్యానిధి పథకం కింద పెద్ద చదువులు చదువుకునే విద్యార్థులకు ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పిన భట్టి.. వీలున్నంత త్వరగా ఆ నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. » తన తల్లి బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమె ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అవసరమైన సాయం అందించాలని మహేశ్ కోరగా, భట్టి వెంటనే స్పందించి ఇప్పటివరకు అయిన ఆస్పత్రి బిల్లులకు ఎల్ఓసీ ఇప్పించాలని తన పీఏను ఆదేశించారు. స్వయంగా తన నంబరు ఆ యువకుడికి ఇచ్చి ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని సూచించారు. » జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తమకు పోస్టింగులు ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు భట్టికి విజ్ఞప్తి చేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. » ట్రాన్స్‌కో, జెన్కోలలో ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత శాఖ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేశారు. » ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. మంత్రితో ముఖాముఖిలో భాగంగా మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే శంకర్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. భట్టి దృష్టికి పటాన్చెరు పంచాయితీ పటాన్చెరు నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నేత లు, ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల మధ్య నెలకొన్న రాజకీయ పంచాయితీ భట్టి దృష్టికి వచ్చింది. పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో వచ్చిన నేతలంతా తమపై మహిపాల్‌రెడ్డి పెత్తనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని, తద్వారా నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని వివరించారు. ఆ తర్వాత కాట శ్రీనివాస్‌గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్లో భట్టితో పాటు మహేశ్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
Andhra Pradesh: విదేశీ విద్య.. ఇప్పుడు మిథ్య!
పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని దెబ్బ తీసేందుకు కూటమి సర్కారు కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదల్చకుండా ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు.విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందనే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులకు రూ.107.07 కోట్లు అందించింది. గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో మరోమారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటేకనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు.ఏదైనా అప్డేట్ ఉందేమో చూద్దామనుకుంటే జ్ఞాన భూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించనప్పటికీ వారి నుంచి స్పష్టత రాక పోవడం శోచనీయం. – సాక్షి, అమరావతిప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. నెలలు గడుస్తున్నా మా ఆవేదన పట్టించుకోవడం లేదు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి సాయం అందేది. ఇప్పుడొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సాయం అందించకపోతే మా అబ్బాయి చదువు కోసం మేము అప్పులు చేసి అవస్థలపాలుకాక తప్పదు. – గుంటూరుకు చెందిన ఒక చిరుద్యోగి మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని విదేశీ విద్యా సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. మా దరఖాస్తు ఏమైందో తెలియదు. జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. విదేశీ విద్య పథకాన్ని కొత్త ప్రభుత్వం నిలిపేస్తుందని అంటున్నారు. నిబంధనల పేరుతో సాయాన్ని అరకొరగా పరిమితం చేస్తారంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తుందో లేదో తెలిస్తే.. మా తిప్పలు మేము పడతాం. – పశ్చిమదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ రైతు ఆవేదనపేద బిడ్డలపై పెద్ద మనసు చూపిన జగన్విదేశాల్లో చదివేందుకు వెళ్లిన పేద బిడ్డలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 408 మందికి రూ.107.07 కోట్లు అందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016–17 నుంచి అమలు చేసిన పథకంలో 3,326 మందికి రూ.318 కోట్లు ఎగ్గొట్టింది. అదే మాదిరి ఈసారి కూడా విదేశీ విద్య పథకంలో ఎంపికైన వారికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.⇒ గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను విస్మరించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కేవలం రూ.15 లక్షలు చొప్పున మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకొంది. అదే జగన్ సర్కారు ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు సాయం అందించింది. వైఎస్ జగన్ అగ్రవర్ణ పేదల(ఈబీసీ)తో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు.⇒ ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంíపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల(సెమిస్టర్)ల్లో ఆ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేవారు.⇒ విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విదేశాల్లో మారిన పరిస్థితులు.. మనోళ్ల ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల విదేశీ విద్య ఆశలు ఆవిరైపోతున్నాయి. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎమ్మెస్‌కు వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక సంక్షోభంతో అమెరికా తదితర దేశాల్లో ఐటీ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూడటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. కొందరు ఆయా దేశాల్లో ఉన్న తమతోటి మిత్రులతో అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించిన వివరాలు కనుక్కుంటున్నారు. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయా దేశాల్లో ఉన్నవిద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజులు పోయాయ్! విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎమ్మెస్ చదువు చాలామంది విద్యార్థులకు ఓ కల. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేయగానే ఏదో ఒక వర్సిటీలో చదువుకోసం ప్రయతి్నంచేవారు. వీలైనంత త్వరగా ఎమ్మెస్ పూర్తి చేస్తే, ఫుల్‌టైమ్ జాబ్‌తో త్వరగా సెటిల్ అవడానికి వీలవుతుందని భావించేవారు. అప్పు చేసి మరీ విమానం ఎక్కేసేవారు. ఎమ్మెస్ చేస్తూనే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్‌తో ఎంతోకొంత సంపాదించుకోవడానికి ఆసక్తి చూపేవారు.కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పరిస్థితి అంత సాను కూలంగా లేదని కన్సల్టెన్సీలు, ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. 2021లో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య 6.84 లక్షలుగా ఉంది. 2023లో కూడా పెరుగుదల నమోదైనా 2024కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని, విద్యార్థుల నుంచి వస్తున్న ఎంక్వైరీలను బట్టి చూస్తే 2025లో ఈ సంఖ్య మరింత తగ్గే వీలుందని కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. వెళ్లినవారికి ఉపాధి కష్టాలు ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో విదేశాల్లో స్కిల్డ్ ఉద్యోగం దొరకడం గగనంగా మారుతోందని, అన్ స్కిల్డ్ ఉద్యోగాలకు కూడా విపరీతమైన పోటీ ఉందని అంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు తీసివేసే పరిస్థితి నెలకొనడం, మరోవైపు భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా, ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ఉద్యోగం రాకపోవడం మాట అలా ఉంచితే కనీసం ఇంటర్వ్యూకు పిలిచే పరిస్థితి కూడా ఉండటం లేదని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఫీజులు ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకు అవసరం. కాగా ఈ మేరకు అప్పు చేసి వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవడంతో పాటు రుణం తీర్చగలమనే ధీమా గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా నాస్కామ్ జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు అమెరికాలో 20 వేల మంది ఉన్నట్టు తేలింది. అస్ట్రేలియాలో ఇచ్చిన ఆఫర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పు తీర్చలేక, ఇండియా రాలేక, అమెరికాలో ఉద్యోగం లేకుండా ఉండలేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. దేశంలో ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇండియా ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం చూపించింది. పలు కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. నైపుణ్యం సమస్య! దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యం ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లే బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొంటున్నాయి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు చిన్నాచితకా ఉద్యోగంతో సరిపెట్టుకుంటుండగా, ఎక్కువమంది అన్‌స్కిల్డ్ ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లినవారి సంఖ్య 2024లో గణనీయంగా తగ్గిందని అంటున్నారు. మంచి ఉద్యోగం మానుకుని అమెరికా వచ్చా బీటెక్ అవ్వగానే ఓ ఎంఎన్సీలో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళల్లో ప్రమోషన్లు కూడా వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళాలనే కోరికతో అప్పు చేసి ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి కావొచ్చింది. కానీ జాబ్ దొరికే అవకాశం కని్పంచడం లేదు. ఇప్పటికీ డబ్బుల కోసం ఇంటి వైపే చూడాల్సి వస్తోంది. – మైలవరపు శశాంక్ (అమెరికా వెళ్ళిన ఖమ్మం విద్యారి్థ) రెండేళ్ళ క్రితం వరకూ అమెరికాలో ఎంఎస్ గురించి రోజుకు సగటున 50 మంది వాకబు చేసేవారు. ఇప్పుడు కనీసం పది మంది కూడా ఉండటం లేదు. కెనడాలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండటం, అమెరికాలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణం. – జాన్సన్, యూఎస్ కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు అమెరికాలో ఐటీ రంగం పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారతీయ విద్యార్థులు నూటికి కనీసం ఆరుగురు కూడా కొత్తగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందడం లేదు. – అమెరికాలోని భారతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎన్వీఎన్అప్పుచేసి అమెరికా వచ్చా. పార్ట్ టైం జాబ్ కూడా ఒక వారం ఉంటే ఇంకో వారం ఉండటం లేదు. కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు ఎంఎస్ పూర్తి చేసిన నా స్నేహితులకు స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా ఉంటోంది. – సామా నీలేష్ (అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థి) -
విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. -
విదేశీ విద్యా పథకానికి మంగళం!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేసిందా అనే ప్రశ్నకు విద్యార్థుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. జ్ఞానభూమి ఆన్లైన్ పోర్టల్ రెండు నెలలుగా తెరుచుకోకపోవడమే దీనికి కారణం. – సాక్షి, అమరావతి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి ఎన్నికల ముందునుంచే పేద విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తులు పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. వారి పరిస్థితి ఇప్పుడు ఏంచేయాలో తెలియని ఆయోమయంలో పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు రూ.107.07 కోట్లను విదేశీ విద్యా పథకం కింద పేద విద్యార్థులకు అందించింది. ఈ ఏడాది జనవరి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. కొందరికి ఇంటర్వ్యూలు కూడా అధికారులు పూర్తి చేశారు. కాగా.. అంతకుముందు ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా పరిశీలించి సాయం విడుదల చేసిందా అంటే అదీలేదు. విద్యార్థులకు ఉదారంగా సాయమందించిన వైఎస్ జగన్ పేద కుటుంబాల్లోని పిల్లల పెద్ద చదువులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకు ఊతమిచ్చారు. ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల్లో ఆ మొత్తాన్ని విద్యార్థులకు చెల్లించేవారు. విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకు విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.15 లక్షల వరకే సాయం అందిస్తే.. జగన్ ప్రభుత్వం గరిష్టంగా రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు అందించడం విశేషం. సమాధానం చెప్పేవారూ కరువు ప్రభుత్వం సాయం అందిస్తుందనే ఆశతో ఇంటర్వ్యూలు పూర్తయిన చాలామంది విద్యార్థులు అప్పులు చేసిమరీ చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. విదేశీ విద్యా పథకం తమకు మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు. పోర్టల్‌లో ఏదైనా అప్డేట్ ఉందేమో అని చూస్తే జ్ఞానభూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించినప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. స్పష్టత రావడానికి మరో నెల పట్టవచ్చని.. పథకాన్ని మార్చి విధి విధానాలు కఠినతరం చేసి ఆర్థిక సాయాన్ని తగ్గించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. -
విదేశీ చదువుల క్రేజ్
-
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్‌లో పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
రూ. 5 లక్షలిస్తే ‘విద్యానిధి’ మీదే!
వరంగల్ జిల్లాకు చెందిన మురిపాల సిద్ధార్థ్ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. బీటెక్‌లో మంచి మార్కులు రావడంతో విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఓ మధ్యవర్తి.. ఈ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడాడు. ఆర్థిక సాయంపై ఆశతో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నాడు. రూ.లక్ష కూడా ఇచ్చాడు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండడంతో మీ కుమారుడు తప్పకుండా ఎంపికవుతాడని చెప్పాడు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్లి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చాడు. కానీ మధ్యవర్తి ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ తండ్రి గుర్తించాడు. సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా నిధి పథకం కింద గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట ఈ పథకాలు అమలవుతున్నాయి. అర్హుడైన విద్యార్థికి రెండు దఫాలుగా గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. కాగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పథకానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో మధ్యవర్తులు దరఖాస్తుదారులను మాయ మాటలతో మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అత్యంత గోప్యంగా ఎంపిక ప్రక్రియ పరిమిత కోటాతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఏటా గరిష్టంగా 2 వందల మందికి, బీసీ, ఈబీసీలకు 300 మందికి సాయం అందిస్తోంది. బీసీ, ఈబీసీ కేటగిరీలో ఈ ఏడాది ఏకంగా 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మధ్యవర్తులు తల్లిదండ్రులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతూ ఈ పథకం కింద తప్పకుండా మీకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతున్నారు. విద్యానిధి పథకం కింద దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, అర్హుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సంబంధిత సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు ఇందులో ఉంటారు. ఈ ప్రక్రియ ఆద్యంతం గోప్యంగా సాగుతుంది. ఎంపికైన తర్వాత జాబితా వెలువడినప్పుడు మాత్రమే అర్హుల పేర్లు బయటకు వస్తాయి. ఈ అంశాన్ని మధ్యవర్తులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు జాబితా వెలువడిన వెంటనే లబ్ధదారులకు ఫోన్లు చేసి తమ ప్రయత్నం వల్లే ఆర్థిక సాయం అందుతోందంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికార యంత్రాంగం నజర్ వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఇటీవల ఫిర్యాదు చేయడంతో విద్యానిధి పథకంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి మధ్యవర్తుల అంశంపై ఆరా తీస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి నుంచి లిఖిత పూర్తక ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యానిధి అర్హతలు, ఎంపిక ఇలా... విదేశీ విద్యా నిధి పథకంలో గ్రాడ్యుయేషన్ మార్కులు కీలకం. నిర్దేశించిన దేశాల్లో ఎంఎస్ చదువుకునే విద్యార్థులు ఈ పథకం కింద ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థి డిగ్రీ మార్కులకు 60 శాతం స్కోర్, జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్‌కు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్‌కు మరో 20 శాతం మార్కులుంటాయి. దరఖాస్తులను అధికారులు వడపోసి నిబంధనల ప్రకారం అత్యధిక మార్కులున్న వారిని రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో అత్యధిక మార్కులున్న వారి జాబితాను రూపొందించి పరిమితికి లోబడి అర్హుల ఎంపిక చేపడతారు. బీసీల్లో మాత్రం సబ్ కేటగిరీలు, ఈబీసీ కేటగిరీ వారీగా వడపోత చేపట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక సగం, చివరి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక మిగతా సాయాన్ని ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విద్యార్థి చదువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే నిధులు విడుదలవుతాయి. -
Vidya Deevena: నిధుల్ని విడుదల చేయనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తూ.. మరోవైపు, సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అందించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.6 కోట్లను, సివిల్ సర్విసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం సివిల్ సర్విస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలుచేసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధిచేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పిస్తూ.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకలీ్టలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. దీనిద్వారా ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
విదేశీ విద్యను ఇక్కడే కల్పించేలా...
భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్హెచ్ఇఐ) క్యాంపస్‌ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్‌లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్‌తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది? యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్‌డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్‌వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్‌లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు. దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్‌ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్‌గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్‌కు ట్రస్టీగా ఉండకూడదు. అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా? భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్‌లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్‌కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు. ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక. విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి? విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్‌లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్‌లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్‌లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది? అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి. మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా! ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్‌లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు. ఎస్ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
విదేశీ విద్యకే మొగ్గు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యత.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. రెండో స్థానంలో కెనడా.. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్‌తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్– సిటిజన్‌షిప్ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. వెనక్కి వచ్చేవారు తక్కువే.. ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. -
విదేశీ విద్యా దీవెన కింద 1,830 మందికి సాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం కింద ఇప్పటివరకు 1,830 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం లభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య పథకం అక్రమాల పుట్టగా మారిందని విజిలెన్స్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకంలోని లోపాలను చక్కదిద్ది మరింత ఎక్కువ మందికి, మరింత ఎక్కువ ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులందరికీ సంతృప్త విధానంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయమందిస్తోంది. 21 నిర్దేశిత సబ్జెక్ట్ కేటగిరీల్లో 50 విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ప్రవేశం పొందినవారికి ట్యూషన్ ఫీజు కింద రూ.కోటి 25 లక్షల వరకు ఆర్థిక సాయం (వాస్తవ రుసుం) అందిస్తోంది. ఈబీసీలు రూ.కోటి వరకు ఆర్థిక సాయానికి అర్హులు. గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే సాయం అందించేది. అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకే పరిమితం చేసింది. ఆ ఆదాయ పరిమితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.8 లక్షలకు పెంచింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది. -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్‌లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు
సాక్షి ప్రతినిధి కర్నూలు: దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్నారు. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన అక్కులప్ప అనే దళితుడు విదేశీ విద్య, అవుట్ సోర్సింగ్, కస్తూరిబా గురుకుల పాఠశాలలోని ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో టీడీపీ వైఖరిని ప్రశ్నిం చాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ‘అంబేడ్కర్ విదేశీ విద్య’ అని పేరు మారుస్తారా? అన్నారు. ఇందుకు లోకేశ్ బదులిస్తూ ‘విదేశీ విద్యను చంద్రబాబు తీసుకొచ్చారు. కొంతమంది పిల్లలైనా విదేశాలకు వెళ్తే, మరో పదిమంది వెళ్తారనే ఉద్దేశంతో ప్రారంభించారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్లి ఇరుక్కుపోయారు. టీడీపీ ప్రభుత్వం ఒక ఏడాది ఫీజులు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. విదేశాల్లో చదివే విద్యార్థులు అప్పులపాలయ్యారు. విదేశీ విద్యతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు తీసేశారు. ప్రభుత్వం రూ.30కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చినంత మాత్రాన పిల్లలు విదేశాలకు వెళ్లరు. విదేశీ విద్యపై పోరాడిన వ్యక్తి మీ లోకేశ్. మంగళగిరి వేదికగా నేనే పోరాడాను. దళితులు పీకింది లేదు... పొడిచింది లేదు. ఈయన పేరు పెట్టేందుకు!’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలంరేపుతున్నాయి. గతంలో లోకేశ్ తండ్రి చంద్రబాబు కూడా ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
విదేశీ విద్యకు ‘అంబేద్కర్ విద్యానిధి’ అండ.. ఏటా రూ.20 లక్షల సాయం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకునేందుకు ఎస్సీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది. మన రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో సీట్ వస్తే చాలు ప్రభుత్వం ఈ ఆర్థికసాయం చేస్తుంది. దీంతో విద్యానిధి పథకానికి జిల్లా ఎస్సీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదట్లో రూ.10లక్షలు.. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ విద్యార్థి విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చదివేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకం కింద మొదట్లో రూ.10లక్షల ఆర్థికసాయం అందించింది. అయితే రూ.10లక్షలు సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి రావడంతో పెద్దగా విదేశాల్లో చదివేందుకు ఎస్సీ విద్యార్థులు పెద్దగా ముందుకు రాలేదు. అయితే ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మళ్లీ పథకం నిబంధనలు సడలించింది. కుటుంబ ఆదాయం రూ.5లక్షలకు పెంచడంతోపాటు విదేశీ విద్యకు అందించే ఆర్థికసాయాన్ని రూ.20లక్షలు చేసింది. దీంతో జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్యకోసం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కుల ఆధారంగా దరఖాస్తులు.. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు పరీక్షలు రాసి సీటు పొందితే ఆ మార్కుల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల శాఖలో దరఖాస్తు చేసుకున్నవారిని అన్ని ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రభుత్వం విదేశీ విద్యనభ్యసించేందుకు ఆర్థికసాయం అందిస్తుంది. ప్రధానంగా యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి వరకు 35 మందికి.. ప్రభుత్వం 2015లో విదేశీ విద్యకోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ విద్యార్థులు 65 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి అర్హతలు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించి 35 మందిని ఎంపిక చేసి ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం వారంతా వివిధ దేశాల యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. కాగా 2021లో అత్యధికంగా తొమ్మిది మంది విద్యార్థులు విదేశీ విద్యకు ఎంపిక కావడం గమనార్హం. -
విదేశీ చదువుల్లో ఏపీ దూకుడు
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే అగ్రస్థానంలో ఉన్నారు. 2016 నుంచి 2021 వరకు ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో 15 శాతం మంది ఏపీ విద్యార్థులే కావడం విశేషం. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 2019–2020లో కరోనా కారణంగా విదేశాలు రాకపోకలపై నిషేధం విధించాయి. పలు దేశాలు వీసాల మంజూరును నిలిపేయడంతో విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో విదేశాల్లో చదువులకు వెళ్లినవారు సైతం వెనక్కి వచ్చేశారు. అగ్రభాగాన ఏపీ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఏటా ఏపీ నుంచే అత్యధిక శాతం మంది ఉంటున్నారు. దేశం మొత్తం మీద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2016లో 3,71,506 మంది విదేశాలకు వెళ్లారు. వీరిలో ఏపీ విద్యార్థులు 12.43 శాతం మంది ఉన్నారు. ఇక 2017లో 4,56,823 మంది వెళ్లగా వారిలో ఏపీ విద్యార్థుల శాతం.. 12.27. అలాగే 2018లో 5,20,342 మంది విదేశాలకు వెళ్లగా 12.06 శాతం మంది ఏపీ విద్యార్థులే. 2019లో 5,88,931 మందికిగాను ఏపీ విద్యార్థుల శాతం.. 11.79గా ఉంది. 2020లో 2,61,604 మంది విదేశీ విద్యార్థుల్లో 13.62 శాతం మంది ఏపీ విద్యార్థులున్నారు. ఇక ఈ ఏడాది విదేశాలకు వెళ్లిన 71,769 మందిలో 16.42 శాతం మంది ఏపీ విద్యార్థులే ఉండడం విశేషం. (చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు) 2020లో తగ్గిపోయిన విద్యార్థులు.. 2020 తర్వాత గణాంకాలను పరిశీలిస్తే.. దేశం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్య ఆ ఏడాది ఒక్కసారిగా పడిపోయింది. కాగా, గత ఆరేళ్లలో 2019లో అత్యధికంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఆ ఏడాది దేశం నుంచి 5,88,931 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఇది 2020లో 2,61,406కు తగ్గిపోయింది. 2020 తర్వాత అత్యధిక కాలం ప్రవేశ నిషేధాలు అమలు కావడం, వీసాలు నిలిపివేయడం విదేశీ చదువులపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా సహా కొన్ని దేశాలు నిషేధాలను పాక్షికంగా సవరించాయి. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక వీసాల మంజూరును ప్రారంభించాయి. ఈ ఏడాది మంజూరైన వీసాలను బట్టి 71,769 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. వీరిలోనూ ఏపీ విద్యార్థులే అత్యధికం. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 11,790 మంది విదేశీ చదువులకు వెళ్లారు. ఏపీ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర నుంచి 10,166 మంది, గుజరాత్ నుంచి 6,383 మంది, పంజాబ్ నుంచి 5,791 మంది, తమిళనాడు నుంచి 4,355 మంది, కర్ణాటక నుంచి 4,176 మంది ఉన్నారు. (చదవండి: ఆరోగ్యంలో అగ్రపథం.. టాప్ 5లో ఏపీ) -
వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా!
విదేశీ చదువు ఒక డోర్ అనుకుంటే.. దాన్ని తెరిచే ‘కీ’.. వీసా ఇంటర్వ్యూ! నిజానికి స్టడీ అబ్రాడ్ విద్యార్థులు విమానం ఎక్కాలా.. వద్దా.. అని నిర్ణయించేది ఈ వీసా ఇంటర్వ్యూనే! ఫారిన్ ఎడ్యుకేషన్ దరఖాస్తు ప్రక్రియలో చివరి అంకమైన వీసా ఇంటర్వ్యూ అత్యంత కీలకమైంది. కాని విదేశాల్లో చదవాలని కలలు కనే ఎంతో మంది ప్రతిభావంతులు... వీసా ఇంటర్వ్యూలో తడబడి అవకాశాన్ని జార విడుచు కుంటున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఫాల్ సెషన్ (ఆగస్టు–సెప్టెంబర్)కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. వీసా ఇంటర్వ్యూల తీరుతెన్నులపై ప్రత్యేక కథనం... ఇంటర్వ్యూ ఉద్దేశం స్టడీ అబ్రాడ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు... సదరు విదేశంలో నివసించేందుకు, విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నారా.. అనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. చదువు పూర్తయిన తర్వాత అభ్యర్థి స్వదేశానికి తిరగి వెళ్తాడా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా విద్యార్థి ఇచ్చే సమాధానాల్లో నిజాయితీని కూడా చూస్తారు. ఒక్కోదేశంలో ఒక్కో తీరు ► విదేశీ విద్యకు సంబంధించి వీసా ఇంటర్వ్యూ విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ► అమెరికాలో విద్యను అభ్యసించాలంటే.. ఎఫ్–1 వీసా పొందాల్సి ఉంటుంది. దీని కోసం వీసా ఇంటర్వ్యూకు హాజరవడం తప్పనిసరి. ► యూకే బోర్డర్ ఏజెన్సీ సైతం వీసా ఇంటర్వ్యూని తిరిగి ప్రవేశపెట్టింది. ఒకసారి వీసా తిరస్కారానికి గురైన లేదా ప్రామాణిక టెస్టుల్లో తక్కువ స్కోర్లు పొందిన అభ్యర్థులను వీసా ఇంటర్వ్యూకి పిలిచే అవకాశాలు ఎక్కువ. ► స్టడీ అబ్రాడ్ పరంగా మరో ముఖ్యమైన దేశం కెనడాకు సంబంధించి అవసరం అనుకుంటేనే విద్యార్థులను వీసా ఇంటర్వ్యూకు పిలుస్తారు. కెనడాలో స్టూడెంట్ వీసా పొందాలంటే.. వైద్య పరీక్షలు తప్పనిసరి. ఆస్ట్రేలియా భిన్నంగా ఆస్ట్రేలియా.. దరఖాస్తు ఆధారంగా అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలవాలా.. వద్దా అనేది నిర్ణయిస్తోంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏదైనా ఒకటి జరగొచ్చు. ► వీసా ఇంటర్వ్యూయర్ అభ్యర్థిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం. ► అభ్యర్థిని పిలిచి నేరుగా ఇంటర్వ్యూ చేయడం. ► మరింత సమాచారం కోరుతూ అభ్యర్థికి లెటర్ రాయడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండానే అభ్యర్థికి తిరస్కరణ లేఖ పంపడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండా వీసా మంజూరు చేయడం. అవసరమైన పత్రాలు వీసా ఇంటర్వ్యూలో ప్రధానంగా అప్లికేషన్ లేదా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్‌ను అడుగుతారు. దీంతోపాటు ఇంటర్వ్యూయర్ కింది డాక్యుమెంట్లలో దేన్నైనా అడిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆయా డాక్యుమెంట్లను సిద్ధంగా తమ వద్ద ఉంచుకోవడం మంచిది. అవి.. పాస్‌పోర్ట్, ఫీజు రిసీట్, 10–12 తరగతులు, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల మెమోలు, జీఆర్ఈ/జీమ్యాట్/శాట్ స్కోర్‌కార్డ్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్. ఫైనాన్షియల్ ప్రొఫైల్ వీసా ఇంటర్వూ్వ ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యమైంది.. విద్యార్థి ఫైనాన్షియల్ ప్రొఫైల్. అభ్యర్థి సదరు దేశంలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమతను కలిగి ఉన్నాడా.. లేదా? అనే నిర్ణయానికి వచ్చేందుకు పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. అవి.. –లోన్ అప్రూవల్ లెటర్, సేవింగ్స్ బ్యాంక్ స్టేట్మెంట్ (3 నెలలు), ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్స్(3 సంవత్సరాలు). ఇలా చేస్తే మేలు ► వీసా ఇంటర్వ్యూను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూయర్ అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని.. సమాధానాలను చక్కటి ఇంగ్లిష్‌లో చెప్పగలిగేలా ఉండాలి. ► చేరేబోయే ప్రోగ్రామ్ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఆ కోర్సును సదరు దేశంలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారో చెప్పి ఒప్పించగలగాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశంలో లభించే ఉద్యోగ అవకాశాలను వివరించేలా సిద్ధంకావాలి. ► ఇంటర్వ్యూయర్ వద్దకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. తక్కువ సమయంలో ఇంటర్వ్యూని ముగించాలని భావిస్తుంటారు. కాబట్టి సమాధానాలను సూటిగా చెప్పడం ద్వారా ఇంటర్వ్యూయర్ మనుసు గెలవొచ్చు. అడిగే ప్రశ్నలు ► వీసా ఇంటర్వ్యూయర్ పలు ప్రశ్నలను అడిగేందుకు ఆస్కారం ఎక్కువ. అవి... ► విదేశీ విద్య కోసం ఈ దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు ► భారత్‌లో ఎందుకు చదవాలనుకోవడం లేదు ► ఎందుకు నిర్దిష్ట ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ► మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే(సదరు దేశం) ఉద్యోగం అవకాశం దక్కితే ఏం చేస్తారు ► ఒకవేళ వ్యక్తిగత ఆర్థిక స్థోమత విద్యాభ్యాసానికి సహకరించని పరిస్థితుల్లో మీ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయి? డూస్.. డోంట్స్ ► చక్కటి వస్త్రధారణతోపాటు సంభాషణ, ప్రవర్తనపై దృష్టిపెట్టాలి. ► ప్రశ్నలను ఆసాంతం విని..తర్వాత సమాధానానికి ఉపక్రమించాలి. ► ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ఇంటర్వ్యూయర్‌తో వాదించడం సరికాదు. ► సదరు దేశం, విద్యనభ్యసించబోతున్న విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవాలి. ► అవసరమైన డాక్యుమెంట్లను వెంట సిద్ధంగా ఉంచుకోవాలి. -
ఫారెన్ ఎడ్యుకేషన్.. చలోచలో
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా పూర్తిస్థాయిలో తగ్గనప్పటికీ రెండేళ్ల కిందటితో పోలిస్తే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం తెలంగాణ విద్యార్థులు ఈ ఏడాది మరింత ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫారెన్‌లో చదువుకోవాలనుకుంటున్న వారిలో ఏకంగా 90 శాతం మంది అమెరికా, బ్రిటన్, కెనడాలనే తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నట్లు తేలింది. ముంబై కేంద్రంగా విదేశీ విద్యాసంస్థల కన్సల్టెంటుగా పనిచేసే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ‘యోకెట్’ 30 వేల మంది తెలంగాణ విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పెరిగిన ఆర్థిక చేయూతతో విదేశాలవైపు... ఒకప్పుడు విదేశీ విద్య అంటే కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం. కానీ ప్రస్తుతం విద్యా రుణాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావడంతో విదేశీ విద్య అనేది పేద విద్యార్థులకు సైతం అందుబాటులోకి వచ్చింది. అందుకే నేటి కాలం విద్యార్థుల్లో చాలా మంది విదేశీ విద్యపై మక్కువ పెంచుకుంటున్నారు. తెలంగాణలో బీటెక్, ఎంబీబీఎస్ ఇతర గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా, బ్రిటన్, కెనడాలకే ప్రాధాన్యమిస్తున్నారని తాజా సర్వే వెల్లడించింది. ఆ తరువాత స్థానంలో ఆస్ట్రేలియాతోపాటు ఐరోపా దేశాలైన జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్స్ను ఎంచుకుంటున్నారని సర్వే వివరించింది. ఏటేటా పెరుగుతున్న సంఖ్య... విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటాన్ని ‘యోకెట్’ తన సర్వేలో ప్రత్యేకంగా గుర్తించింది. 2019లో 8,000 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లినట్లు సర్వే సంస్థ తెలిపింది. అయితే 2020లో కరోనా లాక్డౌన్ కారణంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో చాలా మంది తమ చదువులను ఈ ఏడాదికి వాయిదా వేసుకున్నారని, అయినప్పటికీ 2019తో పోలిస్తే గతేడాది రాష్ట్రం నుంచి ఏకంగా 17 శాతం మంది విద్యార్థులు అధికంగా విదేశాలకు వెళ్లారని తెలిపింది. అలాగే 2019 గణాంకాలతో పోల్చినపుడు ఈ ఏడాది విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న తెలంగాణ విద్యార్థుల సంఖ్య 62 శాతానికి చేరుకుందని సర్వే వెల్లడించింది. అందరికీ కంప్యూటర్ సైన్సే కావాలి.. తెలంగాణ విద్యార్థులు మాస్టర్స్ చేసేందుకు అక్కడ ఎంచుకుంటున్న కోర్సులపైనా సర్వే సంస్థ విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. విదేశాలకు వెళ్తున్న వారిలో 50 శాతం మంది కంప్యూటర్ సైన్స్ ఎంచుకంటున్నారని తేలింది. అలాగే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (ఎంఐఎస్) కోర్సులో చేరేందుకు తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మొగ్గుతున్నట్లు సర్వే వివరించింది. ఇక ఆ తరువాత స్థానంలో ఐటీతోపాటు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. 55 శాతం రుణాల ద్వారానే.. ఈ సర్వేలో ‘యోకెట్’ గమనించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తెలంగాణ నుంచి విదేశాలకు మాస్టర్స్ చేసేందుకు వెళ్తున్న విద్యార్థుల్లో 55 శాతం మందికి అంత ఆర్థిక స్తోమత లేదు. అయినా వారు బ్యాంకు రుణాలపై ఆధారపడి విదేశాలకు వెళ్తున్నారు. అలాగే 30 శాతం మంది పూర్తిగా సొంత నిధులను సమకూర్చుకొని వెళ్తుండగా 15 శాతం మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి విదేశాలకు వెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఎక్కువగా వెళ్తున్నారు కరోనా విపత్తు కారణంగా పలు దేశాలకు విధించిన ఆంక్షలు గతేడాది విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న చాలా మంది విద్యార్థులను నిరాశకు గురిచేశాయి. కానీ 2021లో ఇండియా నుంచి విదేశాలకు వెళ్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి గణనీయ వృద్ధి కనిపిస్తోంది. 2020లో కరోనా కారణంగా వెళ్లలేకపోయిన వారంతా వారి ప్రయాణాన్ని 2021–22కు మార్చుకుంటున్నారు. - తుముల్ బుచ్, యోకెట్ సహ వ్యవస్థాపకుడు -
దళితుల కోసం ప్రత్యేక వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: దళితుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందని, త్వరలో అది ఏర్పాటయ్యే అవకాశముందని ఎస్సీ అభివృద్ధి, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఏర్పాటు చేయాలని సీఎంను కోరారని సభ దృష్టికి తెచ్చారు. పద్దులపై చర్చలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ విషయాలపై పలువురు సభ్యుల సందేహాలను నివృత్తి చేస్తూ కొప్పుల వివరాలు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో ఉండేందుకు గతంలో ఇష్టపడేవారు కాదని, కానీ ప్రస్తుతం వాటిలో సీట్ల కోసం పెద్దపోటీ నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, ఉపాధి రుణాలతో ఆయా కుటుం బాలకు ఆసరాగా ఉంటుండగా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ప్రపంచంలో ఎక్కడైనా పోటీని తట్టుకునేలా నిలిచేందుకు దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో నాణ్యమైన, ఉన్నత విద్యను పొందేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. -
ఫేస్బుక్ మోసం: పరీక్షలు లేకుండా విదేశాల్లో విద్య
సాక్షి, హైదరాబాద్ : ఎలాంటి పరీక్షలు లేకుండా విదేశాల్లో విద్యనభ్యసించడానికి అవసరమైన వీసా, అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ ఫేస్బుక్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.6.7 లక్షలు కాజేశారు. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.5 లక్షలు, నిర్ధిష్ట సమయం కంటే ముందే పంపించేస్తానంటూ మరో రూ.1.7 లక్షలు కాజేశారు. ఈ బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమీర్‌పేటకు చెందిన ఓ యువకుడు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించాడు. దీనికోసం ఇంటర్నెట్తో పాటు సోషల్‌మీడియాలోనూ సెర్చ్ చేశాడు. ఫేస్బుక్ ద్వారా ఈ యువకుడికి పరిచయమైన సైబర్ నేరగాడు తాను విదేశాల్లో ఉంటున్నట్లు నమ్మించాడు. మెసెంజర్, వాట్సాప్‌ల ద్వారా సంప్రదింపులు జరుపుతూ తాను ఒక కన్సల్టెంట్ అని, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా లండన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విధ్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తానంటూ నమ్మబలికాడు. తొలుత ప్రాసెసింగ్ ఫీజుగా రూ.50 వేలు చెల్లించమని చెప్పాడు. ఆపై రకరాల రుసుముల పేర్లు చెప్పి మొత్తం రూ.5 లక్షల తన బ్యాంక్ ఖాతాల్లో, వాలెట్స్‌లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఇంత డబ్బు చెల్లించిన తర్వాత నగర యువకుడు ఎప్పుడు లండన్ పంపుతావంటూ సైబర్ నేరగాడిని పదేపదే ప్రశ్నించాడు. దీంతో వీసా, అడ్మిషన్ వ్యవహారాలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయని, నిర్దేశిత సమయం కంటే తొందరగా వెళ్లాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు. దీనికి ఔనంటూ యువకుడు సమాధానం చెప్పాడు. స్పీడ్ ప్రాసెసింగ్ కోసం మరో రూ.1.7 లక్షలు చెల్లించాలంటూ చెప్పి ఆ మొత్తాన్నీ డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై నగర యువకుడు ఎంతగా ప్రయత్నించినా ఆ సైబర్ నేరగాడు అందుబాటులోకి రాలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ కారు విక్రయిస్తానంటూ ఉన్న ప్రకటన చూసిన నగరవాసి స్పందించాడు. అందులో ఉన్న నెంబర్లో సంప్రదించగా ఆర్మీ ఉద్యోగిగా అవతలి వ్యక్తి చెప్పాడు. బేరసారాల తర్వాత కారును రూ.1,75,218కి విక్రయించడానికి ఒప్పందం కుదిరింది. ఈ మొత్తం డిపాజిట్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు. చిక్కడపల్లికి చెందిన మరో వ్యక్తి కూడా రూ.1.3 లక్షలకు కారు బేరమాడి, రూ.61 వేలు చెల్లించి మోసపోయాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ పే ద్వారా చేసిన బదిలీ అవతలి వ్యక్తికి చేరలేదు. దీంతో ఆ సంస్థ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని భావించాడు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన అతగాడు ఓ నెంబర్ తీసుకుని కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు చెప్పినట్లే తన బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు వివరాలు, పిన్ నెంబర్ అందించాడు. వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఈయన ఖాతా నుంచి రూ.92,794 కాజేశారు. తన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ.56 వేలు పోయాయంటూ దత్తాత్రేయనగర్‌కు చెందిన ఓ వైద్యుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అలానే బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి తన పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచిన సైబర్ నేరగాళ్లు స్నేహితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేయసికి అరుదైన కానుక.. ఇద్దరూ అరెస్టు తల్లి పక్కలో ఉండగానే అడవి జంతువుల దాడి! -
అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?
సాక్షి, అమరావతి: అమెరికాలో ఉన్నత విద్య అంటే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో క్రేజ్. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనుకాడటం లేదు. 2019-20లో అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏకంగా 7.60 బిలియన్ డాలర్లు వెచ్చించడం విశేషం. ఆ దేశంలో అత్యధికంగా చదువుతున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో గత ఐదేళ్లతో పోలిస్తే 2019-20లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు 4.40 శాతం తగ్గారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21కి ముందస్తు దరఖాస్తులు దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. ఈ మేరకు అమెరికా స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసిన నివేదిక అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 27 టాప్ యూనివర్సిటీల వైపే భారతీయుల మొగ్గు ► అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 1,93,124 మంది భారతీయ విద్యార్థులే. సంఖ్యాపరంగా విదేశీ విద్యార్థుల్లో చైనీయులు మొదటి స్థానం (3.72 లక్షల మంది)లో ఉన్నారు. ► భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెడిసిన్, మ్యాథ్స్ కోర్సుల్లో ఎంఎస్, పీహెచ్డీ చేస్తున్నారు. ► అమెరికాలో మొత్తం 74 యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది 27 టాప్ యూనివర్సిటీల్లోనే చేరారు. ► కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఓహియో, మిచిగాన్, ఇండియానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ► మన దేశీయులు అత్యధికంగా చేరుతున్నవాటిలో న్యూయార్క్ యూనివర్సిటీ, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ (బోస్టన్), యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ► ఇల్లినాయిస్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (లాస్ఏంజెల్స్), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాండియాగో), పర్డు్య యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలు ఉన్నాయి. ► 2019-20లో అమెరికాలో మొత్తం 10.75 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యాభాస్యం చేశారు. ఆ దేశంలో మొత్తం విద్యార్థుల్లో విదేశీ విద్యార్థుల వాటా 5.50 శాతం. వీరు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 44 బిలియన్ డాలర్లు సమకూర్చారు. గత నాలుగేళ్లలో యూఎస్‌లో భారతీయ విద్యార్థులు ఇలా.. విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య 2018-19 1,96,271 2017-18 1,86,924 2016-17 1,86,000 2015-16 1,65,918 -
విదేశీ విద్యపై తగ్గని మోజు!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలోనూ విదేశీ విద్యపై విద్యార్థుల ఆసక్తి తగ్గట్లేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా చదువుకునేందుకు విదేశాలకు వెళ్లే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనేక దేశాల్లో కరోనా కారణంగా పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా.. వచ్చే 6 నెలల నుంచి 10 నెలల్లోగా విదేశాలకు వెళ్లేందుకు మన విద్యార్థులు సిద్ధం అవుతున్నట్లు లీవరేజ్ ఎడ్యు సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సహకారం అందించే ఈ సంస్థ ప్రస్తుత కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆసక్తిపై సర్వే నిర్వహించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విభాగం కూడా అదే అంశాన్ని వెల్లడించింది. వచ్చే 6 నుంచి 10 నెలల్లో విదేశాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయన్న అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ఏటా దేశవ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. దీంతో వచ్చే 10 నెలల కాలంలో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులతో మాట్లాడి నివేదిక రూపొందించింది. లీవరేజ్ సర్వేలో తేలిన అంశాలివే.. – దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 76 శాతం మంది విద్యార్థులు రాబోయే 6 నుంచి 10 నెలల్లో విదేశాల్లో తమ విద్యను కొనసాగించాలని భావిస్తున్నట్లు తేలింది. – ఈ వేసవి ముగిసే నాటికి తాము విదేశాల్లో చదువుకునే అంశంపై నిర్ణయం తీసుకుంటామని 16 శాతం విద్యార్థులు పేర్కొన్నారు. – 8 శాతం మంది విద్యార్థులు మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా విదేశాల్లో చదువుకునే అంశాలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. – సెప్టెంబర్ నుంచి జనవరి నాటికి అంతర్జాతీయ యూనివర్సిటీలు చేపట్టే చర్యల ఆధారంగా, అక్కడి పరిస్థితులను బట్టి తమ నిర్ణయాల్లో మార్పులు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామని 25 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది. – 70 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు అంతర్జాతీయంగా అరోగ్య సంరక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఆరోగ్య సంరక్షణకు కెనడా, బ్రిటన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయని, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, భారత్, జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. – సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 76 శాతం మంది పీజీ కోసం విదేశాలకు వెళ్తామని చెప్పగా, మిగతా 34 శాతం మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివేందుకు వెళతావుని చెప్పారు. – విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బ్రిటన్ వెళ్తామని చెప్పుకొచ్చారు. బ్రిటన్‌లో చదువుకుంటామని 28 శాతం మంది చెప్పగా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్‌లో చదువుకుంటామని 20 శాతం మంది విద్యార్థులు పేర్కొన్నారు. కెనడాలో చదువుకునేందుకు 15 శాతం మంది, అమెరికాలో చదువుకునేందుకు 18 శాతం మంది ఆసక్తి కనబరిచారు. ప్రణాళికలు మార్చుకోవట్లేదు.. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఎక్కువ మంది కరోనా కారణంగా తమ ప్రణాళికలు మార్చుకోవట్లేదని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విభాగం పేర్కొంది. రానున్న 6 నెలల్లో విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో 73 శాతం మంది నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు తెలిపింది. ప్రణాళికలను మార్చుకున్న 27 శాతం మందిలో సగం మాత్రం తమ ప్రణాళికలను వచ్చే ఏడాదికి లేదా ఆపై సంవత్సరానికి వాయిదా వేసుకున్నట్లు తెలిపారని వెల్లడించింది. మిగతా సగం మంది ఆన్లైన్ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తి కనబర్చినట్లు తేలింది. ఇటీవల వస్తున్న సర్వేల్లో మాత్రం దేశంలోనే చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. గతవారం నిర్వహించిన సర్వేలో 31 శాతం మంది తమ ప్రణాళికలు మార్చుకున్నట్లు వెల్లడించింది. చదవండి: కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా! ప్రభావం ఎక్కువే ఉంటుంది.. విదేశాలకు వెళ్లే విద్యార్థులపై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, అది దేశీయ విద్యకు ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే 70 శాతం విద్యార్థులపై ఆ ప్రభావం ఉందని ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ ఫౌండర్, డైరెక్టర్ జితిన్ చాడా ఇటీవల పేర్కొన్నారు. అమెరికా, ఐరోపాకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలు విరమించుకున్నారని వెల్లడించారు. విదేశీ విద్యపై కరోనా ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్షు చోప్రా పేర్కొన్నారు. స్థానికంగానే తమ పిల్లలను చదివించుకునేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు కరోనా కారణంగా భారత విద్యా రంగం మెరుగుపడుతుందని, విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ చదువుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతుందని ఫరీదాబాద్‌లోని మానవ్ రచ్నా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) ప్రొఫెసర్ డాక్టర్ సుభాజిత్ ఘోష్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయి దేశంలోనే చదువుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. -
విదేశీ విద్య.. ఇలా సాధ్యమే!
విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా. కానీ, ఇపుడు విదేశీ విద్యావకాశాలు విస్త ృతమై... చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా.. వాటిలో ప్రవేశానికి కటాఫ్ 99 శాతం. దీన్నే రీచ్ఐవీ సీఈఓ విభా కాగ్జి మాటల్లో చెప్పాలంటే... దేశంలో ఆమోదనీయ స్థాయిలో ఉన్న నాణ్యమైన విద్య 2 శాతంలోపే!!. మరి మిగిలిన 98 శాతం మంది మాటేంటి? అందుకే ఇపుడు తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత వరకూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలంటే అది విదేశాల్లోనే సాధ్యమనే భావనతో ఉంటున్నారు. కాకపోతే ఈ ఖరీదైన విదేశీ విద్యను అందుకోవడం ఆర్థి కంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అందుకోవాలంటే అందుకు ప్రణాళిక అవసరమంటున్నారు నిపుణులు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం విదేశాల్లో కోర్సు పూర్తి చేయడమన్నది ఖరీదైన వ్యవహారమే. ఐవీ లీగ్ కాలేజీల్లో ఏడాది ట్యూషన్ ఫీజు రూ.30– 35 లక్షల మధ్య ఉంది. దీనికి తోడు అదనపు వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వసతి, ఆహారం, కన్వేయన్స్, విద్యకు అవసరమైన వస్తువుల కొనుగోలు, హెల్త్ ఇన్సూరెన్స్, వినోద ఖర్చులు అదనం. వీటన్నిటికీ మరో రూ.10 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం ప్రభావం, రూపాయి విలువ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2018లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 శాతం వరకు పడిపోయింది. మరి 2–4 ఏళ్ల కోర్సుల కాలంలో రూపాయి విలువలో వచ్చే వ్యత్యాసాల ఆధారంగా కోర్సు ఫీజులకు చేసే చెల్లింపులు పెరిగిపోవడం, లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని విదేశీ విద్య కోసం పంపించాలనుకునే వారు మూడేళ్ల కోర్సు కోసం రూ.50 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. దీనికి 8 శాతం ద్రవ్యోల్బణ రేటును కూడా ముడిపెట్టాలి. అంటే... ఇప్పుడు రూ.50 లక్షల వ్యయమయితే, పదేళ్ల తర్వాత 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా కోర్సు ఫీజు రూ.1.07 కోట్లకు పెరిగిపోతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని చూస్తే అసాధ్యమేనని అనిపించొచ్చు. కానీ, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సాధ్యమే. ముందుగానే ప్రారంభించాలి పిల్లల విద్యా వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే పొదుపు మొదలు పెట్టిన వారికి లక్ష్యం సులువవుతుంది. పిల్లలు నెలల వయసులో ఉన్నప్పటి నుంచే వారి విద్యావసరాలకు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలనేది ఫైనాన్షియల్ అడ్వైజర్లు చేసే సూచన. అందుకే. సిప్ విధానంలో ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే పిల్లలు ఉన్నత విద్యకు వచ్చే సరికి రూ.50 లక్షల నిధి సాకారం అవుతుంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనుక పెద్ద భారం కూడా అనిపించదు. దీర్ఘకాలం చేతిలో మిగిలి ఉంటే... అధిక రాబడుల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సరైన చోట పెట్టుబడి పైన చెప్పుకున్నట్టు ముందు నుంచే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే అనుకున్నంత నిధి సమకూరుతుందనుకోవద్దు. మీ అవసరాలకు తగిన మొత్తం సమకూరేందుకు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, దానిపై ఆశించే రాబడులు, కాంపౌండింగ్ ప్రయోజనంతో నిర్ణీత సమయానికి ఎంత సమకూరుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇందుకు అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచన తీసుకోవాలి. 5–10 ఏళ్లు, అంతకుమించి సమయం ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ కలగలసిన సాధనాల్లో మెరుగైన రాబడులనే ఆశించొచ్చు. ‘‘దీర్ఘకాలం పాటు సమయం ఉంటే 65–70%పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సురక్షితమే. మంచి ఫలితాల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోవాలి. స్టాక్స్, బాండ్లలోనూ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీలకు వర్తించే పన్ను ప్రయోజనాలే వీటికీ అమలవుతాయి. ఇవి 65% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక లాభం ఏడాదిలో రూ.లక్ష దాటితే (అమ్ముకున్న సమయంలో) దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లక్ష వరకూ పన్ను ఉండదు. ఆపై లాభంపై 10%పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఫిన్స్కాలర్జ్ వెల్త్ మేనేజర్స్ వ్యవస్థాపకురాలు రేణు తెలిపారు. ఆలస్యంగా మొదలు పెడితే... పిల్లలు పుట్టిన వెంటనే వారి విద్య కోసం పెట్టుబడి మొదలుపెట్టని వారు, ఈ అవసరాన్ని కొంత ఆలస్యంగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారు... సిప్తోపాటు ఏక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పరిష్కారం. లక్ష్యానికి దీర్ఘకాలం లేకపోతే వచ్చిన సమస్య ఏంటంటే రాబడులకు రిస్క్ తీసుకోలేని పరిస్థితి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో అంత ఆటుపోట్లు ఉండవు. రాబడులు బాండ్ ఈల్డ్స్‌కు స మానంగా ఉంటాయి. మూడేళ్లకు పైగా కొనసాగితే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే తక్కువ పన్ను రేట్లు అమలవుతాయి. విద్యా రుణం తీసుకోవచ్చు... లక్ష్యానికి సరిపడా ఇన్వెస్ట్ చేయలేని వారు, ఇన్వెస్ట్ చేసినప్పటికీ నిర్ణీత సమయంలో అవసరమైనంత నిధి సమకూరని వారు, ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించిన వారు పిల్లల విదేశీ విద్యా వ్యయాలను గట్టెక్కేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం పరిష్కారం. దాదాపు అన్ని బ్యాంకులు విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మంచి విద్యా సంస్థల్లో సీటు సంపాదిస్తే సులువుగానే రుణం పొందొచ్చు. పైగా, విద్యా రుణంపై ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లించే ఆదాయం ఉన్న వారికి ఇదో అదనపు ఆకర్షణ. సంప్రదాయ ఇన్వెస్టర్లయితే... పిల్లల ఉన్నత విద్య అనేది విస్మరించరాని అంశం. అలాగే, వాయిదా వేసేది కూడా కాదు. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోలేని వారు అయితే, పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం మరింత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రమ్య (25) నెదర్లాండ్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్‌కు వెళుతోంది. ఆమె చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాడు. కానీ, సంప్రదాయ సాధనాల్లో చేయడంతో రాబడులు పెద్దగా లేవు. దీంతో కోర్సుకు కావాల్సినంత సమకూరలేదు. దీంతో రమ్య విద్యావసరాల కోసం ఆమె తండ్రి తన రిటైర్మెంట్ నిధిలోనూ కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని మెరుగైన రాబడులను ఇవ్వలేవు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం కాస్తంత నయం. రికరింగ్ డిపాజిట్ కూడా కాస్త మెరుగైన ఆప్షనే. లక్ష్యానికి సమీపంలో... పిల్లల ఉన్నత విద్యకు మరో 2 ఏళ్లు ఉందనగా, ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు కొద్దికొద్దిగా వాటిని డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి మార్కె ట్లు పడిపోతే పెట్టుబడుల విలువ అమాంతం కరిగిపోయే ప్రమా దం ఉంటుంది. కనుక పెట్టుబడులను రక్షించుకోవాలనుకుంటే ముందు నుంచే క్రమంగా వైదొలగడం అవసరం. విద్యా వ్యయం ఏ దేశంలో ఎంతెంత? యూఎస్ఏ ట్యూషన్ ఫీజు: ప్రైవేటు కాలేజీల్లో సుమారు రూ.25–30 లక్షలు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.15–23 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.75,000. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరంలో తక్కువ. మొత్తం ఖర్చు: ఏటా దాదాపు రూ.34 లక్షలు. ఆస్ట్రేలియా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అయితే రూ.10–16 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌కు 12–18 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.86,000. పట్టణాలను బట్టి ఇందులో మార్పు ఉంటుంది. సిడ్నీ, కాన్బెర్రా పట్టణాల మధ్యే నివాస వ్యయం నెలకు రూ.17,000 తేడా ఉంటుంది. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. యూకే ట్యూషన్ ఫీజు: రూ.8–18 లక్షలు. నివాస వ్యయం: లండన్‌లో అయితే ప్రతి నెలా రూ.1.1 లక్ష వరకు. లండన్ బయట అయితే రూ.91,000. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. కెనడా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–15 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8–20 లక్షలు. నివాస వ్యయం: వీసా అవసరాలను బట్టి ప్రతి నెలా రూ.57,000 వరకు మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.19.8 లక్షలు సింగపూర్ ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5–13 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–25 లక్షలు. నివాస వ్యయం: రూ.50,000 వరకు ప్రతి నెలా. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.18 లక్షలు జర్మనీ ట్యూషన్ ఫీజు: పబ్లిక్ యూనివర్సిటీల్లో ఫీజు ఉండదు. కొన్ని నామమాత్రంగా ఏడాదికి రూ.40,000 వరకు చార్జ్ చేస్తున్నాయి. నివాస వ్యయం: మ్యూనిక్, బెర్లిన్ వంటి పెద్ద పట్టణాల్లో అయితే ప్రతి నెలా రూ.54,000. కాలేజీ డార్మెటరీల్లో ఉండేట్టు అయితే రూ.42,000 చాలు. ఫ్రీబర్గ్, హాన్నోవర్ వంటి చిన్న పట్టణాల్లో అయితే రూ.42,000 వరకు అవసరం అవుతుంది. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.5.4 లక్షలు. -
బ్రాహ్మణ పరిషత్ ప్రతిపాదనలకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రతిపాదించిన పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విదేశీ విద్య పథకం కింద రూ. 5 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ విధానాల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చేయటానికి ఏర్పరచిన పథకాన్ని ఆమోదించింది. వేద పాఠశాలలకు రూ. 2 లక్షల గ్రాంట్ మంజూరు చేయడానికి అంగీకరించింది. 75 ఏళ్లు నిండిన వేద పండితులకు నెలకు రూ. 2,500 చొప్పున గౌరవ పారితోషికం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. శాస్త్ర పారంగతులు వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 250 చొప్పున స్టైఫండ్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్మార్ధం పూర్తి చేసిన వారికి రూ. 3 లక్షలు, వేద పాఠశాలల నుంచి బయటకు వచ్చే ముందు, క్రమాంతం, గణాంతం చదువుకున్న వారికి రూ. 5 లక్షల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సబ్సిడీ.. బ్రాహ్మణుల్లో రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలన్నా లేదా వ్యాపారం చేసుకోవాలన్నా రూ. 1 లక్ష ప్రాజెక్టు అయితే 80 శాతం సబ్సిడీ, రూ. 12 లక్షల లోపు ప్రాజెక్టు అయితే రూ. 5 లక్షలు మించకుండా 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇంతకు ముందు మంజూరైన వాటిలో ఈ నియమం పాటించిన వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం సూచించింది. విదేశీ విద్య పథకం, బ్రాహ్మణ ఉపాధి పథకాల కింద దరఖాస్తు చేయదలచిన వారు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 20న జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో 2018–19 ఏడాదికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం.