Corporate education
-
ఆంగ్లానికే పట్టం!
సాక్షి, అమరావతి: తెలుగు భాషను గుండెల నిండా నింపుకొని.. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలవగలం. ఈ విషయాన్ని గుర్తించి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా అడుగులు ముందుకు వేయించారు. తెలుగు విద్యార్థులు రానున్న రోజుల్లో ఏ దేశానికి వెళ్లినా అక్కడి వారితో పోటీపడి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి చదువులను అందుబాటులోకి తెచ్చారు. కానీ అదేదో తప్పన్నట్లుగా, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటే తెలుగు భాషను అవమానించినట్లుగా తప్పుడు వాదనలను తెరపైకి తెచ్చి.. పేద, ధనిక విద్యార్థులనే సామాజిక అంతరాలను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు కొందరు తెలుగు భాషోద్దారకులమనే ముసుగు వేసుకున్న అభివృద్ధి నిరోధకుల సాయం తీసుకుంటోంది.రెండు శతాబ్దాల పోరాటం⇒ మన దేశంలో ఆంగ్ల విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇతర దేశాలతో పాటు మనదేశంలోనూ ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వారికే కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. దీనిని ముందే గుర్తించిన విలియం కారీ, రాజా రామ్మోహన్ రాయ్ 1817లో కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) మొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. ⇒ గవర్నర్ జనరల్ విలియం పిట్‌కి రామ్మోహన్ రాయ్ 1823లో రాసిన లేఖలో దేశంలో ఆంగ్ల మాధ్యమంతో ఆధునిక విద్య కోసం తీవ్రంగా వాదించారు. టీబీ మెకాలే 1835లో ఆంగ్ల విద్యా చట్టం ద్వారా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దానిని అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింక్ ఆమోదించారు. ప్రస్తుతం ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.⇒ 1983లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ను తీసేయడం వల్ల పశ్చిమ బెంగాల్లో యువత ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుతున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాయి. పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రాలన్నీ తమ ప్రాంతీయ భాషకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా రాణించాలంటే తప్పదు⇒ ‘ది ఇన్సైట్ పార్ట్నర్స్’ ప్రత్యేక నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 1.75 బిలియన్ల మంది ప్రస్తుతం స్థానిక భాషగా లేదా రెండవ భాషగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. మాండరిన్ చైనీస్ మాట్లాడే 1.1 బిలియన్ల కంటే ఇది ఎక్కువ. హిందీ, స్పానిష్ భాషలు మూడు, నాల్గవ స్థానంలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే అగ్ర భాష ఆంగ్లం అని స్పష్టం అవుతోంది.⇒ యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా నేర్చుకుంటున్నారు. వీరి సంఖ్య గతేడాది దాదాపు 4,19,000. ఆస్ట్రేలియాలో దాదాపు 1,69,000 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో 1,44,000 మంది విదేశీ విద్యార్థులు ఆంగ్లాన్ని విదేశీ భాషగా చదువుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ కమ్యూనికేషన్, బహుళజాతి సంస్థలలో ఉపాధిని పెంచడం, విదేశాల్లో పనిని పొందడం, గ్లోబల్ ఎక్స్‌పర్ట్‌గా వివిధ రంగాలలో నైపుణ్యం పొందడం కోసం యువతకు ఇంగ్లిష్ నేర్చుకోవడం చాలా అవసరం.⇒ రెండు దశాబ్దాలుగా ద్విభాషా, బహుభాషా నైపుణ్యాల అవసరం గణనీయంగా పెరిగింది. ఎయిర్‌బస్, డైమ్లర్–క్రిస్లర్, ఫాస్ట్ రీటైలింగ్, నోకియా, రెనాల్ట్, శామ్సంగ్, శాప్, టెక్నికలర్, బీజింగ్‌లోని మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలు ‘ఇంగ్లిష్నైజేషన్’ పేరుతో సాధారణ కార్పొరేట్ భాషగా ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో ప్రపంచ భాషా సేవల పరిశ్రమ మార్కెట్ దాదాపు 55 బిలియన్ డాలర్ల ఆదాయాలనార్జిస్తోందని అంచనా. డిజిటల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెర్నింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి 15.03 బిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు.వ్యాపార రంగంలో..⇒ వ్యాపారానికి సంబంధించిన ప్రపంచ భాష ఇంగ్లిష్. ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంటర్నెట్ సేవల సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో జపాన్‌లోని అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ కంపెనీ రకుటెన్ 2010లోనే కంపెనీ వ్యాపార అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను మార్చింది. సంస్థలోని జపనీయులంతా ఆంగ్లం నేర్చుకోకుంటే ఉద్యోగాలు వదిలేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. గ్లోబల్ ఎకానమీలో మనుగడకు ఆంగ్లం అవసరమని చెప్పడానికి ఇదో ఉదాహరణ.⇒ ఆస్ట్రేలియాలో దాదాపు 385 మిలియన్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతుంటే, మన దేశంలో ఒక బిలియన్ మంది ఇంగ్లిష్ బాగా తెలిసిన వారున్నారు. ఇంటర్నెట్లో 565 మిలియన్ల మంది ఇంగ్లిష్‌నే ఉపయోగిస్తున్నారనేది మరో అంచనా. \⇒ 1998లో జర్మనీకి చెందిన హోచ్స్ట్, ఫ్రాన్స్‌కు చెందిన రోన్–పౌలెంక్ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అవెంటిస్ను ప్రారంభించినప్పుడు ఇంగ్లిష్‌నే ఆపరేటింగ్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్నాయి. 1990వ దశకంలో ఇటాలియన్ ఉపకరణాల తయారీదారు మెర్లోని, దాని అంతర్జాతీయ ఇమేజ్ను మరింత పెంచుకోవడానికి ఇంగ్లిష్ భాషనే అనుసరించింది. ⇒ కాగా, మన రాష్ట్రంలో కొన్ని శక్తులు పేద, ధనిక వర్గాల మధ్య మరింత అంతరం పెంచి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ వాస్తవాలన్నింటికీ ముసుగు వేస్తుండటం ఆందోళనకరం. -
ఏపీ నుంచే ‘గ్లోబల్ గ్రాడ్యుయేట్స్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ‘గ్లోబల్ గ్రాడ్యుయేట్స్’ను తయారు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో ర్యాంకులు సాధించిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ దూరదృష్టితో పేదింటి పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారన్నారు. విద్యారంగం మెరుగైన అభివృద్ధికి తమ ప్రభుత్వం నిపుణులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి(ఆస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ద్వారా ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ రామమోహనరావు, ప్రొఫెసర్ పి.ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. ఏపీలోని విద్యా రంగంలో సంస్కరణలకు నిదర్శనంగా ర్యాంకులు మెరుగుపడ్డాయన్నారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం న్యాక్ ఏ గ్రేడ్ 39, న్యాక్ ఏ ప్లస్ 32, న్యాక్ ఏ ప్లస్‌ప్లస్‌లో 6, ఎన్ఐఆర్ఎఫ్లో ఓవరాల్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, ఫార్మా విభాగంలో ర్యాంకులు సాధించిన 12 సంస్థల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్‌లర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, విక్రమ సింహపురి వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎం సుందరవల్లీ, శ్రీ వెంకటేశ్వర వర్సిటీ రిజిస్ట్రార్ మహ్మద్ హుస్సేన్, ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆ నిబంధనతో పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్య..
కడప ఎడ్యుకేషన్(వైఎస్సార్ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాసంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చదివే విద్యార్థుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో విద్యను వెనకబడిన వర్గాల దరికి చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధనను విధించింది. జిల్లాలో ఈ జోఓను అమలు చేసి 64 మందికి అవకాశం కల్పించారు. ఇలా ప్రవేశం పొందిన వారికి పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాం, బూట్లతో పాటు జగనన్న విద్యాకానుక సైతం అందిస్తోంది. పేరున్న పాఠశాలల్లో చదువుకోవాలనే పేదవారి కలను నిజం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు... విద్యాశాఖ 2022–23 విద్యా సంవత్సరంలో అర్హులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలలకు పంపించింది. జిల్లాలో 796 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1వ తగరతిలో ప్రవేశానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. విద్యార్థుల ఎంపిక పక్రియను ఆన్లైన్లోనే పారదర్శకంగా నిర్వహించింది. జిల్లాలో 123 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 86 మందిని ఎంపిక చేయగా 64 మందికి వివిధ పాఠశాలల్లో అడ్మిషనను కల్పించారు. మిగతా 22 మందికి వివిధ కారణాలతో ప్రవేశాలు కల్పించలేదు. మండలాల వారగా సీట్లు పొందిన వారు... జిల్లాలో చాపాడు మండలం నుంచి 8 మంది దరఖాస్తు చేసుకోగా ఐదుగురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. కలసపాడు మండంలో 17 మందికిగాను 16 మంది, కడప మండలంలో 12 మందికిగాను 8 మంది చేరారు. బిమఠంలో ఇద్దరికిగాను ఇద్దరూ చేరారు. కమాలపురంలో ఆరుగురికి గాను ఆరుగురు చేరారు. ఖాజీపేటలో ముగ్గురికిగాను ముగ్గురు చేరలేదు. కొండాపురంలో ఇద్దరికిగాను ఇద్దరూ చేశారు. మైదుకూరులో ముగ్గురికిగాను ఇద్దరు చేరారు. పెండ్లిమర్రిలో ఇద్దరికిగాను ఒకరు, ప్రొద్దుటూరు మండలంలో 9 మంది దరఖాస్తు చేసుకోగా ఏడుగురు చేరారు. పోరుమామిళ్ల, పులివెందుల్లో ఒకరికిగాను ఒకరు చేరారు. కాశినాయన మండలంలో ఒకరికగాను ఒకరు చేరలేదు. సిద్దవటంలో నలుగురికి నలుగురు. వల్లూరు, వేముల, మద్దనూరులో ఒకరికి ఒకరు చేరారు.సీకేదిన్నెలో ముగ్గురికి ముగ్గురు చేరారు. అలాగే రెండోవిడతకు సంబంధించి కడపలో ముగ్గురికి ఇద్దరు చేరగా ఒకరు వివిధ కారణాలతో చేరలేదు. ఖాజీపేటలో ఇద్దరికి ఇద్దరు, చాపాడులో ముగ్గురికి మగ్గురు పాఠశాలలో చేరలేదు. ఉచితంగా ప్రవేశం కల్పించాలి పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూళలో చదువుకోవాలనే కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. 2022–23 సంవత్సరానికి ఈ నిబంధనను అమలు చేస్తూ ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు నిరాకరించడానికి వీల్లేదు. విద్యార్థులపై ఎటువంటి వివక్ష చూపకూడదు. అడ్మిషన్లు తిరస్కరించినా, ఫీజులు చెల్లించాలని వేధించినా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. – దేవరాజు, జిల్లా విద్యాశాఖాధికారి -
తింగరి సన్నాసిలా ఆలోచిస్తాడు.. రాకేష్‌లో ఉన్న లోపమేంటి?
అదో కార్పొరేట్ స్కూలు. ఏడో తరగతి .టీచర్ ఇంగ్లీష్ లో పాఠం చెబుతున్నాడు .‘ సూర్యుడు , భూమి ఒకే సరళ రేఖ లో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది . అమ్బరా, పెనంబ్రా.. ‘ అంటూ పాఠ్యపుస్తకం లో ఉన్నది వున్నట్టుగా , గడగడా పాఠం అప్పచెప్పినట్టు టీచర్ చెప్పుకొంటూ పోతున్నాడు . రాకేష్ కు ఇదేదీ అర్థం కావడం లేదు. ‘ సర్ .. భూమి చంద్రుడు పక్కపక్కనే ఉంటారు కదా . మధ్యలో ఎటువంటి అడ్డు లేదు కదా ? మరి చంద్రుడు ఎందుకు కనిపించడు ?‘ అడిగాడు. టీచర్ తడబడుతూ‘ రెండింటికి మధ్య సూర్యుడు వస్తాడు అని చెప్పా కదా ? అయినా ఎప్పుడూ అనుమానాలే . వెదవ . నువ్వు ... నీ మొఖం . నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే . క్లాస్ బయట అరగంట నిలబడు‘ శిక్ష విధించాడు.రాకేష్ క్లాస్ బయట నిల్చొన్నాడు . క్లాసులో పిల్లలు హేళనగా నవ్వుతున్నారు . వారు పాఠాన్ని బట్టి కొట్టడం లో దిట్టలు తనకేమో ఆలా చేయడం ఇష్టం ఉండదు . ప్రతిదీ ఆలోచిస్తాడు . సూర్యుడు, భూమికి చంద్రుడికి మధ్యన వచ్చేస్తే భూమి భస్మీపటలం అయిపోతుందని తన అనుమానం . తనకింకా ఎన్నో అనుమానాలు . ఊటీ , సిమ్లా కొండ ప్రాంతాలు . కొండపైకి పొతే సూర్యుడికి కాస్తో కూస్తో దగ్గరగా పోయినట్టే కదా . అంటే ఎక్కువ వేడి ఉండాలి . కానీ కొండ ప్రాంతాలు ఎందుకు చల్లగా ఉంటాయి ? భూమి తిన్నగా ఉండదు . తన చుట్టూ తానూ తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగు తుంటుంది . దీనికి పెట్రోల్ ఎవడు కొట్టిస్తాడు ? ఇంత శక్తి ఎక్కడినుంచి వస్తుంది ? ఉత్తర ధ్రువ దేశాలు సరే . న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మనుషులు, వాహనాలు తలకిందులుగా వేలాడుతుంటాయా ? సముద్రాల్లోని నీరు కిందకు కారిపోదా? నదిలోని నీరు తాగడానికి వీలుగా ఉంటుంది . అది సముద్రం లో కలిస్తే ఎందుకు ఉప్పగా మారి పోతుంది? ఉత్తర భారత దేశం లోని నదులు జీవ నదులు . గోదావరి కృష్ణ నదులు ఎందుకు సంవత్సరమంతా ప్రవహించవు ? హుస్సేన్ సాగర్ లో ఎందుకు మంచు కురవదు ? బకెట్ నీటిలో కాళ్ళు పెట్టి ఎండలో నిల్చుంటే పచ్చని చెట్లలా తాను కూడా ఆహారాన్ని తయారు చేసుకోవచ్చా? మనిషి కోతి నుంచి పరిణామం చెందితే ఇంకా కోతులు ఎందుకున్నాయి ? అవి మనుషులుగా ఎప్పుడు మారుతాయి ? ఇవన్నీ అడగాలని పిస్తుంది . టీచర్లు కొడుతారు . క్లాస్మేట్స్ నవ్వుతారు . అందుకే నోరు మూసుకొంటాడు . రాకేష్ ఇంటికి వచ్చాడు . ఇంట్లో న్యూ జెర్సీ తాత ఉన్నాడు. అయన ఎప్పుడు ఇంటికి వచ్చినా, అమెరికా లోని తన కొడుకు కూతురు గురించి గొప్పలు చెబుతాడు . ఇండియా వేస్ట్ అంటాడు . అయన తో మాట్లాడాలి అని ఎన్నో సార్లు అనుకొన్నాడు . అమెరికా జీవన విధానం ఎందుకు గొప్పదని అయన అనుకొంటున్నాడు అని తెలుసుకోవాలి . ఇంటికి రావడం తోటే మమ్మీ ‘ రాకేష్ .. నువ్వు పోయి చదువుకో . హోమ్ వర్క్ చేసుకున్నాక డిన్నర్ . అటు పై రెండు పాఠాలు అప్ప చెప్పాలి ‘ అని టార్గెట్ ఇచ్చింది . ఉసురో మంటూ వెళ్లి తలుపు వేసుకొన్నాడు . పుస్తకం తెరిచాడు. తన మదినిండా ప్రశ్నలే ?అమెరికా డాలర్ ఒక్కటికి మనది 80 రూపాయిలా ? ఎందుకు ? మన డబ్బుకు అంత తక్కువ విలువ ఎందుకు ? అసలు దీన్ని ఎవరు నిర్ణయిస్తారు ? ఒక డాలర్ కు ఒక రూపాయి అయితే అమెరికా లోని మనవారందరూ తిరిగి వచ్చేస్తారా ? కొడుకు కూతురు అక్కడ స్థిరపడితే కొంతమంది అంకుల్స్ ఇక్కడ ప్లాట్స్ కొంటారెందుకు ? తాను అమెరికాకు రెండు సార్లు వెళ్ళాడు . వాళ్ళు తలనుంచి కిందదాకా లావుగా ఉంటారు . ఇక్కడ పెద్దవారు కడుపు దగ్గరే లావుగా ఉంటారెందుకు ? అమెరికా వాతావరణానికి తెల్లబడితే అక్కడికి వెళ్లిన ఇండియన్స్ ఎందుకు బ్రౌన్ కలర్ లోనే ఉన్నారు ? భూమి తిరుగుతూ ఉంటుంది కదా. అమెరికాకి పోవడానికి విమానమే ఎక్కాలా ? గాలిలో కొన్ని గంటలు నిలబడితే హైదరాబాద్ , ముంబై , అరేబియా సముద్రం , అరబ్ .. ఇలా నెమ్మదిగా కిందకు చూస్తూ అమెరికా వచ్చినప్పుడు దూకొచ్చుగా ?ఇండియా ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది ? ప్రతి ఇంటికి నోట్ల ప్రింటింగ్ మెషిన్ ఇచ్చేస్తే అందరూ దండిగా నోట్లు ముద్రించుకొని కోటీశ్వరులు అయిపోవచ్చుగా ?‘ ఆలోచనల తో బుర్ర తిరుగుతోంది . ఈ లోగా అమ్మ నాన్న రూమ్ లోకి వచ్చారు . తనేమో తన క్లాస్ మెట్ దగ్గర తీసుకొన్న ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పై ఒక చిన్న పుస్తకం చదవాలి అని తెరిచి ఉంచాడు . రోబో లు మన జీవితాలను ఎలా మార్చేస్తాయి అని అందులో వివరించారు.‘ చూడండి బాబాయ్ ! ఇదీ వీడి వాలకం . వెదవ! అసలు పుస్తకాలు చదవడు. బుర్ర తక్కువ సన్నాసి .ఎప్పుడూ ఏదో కాలక్షేపం పుస్తకాలు కావాలంటాడు . పిచ్చాడిలా ఆలోచిస్తుంటాడు. గౌతమ బుద్ధుడు అనుకొంటాడు . పక్కింటి అమ్మాయి సెంట్ పర్సెంట్ . వీడు ముప్పై నలబై . రేపు పొద్దున్న దాని దగ్గర నౌకరు అవుతాడు . ఆలా కాదులే .. నువ్వు ఈ సారి అమెరికా కు వెళుతున్నప్పుడు చెప్పు .. వీడిని పంపుతాను . ఇంట్లో నౌకర్లు దొరకడం కష్టం అంటున్నావుగా . అక్కడ పనిలోపెట్టుకోమని చెప్పు‘ .. అమ్మ చెబుతోంది. నాన్న, తాను ఫ్రెండ్ దగ్గరనుంచి బతిమలాడి తీసుకొని వచ్చిన పుస్తకాన్ని చించేసాడు . తనకు మొదట్లో అవమానంగా ఉండేది . ఇప్పుడది మామూలయిపోయింది . తనకు బుర్ర లేదు . పిచ్చి ఆలోచనలు చేస్తాను .. తాను నౌకరు ఉద్యోగానికి మాత్రేమే పనికొస్తాను ‘ డాడీ, మమ్మీ , స్కూల్ లో టీచర్ లు చెప్పేది ఇదే . విని విని దీనికే ఫిక్స్ అయిపోయాడు. ఇంటికి వెళితే అమ్మ చెప్పే మాటలు ..‘ పుస్తకం తీయి . చదువు . నోట్లో గొణుక్కొంటావేంటి ? గట్టిగా చదువు . చదివింది అరగంటలో పొల్లు పోకుండా అప్ప చెప్పాలి‘. నాన్న లేట్ నైట్ ఇంటికి వస్తాడు . ఆదివారాలు ఆయన అడిగే ప్రశ్నలు ‘ ఎన్ని మార్కులు వచ్చాయి ? ఎందుకింత తక్కువ మార్కులు? ‘ మార్కులు చెబితే‘ అసలే నాకే పుట్టవారా నువ్వు ? నీ మొఖం చూపొద్దు . ఈ సారి ఇదే మార్కులు వస్తే హుస్సేన్ సాగర్ లో దూకి చావు . ఇంటికి మాత్రం రావొద్దు .‘ అని మాటలు . తనకు బతకాలనిపించడం లేదు . ఇది తన ఇల్లేనా ? ఈ ఇంట్లో తన స్థానం ఏంటి ? అమ్మ నాన్న కు తనపై ఎందుకింత కోపం ? అర్థం కాని పాఠాల్ని బట్టి గొట్టడం తనకు ఇష్టం ఉండదు . చేతకాదు .ఏమి చెయ్యాలో అర్థం కాదు.ఐఐటీ లో సీట్ సాధించి అమెరికా లో జాబ్ చెయ్యాలి అని తల్లితండ్రులు ఎప్పుడో డిసైడ్ చేసేసారు . ఐఐటీ ఫౌండేషన్ కోర్స్. తనకు మాత్రం స్పేస్ సైంటిస్ట్ లేదా ఎకనామిస్ట్ కావాలని ఆశ. ఆ మాట చెబితే అందరూ పగలపడి నవ్వుతారు . ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? అంటారు . ఉట్టి అంటే ఎలా ఉంటుందో తనకు తెలియదు. స్వర్గానికి ఎక్కడం ఎందుకు ? పుణ్యం చేస్తే దేవుడే తీసుకొని పోతాడు కదా ? తన అనుమానం . తనకే ఎందుకిన్ని అనుమానాలు ? ఊళ్ళో అమ్మమ్మ ఉంది . సమ్మర్ హాలిడేస్ లో ఊరిలో గడపాలని తన ఆశ . బియ్యం చెట్లు ఎలా బియ్యం పండ్లను కాస్తాయో చూడాలి . చెరకును గానుగ ఆడితే నల్లటి బెల్లం వస్తుందట . అదే షుగర్ ఫ్యాక్టరీ కు పంపితే తెల్లటి చక్కర. ఎందుకిలా ?ఊళ్ళో ఒకప్పుడు బావులు ఉండేవట . వాటిలో ఆ రోజుల్లో పిల్లలు ఈత కొట్టేవారట . ఇప్పుడేమో బోర్ బావులు . ఎంత లోతుకు డిగ్ చేసినా నీరు రావడం లేదు . ఎందుకు ? గ్రామాల్లో రైల్వే పట్టాలను మరుగుదొడ్లుగా వాడుతారెందుకని ? మలం ఎప్పుడూ కంపుకొడుతుందా ? లేక హీరోలు హీరోయిన్ లు అమెరికా లోని తెల్లవారు .. వీరి మలం సువాసనను కలిగి ఉంటుందా ? అసలు మలం ఎందుకు వస్తుంది. మనం తినే ఆహారం లో అరగని పదార్థలు ఉంటేనే కదా ? రోజూ పోషకాలను ఇచ్చే టాబ్లెట్స్ సెలైన్ వాటర్ తీసుకొంటే టాయిలెట్లకు వెళ్లాల్సిన అవసరముండదు కదా ? అమ్మమ్మ వూరికి ఎప్పుడు మూడో క్లాసులో ఉన్నప్పుడు ఒక సారి తీసుకొని వెళ్లారు . అదీ పది రోజులు . సమ్మర్ హాలిడేస్ వస్తే తనకు స్పెషల్ క్లాసులు . మాథ్స్ ఫిజిక్స్ లో తాను వీక్ అట . తనకేమో తనకు చదువు చెప్పే టీచర్ లకే సబ్జెక్టు రాదు అనిపిస్తుంది . నాలుగో క్లాసులో మాథ్స్ టీచర్ ఒక ప్రశ్న అడిగాడు . నెలకు 29 రోజులున్న నెల ఏది ? అని . తాను జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రతినెల కు 29 రోజులు ఉంటాయి అని చెబితే టీచర్ అరగంట గోడ కుర్చీ వేయించాడు . తన తప్పేంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు . మొన్న ఫిజిక్స్ క్లాస్ .. ఆకాశం లో రాత్రి ఇన్ని నక్షత్రాలు చూసాము అని పిల్లలు టీచర్ తో చెబుతున్నారు . ఇప్పుడు ఆకాశం లో ఉన్న నక్షత్రాలను మన జీవిత కాలం లో చూడలేము మనకు కనిపించేది ఎప్పుడో తాతల కాలం నాటి దృశ్యం అని తాను చెబితే టీచర్ గొడ్డుని బాదినట్టు బాదేశాడు. రాకేష్ తండ్రి రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్. తల్లి గృహిణి . ఒకడే కొడుకు. రియల్ బూమ్ ఉన్నప్పుడు పరవాలేదు . మిగతా టైం లో ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా తెలియడం లేదు. తాము పడుతున్న బాధలు కొడుకు పడకూడదు . బంధువుల పిల్లలు ఎక్కువమంది అమెరికా లో సెటిల్ అయ్యారు . హ్యాపీగా ఉన్నారు. తమ కొడుకు ఐఐటీ లో సీట్ కొట్టాలి . జీవితం లో స్థిరపడాలి . పిల్లాడి విద్య కోసం వీరు ఎంత త్యాగానికైనా సిద్ధం . సంవత్సరానికి తనకు తన భార్య కు మూడు జతల బట్టలే .నగ కొనాలన్న ఆశ ఆమె మనసులోనే దాచేసుకొంది. సంవత్సరానికి లక్ష ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్ లో ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పించారు . వీడేమో చదవడు. తింగరి సన్నాసి లా ఆలోచిస్తాడు. అదీ రాకేష్ తల్లితండ్రుల మనోవేదన . ఇప్పడు రాకేష్ ని వెంటబెట్టుకొని దంపతులిద్దరూ ఒక సైకియాట్రిస్ట్ వద్దకు వచ్చారు . రాకేష్ లోని లోపం ఏంటి ?దీన్ని ఎలా సరిదిద్దాలి ? వాడిని దారిలో ఎలా పెట్టాలి అదే వారిముందున్న సమస్య. మీకేమైనా సమాధానం తెలిస్తే చెప్పండి . పాపం... కన్న బిడ్డను ప్రాణంగా చూసుకొంటూ బతుకుతున్న ఆ తల్లితండికి సాయం చేయండి.ఇది రాకేష్ ఒక్కడి సమస్యే కాదు.. మన చుట్టున్న లక్షలాది మంది పిల్లలు, వారి తల్లితండ్రుల సమస్య. ముందు సమాజంలో పేరుకుపోయిన కొన్ని భావనలను గుర్తించండి. పిల్లలకు మేలు చేస్తున్నామా? కీడు చేస్తున్నామా తెలుసుకోండి. -అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు. -
చదువంటే ఏబీసీడీలేనా?
సందర్భం మీరు విశ్లేషించాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం ఏబీసీడీలు పెట్టండి చాలు అనే చందంగా కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యకు ప్రమాణం గుడ్డిగా ఏబీసీడీలు పెట్టడమా? ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయనొక దార్శనికుడు. దేశ భవిష్యత్తుపట్ల దూరదృష్టితో ఆయనీ నినాదం ఇచ్చారు. ఈ దేశ భవిష్యత్తుకు ఇంధనం కచ్చితంగా నేటి బాలలే. అలాంటి అమూల్యమైన సంప దను సామాజిక విలువలు, బాధ్యత కల్గిన పౌరులుగా నైపుణ్యాలతో కూడిన పదునైన ఆయుధాలుగా మలచు కోవాల్సిన ఆవశ్యకత కచ్చితంగా నేటి సమాజానిదే. అందువల్ల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి సరి కొత్త ఆలోచనా విధానాన్ని, స్వతహాగా ఆలోచించే దృక్ప థాన్ని పెంపొందించేలా ప్రభుత్వాలు వ్యూహరచనలు చేయాలి. కానీ ఈ రోజు పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. పిల్లల్ని ఓ మూసలో పోసినట్టు తయారు చేయడంతో వారు మార్కుల సునామీలో కొట్టుకుపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు పిల్లల్ని మార్కుల యంత్రా లుగా తయారు చేస్తున్నాయి. క్వశ్చన్ బ్యాంకులు, నిత్యం స్టడీ అవర్లతో ఆ చిన్నారులతో మార్కుల జపం చేయి స్తున్నాయి. ఇది దేశ భవిష్యత్తుకు పెను ముప్పు. విద్యార్థి ప్రతిభకు నేడు మార్కులే గీటురాయిగా మారిపోయాయి. ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక సామర్థ్యంతో ఏ మాత్రం పని లేకుండా కేవలం మార్కు లకే ప్రాధాన్యం ఇవ్వడంతో విద్యా వ్యవస్థ రోజురోజుకీ సంక్షోభంలోకి కూరుకుపోతోందని చెప్పక తప్పదు. విద్యార్థి ప్రతిభకు ఆలోచనా విధానం, అతడి విశ్లేషణా త్మక సామర్థ్యమే కొలమానం తప్ప మార్కులు కారాదు. దురదృష్టవశాత్తు మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందువల్ల మన పరీక్షల విధానంలోనే మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు ప్రతి పాఠశాలలో వారం కాగానే పరీక్ష. పరీక్షలు పెట్టడం తప్పేం కాదు. కానీ, ఒక పరీక్ష, రెండో పరీక్షకు మధ్య జరగాల్సిన పునశ్చరణ మాత్రం లోపి స్తోంది. వెనకట ఓ పరీక్ష జరిగాక పిల్లల్లో ఏయే లోపాలు ఉన్నాయి? ఏయే పిల్లలు దేనిలో ముందంజలో ఉన్నారు? మిగతావారు దేంట్లో వెనుకబడిపోతున్నారు? అందుకు కారణాలేమిటో విశ్లేషించేవారు. తదనంతర కాలంలో అధ్యయనంలో లోపాల్ని గుర్తించి వాటిని సవ రించేవాళ్లు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తి విరుద్ధంగా తయారైంది. పరీక్షలు పెడుతూ వాటి ద్వారానే విద్యలో నాణ్యతా ప్రమాణాలను అంచనా వేస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ ఆధిక్యతను చూపించడం కోసం, తల్లిదండ్రులకు జవాబుదారీతనం కోసం పరీక్షల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. పరీక్షలు పెట్టడమే చదువు అనే భ్రమల్ని కల్పిస్తున్నారు. అంతేగాకుండా ప్రతివారం వాటిని మూల్యాంకనం చేసి మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తున్నారు. తద్వారా ఈ వారం ఒక విద్యార్థి ఒక సెక్షన్లో ఉంటే వచ్చే వారం అతడికి వచ్చిన గ్రేడ్ ఆధారంగా ఇంకో సెక్షన్లో పడేస్తు న్నారు. వారాంతపు పరీక్షల ఆధారంగానే ర్యాంకులు ఇస్తున్నారు. కాబట్టి పాఠ్య పుస్తకంతో చదువు చెప్పడా నికి బదులుగా క్వశ్చన్ బ్యాంకులు కొనుక్కోమని చెప్పడం పరిపాటిగా మారింది. పరీక్ష పేపర్లు కూడా తక్కువ సమయంలో వాల్యుయేషన్ కావాలని ఆబ్జెక్టివ్ టైప్‌లో పరీక్షలు పెడుతున్నారు. దీంతో పిల్లలు ఆలోచిం చనక్కర్లేదు. ఇచ్చిన ప్రశ్నను విశ్లేషించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తమకు తోచిన విధంగా ఏబీసీడీలు పెట్టుకుంటూ పోతే ఎన్నో కొన్ని మార్కులు వస్తాయిలే అనుకొనే అవకాశమూ లేకపోలేదు. చదువంటే ఏబీసీ డీలు పెట్టడమా? పిల్లలు తమ ఆలోచనను స్వతహాగా వ్యక్తపరిచే సంప్రదాయాన్నే పూర్తిగా నిరాకరిస్తున్నారు. మీరు విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఆలోచించా ల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. కేవలం ఏబీసీడీలు పెట్టండి చాలు అనే చందంగా వారిని ప్రోత్సహిస్తుంటే ఎలాంటి వాతావరణం నెలకొంటుందో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా విద్యార్థి ప్రతిభకు అద్దంపట్టేది అతడి విశ్లేషణాత్మక నైపుణ్య ధోరణి. కానీ, దాన్ని పక్కనబెట్టి సమయాభావం, ఇంకా ఇతర సమ స్యల కారణంగా పెద్ద పెద్ద పరీక్షలకు సైతం ఆబ్జెక్టివ్ టైప్ లోనే పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి గందరగోళంగా తయా రయ్యే అవకాశం ఉంది. పిల్లవాడు చదివిన దాన్ని అర్థం చేసుకొని పరీక్షలో జవాబులు రాయడానికి బదులుగా నేరుగా వెళ్లి ఏబీసీడీలు పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి వస్తోన్న పోకడల్ని చూస్తున్నాం. ఈ రోజు ఆలోచన పోయింది. రాత పోయింది. చదవడం పోయింది. కేవలం ఏబీసీడీలు రాయడం మాత్రమే పెరిగింది. అంటే పిల్లవాడికి ప్రశ్నపత్రం ఇవ్వగానే దాంట్లో ఏబీసీడీలు పెడదామనే ఆలోచిస్తాడు. అన్నీ ‘బి’లు పెట్టినా ఏ పది మార్కులో రావచ్చను కుంటున్నాడు. అయితే, ఈ ‘బి’ ఆలోచనతో పెట్టినవి కాదు. అందువల్ల ఇలాంటి పద్ధతుల ద్వారా విద్యార్థు లకు వచ్చిన మార్కులు అతడి ప్రతిభకు దక్కిన మార్కులు అని అంచనాకు రావడం సబబు కాదు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించే పద్ధతులను అవలం భించడం ద్వారా, నాణ్యమైన బోధనలతో విద్యార్థుల్లో బలహీనతల్ని రూపుమాపాలి తప్ప, వారి బలహీనత లతో ధనం సంపాదించడం సరైంది కాదు. ఈ డిజిటల్ యుగంలో కొత్త నైపుణ్యాలు కల్గిన మానవ సంపదను దేశానికి అందించడమే లక్ష్యంగా అంతా ముందుకెళదాం. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
అంతా మాయ!
♦ కార్పొరేట్ విద్యకు దూరం అయిన పేద విద్యార్థులు ♦ పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించినా ఆదుకోని పథకం ♦ సర్వర్ మొరాయించడంతో పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు ♦ ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తోందనే విమర్శలు ♦ గడువు పొడిగిస్తేనే విద్యార్థుకు న్యాయం ఉలవపాడు:పేదలు కార్పొరేట్ విద్యను అందుకోలేరు. అంత స్థాయిలో ఫీజులు చెల్లించడం అసాధ్యం. అందుకే ప్రభుత్వం ఓ పథకాన్ని ముందుకు తెచ్చింది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా విద్య అందించే అవకాశం కల్పించింది. దానికి గాను ఈనెల 18 నుంచి 27 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదో తరగతిలో 7 జీపీఏ పాయింట్లకంటే పైగా తెచ్చుకున్న విద్యార్థులను అర్హులుగా తేల్చింది. తీవ్ర నిరాశ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసినా.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా సర్వర్ మొరాయించింది. ఇది ప్రభుత్వం కావాలని చేస్తోందా లేక ఇంటర్నెట్ సిగ్నల్‌లో సమస్యా అని ఎవరికీ అంతుబట్టడంలేదు. మూడు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పథకానికి చివరి తేదీ 27 గా ప్రకటించారు. కానీ చివరి మూడు రోజులు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా పేద విద్యార్థులు కార్పొరేట్ ఉచిత విద్యకు అవకాశం కోల్పోయారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తుది గడువు తేదీని పొడిగించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయాలి.. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 7 గ్రేడు లేదా ఆ పైన మార్కులు సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో సంబంధిత సైట్ లో అప్లికేషన్ ఫాంమ్‌ను డౌన్లోడ్ చేసుకుని హాల్‌టికెట్ వివరాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఫొటో వంటి వివరాలు అప్లోడ్ చేయాలి. అనంతరం కావాల్సిన కార్పొరేట్ కళాశాల ను వరుస క్రమంలో తెలియచేయాలి. అన్నీ సమస్యలే.. నెట్లో దరఖాస్తు చేద్దామని వెళితే సంబంధిత వెబ్సైట్ పనిచేయకపోవడంతో అంతా వెనక్కు వస్తున్నారు. కొన్ని సార్లు సైట్ వచ్చినా అందులో 2015–16 విద్యా సంవత్సరం అని కనిపిస్తోంది. అలాగే దరఖాస్తు చేసినా మొబైల్‌కు మెసేజ్ రావడం లేదు. దీంతో అసలు దరఖాస్తు చేశామా లేదా అని ఎవరికీ అర్థం కావడంలేదు. ప్రభుత్వ నిర్వాకం వలన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. -
‘ఆన్లైన్’ ఆటంకాలు
- తెరుచుకోని ‘కార్పొరేట్ విద్య’ దరఖాస్తు వెబ్సైట్ -ఈ నెల 27న ముగియనున్న గడువు - తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్య కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు ఆన్లైన్ షాక్ ఇస్తోంది. వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి.. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులను ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదివిస్తుంది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరానికి గాను ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 18 నుంచి 27 వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్‌కాపీని ఆయా సంక్షేమ శాఖల కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొంది. జిల్లాలో మొత్తం 232 సీట్లు భర్తీ చేయనున్నారు. పదోతరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో భోజనం, వసతితో కూడిన విద్యను అందజేస్తారు. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీ విద్యార్థినులకు 50 శాతం, ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 25 శాతం, రెసిడెన్షియల్, నవోదయ పాఠశాలల విద్యార్థులకు 20 శాతం, ప్రతిభ గల విద్యార్థుల పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు. సమీపిస్తున్న గడువు ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయింది. దరఖాస్తుకు ఇక మిగిలింది మూడు రోజులే. కానీ ఇప్పటికీ వెబ్సైట్ తెరుచుకోలేదు. వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజూ ఆన్లైన్, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వెబ్సైట్ తెరవగానే ‘2016–17 (గడిచిన సంవత్సరం) కార్పొరేట్ అడ్మిషన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ క్లోజ్’ అని వస్తోంది. ఈ ఏడాది దరఖాస్తుకు ఆప్షన్ కన్పించడం లేదు. మరోవైపు విద్యార్థులు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ‘మా చేతుల్లో ఏమీ లేదు. ఆన్లైన్ ఓపెన్ అయితే దరఖాస్తు చేయండి. లేదంటే లేదు’ అంటూ ఉచిత సలహా ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. -
ఊరి బడి.. సర్కారు ఉరి
ప్రాథమికోన్నత స్కూళ్లకు మంగళం.. హేతుబద్ధీకరణ పేరుతో 4 వేల స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం త్వరలో ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు వేసవి బదిలీలకు ముందే చేపట్టాలని అధికారుల నిర్ణయం ప్రైమరీ, హైస్కూల్.. రెండంచెల విధానం అమలుకు సిద్ధం ఊళ్లోకి అడుగు పెడుతూనే అందరికీ దర్పంగా కనిపించేది సర్కారు పాఠశాల. ఒక్కో పాఠశాలకు ఒక్కో చరిత్ర. వీటిల్లో చదువుకుని ఎంతో మంది పేద విద్యార్థులు కలెక్టర్లు, ఎస్పీలయ్యారు. ఓ పద్ధతి ప్రకారం సామాజిక అవగాహన కల్పిస్తూ పిల్లలను తీర్చిదిద్దడంలో వీటికి తిరుగులేదు. ‘ఓ స్కూలు కట్టండి.. ఆ ఊరంతా అదే బాగుపడుతుంద’ని పెద్దలు చెప్పిన మాట అక్షరాలా నిజమని వేలాది గ్రామాలు నిరూపించాయి. ఇలాంటి స్కూళ్లలో చిన్న పాటి లోపాలు చూపి.. కాలి వేలికి పుండు అయిందని ఏకంగా కాలినే తీసేయండన్నట్లు ప్రభుత్వం వరుసగా మూతేస్తోంది. ఇదే అదనుగా కాచుకు కూర్చున్న ‘కార్పొరేట్’ విద్యా సంస్థలు తమ విద్యా వ్యాపారాన్ని మూడు వీధులు.. ఆరు పాఠశాలల రీతిలో విస్తరించుకుంటున్నాయి. వెరసి సగటు.. బడుగు విద్యార్థి చదువు ‘కొన’లేక సతమతమవుతున్నాడు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత విద్యాసంవత్సరం హేతుబద్ధీకరణ పేరిట 1,486 స్కూళ్లను మూసేయించిన ప్రభుత్వం ఈసారి అంతకన్నా రెట్టింపు సంఖ్యలో స్కూళ్లకు మంగళం పాడాలన్న యోచనతో ముందుకెళ్తోంది. ఇందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే ప్రభుత్వానికి పంపనుంది. వేసవి సెలవుల్లో టీచర్ల సాధారణ బదిలీలు చేపట్టడానికి ముందే స్కూళ్ల హేతుబద్ధీకరణను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత బదిలీల ద్వారా మిగిలిన స్కూళ్లలో టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రాథమికోన్నత స్కూళ్లకు పెనుముప్పు పాఠశాల విద్యాశాఖ రూపొందించిన హేతుబద్ధీకరణ ప్రతిపాదనల్లో ఈసారి ప్రాథమికోన్నత పాఠశాలలను మూయించాలన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అనే మూడంచెల విధానంలో ప్రభుత్వ స్కూళ్లు నడుస్తున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను ముడిపెట్టి వాటిని క్రమేణా మూయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండంచెల విధానమే కొనసాగించి ప్రాథమికోన్నత విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రంలోని 4,427 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 4 వేల వరకు మూతపడే ప్రమాదముంది. దీనివల్ల టీచర్లు వేరే పాఠశాలలకు బదిలీ అవ్వడంతో పాటు 1.50 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడనున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 75 మందిపైనా, 6, 7 తరగతుల్లో 60 మందిపైన విద్యార్థులున్న పాఠశాలల్ని అప్‌గ్రేడ్ చేసి హైస్కూళ్లుగా మార్పు చేసి 8, 9 తరగతులు ప్రారంభించాలని, అంతకన్నా తక్కువగా విద్యార్థుల సంఖ్య ఉంటే వాటిని పూర్తిగా రద్దుచేసి ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలన్న నిబంధన పెడుతున్నారు. ఈ ప్రాథమికోన్నత పాఠశాలలను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలపైనా కన్ను ప్రాథమికోన్నత స్కూళ్ల వరకే కాకుండా ప్రాథమిక పాఠశాలలనూ హేతుబద్ధీకరించాలని విద్యాశాఖ చూస్తోంది. రాష్ట్రంలో 39,186 ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 32 వేల స్కూళ్లున్నాయి. వీటిలో 5,690 స్కూళ్లలో 19 మంది లోపు విద్యార్థులున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చూపిస్తోంది. వీటన్నిటినీ గిట్టుబాటు కాని (నాన్ వయోబుల్) పాఠశాలల కింద జమకట్టి వేరే పాఠశాలల్లో విలీనం చేస్తోంది. గతేడాది విలీనం చేసిన పాఠశాలల్లో 3,876 స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్పు చేస్తామని అధికారులు ప్రకటించారు. తగినంత మంది టీచర్లు, సదుపాయాలు, రవాణా సదుపాయం అంటూ ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. సున్నాలు, ఇతర మరమ్మతుల పేరిట రూ.121 కోట్లకు పైగా ఖర్చు చేయించారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఇందులో 1,486 స్కూళ్లలో తగినంత మంది విద్యార్థులు లేరని సాకుచూపుతూ మూత దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలకూ తప్పని ముప్పు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలనూ హేతుబద్ధీకరణ పరిధిలోకి తెస్తున్నారు. రాష్ట్రంలో 4,998 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 3,851 స్కూళ్లలో సమాంతరంగా సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియం తరగతులు నడుస్తున్నాయి. ఈ హైస్కూళ్లలో 75 లోపు విద్యార్థులున్న వాటిని, 5 కిలోమీటర్లలోపు ఉన్న హైస్కూళ్లలో విలీనం పేరిట మూసి వేయించాలని నిర్ణయించారు. నిర్ణీత సంఖ్యకన్నా తక్కువ విద్యార్థులున్న స్కూళ్లు 144 ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలోని సక్సెస్ స్కూళ్లలో 50 మంది కన్నా తక్కువ ఉన్నవి 539 ఉన్నాయి. వీటన్నిటిపైనా హేతుబద్ధీకరణ వేటు పడనుంది. -
కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం
డీఈఓ రామలింగం గూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డీఈఓ మాట్లాడుతూ జిల్లాలోని 100 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ మేరకే 6 నుంచి 10 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలిన పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు బోధించేందుకు దాతల సాయాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో నూతన విద్యా వరవడులకు శ్రీకారం చుడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ మంజులాక్షి, ఎంఈఓ ఇస్మాయిల్, రవీంద్ర, రిసోర్స్ పర్సన్లు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, ఖాధర్‌బాష, జగదీష్ పాల్గొన్నారు. -
సరస్వతీ నిలయం
సక్సెస్ బాటలో సర్కారు బడి ఆదర్శంగా నిలుస్తున్న ముట్పూరు పాఠశాల కార్పొరేట్‌కు ధీటుగా విద్యాబోధన గ్రామస్తుల ప్రోత్సాహం, దాతల సహకారంతో ముందుకు.. సర్కారు స్కూలంటే సాధారణంగా రంగు వెలిసిన గోడలు, లేచిపోయిన గచ్చు, పెచ్చులూడుతున్న శ్లాబు, చెత్తా చెదారాలు తదితర దశ్యాలే కళ్లముందు మెదులుతాయి. కొందుర్గు మండలం ముట్పూరు ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఉపాధ్యాయులు అంకితభావంతో వ్యవహరిస్తారు. ప్రతి చిన్నారికి సులభంగా అర్థమయ్యేలా కృషి చేస్తున్నారు. గ్రామస్తుల ప్రోత్సాహంతో పాటు దాతల సాయంతో పాఠశాలను అభివృద్ధిపథంలో దూసుకెళ్తోంది. – కొందుర్గు ఆరేళ్ల క్రితం ఆ పాఠశాలలో ఎలాంటి వసతులు లేవు. 2010లో ఉన్నత పాఠశాల నుంచి వేరు పడిన తర్వాత ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, గ్రామస్తుల ప్రోత్సాహం, దాతల సహకారంతో దినదినాభివృద్ధి సాధించింది ముట్పూర్ ప్రాథమిక పాఠశాల. పాఠశాల విభజన సమయంలో ఐదు తరగతులకు 75మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. అప్పట్లో పాఠశాల భవనం సరిగా లేదు. కానీ ప్రస్తుతం చక్కటి భవనం, తరగతి గదుల్లో కార్పొరేట్ స్థాయిలో ఆధునాతన ఫర్నీచర్, గ్రంథాలయం, డైనింగ్ హాలు, క్రీడాసామగ్రి, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పన ఉన్నాయి. ప్రస్తుతం పాఠశాలలో 131మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులున్నారు. అలాగే దాతల సాయంతో మరో ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో మూడో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. దాతల సహకారంతో.. షాద్‌నగర్ పట్టణ వాసవీ వనితా క్లబ్ వారు విద్యార్థులకు టై, బెల్టుల ప్రదానం లయన్స్ క్లబ్ షాద్‌నగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు మాజీ సర్పంచ్ మానిక్‌రెడ్డి రూ.40 వేలతో ఫర్నీచర్, విద్యార్థులకు బ్యాగ్‌ల పంపిణీ. ఏడాది పాటు విద్యా వలంటీర్ నియామకం. కక్కునూరి వెంకటేష్‌గుప్త తాగునీటì æట్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ఏటా నోటుపుస్తకాల పంపిణీ. మహదేవ్పూర్ శ్రీనివాసుగుప్త పాఠశాలకు జాతీయ నాయకుల చిత్రపటాల ఏర్పాటు. గ్రంథాలయ కమిటీ సభ్యుడు అందె జంగరాజు పాఠశాలకు అవసరమైన వైట్బోర్డుల ఏర్పాటు విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరావు, వీఆర్ఓ ఆనందకిషన్రావు సహకారంతో పాఠశాల గ్రంథాలయంలో టేబుళ్ల ఏర్పాటు. లయన్ రవీందర్‌రెడ్డి రెండు బెంచీల సాయం. షాద్‌నగర్ మలిపెద్ది శ్రీనివాసుగుప్త రూ.20 వేల ఫర్నీచర్, వెంకటరమణ స్టీల్ ప్యాలెస్ కష్ణయ్య మరో రూ.20 వేల ఫర్నీచర్ వితరణ. డాక్టర్ చైతన్య రూ.10వేల విలువ గల ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ రూ.5వేల విలువ గల బ్యాగ్‌లు, మహికో సేల్స్ ఆఫీసర్ బి.రాజు రూ.7వేలతో మైక్‌సెట్, గ్రామానికి చెందిన నవాజ్ షరీఫ్ పాఠశాలకు రూ.8వేలతో పాఠశాలకు గేటు ఏర్పాటు, గ్రామస్తులు రాజేందర్, పండరి, గొల్ల యాదయ్య, బుయ్యని యాదయ్య, శ్రీనివాసులు సహకారంతో మరో విద్యా వలంటీర్ నియామకం. పాఠశాల ప్రత్యేకతలు.. క్రమం తప్పని ఎస్ఎంసీ సమావేశాల నిర్వహణ, సమావేశాల్లో విద్యార్థుల ప్రగతి ప్రదర్శన ప్రతి నెల 1, 3 శనివారాల్లో ఉపాధ్యాయుల సమీక్ష ప్రతి నెల చివరి శనివారం బాలలసభ నిర్వహణ, ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపాధ్యాయురాలు సాయివాణి సొంత ఖర్చుతో బహుమతుల ప్రదానం. ఉపాధ్యాయురాలు రమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంస్కతిక ప్రదర్శనలపై అవగాహన. విద్యార్థులకు ప్రతిరోజు యోగా, ధ్యానం. భోజన అనంతరం విరామ సమయంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు గ్రంథాలయ పుస్తక పఠనం. క్విజ్, సాంస్కతిక కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణ విద్యార్థుల పొదుపు నిర్వహణ వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ పాఠశాల ప్రగతి ఇలా.. 2012లో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన ఎం.నవనీత జిల్లాలో ద్వితీయస్థానంలో నిలిచింది. మండలస్థాయి క్విజ్ పోటీల్లో ప్రతి ఏడాది ఈ పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ప్రతిఏటా గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు ప్రతిభ. గురుకుల ప్రవేశ పరీక్షలో 2013–14లో శైలు, కష్ణవేణి, గాయత్రి, 2014–15లో నందిని, నిఖిత, మౌణిక, 2015–16లో శ్రీకాంత్, వంశి, జి. కల్పన, వైష్ణవి, ప్రణిత, భరణి, కె.నందిని, రేఖ, మౌణిక, మహేష్, శివకుమార్, జగదీష్, మురళికష్ణ, శివలీల, జి.నందిని, పి.కల్పన సీట్లు సాధించారు. అలాగే నిఖిల్‌గౌడ్, భానుప్రకాష్గౌడ్ ఆదిలాబాద్ స్ఫోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యారు. ఆదర్శ పాఠశాల.. ముట్పూర్ ప్రాథమిక పాఠశాలను జిల్లాలోనే ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రుల సంపూర్ణ సహకారం ఉంటే పాఠశాల ప్రగతిపథంలో నడుస్తుంది. ఒకే ఏడాది 18మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో సీట్లు సంపాదించడమే ఇందుకు నిదర్శనం. – కిష్టారెడ్డి, ఎంఈఓ, కొందుర్గు బడి బాగుంటే.. గ్రామంలో బడిబాగుంటే గ్రామమంతా బాగుంటుందని నా నమ్మకం. అందుకే బడి అభివృద్ధి కోసం నా వంతు కషి చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులున్నాయి. ఈ ఏడాది దాతల సహకారంతో రూ.లక్షతో ఫర్నీచర్ సమకూర్చాం. అలాగే భవిష్యత్‌లో డిజిటల్ పాఠశాలగా రూపొందించి జిల్లాలోనే నంబర్‌వన్ చేయాలని ఉంది. – మానిక్‌రెడ్డి, దాత, మాజీ సర్పంచ్, ముట్పూర్ ప్రాథమిక విద్యనే కీలకం.. విద్యార్థికి విద్యను అభ్యసించడంలో ప్రాథమిక దశనే కీలకం. ఈ పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం, గ్రామస్తుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కషి ఎంతో బాగుంది. మాజీ సర్పంచ్ మానిక్‌రెడ్డి పాఠశాలను దత్తత తీసుకొని పూర్తి సహకారం అందిస్తున్నారు. అందిరి కషితో పాఠశాల ప్రగతిని సాధించడానికి దోహదపడుతోంది. – మోహన్‌రావు, హెచ్ఎం పీఎస్ ముట్పూర్ -
కార్పొరేట్‌కు అడుగులు
టెన్త్ పాసైన వెనుకబడిన వర్గాల పిల్లలకు శుభవార్త. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ కాలేజీలో చదువుకునే అవకాశాన్ని వీరికి ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకు చర్యలు చేపట్టింది. ఏడు గ్రేడు పాయింట్లు మించి సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు ఇది నిజంగా వరమే. * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగుల్లో ప్రతిభావంతులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు * ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం సత్తెనపల్లి : వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో టెన్తలో ఉత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఇంటర్ విద్య కార్పొరేట్ కళాశాలల్లో అభ్యసించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. టెన్త్‌లో 7 గ్రేడ్ పాయింట్ల కన్నా ఎక్కువ సాధించిన వారి కార్పొరేట్ విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మేరకు అర్హుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగుల వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అర్హులు. అర్హతలు ఇవీ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టెన్త్ విద్యనభ్యసించి ఉండాలి. 2016 మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షల్లో 7 గ్రేడ్ పాయింట్లు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించి ఉండరాదు. మిగిలిన వారి కుటుంబ ఏడాది ఆదాయం రూ.లక్షకు మించకూడదు. జెడ్పీ, మున్సిపల్, వసతి గృహాలు, సాంఘిక, గిరిజన సంక్షేమ, కేజీబీవీలు, నవోదయ పాఠశాలల్లో చదివి ఉండాలి. ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జూన్ 2 నుంచి 10వ తేదీలోగా ఏపీ ఈ-పాస్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారి సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తుంది. ప్రయోజనాలు ఇలా.. కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక విద్యార్థులకు ఉంటుంది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. రిజర్వేషన్లు ఇలా.. జిల్లావ్యాప్తంగా 57 మండలాలకు మొత్తం 272 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 50 శాతం.. అన్ని యాజమాన్యాల్లోని వసతి గృహాల్లో ఉండి టెన్త్ చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. గిరిజన, సాంఘిక సంక్షేమ, కేజీబీవీ, బీసీ యాజమాన్యాల గురుకుల పాఠశాలలు, నవోదయలో చదువుకున్న వారికి 25 శాతం సీట్లు కేటాయిస్తారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుకున్న వారికి ఐదు శాతం, పురపాలక, జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న వారికి 20 శాతం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకోండి.. పదో తరగతి పూర్తి చేసి ఏడు గ్రేడ్ పాయింట్లు మించి సాధించిన విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో విద్యనభ్యసించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెల 2 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది పేద, వసతి గృహాల విద్యార్థులకు మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. - పవన్‌కుమార్, సూపరింటెండెంట్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం, గుంటూరు -
నినాదాన్ని సాకారం చేసేవాడే మేటి యోధుడు
కార్పొరేట్ విద్యకు రెడ్‌కార్పెట్ పరచి విద్యా వ్యవస్థను నాశనం చేసుకున్నాం. పిల్లల్లో వ్యక్తిగత లాభం, స్వార్థాలను రేకెత్తించాం. విద్యార్థి దశ నుంచే యువతలో దేశభక్తిని, నిస్వార్థతత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంపొందించడం సర్కారీ విద్యతోనే సాధ్యం. గత రెండు నెలలుగా అమెరి కాలో తిరుగుతున్నాను. ప్రస్తు తం తూర్పు అమెరికా నుంచి పడమరకు వచ్చాను. తూర్పు అమెరికాలోని కాలిఫోర్నియా లో సుమారు యాభై ఏళ్లకు పైబడిన నా పూర్వ విద్యార్థు లు కలిశారు. వీరంతా 1970- 90ల మధ్య ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారే. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. కొందరు పలు కంపెనీలను నడిపిస్తున్నవారైతే... ఇంకొందరు కొన్ని కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ఈసారి పర్యటనలో వారందరితో కలసి ముచ్చటించే అవకాశం నాకు చిక్కింది. ‘‘తెలుగు రాష్ట్రాలు రెండూ పునర్నిర్మాణ దశలో ఉన్నాయి కదా... మీరు కూడా మీ గ్రామాల్లోనో, లేక సమీప పట్టణాల్లోనో కంపెనీలు స్థాపించి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తే బాగుంటుంది కదా!’’ అని వారితో అనగానే... వారంతా ఉత్సాహంగా అందుకు ముందుకువచ్చారు. ‘‘ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కావాల్సింది ఉద్యమాలు, తగాదాలు కావు... నిర్మాణాత్మక కార్యక్రమాల్ని రూపొం దించే సరికొత్త ఆలోచనలు’’ అన్న నా విజ్ఞప్తికి వారి నుం చి విశేష స్పందన వచ్చింది. ఇటీవలే అమెరికాకు పడమర దిశగా ఉన్న వాషింగ్ట న్లో కూడా అలాగే కొందరు తెలుగువారిని కలిశాను. వీరు కూడా నా దగ్గర చదువుకున్నవారే. కానీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వాములు కండనే నా విజ్ఞప్తికి అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ‘‘మాకు దేశం ఏం చేసింది? ప్రభుత్వ బడుల్లో నాణ్యతలేక చిన్నప్పటి నుంచీ ప్రైవేట్ బడుల్లోనే చదువుకున్నాం. కళాశాల విద్య కూడా అంతే. ఫీజులన్నీ మా తల్లిదండ్రులే భరించారు. ఇంజనీరింగ్ విద్య కూడా అంతంత మాత్రంగానే సాగిం ది. ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. మాకు ఈ దేశం ఉద్యోగావకాశాలను కల్పించింది. మన దేశంలో కులమే అన్నింటికీ ప్రాతిపదిక. ఇక్కడ కులాన్ని, మతాన్ని చూడరు. అందుకే మాకు ఈ దేశం అంటే ఇష్టం... మేం ఎవరికైనా రుణపడి ఉన్నామంటే అది కేవ లం మా తల్లిదండ్రులకే’నని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని ఇంతకు ముందు నేను అనేకసార్లు చర్చించాను. ప్రైవేట్ కళాశా లల్లో అధిక ఫీజులు చెల్లించి చదువును కొనుక్కోవడం వల్ల లాభాపేక్షకు సంబంధించిన ఆలోచనలతోనే వారి విద్యాభ్యాసం సాగింది తప్ప వారిలో సామాజిక దృక్ప థం ఏర్పడలేదు. ప్రభుత్వాలు సర్కారీ విద్యను క్రమం గా నీరుగార్చడం వల్ల కలుగుతున్న విపరిణామాలను ఇప్పుడు చవిచూడాల్సి వస్తోంది. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లలోని విద్యార్థులకు ఎంత తేడా ఉందో గమనించాను. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న తరం ఒకటైతే... కార్పొరేట్ కళాశాలల్లో చదువును కొనుక్కున్న తరం ఇంకొకటి. అందుకే సామా జిక లక్ష్యం అనే పదానికి అర్థమే మారిపోయింది. కాబట్టి ప్రైవేట్ విద్యావ్యవస్థ మనుషుల్లో తీసుకొచ్చిన ఈ మార్పును చూసి ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. అమె రికా అధ్యక్షులలో జఫర్సన్ గొప్పవాడు. ఆ తర్వాత అధ్యక్షుడైన లింకన్‌ను పత్రికా విలేకర్లు మీకు ‘‘ఆదర్శ ప్రాయుడైన అధ్యక్షుడు ఎవరు?’’ అని అడిగితే ఆయన ‘‘నేనే ఓ ఆదర్శ అధ్యక్షుడ్ని కావాలి’ అన్నారట. జఫర్ సన్ ప్రపంచానికి సమానత్వ నినాదాన్ని ఇచ్చాడు. ఆ కారణంగా లింకన్ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవచ్చని అనలేం. జఫర్సన్ కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం మాత్రమే. ఆయన సమానత్వ నినాదాన్ని ఇచ్చాడే తప్ప దాన్ని అమలు జరపలేదు. ప్రజలకు నినాదం కన్నా అమలు ముఖ్యం. నినాదమిచ్చినవాడి కంటే దాన్ని అమ లు చేసిన వాడే ఆదర్శం. జఫర్సన్ కాలం కంటే లింకన్ కాలంలో సాంకేతికత బాగా పెరిగింది. లింకన్ బ్యాం కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. బానిసత్వానికి వ్యతిరే కంగా పోరాటం చేశాడు. ఆనాడు బానిసత్వానికి వ్యతిరే కంగా పోరాటం చేసిన వాడే యోధుడు. అందువల్ల అమెరికా స్వాతంత్య్రదినోత్సవం నాడు జఫర్సన్ కన్నా లింకన్నే ప్రజలు ఎక్కువగా జ్ఞప్తికి తెచ్చుకుంటారు. లింకన్ నినాదం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యమి చ్చాడు. అలాగే మన ప్రజలకు కూడా ఈనాడు కావా ల్సింది నినాదాలు కాదు. ఆచరణలో అమలు చేసి చూపే ప్రభుత్వాలు, నాయకులు కావాలి. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే శక్తినిచ్చే నాయకులు కావాలి. సమస్యల మూలాలను కనుగొని నిర్మూలించేవాడే యోధుడు. ప్రజాస్వామిక నినాదాలను ఇవ్వడంకన్నా ఆచరణలో అమలయ్యేలా చేసేవాడే గొప్పవాడు. మనం కార్పొరేట్ యాజమాన్యాలకు రెడ్‌కార్పెట్ పరచి చేజేతులారా మన విద్యా వ్యవస్థను నాశనం చేసు కున్నాం. పిల్లల్లో వ్యక్తిగత లాభం, స్వార్థాలను రేకెత్తిం చాం. చిన్న వయసు నుంచే విద్యార్థిలో ‘‘నేను చదువును కొనుక్కున్నాను’’ అనే భావనను కలిగిస్తున్నాం. కాబట్టి మా తల్లిదండ్రులు నా కోసం ఖర్చు చేసిన ఆ డబ్బును ఏ రకంగానైనా నేను సంపాదించాల్సిందే అనే ఆలోచ నను మనమే వారిలో కల్పిస్తున్నాం. వెర్రితలలు వేస్తోన్న కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రించకపోతే మరె న్నో విపత్కర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏ దేశం తమకు మంచి ఉపాధిని, భవిష్యత్తును కల్పిస్తున్నదో ఆ దేశాన్నే ఎవరైనా ప్రేమిస్తారు, గౌరవి స్తారు. కాబట్టి విద్యార్థి దశ నుంచే యువతలో దేశభక్తిని, నిస్వార్థతత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంపొందిం చడం సర్కారీ బడులతోనే సాధ్యం. ప్రభుత్వాలు తక్ష ణమే సర్కారీ విద్యాసంస్థలను పటిష్టపరిచేందుకు పూను కోవాలి. సరికొత్త పరిశ్రమలను, వివిధ రంగాలలోని కంపెనీలను ఏర్పరచి ఉపాధి అవకాశాలను కల్పించగల గాలి. అప్పుడే విద్యార్థులకు దేశం పట్ల, రాష్ర్టం పట్ల ప్రేమ కలుగుతుంది. సామాజిక బాధ్యతతో మెలగు తారు. యువతను కదిలించడానికి కావాల్సింది ఉపన్యా సాలు కాదు... ఆచరణ! (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు) - చుక్కా రామయ్య -
కార్పొరేషన్ స్కూళ్లలో కార్పొరేట్ విద్య
- వైఎస్సార్(కడప) కార్పొరేషన్లో సరికొత్త ప్రయోగం - రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేయర్ సురేష్‌బాబు ప్రయత్నం - 25 స్కూళ్లలో పేదలకు ఆంగ్ల విద్య - వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ చేయూత హైదరాబాద్: పేదలకు సైతం కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్సార్(కడప) కార్పొరేషన్ మేయర్, వైఎస్సార్ సీపీ నేత కె. సురేష్‌బాబు. కార్పొరేషన్ స్కూళ్లలోనూ కార్పొరేట్ తరహా ఆంగ్ల మాధ్యమ విద్యను అందించాలని ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో సురేష్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 45 స్కూళ్లు ఉన్నాయని, వాటిలో స్లమ్ ఏరియాలోని 25 స్కూళ్లల్లో జూన్ నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయా స్కూళ్లలో కార్పొరేట్ తరహా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ రూ. 2,50,116 చెక్కును వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో తమకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. సురేష్ బాబు ఆలోచనలకు తోడ్పాటు అందించేందుకు తాము సిద్ధమని వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ కన్వీనర్ పండుకాయల రత్నాకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
సర్కారీ బడులపై ప్రై‘వేటు’
ఏలూరు సిటీ :పురపాలక, నగరపాలక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలన్నీ కార్పొరేట్ విద్యాసంస్థల హస్తాల్లోకి వెళ్లనున్నాయి. వీటిని ఎయిడెడ్ పాఠశాలల తరహాలో నిర్వహిం చేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలను ప్రైవేటీకరించే యోచనలో సర్కారు ఉన్నట్టు భోగట్టా. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు ఇస్తున్నట్టుగానే ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది. నిర్వహణ బాధ్యతలు మాత్రం కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చేపడతాయి. దీనివల్ల పురపాలక, నగరపాలక పాఠశాల భవనాలు, స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళతాయి. పిల్లలకు ఉచితంగానే విద్య అందిస్తారు కాబట్టి పాఠశాలల స్థలాల్లో వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు వాటికి కల్పిస్తారని తెలుస్తోంది. ఇలా ప్రభుత్వ విద్యాసంస్థలను, ఆస్తులను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధారాదత్తం చేసేం దుకు రంగం సిద్ధమవుతోంది. ముంబై తరహా విధానమట ముంబై మహానగరంలో పురపాలక, నగరపాలక సంస్థల యూజమాన్యాల్లోని పాఠశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, రాష్ట్ర సర్కారు సైతం అదే పద్ధతిని అవలంభించబోతోందని సమాచారం. ఒక్క ఏలూరు నగరంలోనే 50 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 7 ఉన్నత పాఠశాలలు కాగా, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, 38 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 8వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలన్నిటికీ అత్యంత విలువ చేసే భవనాలు, ప్రాంగణాలు ఉన్నాయి. అక్కడ వాణిజ్య భవనాలు నిర్మిం చేందుకు అనువైన పరిస్థితులున్నారుు. ఇప్పటికే అధికార నేతలు కొన్ని పాఠశాలల ఆవరణలలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ప్రయత్నించి వ్యతిరేకత రావటంతో విరమించుకున్నారు. ఏలూరు నగరంతోపాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మునిసిసాలిటీలలోని పాఠశాలలనూ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. విద్యా వ్యాపారానికి ఊతం పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్(పీపీపీ) విధానంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు మునిసిపల్ స్కూళ్లను అప్పగించేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవటం సరికాదు. దీనివల్ల విద్యా వ్యాపారానికి ప్రభుత్వమే ఊతమిస్తున్నట్టవుతుంది. దీనివల్ల విలువైన స్థలాలు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళతాయి. కార్పొరేట్ స్కూళ్లలో బట్టీపట్టే విధానం తప్ప పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే కార్యక్రమాలు ఉండవు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంటే మంచిది. - షేక్ సాబ్జి, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ జిల్లా శాఖ అభివృద్ధి చేయడం మానేసి... ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయులను నియమించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా మునిసిపల్ స్కూళ్లను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడం సరికాదు. పేద వర్గాలకు విద్యను దూరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తప్పకుండా మా సంఘం ఉద్యమిస్తుంది. ప్రభుత్వ విద్యరంగాన్ని కాపాడుకునేందుకు శాయశక్తులా పోరాడతాం. - గగ్గులోతు కృష్ణ, కార్యదర్శి, ఏపీటీఎఫ్ 1938 కార్పొరేట్‌కు అప్పగించటం దారుణం పురపాలక, నగరపాలక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదవర్గాల పిల్లలకు ఇప్పటికే సరైన విద్య అందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల వారికి పూర్తిగా విద్య అందకుండా పోతుంది. పాఠశాల స్థలాలపై కన్నేసిన కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు అభివృద్ధి పేరుతో వాటిని దోచుకోవాలని చూస్తున్నాయి. దీనిని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అడ్డుకోవాల్సిందే. - జి.సుధీర్, అధ్యక్షులు, వైఎస్సార్ టీఎఫ్, జిల్లా శాఖ -
డుమ్మాలు జాన్తానై
గైర్హాజరయ్యే టీచర్లపై సర్కార్ నిఘా - నేటి నుంచీ ఉపాధ్యాయుల హాజరుపై కలెక్టర్ పర్యవేక్షణ - ఉదయం 10 గంటల్లోగా హెచ్ఎంల ద్వారా ఎంఈఓలకు హాజరు వివరాలు - 12 గంటల్లోగా జిల్లా అధికారులకు సమాచారమివ్వనున్న ఎంఈఓలు మెదక్: సర్కార్ స్కూళ్లలోనూ కార్పొరేట్ విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. అందులో తొలుత పంతుళ్లపై పర్యవేక్షణకు సిద్ధమైంది. అందులో భాగంగానే నేటి నుంచి ప్రతిరోజు పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల అటెండెన్స్‌ను ఏకంగా కలెక్టరే మానిటరింగ్ చేయనున్నారు. ఉదయం పాఠశాల సమయానికి విధులకు హాజరైన...గైర్హాజరైన..ఉపాధ్యాయుల వివరాలను ఏకంగా కలెక్టర్, విద్యాశాఖ అధికారి, ఆర్వీఎం పీఓ లకు సమాచారం అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్న తరుణంలో మెదక్ జిల్లాలో తీసుకున్న ఈ నిర్ణయం...ఇతర జిల్లాలకు ఆదర్శంగా మారే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో 1,974 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2,899 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మొత్తంగా సుమారు 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం...ఇటీవలే పాఠశాలల వేళలను కూడా మార్చారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సమయానుకూలంగా పాఠశాలకు రావడం లేదన్న ఆరోపణ లున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ బూత్‌ల కోసం జిల్లాలో సుమారు 75 పాఠశాలలను పరిశీలించిన సమయంలో, దాదాపు 62 పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ విధుల్లో అలసత్వం వహిస్తున్నట్లు గుర్తించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. రోజువారీ మానిటరింగ్ ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటలకల్లా సంబంధిత ఎంఈఓలకు ఉపాధ్యాయుల హాజరుపై సమాచారం ఇవ్వాలి. ఎంఈఓలు మధ్యాహ్నం 12 గంటల్లోపు కలెక్టర్‌కు, విద్యాశాఖ అధికారికి, ఆర్వీఎం పీఓకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇందులో పాఠశాల పేరు, మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య, సెలవుల్లో ఉన్న వారి వివరాలు, విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయుల హోదా, బోధించే సబ్జెక్ట్ తదితర వివరాలు ఉన్నత అధికారులకు తెలియజేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇక నుంచి పంతుళ్లు విధులకు డుమ్మా కొట్టినా...సమయ పాలన పాటించకపోయినా ఏకంగా కలెక్టరే చర్య తీసుకునే అవకాశం కలిగింది. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ ప్రభుత్వాస్పత్రుల్లో, హాస్టళ్లు, కేజీబివీల్లో స్కైప్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14 నుంచి ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. వీటికితోడు ఉపాధ్యాయుల పనితీరుపై రేటింగ్ కూడా నమోదు చే సేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఉపాధ్యాయుల హాజరుపై కలెక్టర్ పర్యవేక్షణ ప్రారంభమవుతోంది. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం గమనార్హం. -
ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు
మెదక్: కార్పొరేట్ విద్య కాలకూట విషమని, ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు వేస్తాయని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో జరిగిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ విద్య.. పాలబుగ్గల చిన్నారుల మెదడుపై మోయలేని భారాన్ని మోపుతోందన్నారు. విద్యార్థికి పాఠశాల, ఇల్లు తప్ప మరేవీ తెలియని పరిస్థితి నెలకొంటోందన్నారు. రాన్రాను విద్యార్థి ఆట పాటలకు.. ప్రాపంచిక జ్ఞానానికి...పల్లె వాతావరణాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని రోజులైతే గేదెలను సైతం జూకెళ్లి చూపించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికే మార్గదర్శకులన్నారు. గ్రామీణ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరి హృదయాలను పులకింపజేశాయన్నారు. ఇన్‌స్పైర్‌లో వారు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు శాస్త్రవేత్తలనే అబ్బురపరిచేవిగా ఉన్నాయన్నారు. మెతుకుసీమ బిడ్డలు మట్టిలో మాణిక్యాలని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ డీఈఓ రాజేశ్వర్‌రావు ఇంతకాలం ఆంధ్రాలో పనిచేశారని, ఆయన మెతుకుసీమకు బదిలీపై రావడంతో ఈరోజు ఇన్‌స్పైర్‌ను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నామన్నారు. ఇందుకు కృషిచేసిన ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్‌లో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇన్‌స్పైర్‌లో విజేతలైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. సైన్స్‌ఫెయిర్‌ను తిలకించేందుకు 124 పాఠశాలకు చెందిన విద్యార్థులు రావడం గమనార్హమన్నారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ గత మూడు ఇన్స్పైర్ ప్రోగ్రాంలలో 4,046 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ సురేందర్ మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో ఇన్‌స్పైర్‌ను మెదక్‌లో నిర్వహిస్తే లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. విజేతలైన 75 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగిఅశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, కౌన్సిలర్లు మాయ మల్లేశం, డిప్యూటీ ఈఓలు శోభ, పోమ్లా నాయక్, మోహన్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్, ఎంఈఓలు నరేష్, నీలకంఠం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మెదక్ రూరల్: ఇన్స్పైర్ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. విద్యార్థులు చేసిన వివిధ నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణంలోని సిద్దార్థ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీనిజ చేసిన భరతనాట్యం మంత్రముగ్దుల్ని చేసింది. నెత్తిన బోనాలు పెట్టి, పల్లెంపై నిలబడి, రెండు చేతుల్లో జ్యోతులను వెలిగించి ఆమె చేసిన నృత్యం ఔరా అనిపించింది. పాపన్నపేటకు చెందిన తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాడిన పాటపై చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. -
ఏకోపాధ్యాయ.. బోధన మిథ్య
కోవెలకుంట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందిస్తామని చెబుతున్న సర్కారు మాటలకు.. చేతలకు పొంతన కుదరని పరిస్థితి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా.. పోస్టులను కుదించి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చేయడం విమర్శలకు తావిస్తోంది. ఫలితంగా గ్రామీణ విద్యార్థులకు విద్య క్రమంగా దూరమవుతోంది. వేలాది రూపాయల డొనేషన్లతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించలేక తల్లిదండ్రులు ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా జారీ చేసిన జీవో 55 నిరుపేద విద్యార్థులకు శాపంగా మారింది. జిల్లాలో 1,835 ప్రాథమిక.. 447 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, జీవో ప్రకారం 394 ప్రాథమిక, 13 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏకోపాధ్యాయులే దిక్కయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అధిక శాతం 25 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. అయినప్పటికీ 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తుండటం చూస్తే విద్యార్థులకు ఏ స్థాయిలో న్యాయం చేకూరుతుందో అర్థమవుతోంది. మనో విజ్ఞాన శాస్త్రం ప్రకారం 1, 2 తరగతులకు బోధించడమే కష్టమైన పరిస్థితుల్లో.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నాలుగు సబ్జెక్టులను బోధించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక ఉదయం ప్రార్థన మొదలు.. సాయంత్రం బడి ముగిసే వరకు ఒక్క ఉపాధ్యాయుడు అన్నీ తానై చూసుకోవాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన పథకం.. స్కూల్ కాంప్లెక్స్ రికార్డులు.. విద్యా బోధన.. విరామ సమయంలో ఆటలపోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదునివ్వడం వారికి తలకు మించిన భారమవుతోంది. అనివార్య కారణాలతో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆయా పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. చాలా వరకు పాఠశాలలు మూతపడుతున్నాయి. ఏకోపాధ్యాయులు మండల విద్యాధికారి అనుమతితో సెలవు తీసుకోవాల్సి ఉండగా.. ఆ అధికారి తన ఆధీనంలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్, సమీప పాఠశాలలోని మరో ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపాల్సి ఉంటోంది. అనారోగ్యంతో వారం రోజులకు పైబడి సెలవు పెడితే డిప్యూటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులు పూర్తి చేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇదిలాఉంటే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు చుక్కలు చూపుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. గత మూడేళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలపై దృష్టి సారించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పేరుకే ఆదర్శం
నిజాంసాగర్: జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను రెండేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సదరు పాఠశాల ల్లో ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించాలి. జిల్లాలోని 15 మండలాల్లో గతేడాది నుంచి తరగతులను ప్రారంభించారు. మొదట్లో 6, 8వ తరగతితోపాటు ఇంటర్ ప్రథమ తరగతులకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులను లాటరీ పద్ధతిన పాఠశాలల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం రెండో సంవత్సరం ఆదర్శ పాఠశాలల్లో పదోతరగతి మినహా ఆరు నుంచి ఇంట ర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఆద ర్శ పాఠశాలల్లో తరగుతులవారీగా విద్యాబోధన చేపట్టేందుకు సరపడా ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్‌కు అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్ట లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో బోధించేం దుకు ఉపాధ్యాయులు, ఆధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యాబోధనకు గాను ఒక్కొక్క మోడల్ పాఠశాలల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని పలు మోడ ల్ పాఠశాలల్లో ఏడెనిమి మంది ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ అయ్యారు. ఆదర్శ పాఠశాలలకు ఉపాధ్యాయుల ఎంపిక పూర్తయినా అప్పటి ప్రభుత్వం వారిని పాఠశాలల్లో నియమించ లే దు. నిజాంసాగర్, మద్నూర్, కొత్తాబాది, ఎల్లారెడ్డి, గాందారి, సదాశివనగర్, రెంజల్ తదితర మండలాల్లోని ఆదర్శ పాఠశాలలు సమస్యలతో సతమవుతున్నాయి. ఆదర్శానికి ఆరు వందలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటితో పాటు మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. అలాగే సబ్జెక్టులవారిగా ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తి చేయకపోవడంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. గతేడాది ఆరకొర వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతతో విద్యాసంవత్సరాన్ని నెట్టుకొట్చారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోంది. ఈ విషయమై పాఠశాల నిర్వహకులు విద్యార్థుల తల్లితండ్రులతో ఇటీవల సమావేశమై పాఠశాలలో కనీస వసతులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల నిమాయకం కోసం ఒక్కొక్క విద్యార్థి రూ. 600 చెల్లిం చాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లిస్తేనే వసతులు కల్పించడంతోపాటు ప్రైవేట్ టీచర్ల నియమించొచ్చని నిర్వహకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న బోజనం తింటున్నా తాగడానికి మంచినీటి కొరత వేధిస్తోంది. ఈ సమస్య తీర్చడానికి విద్యార్థులు డబ్బులు చెల్లించాలని నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని విద్యార్థులను పంపిస్తే ఆరువందలు చెల్లిం చడం ఇబ్బందికరంగా మారుతోందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యాబోధనకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని తల్లితండ్రులు కోరుతున్నారు. -
ఆదర్శానికో దండం!
సాక్షి, కరీంనగర్ :మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది జిల్లాలో ఆదర్శ పాఠశాలల పరిస్థితి. ఇప్పటికే అరకొర వసతులతో అస్తవ్యస్తంగా తయారైన ఈ పాఠశాలలకు మరో ఆపద వచ్చిపడింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించేసరికి ఆకర్షణీయమైన వేతనాలు, అన్ని అలవెన్సులు, బోధనకు అన్ని వసతులుంటాయనే ఆశతో పోటీ పరీక్షలో నెగ్గి మోడల్స్కూళ్లలో చేరిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. ఆర్థిక, సర్వీసు సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోవడం ఇష్టం లేక స్కూల్ పాయింట్లకు వెళ్లిపోతున్నారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గత విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో 45 మోడల్‌స్కూళ్లు ఏర్పాటయ్యాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. బోధనకు ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ)లను ఎంపిక చేసింది. స్కూలుకు ఓ ప్రిన్సిపాల్, 13 మంది చొప్పున మొత్తం 585 మంది పీజీటీలు, ఒక్కో స్కూలుకు ఆరుగురి చొప్పున మొత్తం 270 మంది టీజీటీలు ఉండాలి. కానీ 21 మంది ప్రిన్సిపాళ్లు, 338 మంది పీజీటీలు, 118 టీజీటీలను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. మిగతా పోస్టులు ఖాళీ ఉన్నాయి. సర్వీసు రూల్స్, వేతనాలతోనే సమస్య ప్రభుత్వ పాఠశాలల ఎస్జీటీలకు నెలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860 మూలవేతనం ఉండగా, ఆదర్శ పాఠశాలల్లో బోధించే టీజీటీలకు నెలకు రూ.14,860, పీజీటీలకు 16,150 ఖరారు చేసింది. ఎక్కువ వేతనం వస్తుందనే ఆశతో అప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పలువురు రాత పరీక్ష రాసి ఎంపికై మోడల్స్కూళ్లలో చేరారు. ఎస్జీటీలను టీజీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లను పీజీటీ, ప్రిన్సిపాళ్లుగా తీసుకుంది. నియామకాల వరకు బాగానే ఉన్నా అటు తర్వాత వీరి గురించి ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. సర్వీస్ రూల్స్, బదిలీలపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. వీరి నియామకాలైనప్పటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఏ రెండుసార్లు(17.12శాతం) పెరిగింది. ఆదర్శ పాఠశాలల అధ్యాపకులకు మాత్రం పాత మూల వేతనమే అందుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే పీజీటీలు ప్రతి నెల రూ.7,125, టీజీటీలు రూ.6,556లు తక్కువ వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసి.. మోడల్ స్కూళ్లలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తిస్తుందా? కొత్త పెన్షన్ విధానామా? అనే విషయంపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించింది. ఆదర్శపాఠశాలల్లోని టీజీటీ, పీజీటీలకు ఇది వర్తించకపోవడంతో భవిష్యత్తులో పీఆర్సీలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 15 మంది మోడల్ స్కూళ్లలో పోస్టింగ్ పొందిన తర్వాత వాటిలో పనిచేయడం ఇష్టం లేకపోతే రెండేళ్లలోపు తిరిగి స్కూల్ పాయింట్లకు వెళ్లిపోవచ్చనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో ఈ నిబంధన ఆధారంగా ఆదర్శపాఠశాలల బోధకులు పాతస్థానాలకు వెళ్తున్నారు. ఇక్కడే కొనసాగితే భవిష్యత్‌లో సర్వీసుపరం గా, వేతనాల పరంగా నష్టపోయే ప్రమాదముందని వారు తిరిగి వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 15 బోధకులు సర్కారు స్కూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. సైదాపూర్, కేశవపట్నం, కాటారం మోడల్స్కూళ్లలోని పలువురు బోధకులు పాత స్థానాలకు వెళ్లారు. ఇంకా పదుల సంఖ్యలో మోడల్ స్కూల్స్ నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరూ ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ, కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే వీరిని స్కూల్ పాయింట్లకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వసతులు సరిగా లేవని, కనీసం భవనాలు కూడా లేనిచోట చదివేదెలా? అని ఇప్పటికే చాలా చోట్ల విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. మోడల్ స్కూళ్లలో ఇప్పటికే పోస్టులు చాలామేర ఖాళీ ఉండగా, ఇప్పుడు ఉన్న బోధకులు కూడా వెళ్లిపోతే విద్యాబోధన, ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. -
కాసులిస్తే సీటు!
- బెస్ట్ అవెలెబుల్ స్కూల్ ఎంపికలో అక్రమాలు - సాంఘిక సంక్షేమ శాఖాధికారుల లీలలు - సీటు ఇచ్చేందుకు రూ.5 వేలు డిమాండ్ ఆదిలాబాద్ : బెస్ట్ అవెలెబుల్ స్కూల్ పథకం ద్వారా కార్పొరేట్ విద్యను పేద దళిత విద్యార్థులకు అందించాలనే ఉన్నత లక్ష్యం అధికారుల ధనదాహం వల్ల నీరుగారుతోంది. సీటు కావాలంటే రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో పేద తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పిల్లలకు కార్పొరేట్ విద్య యోగ్యం లేదని వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ఆదిలాబాద్‌లోని సీఆర్ఆర్, నిర్మల్‌లోని రవి స్కూల్, ఉట్నూర్‌లోని సెయింట్‌పాల్ స్కూల్లో బెస్ట్ అవెలెబుల్ స్కూల్ పథకం కింద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. ఏడాదికి రూ.20 వేలు ఒక్కో విద్యార్థి పేరిట సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు చెల్లించడం జరుగుతుంది. వేయిటింగ్ పేరిట అక్రమాలు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో బెస్ట్ అవెలెబుల్ రెసిడెన్షియల్ స్కూ ల్ పథకం ద్వారా పేద ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం మే 25న నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 5 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. 100 సీట్లకు 500 దరఖాస్తులు వచ్చాయి. 10న లక్కీడ్రా ద్వారా వంద మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కొంత మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచారు. కాగా లక్కీడ్రా ముగిసి 15 రోజులు పైబడినా ఇంకా సీట్ల భర్తీలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 84 మంది విద్యార్థుల ప్రవేశాలు పూర్తికాగా మరో 14 మంది విద్యార్థులు చేరలేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వెయిటింగ్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను ఆశ్రయించగా రూ.5 వేలు ఇస్తే సీటు ఇస్తామని చెబు తూ దండుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారనే ఆరోపణలు బాహా టంగా వినిపిస్తున్నాయి. విద్యార్థినుల పరంగా వెయిటింగ్ లిస్టులో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండగా, నాలుగో నంబర్లో వేయిటింగ్‌లో ఉన్న విద్యార్థిని తండ్రిని రూ.5 వేలు ఇస్తే సీటు ఇస్తామని చెప్పడం అధికారుల తీరుకు నిదర్శనం. ఈ విషయంలో సాక్షి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అంకం శంకర్‌ను వివరణ కోరగా సీటు రానివారు ఇలాంటి ఆరోపణలు చేస్తారని, ఇందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. లక్కీడ్రా నుంచి మొదలుకుంటే అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించామని, ప్రతీ విషయంలో వి ద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలు కూడా తీసుకున్నామని తెలిపారు -
విద్యా ‘హక్కు’ ఉత్తదేనా?
యాచారం : విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితమైంది. ప్రతి పిల్లవాడికీ చదువును హక్కుగా చేస్తూ రూపొందించిన చట్టం, దాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు క్షేత్రస్థాయిలో అధికారుల అశ్రద్ధతో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోగా, చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో లేక చదువులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిద్దామంటే ఫీజులు దడ పుట్టిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉచిత ప్రవేశాలు లేవు... ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో యూకేజీ నుంచి పదో తరగతి వరకూ 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యాహక్కు చట్టం నిర్దేశించింది. ఈ మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ నెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఒక్క విద్యార్థికి కూడ ఉచితంగా సీటు ఇచ్చిన దాఖలాల్లేవు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25 శాతం సీట్లు కేటాయిస్తే మండలంలో వివిధ గ్రామాల్లోని వెయ్యిమందికి పేద విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మండలంలోని యాచారం, మాల్, నందివనపర్తి, నక్కర్తమేడి పల్లి, గునుగల్ తదితర గ్రామాల్లో పదికి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో కనీసం 300మంది నుంచి 500కి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీకిలో వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. -
మేమింతే!
సాక్షి, కర్నూలు: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగా మారింది. ఈ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించినా పరిస్థితిలో మార్పు కరువైంది. తామెలాగూ చదువుకోలేకపోయాం.. కనీసం బిడ్డలనైనా ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించే గ్రామీణులకు, అత్తెసరు జీతాలతో దుర్భర జీవితం తమతోనే ముగిసిపోవాలని.. పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చాలని తలిచే మధ్య తరగతి తల్లిదండ్రులకు ‘కార్పొరేట్’ తీరు నిరాశ మిగులుస్తోంది. సర్కారు పాఠశాలల్లో సౌకర్యాలు వెక్కిరిస్తుండగా.. ఆర్థిక స్థోమత లేకపోయినా పిల్లలను ప్రతి ఒక్కరూ ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే అదనుగా యాజమాన్యాలు ఫీజుల రూపంలో చుక్కలు చూపుతున్నాయి. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో కేజీ నుంచి పదో తరగతి వరకు 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలనేది విద్యా హక్కు చట్టంలోని నిబంధన. గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మొట్టికాయలు వేసింది. ఏడాదిన్నర గడచినా కేంద్రం తీరులో మార్పు కరువైంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును పెడచెవిన పెట్టి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఇప్పటికే సీట్లన్నీ భర్తీ చేసేశాయి. ఈనెల 12 నుంచి 2014-15 విద్యా సంవత్సరం మొదలైంది. అంతకు ముందే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ యథావిధిగా నిర్దేశించిన ఫీజులను సీట్లను భర్తీ చేయడం గమనార్హం. ఇందులో ఏ ఒక్క నిరుపేద విద్యార్థికి ఉచితంగా సీటు కల్పించిన దాఖలాల్లేవు. కేంద్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణే ఇందుకు కారణమని విద్యారంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్రం స్పందించి మార్గదర్శకాలు జారీ చేస్తే జిల్లాలోని వేలాది మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. గత ఏడాది గుర్తింపు పొందిన పాఠశాలల సంఖ్య జిల్లాలో 1300 పైమాటే. వీటిలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయిస్తే పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాట వేసినట్లవుతుంది. ఒక్కో పాఠశాలలో కనీసం 20 మంది పిల్లలకు అవకాశం కల్పించినా 26వేల మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. జిల్లా విద్యా శాఖ అధికారులు.. పాఠశాలల యాజమాన్య కమిటీ సమక్షంలో విద్యార్థుల ఎంపిక చేయాల్సి ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఇదే సమయంలో మిగతా పిల్లలతో పాటు వీరినీ సమానంగా కూర్చోబెట్టి అన్ని రకాల వసతులు కల్పించాలని ఆదేశించింది. అప్పటి తీర్పు తల్లిదండ్రుల్లో ఆనందం నింపింది. తమ పిల్లలకు ప్రైవేట్ విద్యను అభ్యసించే భాగ్యం లభించనుందని సంబరపడ్డారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఎత్తుగడల ముందు వారి ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇదిలాఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన ప్రసంగంలో ‘పేద పిల్లలు ఆకలితో ఏడుస్తూ నిద్రలోకి జారుకోవడం ఆమోదయోగ్యం కాదు.. ప్రభుత్వం సంపన్నుల కోసం కాదు.. పేదల కోసమే పనిచేయాలి’ పలికిన మాటలు నిరుపేదల్లో ఆశలను చిగురింపజేశాయి. విద్యా హక్కు చట్టం అమలులో కనీసం మోడీ ప్రభుత్వమైనా ఒక అడుగు ముందుకేస్తే ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
పేదలకు కార్పొరేట్ విద్య
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకయ్యే ఖర్చులు తానే భరించనుంది. జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేట్ రెసిడెన్సియల్ అత్యుత్తమ పాఠశాలల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశం కల్పించనున్నారు. ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే గిరిజన శాఖ జారీ చేయగా, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ప్రభుత్వం ఇప్పటికే నవోదయ, మోడల్, గురుకులం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో వివిధ వర్గాల్లోని పేద కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యతోపాటు వసతి కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది. అయినప్పటికీ కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో చదవాలని ఆశ ఉండి, ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశం లభించని విద్యార్థులకు అన్ని ఖర్చులు భరిస్తూ చదివించాలనే ఆశయంతో విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశం కల్పించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని గిరిజన, షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేటు రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదవనున్నారు. ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థి ఇతర విద్యార్థులతో కలిసి సమానంగా చదువు నేర్చుకుంటాడు. ఎంపిక ఇలా.. జిల్లాలోని గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎంపిక ప్ర క్రియ నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఎంపిక ప్ర క్రియ ప్రారంభించారు. ఎస్సీ విద్యార్థులకు జిల్లా సాంఘిక సం క్షేమ శాఖ అధికారులు ప్రవేశ భాధ్యతలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు శుక్రవారం జారీ అయ్యాయి. ఎంపికైన పాఠశాలల్లో ఉన్న ఖాళీల ఆధారంగా విద్యార్థులను చేర్చుకుం టారు. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఏటా ప్రవే శం ఉంటుంది. దర ఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, ప్రవేశం కల్పిస్తారు. ఒకసారి చేరిన విద్యార్థికి పదో తరగతి వరకు ఉచితంగా విద్యాభ్యాసం అందిస్తారు. సౌకర్యాలు జిల్లాలో ఎంపికైన రెసిడెన్సియల్ ప్రైవేటు పాఠశాలల్లో చేరిన ప్రతీ విద్యార్థికి చదువుతోపాటు వసతి, భోజనం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. వీటితోపాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, ట్రంక్ పెట్టె, పల్లెం, గ్లాసు, దుప్పటి, సబ్బులు, ధోబీ, మంగళి ఖర్చులనూ సంబంధిత శాఖల అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు అందజేస్తారు. పాఠశాలలో చేరిన విద్యార్థి ఒక్క పైసా కూడా చెల్లించకుండానే కార్పొరేటు విద్య అభ్యసిస్తాడు. అవకాశం ఎందరికీ..? జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం 12 పాఠశాలలను ఎంపిక చేశారు. గిరిజన విద్యార్థుల్లో సుమారు 200 మంది ఏటా ప్రైవేటు పాఠశాలల్లో చేరనున్నారు. ఎస్సీ విద్యార్థుల సంఖ్య 100కే పరిమితం చేశారు. ఒక్కో విద్యార్థికి సగటున రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ప్రభుత్వం వెచ్చించనుంది. -
పేద విద్యార్థులకు వరం
కడు పేదరికం ముందు ఆ కుటుంబాల్లోని విద్యార్థులకు కార్పొరేట్ విద్య గగన కుసుమం అవుతున్న తరుణంలో మహానేత... మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం పేద విద్యార్థుల చదువులకు ప్రాణం పోసింది. ఉన్నత చదువు చదివి తర్వాత ఉద్యోగమొస్తే అది బతుకు తెరువు అవుతుంది. అయితే చదువుకునేటప్పడే ఫీజు రీయింబర్స్‌మెంటును డాక్టర్ వై.ఎస్. ఇచ్చి పేద పిల్లల చదువుకు ఓ తెరువును చూపించిన దేవుడు. ఫీజు రీయింబర్స్‌మెంటు వల్ల నాలాంటి సామాన్య కుటుంబాలకు చెందిన ఆడపిల్లలే కాదు..పేద కుటుంబాలకు చెందిన అనేకమంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల మెట్లు ఎక్కి గౌరవప్రదంగా చదువుకుంటున్నారు. ఇదంతా మహనేత వై.ఎస్.పుణ్యమే. - ఆచంట సౌందర్య. ఎంసీఏ విద్యార్థిని, భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల -
యువతా.. మీ చేతిలోనే దేశ భవిత
చుట్టూ చీకటి...దారీతెన్నూకానరావడంలేదు....నిస్సత్తువ, నిరాశనిస్పృహ చుట్టముట్టిన వేళ. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఇలా ఏం చేద్దామన్నా అందుబాటులేని పరిస్థితి. అగమ్యగోచరంగా కొట్టుమిట్టాడుతున్న యువత. పేదలకు అందని ద్రాక్షలా విద్య, ఎవరికీ దొరకని ఉపాధి...నిరుద్యోగం తాండవించడంతో చదువుకున్న యువత కూలీలా మారి వలసపోయే దుస్థితి. ఇదంతా చంద్రబాబు పాలనలో 2004 సంవత్సరం ముందు పరిస్థితి. ఇన్ని సమస్యలు యువతను ఉక్కిరిబిక్కిరి చేసే సమయంలో ఆశాకిరణం మెరిసింది. రాజశేఖర రెడ్డి రూపంలో వారికి ఆధారం దొరికింది. పేదలు పెద్ద చదువులు చదివేందుకు, కార్పొరేట్ విద్య అభ్యసించేందుకు ఆయన నడుంబిగించారు. స్కాలర్ షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్మెంట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సీట్లు, ప్రత్యేక మేళాల ద్వారా ఉపాధి కల్పనతో వారిని ఆదుకున్నారు. దీంతో యువకుల తల్లిదండ్రుల కళ్లల్లో ఇంద్ర ధనసులు విరబూశాయి. ఎంతో మంది పేద విద్యార్థులు ఇంజినీర్లుగా, డాక్టర్లుగా తయారయ్యారు. మహానేత మరణానంతరం పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల మంజూరు సక్రమంగా సాగక కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధించడం ప్రారంభించారు. నిబంధనల పేరుతో చాలా మంది విద్యార్థులకు వీటిని మంజూరు చేయడం నిలిపివేశారు. పాలకులు రాష్ట్రాన్ని విభజించి విద్య,ఉద్యోగావకాశాలను దెబ్బతీశారు. రెండు ప్రాంతాల విద్యార్థులు, యువకుల మధ్య చిచ్చురేపారు. చేతికి అందివచ్చిన తమ సంతానం ఉద్యమాలకోసం బలిదానమవడంతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఒక్క మంచి నేత మనమధ్యలేకపోవడంతో రాష్ర్టం అతలాకుతలమైంది. యువతను మళ్లీ పాత బాధలు చుట్టుముట్టాయి. ఇటువంటి తరుణంలో యువత మేలుకోవాలి. సమాజం మేలుకోరాలి. యువత అంటే నవ చైతన్యం, సమాజ భవితవ్యం అందుకే యువకులే నవ సమాజ సారథలు కావాలి, రాష్ర్ట పునర్నిర్మాణంలో ముందుండాలి. తిమిరసంహారానికి అరమరికలు లేని నేతలు అవసరం. సత్తువ చచ్చి, కీళ్లు వదిలిన నేతలను, పాత కుళ్లును కడిగేయాలి. ధైర్యమున్న యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగిం చాలి. నడుము వంగిన శకుని మామలు, వారి కుటిల గురువులపై ప్రళయకాల గర్జనలై విజృంభించాలి. ఈ సమరంలో ఉడుకు రక్తానికి కావాలి ఓటు ఆయుధం...ఆ ఆయుధమే ఇస్తుంది మీకు నాయకత్వం. మన చిన్నప్పుడు పాఠశాల స్థాయిలో చదివాం.. భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని! కళాశాలకు వచ్చాం.. అదే పాఠం, మరలా అదే వాక్యం.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని! విద్యార్థి స్థాయి నుంచి ఉద్యోగ, వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాం. ఇప్పుడూ పత్రికల్లో చదువుతున్నాం.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని..! ఏళ్లు గడుస్తున్నా... మన దేశ అభివృద్ధిలో మార్పు రావడం లేదు. రేపు మన పిల్లలూ, వారి పిల్లలూ ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమ’నే చెప్పుకోవాల్సిందేనా? అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం పేరు చేరేదెప్పుడు? సమాజంలో మార్పు అవసరం. గతి తప్పిన రాజకీయాలను గాడిన పెట్టగలిగే.. భ్రష్టుపట్టిన వ్యవస్థను సమూలంగా మార్చగలిగే నాయకత్వం అవసరం. ఇది రాచరిక వ్యవస్థ కాదు.. ప్రజాస్వామ్య దేశం. మన పాలకులను మనమే నిర్ణయించగలిగే హక్కు మనకు ఉంది. గతించిన కాలాన్ని తలచుకుని బాధ పడే క్షణాలను వదిలేద్దాం. ఈ వ్యవస్థను మార్చగలిగే సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తెచ్చుకుందాం. అందుకు యువతే ముందుకు రావాలి. రాజకీయాల్లో వారి భాగస్వామ్యం పెరగాలి. దేశానికి చేటు తెస్తున్న నాయకులను ఓటు అనే ఆయుధం ద్వారా ఇంటికి పంపిద్దాం. యువ నాయకత్వానికి జై కొడదాం.. నయా భారత్‌ను నిర్మిద్దాం.