విదేశాలకు వెళ్లి ఉన్నత వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేయాలనుకునే షెడ్యూల్డు కులాల విద్యార్థులకు రూ.పది లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
నేటినుంచి దరఖాస్తుల స్వీకారం.. గడువు 27
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు వెళ్లి ఉన్నత వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేయాలనుకునే షెడ్యూల్డు కులాల విద్యార్థులకు రూ.పది లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి క మిషనర్ బి.ఉదయలక్ష్మి గురువారం ఒక ప్రకటన చేస్తూ ఎస్సీలకు చెంది, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వారు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులని తెలిపారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ తదితర వృత్తి విద్యాకోర్సులను అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌లలో అభ్యసిద్దామనే ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించి ఉండరాదన్నారు.
పీజీ చేద్దామనుకునేవారు గ్రాడ్యుయేషన్‌లో ఉన్నత శ్రేణిలోను, పీహెచ్‌డీ చేయాలనుకునేవారు పీజీలో ఉన్నత శ్రేణిలోను ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి క లిగిన అభ్యర్థులు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో www.apepass.cgg.gov.in ద్వారా అనుమతించిన ఫార్మాట్‌లో ధ్రువపత్రాలతోసహా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసేందుకు ఈ నెల 27 వతేదీ తుదిగడువుగా పేర్కొన్నారు. అందిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సారథ్యంలోని రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపారు.