
క్రాప్ హాలిడేకు రొయ్య రైతుల శ్రీకారం
ఆక్వా చరిత్రలో ఇదే తొలిసారి
కొనుగోలు ధరలు గిట్టుబాటు కాదంటున్న రైతులు
పట్టుబడి పూర్తి కాగానే ఒక్కొక్కరిగా క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్న సాగుదారులు
పశ్చిమ గోదావరి జిల్లా శిరగాలపల్లి, చందపర్రు గ్రామాల్లో మొదలైన ‘సాగు సమ్మె’
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు ‘సాగు సమ్మె’ వైపు తొలి అడుగు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందపర్రు గ్రామాల రైతులు బుధవారం సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రకటించిన రొయ్యల కొనుగోలు ధరలు తమకు గిట్టుబాటు కావని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఆక్వా సాగు చేయలేమని.. అందుకే తామంతా క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామంటూ చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే బాటలో మిగిలిన గ్రామాల రైతులు అడుగులు వేస్తున్నారు. చెరువుల్లో ఉన్న రొయ్యల పట్టుబడి పూర్తి కాగానే తాము కూడా సాగు సమ్మె చేపడతామని మిగిలిన గ్రామాల రైతులు కూడా చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం విధించిన ప్రతీకార సుంకాల సాకుతో రొయ్యల ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేయడంతో రొయ్యల రైతుల ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో కేంద్రానికి లేఖ పేరిట హడావుడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. 100 కౌంట్ రొయ్యలను రూ.220కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. ఈ ధరలు తమకు గిట్టుబాటు కాదంటూ రైతులు ఒక్కొక్కరిగా సాగు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు.
ఏప్రిల్ నుంచే సమ్మెలోకి..
తొలుత జూలై నుంచి సాగు సమ్మె చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్ నుంచే అమలుకు శ్రీకారం చుడుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లిలో తాము క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ఇద్దరు రైతులు తమ చెరువుల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఇదే గ్రామంలో 110 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా.. దాదాపు 100 ఎకరాల్లో క్రాప్ హాలిడే పాటిస్తున్నట్టు రైతులు ప్రకటించారు. సమీపంలోనే ఉన్న పాలకొల్లు మండలం చందపర్రు గ్రామంలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ఉద్యమానికి పొరుగు జిల్లాల ఆక్వా రైతుల నుంచి మద్దతు పెరుగుతోంది.
అందుకే సమ్మె చేస్తున్నాం
నేను 50 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. ఈ రోజు పట్టుబడి పట్టిన 10 ఎకరాల్లో క్రాప్ హాలిడే బోర్డు పెట్టాను. రేపు మరో 10 ఎకరాలు పట్టుబడి పడుతున్నాను. దాంట్లో కూడా బోర్డు పెడతాను. ఎకరాకు లీజు రూ.80 వేలు అవుతోంది. అదనపు లోడ్, అదనపు వినియోగ సుంకం పేరిట ఏకంగా రూ.లక్ష అదనంగా విద్యుత్ బిల్లులు కట్టాను. ప్రస్తుత రేట్లు మాకు గిట్టుబాటు కావు. అందుకే క్రాప్ హాలిడేకు పాటిస్తున్నాం. – చిలుకూరి బాలాజీ, శిరగాలపల్లి, పశ్చిమ గోదావరి
15 లక్షలు నష్టపోయాను
10 ఎకరాల్లో నాసిరకం సీడ్ వల్ల పంట నష్టపోయాను. మరో 15 ఎకరాల్లో వైరస్ వల్ల పంట దెబ్బతింది. మిగిలిన 10 ఎకరాల్లో 20 టన్నులు పట్టుబడి పడితే 30 కౌంట్‌కు రూ.400–420 మధ్య, 40 కౌంట్‌కు రూ.320–340 మధ్య ఇస్తున్నారు. ఈ సీజన్‌లో దాదాపు 15 లక్షలు నష్టపోయాను. ఈ రేట్లతో ఇక సాగు చేయలేం. అందుకే క్రాప్ హాలిడేకు వెళ్లాలని నిర్ణయించాం. – టీఎన్‌వీవీఎస్ ప్రసాద్, శిరగాలపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా