ఆర్బీకేలు అదృశ్యం! | More Than 5000 Rythu Bharosa Kendras To Shut Down In TDP Govt, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

ఆర్బీకేలు అదృశ్యం!.. వైఎస్‌ జగన్‌ ముద్రను తుడిచేసేందుకు కూటమి సర్కారు ఎత్తుగడ

Published Fri, Feb 14 2025 3:44 AM | Last Updated on Fri, Feb 14 2025 11:24 AM

More Than 5000 Rythu Bharosa Kendras shut down in TDP Govt

5,000కు పైగా రైతుభరోసా కేంద్రాల మూత  

రేషనలైజేషన్‌ పేరిట కుదించేందుకు కసరత్తు

వైఎస్‌ జగన్‌ ముద్రను తుడిచేసేందుకు కూటమి సర్కారు ఎత్తుగడ 

పట్టణ, తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేత 

గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు కలిపి విలీనం 

ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం 

సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పాదకాల సరఫరా బంద్‌ 

అంతర్జాతీయంగా ప్రశంసలతో అన్నదాతలను చేయి పట్టి 

నడిపించిన భరోసా కేంద్రాలపైనా అక్కసు

సాక్షి, అమరావతి: నిన్న స్కూళ్లు.. సచివాలయాలు..! నేడు ఆర్బీకేల వంతు! అన్నింటికీ ఒకటే సాకు.. రేషనలైజేషన్‌..! కూటమి సర్కారు మూసివేతల పరంపర కొనసాగుతోంది. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ అన్నదాతలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా విత్తనం నుంచి విక్రయం దాకా సేవలందించిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు (రైతు సేవా కేంద్రాలు) ఉరి వేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చి, పూర్తిగా నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు తాజాగా రేషనలైజేషన్‌ పేరిట వీటికి మంగళం పాడేందుకు కసరత్తు చేపట్టింది. 

పట్టణ ప్రాంతాలతోపాటు తీర మండలాల్లోని గ్రామాల్లో ఆర్బీకేలను పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం ప్రాతిపదికన 2–3 ఆర్బీకేలను విలీనం చేసి భారీగా కుదించాలని భావిస్తోంది. దాదాపు ఐదారు వేల ఆర్బీకేలు మూత పడనుండటంతో సిబ్బందితో పాటు రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాగు ఉత్పాదకాలతో పాటు సంక్షేమ ఫలాలను రైతులకు ముంగిటే అందించాలన్న సంకల్పంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకే వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గ్రామ స్థాయిలో ఒకేసారి 10,778 ఆర్బీకేల సేవలకు 2020 మే 30న వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే 10,546 ఆర్బీకేలు సేవలందిస్తున్నాయి.  

సగానికిపైగా మూసివేత! 
జనాభా ప్రాతిపదికన ఏర్పాటైన ఆర్బీకేలు కొన్నిచోట్ల ఒక సచివాలయం పరిధిలో రెండు.. అంతకు మించి ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని 232 అర్బీకేలతోపాటు తీర మండలాల్లోని 555 గ్రామాల్లోని ఆర్బీకేలను పూర్తిగా మూసి వేయాలనే నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రెండు వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే ఒక ఆర్బీకేను కేటాయించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రెండు వేల ఎకరాలకు పైబడి విస్తీర్ణం కలిగిన పరిధిలో 1,096 ఆర్బీకేలు ఉన్నాయి. వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల పరిధిలో 2,837 ఆర్బీకేలు, 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం పరిధిలో 3,583 ఆర్బీకేలు, ఐదు వందల ఎకరాల లోపు పరిధిలో 3,033 ఆర్బీకేలు ఉన్నాయి. 

రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలు కాగా, సగటున 1,500 నుంచి రెండు వేల ఎకరాలకు ఒకటి చొప్పున ఆరు వేల ఆర్బీకేలు సరిపోతాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని చోట్ల స్థానికంగా సాగు అయ్యే పంటలను బట్టి విస్తీర్ణం కొద్దిగా పెంచినా కనీసం 5 వేల ఆర్బీకేలు కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. మూసివేసిన ఆర్బీకేలను పంట కొనుగోలు కేంద్రాలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించాలని యోచిస్తున్నారు. మూసివేసే ఆర్బీకేలలో పనిచేసే సిబ్బందిని సంబంధిత శాఖల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేయడంపై కసరత్తు జరుగుతోంది. 

ఆర్బీకేల్లో 15,667 మంది సేవలు 
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఆర్బీకేలకు గత ప్రభుత్వం 21,796 పోస్టులు మంజూరు చేయగా వివిధ దశల్లో నియామకాల ద్వారా 15,667 పోస్టులను భర్తీ చేశారు. 6,162 మంది వ్యవసాయ, 2,303 మంది ఉద్యాన, 377 మంది పట్టు, 6,105 మంది పశు సంవర్థక, 720 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. 

గోపాలమిత్రలతో పాటు వలంటీర్, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ను ఆర్బీకేలతో అనుసంధానించారు. స్థానికంగా సాగయ్యే పంటలను బట్టి వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్‌చార్జీలుగా నియమించారు. విద్యార్హతలను బట్టి అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించారు. ఆర్బీకేల ద్వారా 40 శాతం సబ్సిడీతో రూ.1,052.16 కోట్ల విలువైన 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 36,153 ఇతర వ్యవసాయ పనిముట్లు సమకూర్చారు. 

అత్యాధునిక భవనాలు.. వసతులు 
ప్రతి ఆర్బీకేలో డిజిటల్‌ కియోస్‌్క, స్మార్ట్‌ టీవీ, డిజిటల్‌ లైబ్రరీ, సీడ్, మాయిశ్చర్, సాయిల్‌ టెస్టింగ్‌ యంత్రాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమకూర్చింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా ఫీడ్, పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా.. ఇలా ఏది కావాలన్నా బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేసింది. సీజన్‌కు ముందే అగ్రిల్యాబ్స్‌లో సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను గ్రామ స్థాయిలో నిల్వ చేసి దుక్కి పనులు ప్రారంభం కాకముందే, రైతులు అడిగిన మరుక్షణం అందించేలా చర్యలు తీసుకుంది. 

వాతావరణం, మార్కెట్‌ ధరల సమాచారాన్ని  తెలుసుకునేందుకు 9,484 ఆర్బీకేల్లో డిజిటల్‌ కియోస్‌్కలు నెలకొల్పి, వాటి పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేశారు. 8,304 ఆర్బీకేలు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా, 2474 ఆర్బీకేలు అద్దె భవనాల్లో ఉన్నాయి. రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఆర్బీకేలకు నూతన భవన నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. వివిధ దశల్లో ఉన్న 5,387 భవనాల నిర్మాణాలు కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయాయి.  

అవార్డులు.. అంతర్జాతీయ ప్రశంసలు 
ఆర్బీకేలను వైఎస్‌ జగన్‌ నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దారు. పొలం బడులు, తోట బడులు, పట్టుబడులు, మత్స్యసాగు, పశు విజ్ఞాన బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రాప్‌ బుకింగ్, సంక్షేమ పథకాల అమలుతో పాటు ధరలు పతనమైతే మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద ఆర్బీకేల ద్వారా రైతు క్షేత్రం నుంచే ధాన్యంతో సహా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ క్రాప్‌ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. 

పశువులకు మెరుగైన వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు అందచేశారు. ఆర్బీకేల సాంకేతికత పంజాబ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలనే కాకుండా విదేశాలను సైతం ఆకర్షించింది. ఇథియోఫియా, వియత్నాం తదితర దేశాల ప్రతినిధి బృందాలు ఆర్బీకేల సేవలను అధ్యయనం చేశాయి. ఇక ఆర్బీకేలు ప్రతిష్టాత్మక యూఎన్‌ చాంపియన్‌ అవార్డుకు నామినేట్‌ కావడంతో పాటు పలుమార్లు గోల్డ్‌ స్కోచ్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఆర్బీకేల స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను దేశ వ్యాప్తంగా నెలకొల్పుతోంది. 

నాలుగేళ్లలో సేవలిలా.. 
ఆర్బీకేల ద్వారా నాలుగేళ్లలో 32 లక్షల మంది రైతులకు 11.88 లక్షల టన్నుల ఎరువులు, 58 లక్షల మందికి 34.09 లక్షల క్వింటాళ్ల సరి్టఫైడ్‌ సీడ్స్, 1.36 లక్షల లీటర్ల పురుగు మందులతో పాటు ఆక్వా, ఫిష్‌ ఫీడ్, పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేశారు. ప్రతి ఆర్బీకేలో రూ.5 వేల విలువైన మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా గ్రామ స్థాయిలోనే నాణ్యమైన పశు వైద్య సేవలు అందించారు. 75 శాతం సబ్సిడీపై నాలుగు లక్షల మంది పాడి రైతులకు 7,117.35 టన్నుల పశుగ్రాసం విత్తనాలను పంపిణీ చేశారు. 

60 శాతం సబ్సిడీపై 78,018 టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా అందచేశారు. ఆక్వా రైతులకు రూ.15.10 కోట్ల విలువైన 2,809.76 టన్నుల ఆక్వా ఫీడ్‌ సరఫరా చేశారు. ఆక్వా కార్యకలాపాలకు సంబంధించి 36,300 లైసెన్సులు జారీ చేశారు. ఎరువుల కోసం రైతులు మండల కేంద్రాల చుట్టూ తిరిగి పడిగాపులు కాయాల్సిన దుస్థితి లేకుండా గ్రామంలోనే అందించడంతో రవాణా చార్జీల భారం, వ్యయ ప్రయాసలు తొలిగాయి. ఇలా మరో రూ.150 కోట్ల వరకు రైతులకు ఆదా అయినట్లు అంచనా. ఏటా కోటి మందికి పైగా ఆర్బీకేల సేవలను పొందారు. 

నేడు నిర్వీర్యం..  
టీడీపీ కూటమి పాలనలో ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో సబ్సిడీ విత్తనాలు మినహా మిగిలిన సాగు ఉత్పాదకాల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గతంలో ఏటా సగటున నాలుగు లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా ఈ ఏడాది అతికష్టమ్మీద 1.70 లక్షల టన్నులు అందించారు. ఇక పశు వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. మత్స్య సాగుబడులు, పశు విజ్ఞాన బడులను నిలిపి వేశారు. పొలం బడులు, తోటబడులు మొక్కుబడిగా మారిపోయాయి. మరోవైపు కులగణన, పింఛన్ల పంపిణీ, ఆస్తి పన్ను వసూళ్లు, ఇంటింటి సర్వే, సాగునీటి కాలువల డ్యూటీలు, పంచాయతీ కార్యదర్శులు సూచించే ఇతర నాన్‌డిపార్టుమెంటల్‌ విధులకు సైతం ఆర్బీకేల సిబ్బందినే వినియోగించడంతో రైతులకు సేవలు అందని దుస్థితి నెలకొంది. 

ఆర్బీకేలను ఎత్తివేసే కుట్ర 
గ్రామ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ఆర్బీకేలను పూర్తిగా ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. రేషనలైజేషన్‌ ఇందులో భాగమే. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా అందించే ఎరువులు, సాగు ఉత్పాదకాలు, వివిధ రకాల సేవలను నిలిపివేశారు. ఆర్బీకేలను కుదించడమంటే గ్రామ స్థాయిలో రైతులకు ప్రభుత్వ సేవలను దూరం చేయడమే. ఈ విషయంలో రైతుల తరఫున పోరాటం చేస్తాం. 
– జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం 

గ్రామ స్థాయి సేవలకు విఘాతం 
రైతులకు నష్టం జరగకుండా, సిబ్బంది ఉద్యోగ భద్రతకు ముప్పు లేకుండా రేషనలైజేషన్‌ చేయాలి. అర్బన్‌తో పాటు తీర ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌కేలను కుదించడంలో అభ్యంతరం లేకున్నా, ఇతర ప్రాంతాల్లో కుదించడం వల్ల రైతులు ఇబ్బంది పడతారు. గ్రామ స్థాయిలో రైతులకు అందించే సేవలకు విఘాతం కలుగుతుంది. ఆ ఇబ్బంది లేకుండా గ్రామ స్థాయిలోనే రైతులకు సేవలందేలా సాగు విస్తీర్ణం ప్రాతిపదికన రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలి. వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈవో) రైతు సేవా కేంద్రాల నుంచి మినహాయింపు ఇవ్వాలి. 
– డి.వేణుమాధవరావు, అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం 

కక్ష సాధింపు చర్యే 
అంతర్జాతీయ ప్రశంసలందుకున్న ఆర్బీకేలను రేషనలైజేషన్‌ పేరిట కుదించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ముద్రను తొలగించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ముందుకెళ్తోంది. ఇప్పటికే సూపర్‌సిక్స్‌ హామీలో పేర్కొన్న రూ.20 వేల పెట్టుబడి సాయంతో పాటు ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. ఆర్ధిక భారం పేరిట ఆర్బీకేలను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారు. గ్రామ స్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించేలా ఆర్బీకేలను మరింత బలోపేతం చేయాలి. 
– వడ్డి రఘురాం, వర్కింగ్‌ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం 

పని ఒత్తిడి తగ్గించాలి  
సిబ్బందికి ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల రేషనలైజేషన్‌ చేపట్టాలి. మిగులు సిబ్బందిని దూర ప్రాంతాలకు కాకుండా జిల్లా స్థాయిలోనే సంబంధిత శాఖల్లో సర్దుబాటు చేయాలి. సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. 
– జి.నాగరాజు, అధ్యక్షుడు, ఏపీ ప్లాంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement