15–29 వయస్కుల్లో 28.5శాతం మాత్రమే ఇంటర్‌నెట్ సమర్థ వినియోగం
ఇంటర్‌నెట్ యాక్సిస్‌లో గ్రామీణుల వెనుకబాటు
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో వెల్లడి
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో దేశ యువత వెనుకబడుతోంది. డిజిటల్ అక్షరాస్యతలో 15–29 ఏళ్ల మధ్య వయస్కుల్లో కేవలం మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే ఇంటర్‌నెట్‌ను సమర్ధంగా శోధిస్తున్నారు. ఇందులో ఈ–మెయిల్ పంపడం, పరిశీలించడం, ఆన్‌లైన్ లావాదేవీలకే పరిమితమవుతున్నారు.
ఇది గణనీయమైన డిజిటల్ వెనుకంజను సూచిస్తోందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌వో) తమ సమగ్ర వార్షిక మాడ్యులర్ 2022–23 (సీఏఎంఎస్) సర్వే స్పష్టం చేసింది. ఇంటర్‌నెట్ శోధన నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, అమరావతి
స్వీయ అధ్యయనానికి ఇంటర్‌నెట్
విద్యార్థుల స్వీయ అధ్యయనానికి ఇంటర్‌నెట్ ఎంతగానో దోహదపడుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యా వెబ్‌సైట్లు, పరిశోధన పత్రాలు, ఆన్‌లైన్ లైబ్రరీల ద్వారా ప్రపంచ సమాచారాన్ని సేకరించుకునే విధానం విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.
సంప్రదాయ అభ్యాసానికి అనుబంధంగా ఇంటర్‌నెట్ యాక్సెస్ ఉండటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణుల మధ్య సహకారాన్ని సులభతరం చేస్తోందని పేర్కొంటున్నారు. డిజిటలైజేషన్, డిజిటల్ స్కిల్స్‌లో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో ప్రాధాన్యం పెరుగుతోందని చెబుతున్నారు.
గోవా ముందంజ.. మేఘాలయ వెనుకంజ
దేశంలోని విద్యార్థుల్లో డిజిటల్ సామర్థ్యాల లేమిని సర్వే నొక్కి చెప్పింది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని బహిర్గతం చేసింది. పట్టణ ప్రాంతంలోని పురుషులు డిజిటల్ ప్రావీణ్యంలో అగ్రగామిగా ఉండగా, గ్రామీణ మహిళలు చాలా వెనుకంజలో ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం 15–24 వయసు్కల్లో 26.8శాతం, 15–29 వయస్కుల్లో 28.5 శాతం, 15 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో సమాచారాన్ని సమర్థంగా శోధించగలుగుతున్నారు.
15–29 వయసు్కల్లో స్త్రీలు కేవలం 14.5 శాతం మాత్రమే ఇంటర్‌నెట్‌లో శోధన, ఈ–మెయిల్, ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నారు. డిజిటల్ అక్షరాస్యతలో గోవా, కేరళ మెరుగ్గా ఉంటే మేఘాలయ, త్రిపుర అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాయి. ఇంటర్‌నెట్ శోధన, ఈ–మెయిల్, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించగల 15–29 వయసు కలిగిన విద్యార్థుల జాతీయ సగటు 28.5శాతం ఉంది.
ఈ పనులు చేయడంలో 65.7 శాతంతో గోవా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 53.4 శాతంతో కేరళ, 48 శాతంతో తమిళనాడు, 47.2శాతంతో తెలంగాణ, 32.5 శాతంతో ఏపీ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 16శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment