దేశ సగటును మించి రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగం
దేశ సగటు వినియోగం 84.8 శాతం కాగా.. ఏపీలో 91.1 శాతం..
రాష్ట్రంలోని పట్టణాల్లో 93.7 శాతం... గ్రామాల్లో 90 శాతం నెట్ వాడుతున్న యువత
జూలై–2022 నుంచి జూన్–2023 వరకు సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో వెల్లడి
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ యువతలో 93.7 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో పురుషులు, మహిళలు కూడా దేశ సగటును మించి రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ విషయాలు జూలై–2022 నుంచి జూన్–2023 వరకు నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో వెల్లడైనట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
ప్రధానంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతీ, యువకులు ఇంటర్నెట్ వినియోగంపై రాష్ట్రాల వారీగా సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం మన రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ కేటగిరీలో దేశంలో సగటున 84.8 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌లో 91.1 శాతం మంది వాడుతున్నారు.
15 నుంచి 24 ఏళ్ల మధ్య పురుషులకు సంబంధించి దేశంలో సగటున 89.1 శాతం మంది, మన రాష్ట్రంలో 94.6 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. దేశంలో సగటున మహిళలు 80.0 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... రాష్ట్రంలో 87.3 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నట్లు సర్వే స్పష్టంచేసింది. ఈ కేటగిరీలో దేశ సగటుకన్నా అత్యల్పంగా ఉత్తరప్రదేశ్‌లో 75.6 శాతం, బిహార్‌లో 76.4 శాతం, ఒడిశాలో 80.6 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment