poor children
-
ఆంగ్లానికే పట్టం!
సాక్షి, అమరావతి: తెలుగు భాషను గుండెల నిండా నింపుకొని.. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలవగలం. ఈ విషయాన్ని గుర్తించి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా అడుగులు ముందుకు వేయించారు. తెలుగు విద్యార్థులు రానున్న రోజుల్లో ఏ దేశానికి వెళ్లినా అక్కడి వారితో పోటీపడి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి చదువులను అందుబాటులోకి తెచ్చారు. కానీ అదేదో తప్పన్నట్లుగా, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటే తెలుగు భాషను అవమానించినట్లుగా తప్పుడు వాదనలను తెరపైకి తెచ్చి.. పేద, ధనిక విద్యార్థులనే సామాజిక అంతరాలను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు కొందరు తెలుగు భాషోద్దారకులమనే ముసుగు వేసుకున్న అభివృద్ధి నిరోధకుల సాయం తీసుకుంటోంది.రెండు శతాబ్దాల పోరాటం⇒ మన దేశంలో ఆంగ్ల విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇతర దేశాలతో పాటు మనదేశంలోనూ ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వారికే కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. దీనిని ముందే గుర్తించిన విలియం కారీ, రాజా రామ్మోహన్ రాయ్ 1817లో కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) మొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. ⇒ గవర్నర్ జనరల్ విలియం పిట్‌కి రామ్మోహన్ రాయ్ 1823లో రాసిన లేఖలో దేశంలో ఆంగ్ల మాధ్యమంతో ఆధునిక విద్య కోసం తీవ్రంగా వాదించారు. టీబీ మెకాలే 1835లో ఆంగ్ల విద్యా చట్టం ద్వారా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దానిని అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింక్ ఆమోదించారు. ప్రస్తుతం ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.⇒ 1983లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ను తీసేయడం వల్ల పశ్చిమ బెంగాల్లో యువత ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుతున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాయి. పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రాలన్నీ తమ ప్రాంతీయ భాషకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా రాణించాలంటే తప్పదు⇒ ‘ది ఇన్సైట్ పార్ట్నర్స్’ ప్రత్యేక నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 1.75 బిలియన్ల మంది ప్రస్తుతం స్థానిక భాషగా లేదా రెండవ భాషగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. మాండరిన్ చైనీస్ మాట్లాడే 1.1 బిలియన్ల కంటే ఇది ఎక్కువ. హిందీ, స్పానిష్ భాషలు మూడు, నాల్గవ స్థానంలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే అగ్ర భాష ఆంగ్లం అని స్పష్టం అవుతోంది.⇒ యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా నేర్చుకుంటున్నారు. వీరి సంఖ్య గతేడాది దాదాపు 4,19,000. ఆస్ట్రేలియాలో దాదాపు 1,69,000 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో 1,44,000 మంది విదేశీ విద్యార్థులు ఆంగ్లాన్ని విదేశీ భాషగా చదువుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ కమ్యూనికేషన్, బహుళజాతి సంస్థలలో ఉపాధిని పెంచడం, విదేశాల్లో పనిని పొందడం, గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా వివిధ రంగాలలో నైపుణ్యం పొందడం కోసం యువతకు ఇంగ్లిష్ నేర్చుకోవడం చాలా అవసరం.⇒ రెండు దశాబ్దాలుగా ద్విభాషా, బహుభాషా నైపుణ్యాల అవసరం గణనీయంగా పెరిగింది. ఎయిర్‌బస్, డైమ్లర్–క్రిస్లర్, ఫాస్ట్ రీటైలింగ్, నోకియా, రెనాల్ట్, శామ్సంగ్, శాప్, టెక్నికలర్, బీజింగ్‌లోని మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలు ‘ఇంగ్లిష్నైజేషన్’ పేరుతో సాధారణ కార్పొరేట్ భాషగా ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో ప్రపంచ భాషా సేవల పరిశ్రమ మార్కెట్ దాదాపు 55 బిలియన్ డాలర్ల ఆదాయాలనార్జిస్తోందని అంచనా. డిజిటల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెర్నింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి 15.03 బిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు.వ్యాపార రంగంలో..⇒ వ్యాపారానికి సంబంధించిన ప్రపంచ భాష ఇంగ్లిష్. ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంటర్నెట్ సేవల సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో జపాన్‌లోని అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ కంపెనీ రకుటెన్ 2010లోనే కంపెనీ వ్యాపార అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను మార్చింది. సంస్థలోని జపనీయులంతా ఆంగ్లం నేర్చుకోకుంటే ఉద్యోగాలు వదిలేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. గ్లోబల్ ఎకానమీలో మనుగడకు ఆంగ్లం అవసరమని చెప్పడానికి ఇదో ఉదాహరణ.⇒ ఆస్ట్రేలియాలో దాదాపు 385 మిలియన్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతుంటే, మన దేశంలో ఒక బిలియన్ మంది ఇంగ్లిష్ బాగా తెలిసిన వారున్నారు. ఇంటర్నెట్లో 565 మిలియన్ల మంది ఇంగ్లిష్‌నే ఉపయోగిస్తున్నారనేది మరో అంచనా. \⇒ 1998లో జర్మనీకి చెందిన హోచ్స్ట్, ఫ్రాన్స్‌కు చెందిన రోన్–పౌలెంక్ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అవెంటిస్ను ప్రారంభించినప్పుడు ఇంగ్లిష్‌నే ఆపరేటింగ్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్నాయి. 1990వ దశకంలో ఇటాలియన్ ఉపకరణాల తయారీదారు మెర్లోని, దాని అంతర్జాతీయ ఇమేజ్ను మరింత పెంచుకోవడానికి ఇంగ్లిష్ భాషనే అనుసరించింది. ⇒ కాగా, మన రాష్ట్రంలో కొన్ని శక్తులు పేద, ధనిక వర్గాల మధ్య మరింత అంతరం పెంచి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ వాస్తవాలన్నింటికీ ముసుగు వేస్తుండటం ఆందోళనకరం. -
Andhra Pradesh: విదేశీ విద్య.. ఇప్పుడు మిథ్య!
పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని దెబ్బ తీసేందుకు కూటమి సర్కారు కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదల్చకుండా ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు.విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందనే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులకు రూ.107.07 కోట్లు అందించింది. గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో మరోమారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటేకనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు.ఏదైనా అప్డేట్ ఉందేమో చూద్దామనుకుంటే జ్ఞాన భూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించనప్పటికీ వారి నుంచి స్పష్టత రాక పోవడం శోచనీయం. – సాక్షి, అమరావతిప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. నెలలు గడుస్తున్నా మా ఆవేదన పట్టించుకోవడం లేదు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి సాయం అందేది. ఇప్పుడొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సాయం అందించకపోతే మా అబ్బాయి చదువు కోసం మేము అప్పులు చేసి అవస్థలపాలుకాక తప్పదు. – గుంటూరుకు చెందిన ఒక చిరుద్యోగి మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని విదేశీ విద్యా సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. మా దరఖాస్తు ఏమైందో తెలియదు. జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. విదేశీ విద్య పథకాన్ని కొత్త ప్రభుత్వం నిలిపేస్తుందని అంటున్నారు. నిబంధనల పేరుతో సాయాన్ని అరకొరగా పరిమితం చేస్తారంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తుందో లేదో తెలిస్తే.. మా తిప్పలు మేము పడతాం. – పశ్చిమదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ రైతు ఆవేదనపేద బిడ్డలపై పెద్ద మనసు చూపిన జగన్విదేశాల్లో చదివేందుకు వెళ్లిన పేద బిడ్డలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 408 మందికి రూ.107.07 కోట్లు అందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016–17 నుంచి అమలు చేసిన పథకంలో 3,326 మందికి రూ.318 కోట్లు ఎగ్గొట్టింది. అదే మాదిరి ఈసారి కూడా విదేశీ విద్య పథకంలో ఎంపికైన వారికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.⇒ గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను విస్మరించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కేవలం రూ.15 లక్షలు చొప్పున మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకొంది. అదే జగన్ సర్కారు ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు సాయం అందించింది. వైఎస్ జగన్ అగ్రవర్ణ పేదల(ఈబీసీ)తో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు.⇒ ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంíపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల(సెమిస్టర్)ల్లో ఆ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేవారు.⇒ విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
నాడుప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. దీనికంతటికీ కారణం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ వర్సిటీ బిల్లు. నేడు మెరిట్ సాధించిన పేద విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను సొంతం చేసుకోవచ్చు. గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కన్వినర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా సీఎం జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిభ గల పేదింటి విద్యార్థులను టాప్ క్లాస్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో పైసా ఖర్చులేకుండా చదివిస్తూ, వారు ఉన్నత లక్ష్యాన్ని అధిగమించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు మాత్రమే అందుకునే ప్రైవేట్ యూనివర్సిటీ విద్యను తొలిసారిగా పేదింటి విద్యార్థులకు చేరువ చేశారు. ఏపీఈఏపీ సెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా మెరిట్ సాధించిన పేదింటి విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పించి, ఉత్తమ విద్య అందేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. రెండేళ్లలో 6,996 సీట్లు భర్తీ ఏపీలోని ప్రైవేట్ వర్సిటీల్లో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులన్నింటా ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు దక్కుతున్నాయి. ఈ వర్సిటీల్లో ఏడాదికి రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ నిర్ణయంతో పేద మెరిట్ విద్యార్థులకు గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం సీట్లు, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం సీట్లు లభిస్తున్నాయి. ఇందులో ఎస్ఆర్ఎం–అమరావతి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపీ వీఐటీ), సెంచూరియన్, అపోలో వర్సిటీ, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, మోహన్‌బాబు యూనివర్సిటీలలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో 6,996 సీట్లు పేద విద్యార్థులకు దక్కాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా ప్రభుత్వం ఐదేళ్లలో ఏకంగా రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్ వర్సిటీల్లో కన్వినర్ కేటగిరీలో చేరిన విద్యార్థులకు ఉచితంగానే చదువులు చెప్పిస్తోంది. అప్పట్లో ప్రైవేట్ వర్సిటీలకు చంద్రబాబు అండ ప్రైవేట్ వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం వర్సిటీ యాజమాన్యాలకు లబ్ధి చేకూరేలా నిబంధనలు పెట్టింది. ఆయా వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతో పాటు ఇతర రాయితీలూ కల్పించింది. ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్నింటా వర్సిటీల ఇష్టానికే వదిలేసింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే కేటాయించేవి. ఫలితంగా పేద మెరిట్ విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం జగన్ దార్శనికత సీఎం జగన్ అధికారం చేపట్టాక పరిస్థితి మారింది. ఉన్నత బోధన, వనరులు ఉన్న ప్రైవేట్ వర్సిటీ విద్య పేద విద్యార్థులకూ దక్కాలనుకున్నారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా గ్రీన్‌ఫీల్డ్ విధానంలో ఏర్పాటైన ప్రైవేట్ వర్సిటీల్లో చదువుకునే అవకాశాలపై తొలుత దృష్టి సారించారు. ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ ద్వారా ఆయా వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 35 శాతం సీట్లను కేటాయించారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల ఏర్పాటుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు.ఇప్పటికే కొనసాగుతున్న కాలేజీలు నిరీ్ణత నిబంధనలతో, వనరులను కలిగి ఉంటే ఆయా యాజమాన్యాలు తమ సంస్థలను బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీలుగా మార్చుకునే అవకాశమిచ్చారు. అయితే వర్సిటీగా మారక ముందు వరకు ఈ కాలేజీల్లోని సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో పేద మెరిట్ విద్యార్థులకు దక్కేవి. వర్సిటీగా మారాక 35 శాతం సీట్లే దక్కితే పేద మెరిట్ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని సీఎం జగన్ భావించారు. దీంతో బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లోని 70 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాలో కేటాయించేలా చట్టాన్ని సవరించారు.బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీగా ఏర్పాటయ్యాక కొత్త కోర్సులు ప్రారంభించినా, అదనపు సీట్లు తెచ్చుకున్నా వాటిలో మాత్రం గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల మాదిరి 35 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాకు దక్కుతాయి. ఇటీవల మరో మూడు విద్యా సంస్థలు బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీలుగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిల్లో మరిన్ని అదనపు సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. -
బీద పిల్లల గురించి ఆలోచించండి!
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్ (పెరియార్ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్కర్ బీసీ రిజర్వేషన్ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బీపీ మండల్ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్షిప్లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్ షా తన కొడుకు జయ్ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్ దెబ్బతింటుంది. గుజరాత్లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Jones Manikonda: ట్యూషనమ్మ
విజయవాడకు చెందిన 50 ఏళ్ల జోన్స్ మానికొండ వెనుక ఏ ఆర్థిక అండాదండా లేదు. కాని ఆమె విజయవాడలో, కృష్ణాజిల్లాలో ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల పిల్లల కోసం 60 ట్యూషన్ కేంద్రాలను వాలంటీర్లతో నడుపుతోంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వల్ల స్కూల్ ΄ాఠాల పట్ల భయం ఏర్పడకుండా, స్కూల్ మానేయకుండ ఈ ఈవెనింగ్ ట్యూషన్స్ సాయపడుతున్నాయి. మొత్తం 6 వేల మంది పిల్లలు ఇప్పటికి జోన్స్ వల్ల మేలు ΄÷ందారు. మామూలు పిల్లల సాయంత్రాలు వేరు. తల్లి వారికి స్నానం చేయించి, తినడానికి ఏదైనా ఇచ్చి, కాసేపు ఆడుకోనిచ్చి, ఆ తర్వాత చదువుకు కూచోబెడుతుంది. చదివిస్తుంది. లేదంటే ట్యూషన్‌కు పంపుతుంది. మరి మురికివాడల్లోనో? ఆ పిల్లలు స్కూల్‌కు వెళ్లడమే కష్టం. ఇంటికొచ్చాక ΄ాఠాలు చదివించాలంటే తల్లికి తీరిక ఉండదు. లేదా ఆమెకు చదువు రాదు. తండ్రికి అసలే పట్టదు. మరుసటి రోజు స్కూల్‌కు వెళితే హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ తిడుతుందని భయం. దాని బదులు స్కూల్ ఎగ్గొట్టడమే నయం. ఇలా ఆ పిల్లలు డ్రాపవుట్స్‌గా మారితే? అందుకే జోన్స్ మానికొండ మురికివాడల్లో ట్యూషన్లు నడుపుతుంది. ఆదర్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ పేరుతో ఆమె నడుపుతున్న ట్యూషన్లు ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల చదువుకు మేలు చేస్తున్నాయి. చదువే గౌరవం విజయవాడలోనే పుట్టి పెరిగిన జోన్స్ మానికొండ ఏడుగురు సంతానంలో రెండవది. సోషియాలజీలో ΄ోస్ట్గ్రాడ్యుయేషన్ చేశాక ఎం.ఈడీ. చేసి, సైకాలజీలో మరో పీజీ చేసింది. ‘మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరం బాగా చదువుకున్నాం. చదువు మాత్రమే మనిషికి గౌరవం, ఉ΄ాధి ఇవ్వగలదు. కాని నేటికీ చాలా పేదవాడల్లో పిల్లలకు చదువు అందడం లేదు. మురికివాడల్లోని పిల్లల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాను. ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే కాదు సమాజం మీద కూడా ఉంది’ అంటుందామె. సమాజసేవ కోసం అవివాహితగా ఉండాలని నిర్ణయించుకుంది జోన్స్. వెనుకబడ్డ సమూహాలు మురికివాడల్లో ఎక్కువగా ఉంటున్నది వెనుకబడ్డ సమూహాలు అని గమనించి ఆ సమూహాల మీద దృష్టి పెట్టింది జోన్స్. యానాది, ఎరుకల, వడ్డెర, జంగం, సుగాలి, కోయ... ఇలా 19 సమూహాలను గుర్తించి వారి నివాస ్ర΄ాంతాల్లో ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తోంది. మొత్తం కృష్ణాజిల్లాలో 22, విజయవాడలో 13, వైజాగ్‌లో 4, హైదరాబాద్‌లో 3 సెంటర్లు ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 48 టీచర్లు, 13 మంది వాలంటీర్లు మురికివాడల్లో ట్యూషన్లు చెబుతూ పిల్లలు స్కూళ్లకెళ్లి బాగా చదువుకునేలా సహాయం చేస్తున్నారు. బంధుమిత్రుల సాయంతో జోన్స్ నిర్వహిస్తున్న ఈవెనింగ్ ట్యూషన్లకు నెలకు దాదాపు 2 లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో దాదాపు ఎక్కువ భాగం సౌత్ ఆఫ్రికాలోని ఒక సోదరుడు, సింగపూర్‌లో ఉన్న ఒక సోదరి ఇస్తారు. మరికొంత సాయం స్నేహితుల వల్ల... దాతల వల్ల అందుతుంది. ‘కేవలం చదువు మాత్రమే కాదు... ఈ పిల్లలకు ΄ûష్టికాహారం, పరిశుభ్రమైన బట్టలు కూడా కావాలి. ఆ దిశగా కూడా నా సేవ కొనసాగాలని కోరుకుంటున్నాను. పేదరికం వల్ల పిల్లల్ని పనుల్లో పెట్టే తల్లిదండ్రులను ఒప్పించి ఆ పిల్లలను బడికి పంపేలా చూడటం మాకున్న అతిపెద్ద సవాలు’ అంటుంది జోన్స్. లెక్చరర్‌గా ఉద్యోగం మానేసి మరీ ఆమె చేస్తున్న ఈ సేవకు సమాజం నుంచి మరింత మద్దతు దొరుకుతుందని ఆశిద్దాం. -
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
పేద పిల్లల విద్యపై విషమెందుకు?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేక, విషం కక్కుతున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తే పేద పిల్లలు గొప్పగా ఎదుగుతారని, ఇది ఇష్టం లేకే కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నేషనల్ బకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుపై పచ్చ పత్రిక కథనాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు విధివిధానాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే, అదేదో తప్పు చేసినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగా బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో అత్యాధునిక ఐఎఫ్‌పీ స్క్రీన్లతో బోధనను డిజిటలైజ్ చేశామన్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడేలా టోఫెల్ శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకు ఇస్తున్న టోఫెల్ శిక్షణను ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఏటా ఒక తరగతి పెంచాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు మార్గదర్శకాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే.. ఎకాయెకిన సిలబస్ అమలు చేస్తున్నామని, అందుకోసం వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐబీ సిలబస్ అమలు ప్రాథమిక స్థాయిలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి నిధులూ ఖర్చు చేయలేదని చెప్పారు. ఇవన్నీ సిలబస్ అమలు సమయంలో వచ్చే అంశాలన్నారు. ఐబీ సిలబస్ అమలు 12 ఏళ్ల దీర్ఘకాలిక ప్రక్రియ అని తెలిపారు. ఐబీ సిలబస్ అమలుకు ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయని గుర్తుచేశారు. మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా మన విద్యార్థులు ప్రగతి సాధించకపోతే వెనుకబడిపోతారని, వారిని ఉన్నతంగా నిలపడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. సామాన్య కుటుంబాల్లోని విద్యార్థులకు మంచి జరుగుతుంటే సెలబ్రిటీ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని మంత్రి విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభుత్వ లక్ష్యం మారదని, పేద పిల్లలకు అంతర్జాతయ విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
పేద పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లలో ప్రవేశాలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనగా అనాధ, దివ్యాంగ బాలలు, హెచ్ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు (బీసీ మైనారిటీ, ఓసీ) 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలోకి ఆయా పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, లాటరీ పద్ధతిలో ఎంపికలు చేపడతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీనవర్గాల కుటుంబాలకు వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాల కుటుంబాలకు 1.40 లక్షలు ప్రాతిపదికగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 16 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. "http://cse.ap.gov.in' వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశ దరఖాస్తుతో పాటు ఇతర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
చిన్నారిని పట్టించుకోని రష్మిక.. 'నీ సినిమాలు చూసేదేలే' అని కామెంట్లు
Rashmika Mandanna 'Breaks Hearts', Brutally Trolled: సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. 'ఛలో' సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసి 'గీత గోవిందం'తో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో 2019 సంవత్సరంలో 'ఇండియన్ నేషనల్ క్రష్'గా అరుదైన గుర్తింపును కూడా పొందింది. ఇటీవల విడుదలైన ఐకానిక్ స్టార్ సరసన నటించిన 'పుష్ప' సినిమాలో శ్రీవల్లిగా బాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే రష్మిక ఫిట్నెస్ వీడియోలు, క్యూట్ ఎక్స్ప్రెషన్ ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే ఈ కన్నడ సుందరి తాను చేసే పనులతో ట్రోలింగ్ బారిన పడుతోంది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో రష్మిక డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్స్ ఓ ఆట ఆడేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన రష్మిక మళ్లీ ట్రోలింగ్ బారిన పడింది. ముంబైలో ఓ హోటల్ నుంచి బయటకొచ్చిన రష్మికను ఓ చిన్నారి ఆకలిగా ఉందంటూ డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. అప్పటికే ఆ చిన్నారిని సెక్యూరిటీ గార్డులు పక్కకు తోయడం వంటివి చేసిన ఆ పాప రష్మిక వద్దకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంది. అది చూసి 'తన వద్ద డబ్బులు లేవు' అని చెప్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది. వేరే ఎవరితో కూడా సాయం అందించడం వంటిది చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రష్మికను ఏకిపారేస్తున్నారు. 'చిన్న పాప అలా నిన్ను అడుక్కుంటుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది' అని ప్రశ్నిస్తున్నారు. 'అసలేంటీ నీ యాటిట్యూడ్' అని విరుచుకుపడుతున్నారు. 'ఈరోజు నుంచి నీ సినిమాలు చూడం' అని కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
మానవత్వం చాటుకున్న లేడీ కానిస్టేబుల్
ముంబై: ఖాకీలు అంటే కరుడుగట్టిన కఠినాత్ములే అనుకుంటే పొరపాటు. వారిలో కూడా మానవతావాదులు ఉంటారు. తోటి వారికి కష్టం వచ్చిందంటే చాలు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా సాయం చేయడానికి ముందుకు వస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ కథనం ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది. ఈ దశాబ్దపు మదర్ థెరీసా అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతలా మెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే సదరు మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రెహనా షేక్ ఈ మేరకు ఉదారత చాటారు. ఒక స్కూలుకు చెందిన 50 మంది నిరుపేద పిల్లలను ఆమె దత్తత తీసుకున్నారు. ఆ వివరాలు.. ముంబైలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రెహనా కొద్ది రోజుల క్రితమే ఎస్సై టెస్ట్ పాసయ్యారు. ఆమె భర్త కూడా డిపార్ట్మెంట్లోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఇక వారి కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వారందరి బాగోగులు చూడటమే కాక రెహనా ఇప్పుడు ఏకంగా మరో 50 మందిని దత్తత తీసుకోవడం అంటే మామూలు కాదు. ‘‘గతేడాది నా కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటికి వచ్చిన నా స్నేహితురాలు ఒక పాఠశాలకు చెందిన కొన్ని ఫొటోలు నాకు చూపించింది. అక్కడి పిల్లలను చూసిన తరువాత వారికి నా సహాయం అవసరమని నేను గ్రహించాను. వారంతా మారుమూల గ్రామాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసింది. దాంతో ఆ 50 మంది పిల్లలను దత్తత తీసుకున్నాను. 10 వ తరగతి వరకు వారి విద్యా ఖర్చులను నేను భరిస్తాను అని తెలిపాను. ఇక నా కుమార్తె పుట్టిన రోజు, ఈద్ కోసం దాచిన డబ్బును వారికి ఇచ్చాను” అని కానిస్టేబుల్ రెహనా షేక్ వెల్లడించారు. ఇక గతేడాది మహమ్మారి సమయంలో రక్తం, ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్ కావాలంటూ తనను ఆశ్రయించిన వారందరికి తన శక్తి మేరకు సాయం చేశారు రెహనా. బయటి వారికే కాక.. డిపార్ట్మెంట్ వారికి కూడా సాయం చేశారు. ఇక రెహనా చేస్తున్న సేవలను నగర కమిషనర్ హేమంత్ నాగ్రేల్ ప్రశంసించారు. సన్మానం చేసి ప్రశంసా పత్రం ఇచ్చారు. చదవండి: తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు.. -
సంపూర్ణ పోషణే లక్ష్యం
-
ఇంగ్లిష్ మీడియం.. పేదపిల్లల హక్కు
సాక్షి, అమరావతి: బడుగు, బలహీనవర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను ఒక హక్కుగా అందిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వారికి జగన్ మామ తోడుగా ఉంటాడని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం (సవరణ) బిల్లుకు శాసనమండలి సూచించిన సవరణలను తోసిపుచ్చుతూ ప్రవేశపెట్టిన ప్రభుత్వ బిల్లుపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శాసనసభ గతంలో ఆమోదించిన బిల్లునే యథాతథంగా తిరిగి ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేశారు. సమాజంలోని అన్ని వర్గాల్లోని పేద పిల్లల బతుకులు మార్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తీసుకువచ్చామని.. వారికి కచ్చితంగా న్యాయం చేసి తీరుతామని చెప్పారు. పేదలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎందుకు పాకులాడుతుందో అర్థం కావడం లేదన్నారు. జూన్ 1 నుంచి విద్యా దీవెన కింద ఒక్కో విద్యార్థికి రూ.1350 విలువైన కిట్ అందజేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఇంగ్లీష్ విద్య ఉచితంగా దొరికితేనే బతుకుల్లో మార్పు ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలు ప్రైవేట్ స్కూళ్లకు వేల రూపాయలు ఫీజులు కట్టలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్య ఉచితంగా దొరికితే తమ బతుకులు మారుతాయని దశాబ్దాలుగా వేచిచూస్తున్నారు. వారి గురించి పట్టించుకోని విధంగా ప్రస్తుతం వ్యవస్థలు తయారయ్యాయి. ప్రభుత్వ బడుల్లో పేదలు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించే పరిస్థితి కల్పిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 45 వేలకు పైగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు మీడియం విద్యకు పునాది పడితే పిల్లలు పెరిగేకొద్దీ ఇంగ్లీషులో మాట్లాడడం, చదవడం సులభమవుతుంది. అలాంటి ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ఇంతవరకు ఇంగ్లీషు మీడియం శాతం కేవలం 23.67 మాత్రమే.. అదే ప్రైవేటు స్కూళ్లలో 98.05 శాతం పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం పేదలకు ఇంగ్లీష్ రాకూడదని, వారు పేదరికంలోనే ఉండాలని ఇన్నాళ్లు వదిలేశారు. ఈ వ్యవస్థను మార్చాలి. పేదవాడు భావి ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి తీసుకురావాలనుకున్నాం. ఈవేళ కంప్యూటర్లలో మనకు కనిపించే భాష ఇంగ్లీషు. ఇంగ్లీషు భాష మాట్లాడితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ప్రపంచంలో ఉంది. పేదల పిల్లల బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకున్నాం. పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాలు సహా ఎవరైతే ప్రైవేట్ స్కూళ్లకు డబ్బులు కట్టలేక పిల్లలను తెలుగు మీడియానికి పరిమితం చేస్తున్నారో వారికి ఇంగ్లీషు మీడియంలో విద్యను అందిస్తాం. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందిస్తాం రైట్ టు ఎడ్యుకేషన్ కాకుండా.. పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందించాలనే దృఢ సంకల్పంతో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేయించాలని కొద్ది నెలల క్రితం బిల్లును తీసుకొచ్చాం. పేదవాడి జీవితాలు బాగు చేసే బిల్లు అని తెలిసినా కూడా దాన్ని కౌన్సిల్లో అడ్డుకున్నారు. సవరణలు సూచిస్తూ రిజెక్ట్ చేశారు. దీంతో ఆ బిల్లు మళ్లీ శాసనసభకు వచ్చింది. దీనిపై చర్చ కొనసాగిస్తున్నాం. దీన్ని తరువాత అడ్డుకున్నా.. అది చట్టం అయిపోతుంది. వాళ్లు ఏమీ చేయలేరని తెలిసి కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో వాళ్లకే తెలియదు. పేదవాడికి న్యాయం చేసే కార్యక్రమాన్ని ఆలస్యం చేసేందుకు ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదు. ఆ పేదపిల్లలకు జగన్ మామ తోడుగా ఉన్నాడు.. అందుకే కచ్చితంగా బిల్లును మళ్లీ ఇదే చట్టసభలో పెట్టి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అనేది ఒక హక్కుగా తీసుకొస్తామని చెబుతున్నాం. ఒక్కో విద్యార్థికి రూ.1350 విలువైన కిట్ (బాక్స్) అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకం, ఇంగ్లీష్ మీడియం చదువు, నాడు– నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం. చివరకు మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి మెనూ తయారు చేసి ఏ రోజు ఏం పెట్టాలో తయారు చేసి.. గోరుముద్ద అని పేరుపెట్టాం. ప్రతి అడుగులో పిల్లల జీవితాల మార్పు దిశగా అడుగులు వేస్తున్నాం. పేద పిల్లల తల్లిదండ్రులపై భారం కూడా పడకుండా... జూన్ 12న బడులు తెరిచే సమయానికి ముందే.. జూన్ ఒకటి నాటికే విద్యా కానుక కింద ఒక్కొక్క విద్యార్థికి రూ.1350 విలువైన కిట్ అందించబోతున్నాం. ఈ కిట్‌లో స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్స్‌లు, బెల్టులు పెట్టి ఇవ్వబోతున్నాం. సుమారు 36.10 లక్షల మంది పిల్లలకు విద్యాకానుక కింద జూన్ 1న ఇచ్చేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. దీని కోసం సుమారు రూ.487 కోట్లు ఖర్చుచేస్తున్నాం. బడుగుల జీవితాల్లో మార్పు రావాలని అడుగులు వేస్తున్నాం. దేవుడి దయ, ప్రజలందరి ఆశీర్వాదంతో ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఇంగ్లీష్ మీడియం బోధన బిల్లుకు సంపూర్ణంగా మద్దతు తెలపాలని కోరుతున్నాను. -
హాట్సాఫ్; రూ.300 కోట్ల భవనం దానం
బెంగళూరు: రూపాయి దానం చేయాలంటేనే వంద విధాలుగా ఆలోచించే రోజులు ఇవి. కానీ ఓ మహిళ మాత్రం దాన గుణానికి హద్దులు లేవని నిరూపించారు. ఏకంగా రూ.300 కోట్ల విలువైన తన ఆస్తిని దానం చేసింది. తనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచి చేసిన సహాయం ఎందరో నిరుపేదలకు ఇప్పుడు నీడలా మారబోతోంది. ఇంత మంచి మనసున్న ఆ అమ్మ పేరు మీరా నాయుడు. క్యాన్సర్‌తో బాధపడే బాలల సంక్షేమం కోసం 32 గదులున్న, రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తిని కేటాయించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో మెజిస్ట్రిక్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఉంది. ఒకప్పుడు లక్ష్మీ హోటల్‌గా పేరుగాంచిన ఆ భవనం నేడు బాలల ఆరోగ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఎంతో మంది పోటీపడినా.. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా దానం చేయడానికే ఆమె ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే క్యాన్సర్ బాధిత పిల్లల కోసం ఆ భవనాన్ని కేటాయించడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తున్న నగరంలోని శంకర్ ఆసుపత్రికి మీరా నాయుడు దానిని అప్పగించారు. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘భవనం ఉన్న ప్రదేశంలో నేను మరో బిల్డింగ్ కడితే ఇంకా డబ్బు వచ్చి చేరి నా సంపద పెరుగుతుంది. అంతేకానీ నాకు ఆత్మ సంతృప్తి ఉండదు. నా భర్త శ్రీనివాసులు నాయుడు ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ కట్టించాడు. దీన్ని పేదవారి కోసం దానం చేయడం వల్ల ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని' ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఆమె శంకర్ ఆస్పత్రి నిర్వాహకులకు అప్పగించారు. ఇక్కడికి వచ్చే క్యాన్సర్ బాధితులకు వీరు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అలా వైద్యం పొందిన చిన్నారులకు ఇక్కడ వసతి కల్పించాలని ఆమె కోరారు. ఇది విన్నవారంతా మీరా నాయుడు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. Mrs. Meera Naidu, donates Rs.300 crore "Lakshmi hotel" near Majestic to Shankara Cancer hospital to use it as a free accommodation for the patients and their families from outside Bengaluru. A noble gesture indeed! #Bengaluru #Karnataka — DP SATISH (@dp_satish) December 31, 2019 -
నిరుపేద చిన్నారుల విమానయానం
పిల్లలకు వేలవి సెలవులు వచ్చాయంటే.. తల్లిదండ్రుల ఆర్థిక స్థాయిని బట్టి విహార యాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. సంపన్నుల ఇళ్లల్లో ‘సింగపూర్‌కా, సిమ్లాకా’ అంటూ ఎంపిక చేస్తుంటే.. ‘అమ్మమ్మ ఇంటికా అత్త వాళ్ల ఊరికా’ అంటూ మధ్య తరగతి ఇళ్లలో ప్లాన్ వేస్తుంటారు. మరికొందరైతే వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి సమ్మర్ క్యాంప్స్‌కి జై కొడతారు. అయితే వెకేషన్‌కు వెళ్లే డబ్బుల్లేక, సెలవులను గడిపేందుకు చుట్టాలూ, బంధువులూ లేక, వేసవి శిబిరాల వ్యయాన్ని భరించే స్తోమత లేని అనాథ/నిరుపేద పిల్లల పరిస్థితేంటి? వారికి మాత్రం కలలు ఉండవా? అంటే ఉంటాయి. మరి వాటిని నెరవేర్చేదెవరు..? ‘వారి కలను తీర్చడానికి మనమంతా లేమా!’ అంటూ నగరానికి చెందిన ఓ ఎన్జీఓ ప్రశ్నిస్తే నగరవాసులు ‘మేం ఉన్నామంటూ’ ముందుకొచ్చారు. బాలికలకలలకు రెక్కలు తొడిగారు. సాక్షి,సిటీబ్యూరో :‘ఆంటీవాళ్లు మాకు ఎంతో మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నేను లైఫ్‌లో మంచి పొజిషన్‌కి వచ్చాక మా సొంత డబ్బులతో వాళ్లని ఫారిన్‌కి తీసుకెళతా’ అంటూ చెప్పింది పద్మజ. అలా మాట్లాడుతున్న ఆ అమ్మాయిని సంతోషంగా చూస్తూ.. ‘అదే మాకు కావాలండీ. వాళ్లలో అలాంటి ఆత్మవిశ్వాసమే మేం కోరుకునేది’అని చెప్పారు రీనా. ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ తరఫున 20 మంది నిరుపేద విద్యార్థినుల వేసవి సెలవులను సద్వినియోగం చేసే క్రమంలో భాగంగా ఈ ఉచిత విమానయాన అనుభవాన్ని వారికి అందించామన్నారామె. మరికొన్ని అంశాల్లోనూ శిక్షణ ఈ సమ్మర్ క్యాంప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని భరణి లే అవుట్లో ఉన్న కలినరీ లాంజ్‌లో ఈ బాలికలకు పాకశాస్త్ర తరగతులు ఉచితంగా ఏర్పాటు చేశారు. అప్పటికే అక్కడ శిక్షణ పొందుతున్న సీనియర్ స్టూడెంట్స్ వీరికి శిక్షణ ఇవ్వడం విశేషం. ‘నిరుపేద బాలికలైనా వీరి ఆలోచనా శక్తి అమోఘం. ఒక్క పూటలోనే రకరకాల వంటకాలపై వీరు ప్రాధమిక అవగాహన ఏర్పరచుకున్నారు. ఇలాంటి కార్యక్రమానికి చేయూతనివ్వడం మాకెంతో సంతృప్తినిచ్చింది’ అని కలినరీ లాంజ్ నిర్వాహకులు విభూతి, గోపి ఆనందంగా చెప్పారు. ఈ వేసవి మొత్తం ఈ బాలికలకు వైవిధ్యభరితమైన విజ్ఞాన వినోదాలను పంచాలనే క్రమంలో ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతుందని ఫౌండేషన్ ప్రతినిదులు స్పష్టం చేశారు. విమాన విహారం.. సోషల్ సహకారం.. గత కొంత కాలంగా టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు నగరంలోని రాధా కిషన్ బాలికా భవన్‌ను దత్తత తీసుకుని అక్కడి బాలికల బాగోగులు చూస్తున్నారు. వారికి చదువుతో పాటు అవసరమైనన సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే, అంతటితో ఆగిపోకుండా ఈసారి వేసవి సెలవుల్లో విభిన్న తరహా సమ్మర్ క్యాంప్‌ను డిజైన్ చేశారు. తొలిసారి 20 మంది బాలికలను బెంగళూరుకి విమానంలో తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ‘ఒక్కో బాలికకు టికెట్‌కి వ్యయం రూ.4,500 అవుతుంది. మా ఆలోచనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే మంచి స్పందన వచ్చింది. సిటీలో నివసించే మా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ తలో ఒకరు లేదా ఇద్దరు బాలికలకు స్పాన్సర్ చేస్తామంటూ ముందుకు వచ్చారు. బెంగళూరులో ఒక హోటల్ ఉచిత వసతి అందించారు. ఇలా ప్రతి ఒక్కరూ సహకరించడంతో ఈ బాలికల కల సాకారం చేయగలిగాం’ అని ఆనందంగా వివరించారు రీనా. డ్రీమ్ బిగ్.. అచీవ్ బిగ్ పెద్ద పెద్ద కలలు కనాలి.. అవి సాకారం చేసుకోవడానికి కష్టపడాలి.. అనే ఆలోచన వారికి ఇవ్వాలనేదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఆ ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఇరవై మంది బాలికల కలలకు రెక్కలు తొడుగుదామని భావించామంటున్నారు వీరు. నిరుపేద చిన్నారులు ఖరీదైన కలలు కనడానికి కూడా భయపడతారు. ఆ భయం వారి భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తుంది. ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే వారికి అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు అందాలి అంటారు ఫౌండేషన్ సభ్యులు. సమ్మర్ క్యాంప్‌లో బెంగళూరుకి విమానంలో రాకపోకలు సాగించడం జీవితంలో ఎదగాలనే స్ఫూర్తిని తమకు ఇచ్చిందని దేవిక, జెస్సికా.. తదితర బాలికలు ‘సాక్షి’తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. -
శిరీష్ మా‘స్టార్’ వచ్చిండు.. ఇంగ్లిష్ పాఠం చెప్పిండు
బంజారాహిల్స్: సినీనటుడు అల్లు శిరీష్ టీచర్ అవతారం ఎత్తాడు. పెగా టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ తరగతులు బోధిస్తోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలతో ఆయా స్కూళ్లలో పాఠాలు చెప్పిస్తుంటారు. ఇలా శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4,5 తరగతి విద్యార్థులకు అల్లు శిరీష్ గెస్ట్ టీచర్‌గా రెండు గంటల పాఠాలు బోధించాడు. విద్యార్థులకు సరదాగా ప్రశ్నలు వేస్తూ ఆంగ్లంలో సమాధానలు రాబట్టాడు. అనంతరం చిన్నారులు శిరీష్‌తో ఫొటోలు దిగారు. అతడు మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజని, పిల్లలకు తాను పాఠం చెప్పడం అద్భుతంగా ఉందన్నాడు. తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
పేద చిన్నారులను పట్టిపీడిస్తున్న తలసేమియా
-
ఆనందం
వందమందికి పైగా ట్రావెల్ అండ్ టూరిజమ్ ప్రొఫెషనల్స్ నిరుపేద చిన్నారుల కోసం తమ పనులను పక్కనబెట్టారు. ఆశాకిరణ్, వాల్మీకీ హృదయ్‌లకు చెందిన వంద మంది పిల్లలతో కలసి ఉల్లాసంగా గడిపారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వారికి జత కలసి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. స్కాల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ శనివారం బంజారాహిల్స్ జలగం వెంగళరావు పార్కులో నిర్వహించిన ‘చారిటీ డే అవుట్’లో చిన్నారులు తమనుతాము మరచి ఆడిపాడారు. ఆ తరువాత బహుమతులూ అందుకున్నారు. -
మోడల్
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మోడల్ స్కూళ్లు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆశయం బాగున్నా ఆచరణలో మాత్రం వీటి పరిస్థితి ‘మూడడుగులు ముందుకు.. ఆరడులు వెనక్కు’ అన్న చందంగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది. పేద పిల్లలు ప్రతిభ ఉండి కూడా సరైన ప్రోత్సాహం లేక చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ విద్య, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా అలాంటి జాడ కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ‘మోడల్’ చదువు ప్రశ్నార్థకంగా మారింది. అడుగడుగునా నిర్లక్ష్యం ఇతర విద్యా సంస్థలకు మోడల్‌గా నిలవాల్సిన ఈ స్కూళ్లు ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ‘డల్’ స్కూళ్లుగా మారాయి. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తుత్తివేనని ఈ స్కూళ్ల విషయంలో మరోసారి తేట తెల్లమవుతోంది. ప్రతి మండలంలోనూ ఓ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2012-13 విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2013-14 సంవత్సరానికి వాయిదా వేశారు. ఆ ఏడాది కూడా తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. పోనీ ఈ 25 స్కూళ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాయా అంటే అదీ లేదు. ఆగమేఘాల మీద ప్రారంభించి అద్దె భవనాల్లో స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ స్కూళ్ల భవనాలు పూర్తి స్థాయి నిర్మాణాలకు నోచుకోలేదంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 38 మండలాల్లో ఈ ఏడాది (2014-15) మోడల్ స్కూళ్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే నిధుల కొరతతో కొన్ని మండలాల్లో భవన నిర్మాణాలు పెండింగ్పడగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. బాలారిష్టాల్లో తొలి విడత స్కూళ్లు తొలివిడతగా గతేడాది జిల్లాలో అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, హిందూపురం, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్, నల్లచెరువు, పామిడి, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడి కి, యల్లనూరు మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు ప్రారంభమై ఏడాది అయినా బాలరిష్టాలు ఎదుర్కొంటున్నాయి. కనీస వసతులు కరువయ్యాయి. కనీసం తాగునీటి సదుపాయం చాలా స్కూళ్లలో లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఫర్నీచరు కరువైంది. వసతి సదుపాయం కరువు మోడల్ స్కూళ్లలో 6,7,8 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి రెసిడెన్షియల్ విషయంలో చేతులెత్తేశారు. దీంతో మండల పరిధిలోనే దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, అలాగని వదిలి పెట్టలేక తలలు పట్టుకుంటున్నారు. చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు. ఉదాహరణకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి, కనుముక్కల, ఓబుళంపల్లి, వెంకటాంపల్లి, పులేటిపల్లి తదితర గ్రామాల నుంచి వంద మంది దాకా విద్యార్థులు రోజూ ఆటోల్లో స్కూల్‌కు వస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా గతేడాది ప్రతి స్కూల్లోనూ 20 శాతం అదనంగా విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ కలిపి 100 సీట్లకు పైగా ఖాళీలు ఉండడం విశేషం. ఈ‘సారీ’ ప్రవేశాలు లేవు వాస్తవానికి ఈ ఏడాది (2014-15 విద్యా సంవత్సరం) 38 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఏ ఒక్క మండలంలోనూ ప్రారంభం కాని పరిస్థితి. 6,7,8 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సి ఉంది. స్కూళ్లు ప్రారంభానికి నోచుకోని కారణంగా గతేడాది ప్రారంభమైన 25 స్కూళ్లలో కేవలం ఆరో తరగతికి మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. సీట్లు 2 వేలు.. దరఖాస్తులు 5,680 జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు 2 వేల సీట్లుంటే.. 5,680 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీన్ని బట్టి మోడల్ స్కూళ్లలో చదువుకునేందుకు విద్యార్థులు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి సంబంధించి మంగళవారం డీఈఓ మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, హిందూపురం , కళ్యాణదుర్గం మండలాలకు కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లాటరీ నిర్వహించారు. కనగానపల్లి, కనేకల్లు, నల్లచెరువు, పామిడి, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు మండలాలకు ఆదిమూర్తినగర్‌లోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్.. రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాల విద్యార్థులకు కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో లాటరీ నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ తీశారు. మొత్తం 2 వేల సీట్లకు గాను 5,680 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి స్కూల్లోనూ 80 సీట్లు భర్తీ చేశారు. 20 శాతం అదనంగా అంటే ఎనిమిది మందిని ఎంపిక చేశారు. ఈలెక్కన ఒక్కో స్కూలుకు 88 మందిని ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా యల్లరూరు మండలంలో సీట్లకంటే కూడా దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ అవకాశం కల్పించారు. ఇంకా పది సీట్లు ఖాళీగా మిగిలాయని డీఈఓ వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఎస్‌ఏ ఏడీ శ్రీరాములు, డైట్ కళాశాల లెక్చరర్లు సుబ్బారావు, సాయిప్రసాద్, హెచ్ఎంలు లోకేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్‌తో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.