రాష్ట్రంలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.7,182
జాతీయ స్థాయిలో ఇది రూ.6,996గా నమోదు
ఏపీలో నెలవారీ గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.5,327
జాతీయ స్థాయిలో గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.4,122
వెల్లడించిన గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24
జాతీయ సగటును మించి ఖర్చు చేస్తున్న ఏపీ జనం
ఖర్చుల విషయంలో ఆంధ్రులు తగ్గేదే లేదంటున్నారు. ఏపీలో గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో నెలవారీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. 2022–23 ఆరి్థక ఏడాదితో పోలిస్తే.. రాష్ట్రంలోగ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ 2023–24లో నెలవారీ తలసరి వినియోగం వ్యయం పెరిగింది.
2022–23తో పోలిస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 9.38 శాతం, పట్టణాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 5.89 శాతం పెరిగింది. 2022–23తో పోలిస్తే రాష్ట్రంలో 2023–24లో గ్రామీణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.457, పట్టణ ప్రాంతాల్లో రూ.400 పెరిగింది. గృహ వినియోగ వ్యయ సర్వే 022–23–24ను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది.
ఈ సర్వే ప్రకారం 2023–24లో జాతీయ స్థాయిలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.6,996 ఉండగా.. ఏపీలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.7,182గా నమోదైంది. జాతీయ స్థాయి గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.4,122 ఉండగా.. ఏపీలో గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.5,327గా నమోదైంది. – సాక్షి, అమరావతి
ఆహారేతర వస్తువులపైనే ఖర్చు
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆహారేతర వస్తువుల వినియోగంపైనే ఎక్కువ వ్యయం చేస్తున్నట్టు సర్వేలో స్పష్టమైంది. 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం ఆహారేతర వస్తువుల వినియోగంపైనే వ్యయం చేశారు. రవాణా, దుస్తులు, పరుపులు, పాదరక్షలు, ఇతర వస్తువులు, వినోదం, మన్నికైన వస్తువులు ఆహారేతర వ్యయంలో ప్రధాన వ్యయ వాటాను కలిగి ఉన్నాయి.
పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయంలో ఇంటి అద్దె దాదాపు 7 శాతం వాటా కలిగి ఉంది. ప్రధానంగా పానీయాలు, రిఫ్రెష్‌మెంట్‌లు, ప్రాసెస్ చేసిన ఆహారంలో వ్యయం కొనసాగుతోంది. ఆ తరువాత పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు ఆహార వ్యయంలో ప్రధానంగా ఉన్నాయి. 2022–23తో పోలిస్తే జాతీ య స్థాయిలో 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో నెల వారీ తలసరి వినియోగ వ్యయం 9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం పెరిగింది.
జాతీయ స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం వ్యత్యాసం మరింత తగ్గింది. 2022–23లో 71 శాతం ఉండగా 2023–24లో 70 శాతానికి తగ్గింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన వినియోగం పెరుగుదలను సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment