పింఛన్‌.. తుంచెన్‌! | The number of pensions in the state is decreasing every month | Sakshi
Sakshi News home page

పింఛన్‌.. తుంచెన్‌!

Published Wed, Dec 18 2024 4:42 AM | Last Updated on Wed, Dec 18 2024 4:42 AM

The number of pensions in the state is decreasing every month

మరో 3 లక్షల మందిపై వేలాడుతున్న కత్తి

ఇప్పటికే 1.57 లక్షల మందిని తొలగించిన కూటమి సర్కార్‌ 

పైలట్‌ సర్వే ప్రకారం 10,958మందిలో 563 మందిని అనర్హులుగా తేల్చిన వైనం 

అంటే 5శాతం మందిపై అనర్హత వేటు 

మొత్తం పెన్షనర్లలో 5% అంటే 3 లక్షల మందిని అనర్హులుగా తేల్చనున్నట్లే.. 

అనర్హుల ఏరివేత పేరుతో కుదించేందుకు రంగం సిద్ధం.. సర్వేలో గుర్తించిన 563 మందితో పాటు అందరికీ నోటీసులు 

నోటీసు తీసుకోకుంటే పింఛన్‌ ఆపాలని ఆదేశాలు.. దివ్యాంగులపైనా దయలేదు.. సర్టిఫికెట్లకు 15రోజులే గడువు.. 

కక్ష సాధింపే లక్ష్యంగా సుదూర ప్రాంతాలకు పింఛన్ల బదిలీ  

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య తగ్గిపోతోంది. గత ఆర్నెళ్లలో ఏకంగా 1.57 లక్షల పింఛన్లకు కోత పెట్టిన కూటమి సర్కారు మరో 3 లక్షల పెన్షన్ల తొలగింపుపై గురి పెట్టినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. పైలెట్‌ సర్వే పేరుతో 10,958 మందిని తనిఖీ చేసి 563 మందిపై.. అంటే దాదాపు 5శాతం మందిపై అనర్హులుగా ముద్ర వేసింది. అంటే రాష్ట్రంలోని మొత్తం పెన్షన్లను తనిఖీ చేసి అందులో 5శాతం.. అంటే దాదాపు 3 లక్షలకుపైగా పింఛన్లపై అనర్హత ముద్ర వేసి తొలగించబోతున్నట్లు అర్ధమౌతోంది. 

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. అంటే దాదాపు 6 లక్షల మంది పెన్షన్లను తొలగించే దిశగా సర్కారు సన్నద్ధమైనట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో 65.49 లక్షల మందికి ఫించన్లు ఇవ్వగా ఈ డిసెంబర్‌ నాటికి 63.92 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది.  

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేసి వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసి కక్ష పూరితంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం పింఛన్లకు ఎడాపెడా కోతలు పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల ఏరివేత పేరుతో గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై గురి పెట్టింది. సంబంధిత సచివాలయంతో అసలు సంబంధమే లేని ఉద్యోగులను లబ్ధిదారుల ఇళ్లకు పంపి తనిఖీలు నిర్వహిస్తోంది. 

గతంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఇప్పుడా ఆస్కారమే లేదు. ఈ ఏడాది జనవరిలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిన తరువాత ఇప్పటివరకు మళ్లీ కొత్తవి మంజూరు కాకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు.   
 
దినదిన గండంగా.. 
గత ఐదేళ్లూ నిశ్చింతగా ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే టంచన్‌గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్దిదారులు ఇప్పుడు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారిని కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనర్హత నోటీసుల పేరుతో కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. 

అనర్హుల పేరిట మరో విడత పింఛను నోటీసులు జారీ చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో వీరపాండ్యన్‌ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల డీఆర్‌డీఏ పీడీలకు మెమో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో గత ఆర్నెళ్లలో పింఛన్లు 1,57,162 తగ్గిపోయాయి. ఎడాపెడా కోతలు విధిస్తూ ఫైలెట్‌ సర్వే, స్పెషల్‌ డ్రెవ్‌ అంటూ రకరకాల కార్యక్రమాలకు ప్రభుత్వం తెర తీసింది. 

రాజకీయంగా గిట్టని వారి పింఛన్లను లబ్దిదారులకు తెలియకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ప్రస్తుతం డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 63,92,702 మందికి పింఛన్ల డబ్బులు విడుదలైనా అందులో ఐదారు లక్షల పెన్షన్లకు కోత పెట్టే యోచన ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 
 
అనర్హులంటూ ప్రచారం చేసి.. 
అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం వారం క్రితం అన్ని జిల్లాలో ఒక్కో గ్రామ / వార్డు సచివాలయాన్ని ఎంపిక చేసుకొని మొత్తం 10,958 మంది లబ్దిదారుల పింఛన్లను తనిఖీ చేసి 563 మంది అనర్హులుగా ఉన్నారని గుర్తించింది. 

అంటే ఐదు శాతం పైగానేనన్న మాట. 11 వేల మందిని తనిఖీ చేసి 5శాతం మందిని అనర్హులుగా తేల్చారంటే మొత్తం 65.49 లక్షల మందిని తనిఖీ చేస్తే...అందులో 5శాతం అంటే... దాదాపు 3 లక్షల మందికి పైగా అనర్హులుగా తేల్చబోతున్నారని పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. 

దివ్యాంగులు టార్గెట్‌గా.. 
దివ్యాంగ పింఛన్ల లబ్దిదారులకు సైతం కూటమి ప్రభుత్వం ఎడాపెడా నోటీసులు జారీ చేస్తోంది. అధికారంలో వచ్చిన నెల తిరగక ముందే జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగ పింఛన్‌ లబ్దిదారులకు పలు నిబంధనలతో నోటీసులు ఇచి్చంది. దీర్ఘకాలం క్రితం శరీర వైఫల్య సర్టిఫికెట్లు పొంది ఏళ్ల తరబడి పింఛను తీసుకుంటున్న వారిని సైతం 15 రోజుల్లో కొత్తగా మళ్లీ వైద్యుల ద్వారా పరీక్షలు చేయించుకుని సర్టిఫికెటు అధికారులకు అందజేయాలని ఆదేశించింది. 

దివ్యాంగులు “సదరం’లో పేర్లు నమోదు చేసుకునేందుకు సైతం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది 15 రోజుల్లో ఆన్‌లైన్‌లో రీ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకొని అర్హత నిరూపించుకోవాలని మానవత్వం లేకుండా నోటీసులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 

సుదూర ప్రాంతాలకు బదిలీ.. 
నెల నెలా పింఛన్లు కావాలంటే మా వద్దకు రావాల్సిందే..! అధికార పార్టీలో చేరాల్సిందే! ఎవరికి చెప్పుకున్నా ఏం ఉపయోగం ఉండదు!! ఇదీ పచ్చ నేతల బెదిరింపులు! ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన పింఛన్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే చాలు.. సుదూర ప్రాంతాలకు పెన్షన్లు బదిలీ చేస్తున్నారు. పింఛన్ల కోసం అంతదూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లలేక లబ్దిదారులు ఆశలు వదులుకుంటున్నారు. 

గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలిచారనే అక్కసుతో బాపట్ల జిల్లాలో పలువురు వృద్ధుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు బదిలీ చేశారు. పండుటాకులని కూడా చూడకుండా కూటమి సర్కారు దారుణంగా వ్యవహరించింది.

563 మందికే కాదు.. మిగిలిన వారికీ నోటీసులు 
పైలెట్‌ సర్వేలో గుర్తించిన 563 మంది లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నోటీసులు జారీ చేయాలని సెర్ప్‌ సీఈవో తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. 

అయితే సెర్ప్‌ కార్యాలయం నుంచి అధికారులకు పంపిన ఫోన్‌ సందేశాల్లో మాత్రం ఫైలెట్‌ సర్వే నిర్వహించిన సచివాలయాలతో పాటు ఇతర గ్రామ, వార్డు సచివాలయాలలోనూ అనర్హులుగా పేర్కొంటూ ఎంపీడీవో లాగిన్‌లో ఉన్నవారికి కూడా నోటీసులు జారీ చేయాలని సమాచారం ఇచ్చారు. ఎవరైనా నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తే వారి పింఛన్లను ఎంపీడీవోలు అప్పటికప్పుడే హోల్డ్‌ (తాత్కాలికంగా నిలుపుదల) చేయాలని సెర్ప్‌ సీఈవో ఆదేశాల్లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement