
దేశంలో 50 కోట్లకు చేరనున్న ఇ–కామర్స్ వినియోగదారులు
ప్రస్తుతం జీవనశైలి మార్కెట్ విలువ రూ.11,174 కోట్లు
2028 నాటికి రూ.18,049 కోట్లకు చేరుకునే అవకాశం
17.5 కోట్ల మందికిపైగా జీవనశైలి ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్ షాపింగ్
2028 నాటికి రూ.3876 కోట్లకు ఆన్‌లైన్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మార్కెట్!
డీ కోడింగ్ ఇండియాస్ ఆన్‌లైన్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షాపింగ్ ట్రెండ్స్ నివేదిక
సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ వినియోగంతో వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వినూత్న ఆలోచనలు, వ్యాపార ఆవిష్కరణలకు అంతర్జాలం వేదికైంది. ఇప్పుడు వస్తువుల కొనుగోలు, అమ్మకాల ఆన్‌లైన్ వ్యాపారం మరో రూపాంతరం చెంది సామాజిక మాధ్యమాలకు చేరింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఇ–కామర్స్ మార్కెట్ భారీగా విస్తరించింది. అందులోనూ జీవనశైలి(లైఫ్ స్టైల్) ఉత్పత్తుల వ్యాపారం అగ్రభాగాన నిలుస్తోంది. ‘డీ కోడింగ్ ఇండియాస్ ఆన్‌లైన్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షాపింగ్ ట్రెండ్స్’ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
» ప్రస్తుత జీవనశైలి మార్కెట్ విలువ రూ.11,174 కోట్లు కాగా, మూడేళ్లలో అంటే.. 2028 నాటికి రూ.18,049 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
» 17.5 కోట్లకు పైగా భారతీయులు జీవనశైలి ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్ షాపింగ్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కొక్కరూ ఏటా సగటున 6 నుంచి 7 లావాదేవీలు చేస్తున్నారు. ఈ–లైఫ్ స్టైల్ మార్కెట్‌లో 75 నుంచి 80 శాతం వాటాతో అగ్రస్థానంలో ఫ్యాషన్ ఉత్పత్తుల వ్యాపారం ఉంది. తర్వాత స్థానంలో సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి.
» 2028 నాటికి ఆన్‌లైన్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ మార్కెట్ ఇప్పుడున్న రూ.1,477 కోట్ల నుంచి రూ.3,876 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
» ప్రపంచంలోని టాప్ 50 లైఫ్‌స్టైల్ బ్రాండ్‌లలో 90 శాతం మన దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వాటిలో సగం బ్రాండ్లు రూ.2,585 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించనున్నాయి. ఈ క్రమంలో 2029 నాటికి, ఇ–కామర్స్ వినియోగదారులు 50.1 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
సెల్‌ఫోన్‌లోనే సగానికిపైగా వ్యాపారం
» టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. దేశంలో 88 కోట్లకుపైగా ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. 117.2 కోట్ల ఫోన్ కనెక్షన్లు (ల్యాండ్‌లైన్, సిమ్) ఉన్నాయి. ఆన్‌లైన్ లావాదేవీల్లో 60 శాతం స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతోంది. దీనికి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్–ఏఐ) సాయం, వర్చువల్ ట్రయల్స్, వాయిస్ అసిస్టెడ్ షాపింగ్ వంటి సాంకేతిక సౌకర్యాలు తోడై ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి.
» ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హోల్ సేల్ వ్యాపారుల నుంచి తాము విక్రయించాలనుకున్న సరుకుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెప్పించుకుని వాటిని తిరిగి అవే వేదికల్లో పోస్ట్ చేసి వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.
» 82% మంది దేశంలో కనీసం ఒక సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్నారు.
» 78 % మంది ఫేస్‌బుక్, 34 % మంది ఇన్‌స్ట్రాగామ్ వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా తమకు కావాల్సినవి కొంటున్నారు. ప్రస్తుతం సుమారు 6 కోట్ల్ల మంది ఆన్‌లైన్ వ్యాపారులు ఏటా 9 రెట్లు అధిక అమ్మకాలు సాధిస్తుంటే, ఆఫ్‌లైన్ దుకాణదారులు 6 రెట్ల వృధ్ధినే పొందగలుగుతున్నారు.