సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేక, విషం కక్కుతున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తే పేద పిల్లలు గొప్పగా ఎదుగుతారని, ఇది ఇష్టం లేకే కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నేషనల్ బకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుపై పచ్చ పత్రిక కథనాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు విధివిధానాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే, అదేదో తప్పు చేసినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగా బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో అత్యాధునిక ఐఎఫ్‌పీ స్క్రీన్లతో బోధనను డిజిటలైజ్ చేశామన్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడేలా టోఫెల్ శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకు ఇస్తున్న టోఫెల్ శిక్షణను ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఏటా ఒక తరగతి పెంచాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఇందుకు మార్గదర్శకాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే.. ఎకాయెకిన సిలబస్ అమలు చేస్తున్నామని, అందుకోసం వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐబీ సిలబస్ అమలు ప్రాథమిక స్థాయిలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి నిధులూ ఖర్చు చేయలేదని చెప్పారు. ఇవన్నీ సిలబస్ అమలు సమయంలో వచ్చే అంశాలన్నారు. ఐబీ సిలబస్ అమలు 12 ఏళ్ల దీర్ఘకాలిక ప్రక్రియ అని తెలిపారు. ఐబీ సిలబస్ అమలుకు ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయని గుర్తుచేశారు.
మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా మన విద్యార్థులు ప్రగతి సాధించకపోతే వెనుకబడిపోతారని, వారిని ఉన్నతంగా నిలపడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. సామాన్య కుటుంబాల్లోని విద్యార్థులకు మంచి జరుగుతుంటే సెలబ్రిటీ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని మంత్రి విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభుత్వ లక్ష్యం మారదని, పేద పిల్లలకు అంతర్జాతయ విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment