ఆంగ్లానికే పట్టం! | Recognized as language English spoken by 1. 75 billion people in world | Sakshi
Sakshi News home page

ఆంగ్లానికే పట్టం!

Published Mon, Jan 6 2025 4:50 AM | Last Updated on Mon, Jan 6 2025 4:50 AM

Recognized as language English spoken by 1. 75 billion people in world

ప్రపంచంలో 1.75 బిలియన్ల మంది మాట్లాడే భాషగా గుర్తింపు

గ్లోబల్‌ ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ మార్కెట్‌కు 55 బిలియన్‌ డాలర్ల ఆదాయం

2030 నాటికి 15.03 బిలియన్‌ డాలర్లకు డిజిటల్‌ ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ మార్కెట్‌

దేశంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడులో ప్రాధాన్యం

ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వారికే కార్పొరేట్‌ సంస్థల్లో పెద్దపీట

ఈ వాస్తవాలన్నింటికీ ఏపీలో ముసుగు వేస్తున్న కొందరు అభివృద్ధి నిరోధకులు

సాక్షి, అమరావతి: తెలుగు భాషను గుండెల నిండా నింపుకొని.. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలవగలం. ఈ విషయాన్ని గుర్తించి.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా అడుగులు ముందుకు వేయించారు. తెలుగు విద్యార్థులు రానున్న రోజుల్లో ఏ దేశానికి వెళ్లినా అక్కడి వారితో పోటీపడి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.

పేద పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి చదువులను అందుబాటులోకి తెచ్చారు. కానీ అదేదో తప్పన్నట్లుగా, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటే తెలుగు భాషను అవమానించినట్లుగా తప్పుడు వాదనలను తెరపైకి తెచ్చి.. పేద, ధనిక విద్యార్థులనే సామాజిక అంతరాలను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు కొందరు తెలుగు భాషోద్దారకులమనే ముసుగు వేసుకున్న అభివృద్ధి నిరోధకుల సాయం తీసుకుంటోంది.

రెండు శతాబ్దాల పోరాటం
మన దేశంలో ఆంగ్ల విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇతర దేశాలతో పాటు మనదేశంలోనూ ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వారికే కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. దీనిని ముందే గుర్తించిన విలియం కారీ, రాజా రామ్మోహన్‌ రాయ్‌ 1817లో కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) మొదటి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను ప్రారంభించారు. 

గవర్నర్‌ జనరల్‌ విలియం పిట్‌కి రామ్మోహన్‌ రాయ్‌ 1823లో రాసిన లేఖలో దేశంలో ఆంగ్ల మాధ్యమంతో ఆధునిక విద్య కోసం తీవ్రంగా వాదించారు. టీబీ మెకాలే 1835లో ఆంగ్ల విద్యా చట్టం ద్వారా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దానిని అప్పటి గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా విలియం బెంటింక్‌ ఆమోదించారు. ప్రస్తుతం ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

 1983లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ను తీసేయడం వల్ల పశ్చిమ బెంగాల్‌లో యువత ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుతున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాయి. పంజాబ్, జమ్మూ, కాశ్మీర్‌ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రాలన్నీ తమ ప్రాంతీయ భాషకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.

గ్లోబల్‌ ఎక్స్‌పర్ట్‌గా రాణించాలంటే తప్పదు
‘ది ఇన్‌సైట్‌ పార్ట్‌నర్స్‌’ ప్రత్యేక నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 1.75 బిలియన్ల మంది ప్రస్తుతం స్థానిక భాషగా లేదా రెండవ భాషగా ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. మాండరిన్‌ చైనీస్‌ మాట్లాడే 1.1 బిలియన్ల కంటే ఇది ఎక్కువ. హిందీ, స్పానిష్‌ భాషలు మూడు, నాల్గవ స్థానంలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే అగ్ర భాష ఆంగ్లం అని స్పష్టం అవుతోంది.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా నేర్చుకుంటున్నారు. వీరి సంఖ్య గతేడాది దాదాపు 4,19,000. ఆస్ట్రేలియాలో దాదాపు 1,69,000 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో 1,44,000 మంది విదేశీ విద్యార్థులు ఆంగ్లాన్ని విదేశీ భాషగా చదువుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ కమ్యూనికేషన్, బహుళజాతి సంస్థలలో ఉపాధిని పెంచడం, విదేశాల్లో పనిని పొందడం, గ్లోబల్‌ ఎక్స్‌పర్ట్‌గా వివిధ రంగాలలో నైపుణ్యం పొందడం కోసం యువతకు ఇంగ్లిష్‌ నేర్చుకోవడం చాలా అవసరం.

రెండు దశాబ్దాలుగా ద్విభాషా, బహుభాషా నైపుణ్యాల అవసరం గణనీయంగా పెరిగింది. ఎయిర్‌బస్, డైమ్లర్‌–క్రిస్లర్, ఫాస్ట్‌ రీటైలింగ్, నోకియా, రెనాల్ట్, శామ్‌సంగ్, శాప్, టెక్నికలర్, బీజింగ్‌లోని మైక్రోసాఫ్ట్‌ వంటి బహుళజాతి సంస్థలు ‘ఇంగ్లిష్‌నైజేషన్‌’ పేరుతో సాధారణ కార్పొరేట్‌ భాషగా ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో ప్రపంచ భాషా సేవల పరిశ్రమ మార్కెట్‌ దాదాపు 55 బిలియన్‌ డాలర్ల ఆదాయాలనార్జిస్తోందని అంచనా. డిజిటల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ మార్కెట్‌ విలువ 2030 నాటికి  15.03 బిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు.

వ్యాపార రంగంలో..
వ్యాపా­రానికి సంబంధించిన ప్రపంచ భాష ఇంగ్లిష్‌. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఇంటర్నెట్‌ సేవల సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్‌ మార్కెట్‌ కంపెనీ రకుటెన్‌ 2010లోనే కంపెనీ వ్యాపార అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను మార్చింది.  సంస్థలోని జపనీయులంతా ఆంగ్లం  నేర్చుకోకుంటే ఉద్యోగాలు వదిలేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. గ్లోబల్‌ ఎకానమీలో మను­గడకు ఆంగ్లం అవసరమని చెప్పడానికి ఇదో ఉదాహరణ.

ఆస్ట్రేలియాలో దాదాపు 385 మిలియన్ల మంది ఇంగ్లిష్‌ మాట్లాడుతుంటే, మన దేశంలో ఒక బిలియన్‌ మంది ఇంగ్లిష్‌ బాగా తెలిసిన వారున్నారు. ఇంటర్నెట్‌లో 565 మిలియన్ల మంది ఇంగ్లిష్‌నే ఉపయోగిస్తున్నారనేది మరో అంచనా. \

  1998లో జర్మనీకి చెందిన హోచ్‌స్ట్, ఫ్రాన్స్‌కు చెందిన రోన్‌–పౌలెంక్‌ అతిపెద్ద ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అవెంటిస్‌ను ప్రారంభించినప్పుడు ఇంగ్లిష్‌నే  ఆపరేటింగ్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకున్నాయి. 1990వ దశకంలో ఇటాలియన్‌ ఉపకరణాల తయారీదారు మెర్లోని, దాని అంతర్జాతీయ ఇమేజ్‌ను మరింత పెంచుకోవడానికి ఇంగ్లిష్‌ భాషనే అనుసరించింది. 

 కాగా, మన రాష్ట్రంలో కొన్ని శక్తులు పేద, ధనిక వర్గాల మధ్య మరింత అంతరం పెంచి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ వాస్తవాలన్నింటికీ ముసుగు వేస్తుండటం ఆందోళనకరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement