
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో రైతుల రాస్తారోకో
మిర్చి క్వింటాకు రూ. 20వేల ధర నిర్ణయించాలి.. ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలి
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/నరసరావుపేట: అధికారం చేపట్టిన కేవలం తొమ్మిది నెలల్లోనే కూటమి సర్కార్ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి, ఆక్వా రైతులు రోడ్డెక్కారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాలలో రైతులు ఆందోళన బాట పట్టారు. రైతును రక్షించండి – దేశాన్ని కాపాడండి అనే నినాదంతో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం...
ప్రభుత్వ తీరు విచారకరం
విజయవాడ లెనిన్ సెంటర్‌లో జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద హాజరై ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మిర్చి క్వింటాకు రూ. 20వేల ధర నిర్ణయించి, ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు.
స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ, వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. తెలుగు గంగా, పూలసుబ్బయ్య వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, కె. వి. వి. ప్రసాద్, తదితర రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించి రాష్ట్రంలో అన్ని పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
వరికెపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి
కాగా, పల్నాడు జిల్లా రైతులకు మణిహారమైన వరికెపూడిశెల ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని పల్నాడు జిల్లా రైతు,ప్రజా సంఘాల సమన్వయ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది . రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలలో మిర్చి పంట సాగు చేసిన రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు.
రొయ్యల రైతుల రాస్తారోకో
వీరవాసరం: రొయ్యల రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లాలోని పలువురు రైతులు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని తూర్పు చెరువు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవాసరం–బ్రాహ్మణ చెరువు రహదారి నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది.
వీరవాసరం మండల రొయ్యల రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్ల రాంబాబు మాట్లాడుతూ రొయ్యల ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి రొయ్యల రైతులకు తీరని నష్టం కలుగజేస్తున్నారన్నారు. వారం రోజుల క్రితం కిలో 100 కౌంటు ధర రూ.250 నుంచి రూ.260 ఉండగా రెండు మూడు రోజుల నుంచి రూ.220 నుంచి రూ.230కు తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment