ఆక్వా రైతు సంఘం నాయకుల పిలుపు
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
తమకిచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అవసరమైతే క్రాప్ హాలీడేకు రైతులు సిద్ధం కావాలని ఆక్వా రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. అప్పుడే హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు దిగివస్తాయన్నారు. జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో ఆక్వా రైతు మహాసభ నిర్వహించారు.
సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. ‘హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు లాభాపేక్షతో వ్యవహరిస్తూ ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. చాలా కంపెనీలు ఫీడ్, మందులు రెండింటినీ తయారు చేస్తున్నాయి. నాసిరకం ఫీడ్ వల్ల తెగుళ్లు వస్తున్నాయి. వాటిని తగ్గించే మందులను కూడా ఆ కంపెనీలే విక్రయిస్తున్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు సీడ్, ఫీడ్ నాణ్యతలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఎంపెడా పటిష్ట చర్యలు తీసుకోవాలి.
ఏ ఒక్క రైతుకు సమస్య వ చ్చినా రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ పోరాడాలి. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీల వద్ద ఆందోళనలు చేపట్టాలి. పరిస్థితి మరింతగా దిగజారితే ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు క్రాప్ హాలీడేకు సిద్ధమవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలీడేను విజయవంతం చేసేందుకు అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకువద్దాం’ అని అన్నారు.
గత ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం
ఆక్వా రైతు సంఘం నాయకుడు యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో రొయ్య ధరలు ఒడిదుడుకులకు గురికాకుండా ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు అప్సడా కృషి చేసింది. అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ రైతు సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారు. వీరవాసరంలో ఆక్వా చెరువులకు విద్యుత్ సమస్య ఉందని రైతులు చెప్పగా.. వెంటనే నిరంతర విద్యుత్‌ను అందించారు’ అని చెప్పారు.
జోన్‌తో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తామని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, విద్యుత్ సమస్య పరిష్కరిస్తామని, నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలపైనా సమావేశంలో చర్చించారు. వాటి అమలుకు మంత్రులను కలవాలని నిర్ణయించారు. ఆక్వా రైతు సంఘాల నాయకులు బోణం వెంకట నరసయ్య, యాళ్ల వెంకటానందం, గాదిరాజు సుబ్బరాజు, పి.నాగభూషణం, వీరవల్లి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment