ఈ పథకం కింద విద్యార్థులకు పైసా విదిల్చని కూటమి సర్కారు
పేద బిడ్డలపై నిర్ధయగా వ్యవహరిస్తున్న వైనం
ఇప్పటికే విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు చెల్లింపులు బంద్
ఎన్నికల ముందు వచ్చిన కొత్త దరఖాస్తులు బుట్టదాఖలేనా?
ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పటికే విదేశాల్లో చేరిన పలువురు విద్యార్థులు
వారికి నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
అప్‌డేట్ తెలుసుకుందామంటే తెరుచుకోని జ్ఞానభూమి ఆన్‌లైన్ పోర్టల్
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన
పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని దెబ్బ తీసేందుకు కూటమి సర్కారు కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదల్చకుండా ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు.
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందనే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులకు రూ.107.07 కోట్లు అందించింది. గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో మరోమారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటేకనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు.
ఏదైనా అప్‌డేట్ ఉందేమో చూద్దామనుకుంటే జ్ఞాన భూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించనప్పటికీ వారి నుంచి స్పష్టత రాక పోవడం శోచనీయం.
– సాక్షి, అమరావతి
ప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. నెలలు గడుస్తున్నా మా ఆవేదన పట్టించుకోవడం లేదు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి సాయం అందేది. ఇప్పుడొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సాయం అందించకపోతే మా అబ్బాయి చదువు కోసం మేము అప్పులు చేసి అవస్థలపాలుకాక తప్పదు.
– గుంటూరుకు చెందిన ఒక చిరుద్యోగి
మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని విదేశీ విద్యా సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. మా దరఖాస్తు ఏమైందో తెలియదు. జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. విదేశీ విద్య పథకాన్ని కొత్త ప్రభుత్వం నిలిపేస్తుందని అంటున్నారు. నిబంధనల పేరుతో సాయాన్ని అరకొరగా పరిమితం చేస్తారంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తుందో లేదో తెలిస్తే.. మా తిప్పలు మేము పడతాం.
– పశ్చిమదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ రైతు ఆవేదన
పేద బిడ్డలపై పెద్ద మనసు చూపిన జగన్
విదేశాల్లో చదివేందుకు వెళ్లిన పేద బిడ్డలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 408 మందికి రూ.107.07 కోట్లు అందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016–17 నుంచి అమలు చేసిన పథకంలో 3,326 మందికి రూ.318 కోట్లు ఎగ్గొట్టింది. అదే మాదిరి ఈసారి కూడా విదేశీ విద్య పథకంలో ఎంపికైన వారికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
⇒ గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను విస్మరించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కేవలం రూ.15 లక్షలు చొప్పున మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకొంది. అదే జగన్ సర్కారు ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు సాయం అందించింది. వైఎస్ జగన్ అగ్రవర్ణ పేదల(ఈబీసీ)తో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు.
⇒ ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంíపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల(సెమిస్టర్)ల్లో ఆ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేవారు.
⇒ విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్‌డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment