ఊరి బడి.. సర్కారు ఉరి
ప్రాథమికోన్నత స్కూళ్లకు మంగళం.. హేతుబద్ధీకరణ పేరుతో 4 వేల స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం త్వరలో ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు వేసవి బదిలీలకు ముందే చేపట్టాలని అధికారుల నిర్ణయం ప్రైమరీ, హైస్కూల్.. రెండంచెల విధానం అమలుకు సిద్ధం ఊళ్లోకి అడుగు పెడుతూనే అందరికీ దర్పంగా కనిపించేది సర్కారు పాఠశాల. ఒక్కో పాఠశాలకు ఒక్కో చరిత్ర. వీటిల్లో చదువుకుని ఎంతో మంది పేద విద్యార్థులు కలెక్టర్లు, ఎస్పీలయ్యారు. ఓ పద్ధతి ప్రకారం సామాజిక అవగాహన కల్పిస్తూ పిల్లలను తీర్చిదిద్దడంలో వీటికి తిరుగులేదు.
‘ఓ స్కూలు కట్టండి.. ఆ ఊరంతా అదే బాగుపడుతుంద’ని పెద్దలు చెప్పిన మాట అక్షరాలా నిజమని వేలాది గ్రామాలు నిరూపించాయి. ఇలాంటి స్కూళ్లలో చిన్న పాటి లోపాలు చూపి.. కాలి వేలికి పుండు అయిందని ఏకంగా కాలినే తీసేయండన్నట్లు ప్రభుత్వం వరుసగా మూతేస్తోంది. ఇదే అదనుగా కాచుకు కూర్చున్న ‘కార్పొరేట్’ విద్యా సంస్థలు తమ విద్యా వ్యాపారాన్ని మూడు వీధులు.. ఆరు పాఠశాలల రీతిలో విస్తరించుకుంటున్నాయి. వెరసి సగటు.. బడుగు విద్యార్థి చదువు ‘కొన’లేక సతమతమవుతున్నాడు.
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత విద్యాసంవత్సరం హేతుబద్ధీకరణ పేరిట 1,486 స్కూళ్లను మూసేయించిన ప్రభుత్వం ఈసారి అంతకన్నా రెట్టింపు సంఖ్యలో స్కూళ్లకు మంగళం పాడాలన్న యోచనతో ముందుకెళ్తోంది. ఇందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే ప్రభుత్వానికి పంపనుంది. వేసవి సెలవుల్లో టీచర్ల సాధారణ బదిలీలు చేపట్టడానికి ముందే స్కూళ్ల హేతుబద్ధీకరణను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత బదిలీల ద్వారా మిగిలిన స్కూళ్లలో టీచర్లను సర్దుబాటు చేయనున్నారు.
ప్రాథమికోన్నత స్కూళ్లకు పెనుముప్పు
పాఠశాల విద్యాశాఖ రూపొందించిన హేతుబద్ధీకరణ ప్రతిపాదనల్లో ఈసారి ప్రాథమికోన్నత పాఠశాలలను మూయించాలన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అనే మూడంచెల విధానంలో ప్రభుత్వ స్కూళ్లు నడుస్తున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను ముడిపెట్టి వాటిని క్రమేణా మూయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండంచెల విధానమే కొనసాగించి ప్రాథమికోన్నత విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రంలోని 4,427 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 4 వేల వరకు మూతపడే ప్రమాదముంది.
దీనివల్ల టీచర్లు వేరే పాఠశాలలకు బదిలీ అవ్వడంతో పాటు 1.50 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడనున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 75 మందిపైనా, 6, 7 తరగతుల్లో 60 మందిపైన విద్యార్థులున్న పాఠశాలల్ని అప్‌గ్రేడ్ చేసి హైస్కూళ్లుగా మార్పు చేసి 8, 9 తరగతులు ప్రారంభించాలని, అంతకన్నా తక్కువగా విద్యార్థుల సంఖ్య ఉంటే వాటిని పూర్తిగా రద్దుచేసి ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలన్న నిబంధన పెడుతున్నారు. ఈ ప్రాథమికోన్నత పాఠశాలలను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు.
ప్రాథమిక పాఠశాలలపైనా కన్ను
ప్రాథమికోన్నత స్కూళ్ల వరకే కాకుండా ప్రాథమిక పాఠశాలలనూ హేతుబద్ధీకరించాలని విద్యాశాఖ చూస్తోంది. రాష్ట్రంలో 39,186 ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 32 వేల స్కూళ్లున్నాయి. వీటిలో 5,690 స్కూళ్లలో 19 మంది లోపు విద్యార్థులున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చూపిస్తోంది. వీటన్నిటినీ గిట్టుబాటు కాని (నాన్ వయోబుల్) పాఠశాలల కింద జమకట్టి వేరే పాఠశాలల్లో విలీనం చేస్తోంది.
గతేడాది విలీనం చేసిన పాఠశాలల్లో 3,876 స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్పు చేస్తామని అధికారులు ప్రకటించారు. తగినంత మంది టీచర్లు, సదుపాయాలు, రవాణా సదుపాయం అంటూ ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. సున్నాలు, ఇతర మరమ్మతుల పేరిట రూ.121 కోట్లకు పైగా ఖర్చు చేయించారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఇందులో 1,486 స్కూళ్లలో తగినంత మంది విద్యార్థులు లేరని సాకుచూపుతూ మూత దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
ఉన్నత పాఠశాలలకూ తప్పని ముప్పు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలనూ హేతుబద్ధీకరణ పరిధిలోకి తెస్తున్నారు. రాష్ట్రంలో 4,998 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 3,851 స్కూళ్లలో సమాంతరంగా సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియం తరగతులు నడుస్తున్నాయి. ఈ హైస్కూళ్లలో 75 లోపు విద్యార్థులున్న వాటిని, 5 కిలోమీటర్లలోపు ఉన్న హైస్కూళ్లలో విలీనం పేరిట మూసి వేయించాలని నిర్ణయించారు. నిర్ణీత సంఖ్యకన్నా తక్కువ విద్యార్థులున్న స్కూళ్లు 144 ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలోని సక్సెస్ స్కూళ్లలో 50 మంది కన్నా తక్కువ ఉన్నవి 539 ఉన్నాయి. వీటన్నిటిపైనా హేతుబద్ధీకరణ వేటు పడనుంది.