national
-
వికారాబాద్ జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్
-
క్యాన్సర్‌ను జయించొచ్చు
క్యాన్సర్(రాచపుండు)కు ఇప్పుడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలతో ముందుకు సాగితే క్యాన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను కనిపెట్టిన పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ పుట్టిన రోజునే అవగాహన దినంగా నిర్వహించడం గమనార్హం.గుర్తించడం ఎలా?మానకుండా ఉన్న పుండ్లు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.కారకాలుసిగిరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటితోపాటు గుట్కా పాన్, మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల నోటి, పేగు, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, పాంక్రియాటిక్ క్యాన్సర్లూ వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది.మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలుతాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలు అధికంగా ఉంటాయి. ఇవి తినేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును రోజూ తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్నాన్కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రాంలో గత ఏడాది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాల్లో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా రోజూ వీరి వద్ద 30 నుంచి 50 మంది వరకు రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. -
National Candy Day: మిఠాయి పుట్టుక వెనుక..
మిఠాయిలను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. స్వీట్స్‌ను చూడగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నోరూరుతుంది. మరి ఇలాంటి మిఠాయిల గొప్పదనాన్ని గుర్తు చేసుకునేందుకు ఒక రోజు ఉందని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం నవంబర్ 4న జాతీయ మిఠాయి దినోత్సవం జరుపుకుంటారు. ఇది తీపిని ఇష్టపడేవారు తియ్యని వేడుక చేసుకునే రోజు. ఈ రోజు ఉద్దేశ్యం స్వీట్లను ఆస్వాదిస్తూ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తీపి పదార్థాలపై మనకున్న ప్రేమను వ్యక్తపరడచడం. ఈ రోజున వివిధ రకాల క్యాండీలను రుచి చూడటమే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వేడుక చేసుకుంటుంటారు.మిఠాయి కథ భారతదేశంలోనే మొదలయ్యింది. ప్రాచీన భారతీయులు చెరకు రసాన్ని ఉడికించి, అచ్చులుగా పోసేవారు. వీటిని ముక్కలుగా చేసి దానిని ‘ఖండ’ అని పిలిచేవారు. దీనినే చరిత్రకారులు తొలి మిఠాయిగా అభివర్ణించారు. పురాతన చైనా, మధ్యప్రాచ్యం, ఈజిప్ట్, గ్రీస్, రోమ్లలో తేనెతో మిఠాయిలు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవానికి ముందు మిఠాయిని జీర్ణవ్యవస్థను మెరుగుపరడచానికి, గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఉపయోగించేవారు.18వ శతాబ్దంలో క్యాండీ.. ఫ్రాన్స్ బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చింది. వంటలలో నైపుణ్యం కలిగినవారు చక్కెరతో మిఠాయిలు చేసేవారు. 1830వ దశకంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న సమయంలో మిఠాయి సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల క్యాండీలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో చాలామంది ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు మిఠాయి తింటుంటారు. ఇలా చేయడం వలన తాము అనుకున్న పనులు సఫలమవుతాయని భావిస్తుంటారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
డీజీపీని చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం.. ఎందుకంటే?
పాట్నా: బీహార్ పోలీస్ కార్యక్రమంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్‌ను చేతులు జోడించి అభ్యర్థించారు.సోమవారం బీహార్‌లో కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్మెంట్ లెటర్లను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ తన ప్రసంగం మధ్యలో చేతులు జోడించి బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో మరిన్ని రిక్రూట్మెంట్లు జరిగేలా చూస్తారా? అని అడిగారు. సీఎం నితిష్ కుమార్ విజ్ఞప్తితో డీజీపీ అలోక్ రాజ్ మెరుపు వేగంతో స్పందించారు. వేదికపై కూర్చొన్న డీజీపీ ఒక్కసారి లేచి సెల్యూట్ చేశారు. వెంటనే నితీష్ కుమార్ లేదు ముందు మీరు పోలీస్ రిక్రూట్మెంట్ త్వరగా చేస్తారా? అని మరోసారి అడిగారు. అందుకు డీజీపీ స్పందిస్తూ.. సీఎం నితీష్ ఆదేశాలను అమలు చేసేందుకు బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. త్వరలో పోలీసు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తాం’ అని అన్నారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలువచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతవారం బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగనన్ని దారుణాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. కానీ చర్యలు లేవు. ఫిర్యాదు చేస్తే విచారణ శూన్యం. ప్రజలకు న్యాయం జరగదు. ఇకపై సీఎం నితీష్ కుమార్ బీహార్‌ను నడపలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ డీజీపీ అలోక్ రాజ్ పోలీస్ రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని కోరుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
ముఖ్యమంత్రిపై పోటీ.. 8 మంది రెబల్స్‌పై వేటు
న్యూఢిల్లీ: అక్టోబరు 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్యానా బీజేపీ ఎనిమిది మంది రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీతో సహా ఇతర బీజేపీ నాయకులపై పోటీ చేసేందుకు రెబల్స్ ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అధిష్టానం వారిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ జాబితాలో మాజీ మంత్రి రంజిత్ చౌతాలా సైతం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడ్డ చౌతాలా తన పదవికి రాజీనామా చేశారు. లాడ్వా నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన సందీప్ గార్గ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.బహిష్కరణకు గురైన ఇతర ఆరుగురు నాయకులు అసంధ్ స్థానం నుండి పోటీ చేస్తున్న జిలే రామ్ శర్మ, సఫిడో నుండి మాజీ మంత్రి బచన్ సింగ్ ఆర్య, మెహమ్ నుండి రాధా అహ్లావత్, గుర్గావ్ నుండి నవీన్ గోయల్, హతిన్ నుండి కెహర్ సింగ్ రావత్, మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కద్యన్ ఉన్నారు.రంజిత్ చౌతాలా స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన రానియా నుండి ఎన్నికల టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం
చెన్నై : తమిళనాడు కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రి వర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్నారు సీఎం స్టాలిన్. డిప్యూటీ సీఎంగా ఉదయనిది స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాజ్ భవన్లో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురి మంత్రుల శాఖల్ని మార్చారు సీఎం స్టాలిన్. ఈడీ దర్యాప్తు చేసిన అవినీతి కేసులో అరెస్టయి బెయిల్‌పై ఉన్న సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రిపదవి దక్కింది. 👉 చదవండి : చంద్రబాబు పొలిటికల్ జాదు -
National Daughter’s Day 2024: వందే భారత్‌ను పరుగులు పెట్టిస్తున్న రితికా టిర్కీ
జంషెడ్పూర్: నేడు (సెప్టెంబర్ 22) జాతీయ కుమార్తెల దినోత్సవం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ లక్ష్యం. అంతేకాదు కూతుళ్లు కొడుకుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని అందించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన రితికా టిర్కీ టాటా-పట్నా వందే భారత్‌ను నడిపి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.జంషెడ్‌పూర్‌లోని జుగ్సలై నివాసి రితికా టిర్కీ(27) టాటా-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపి వందేభారత్‌ను నడిపిన దేశంలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందారు. రితికా తండ్రి లూటియా భగత్ రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. వెనుకబడిన గిరిజన కుటుంబానికి చెందినప్పటికీ రితిక చదువులో ఎంతో ప్రతిభ చూపారు. రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశాక,మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ అందుకున్నారు. 2019లో రైల్వేలో లోకో పైలట్‌గా నియమితురాలయ్యారు. మొదట చంద్రపురలో పోస్ట్ అయిన ఆమె ఆ తర్వాత 2021లో టాటానగర్‌కు బదిలీ అయ్యారు. రితికా భర్త బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.రితికా మీడియాతో మాట్లాడుతూ కూతుళ్లు.. కుమారులతో సమానమేనని, వారు ఏ రంగంలోనూ వెనుకబడరని తెలిపారు. లోకో పైలట్‌గా రైలు నడపడం సవాలుతో కూడుకున్న పని అని, అయితే దీనినే కెరీర్‌గా మార్చుకుని ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించానన్నారు. వందేభారత్ రైలును నడిపిన మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులకు అనేక అవకాశాలు అందించేందుకు ప్రపంచం తలుపులు తెరిచిందన్నారు. ఇది కూడా చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! -
80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!
ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక ఉంటే చాలు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదు. అదే నిరూపించింది 80 ఏళ్ల బామ్మ. లేటు వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని ఎన్నో పతకాలు సాధించింది. అతేగాదు నృత్యకారిణిగా కూడా రంగ ప్రవేశం చేసి ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్ధురాలిగా పేరు తెచ్చుకుంది. జీవితంలో కష్టాలు మాములే వాటిని పక్కన పెట్టి మంచిగా ఆస్వాదించడం తెలిస్తే హాయిగా జీవించొచ్చు అంటోంది ఈ బామ్మ. ఎవరీమె? రెస్ట్ తీసుకునే వయసులో మెరుపుతీగలా పతకాలు సాధిస్తూ.. దూసుకుపోతున్న ఆమె నేపథ్యం ఏంటంటే..గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల బకులాబెన్ పటేల్ అనే బామ్మకి ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయమట. కానీ ఇప్పుడు గజ ఈతగాడి మాదిరి అలవోకగా ఈత కొట్టేస్తోంది. 58 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం ప్రారంభించిందట. మొదట్లో విభిన్న అథ్లెటిక్ క్రీడలు ప్రయత్నిస్తూ..చివరికి ఈత నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందట. అలా ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈతల పోటీల్లో పాల్గొని ఎన్నో పతాకాలు, సర్టిఫికేట్లు సాధించింది. ఈ పోటీల నేపథ్యంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఆస్ట్రేలియా వంటి 12 దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అంతేగాదు ఆ బామ్మ పేరు మీదుగా ఏకంగా తొమ్మిది అంతర్జాతీయ పతకాలు, దాదాపు 500కి పైగా సరిఫికేట్లు ఉన్నాయి. అంతేగాదు 400 మందికి పైగా స్విమ్మర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. అలాగే ప్రపంచంలో అత్యంత సవాలుతో కూడిన సముద్రాలు, నదులను కూడా ఈదేసింది. అత్యంత కష్టమైన కెనడియన్ సముద్రంలో కూడా అలవోకగా రెండుసార్లు స్విమ్ చేసింది. అంతేగాదు ఏదో ఒక రోజు ఇంగ్లిష్ ఛానెల్‌ను కూడా జయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాలని భావిస్తోంది బకులాబెన్. దీంతోపాటు ఏడు పదుల వయసులో భరతనాట్య నృత్యకారిణిగా రంగప్రవేశం చేసింది. పైగా ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్దురాలిగా నిలవడమే గాక ఉత్తమ నృత్యకారిణిగా ప్రశంసలందుకుంది. ఇక బకులాబెన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 13వ ఏటనే వివాహం చేసుకుని ఇద్దర పిల్లలకు తల్లి అయ్యింది. అయితే కొంతకాలనికే భర్త మరణించడంతో ఒంటిరిగా పిల్లలను పోషించుకుంటూ బతికింది. వాళ్లు పెద్దవాళ్లై మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడంతో మళ్లీ ఆమె జీవితం శూన్యంతో నిశబ్దంగా ఉండిపోయింది. దీన్నుంచి బయటపడేలా ఆమె తన దృష్టిని క్రీడలవైపుకి మళ్లించింది. అలా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించింది. తాను ఏ రోజుకైనా దేశం గర్వపడేలా విజయం సాధించి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలనేది ప్రగాఢమైన కోరికట ఆమెకు. (చదవండి: ఫ్యాషన్ బ్లాగ్‌తో ..ఏకంగా రూ. 40 కోట్లు..!) -
National Forest Martyrs Day: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈరోజు ప్రత్యక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబరు 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణముంది. 1730, సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. అప్పటి జోధ్‌పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దాని కోసం అతనికి ఖేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్‌లోని థార్ జిల్లాలోని ఖేజ్రీ గ్రామంలోని ఖేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను విష్ణోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.ఖేజ్రీ చెట్లు బిష్ణోయిల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్ణోయ్ మహిళ అమృతా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు ఖేజ్రీ చెట్లను కావలించుకుని వాటిని నరకకుండా అడ్డుకున్నారు.అమృతా దేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికేవారిని అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో బిష్ణోయిలు- మహారాజు సైనికుల మధ్య కొట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్ణోయిలు కన్నుమూశారు. -
National Nutrition Week 2024 : స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా మారాలంటే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. సరైన పోషకాహారం, ఆరోగ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఆటగాళ్లకు ఆరోగ్యంతో కూడిన ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్లకు అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.క్రీడా మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ఏ క్రీడా జట్టుకైనా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంతో అవసరం. అథ్లెట్లు, వారి కోచ్‌లకు అనుసంధానంగా క్రీడా పోషకాహార నిపుణులు పని చేస్తుంటారు. అథ్లెట్ లేదా ఆటగాడి పనితీరు వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సూచనలు, సలహాలు అందించే ఆరోగ్య నిపుణులు రాష్ట్రానికి లేదా దేశానికి పతకాలు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కావడానికి బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సు చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక మెడికల్ స్ట్రీమ్‌లోకి వెళ్లేవారు లేదా న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన ఈ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్ లేదా న్యూట్రిషన్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేయడం ద్వారా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా ఉపాధి లేదా ఉద్యోగం పొందవచ్చు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అందిస్తోంది. డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును అన్నామలై యూనివర్సిటీ అందిస్తోంది. డైటెటిక్స్‌లో ఎంఎస్సీని కేరళ విశ్వవిద్యాలయం అందిస్తోంది.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం. క్రీడా పోషకాహార నిపుణులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి, ఉద్యోగ మార్గాలను అందుకోవచ్చు. -
పాత, కొత్తల గందరగోళం..
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
పాతాళగంగ లైన్ క్లియర్.. తెరుచుకోని జోషిమఠ్ రహదారి
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రెండు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిలో ఒకటి బద్రీనాథ్ జాతీయ రహదారిలోని జోషిమఠ్‌లో, మరొకటి పాతాళగంగ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. అయితే తాజాగా చార్ధామ్ యాత్రికుల కోసం పాతాళగంగ రహదారిని క్లియర్ చేశారు. దీంతో 40 గంటల తరువాత ఈ రహదారిలో వెళ్లేవారికి ఉపశమనం లభించినట్లయ్యింది. జోషిమఠ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన రహదారి ప్రాంతాన్ని ఇంకా క్లియర్ చేయలేదు.48 గంటలు గడిచినా జోషిమఠ్-బద్రీనాథ్ హైవేలో ఇంకా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడటంతో, బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ మొదలైన ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రికులు పలు అవస్థలు పడుతున్నారు.రెండు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ హైవేపై చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు జోషిమఠ్‌లో రహదారిని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో 260కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. వాటిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేసేందుకు 241 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు. -
కొత్త నేరచట్టాలపై ఉద్యమించాలి!
పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం, లోక్‌సభలో స్పీకర్ వ్యవహార శైలి, జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాలు వంటి వాటిని గమనిస్తే 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రాబోతున్నాయనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజాస్వామికవాదులనూ, పౌరహక్కుల కార్యకర్తలనూ ఉక్కుపాదంతో అణచేలా ఉన్నాయి.గుజరాత్ నమూనా అంటూ ఊదరగొట్టిన మోదీ– అమిత్ షాలు దశాబ్ద కాలంగా చేస్తున్న నరమేధపు రక్తపు మరకలను ఎమర్జెన్సీ బూచి చూపి తుడిచి వేయలేరు. బిల్కిస్ బానో కేసులో ముద్దాయిలను స్వాగత సత్కారాలతో విడుదల చేయటం, డేరా బాబా లాంటి వారికి పెరోల్ ఇవ్వటం, గోవింద్ పాన్స్రే, స్టాన్ స్వామి లాంటి వారి ప్రాణాలను హరించి, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిని ఆరు సంవత్సరాలు నేరం నిరూపణ కాకుండానే నిర్బంధించటం, వరవరరావు, సుధా భరద్వాజ్‌లను అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు విడుదల చేయటం... వంటివన్నీ మోదీ పాలన ఎంత అమానవీయంగా, అన్యాయంగా సాగుతున్నదో తెలిపే కొన్ని ఉదాహరణలు మాత్రమే.ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉపా, దేశ ద్రోహం, మనీ లాండరింగ్ చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా సవరించారు. డా‘‘ నరేంద్ర దాభోల్కర్, కామ్రేడ్ గోవింద్, ప్రొఫెసర్ ఎమ్ఎమ్ కల్బుర్గి, గౌరీ లంకేశ్ ప్రాణాలను బలిగొన్నారు. ఇటువంటి తరుణంలో అమలులోకి తెచ్చిన కొత్త నేర చట్టాలు పోలీసులకు అపరిమిత అధికారాలను దఖలు పరుస్తున్నాయి.కేసులు నమోదు చేయడంలో వారికి హద్దూ అదుపూ లేకుండా చేస్తున్న ఈ చట్టాలు మానవహక్కుల కార్యకర్తలూ, రాజకీయ కార్యకర్తల మనుగడనే కాదు, సామాన్యుల బతుకులనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రజలు ఉద్యమించాలి. – దినవహి హరినాథ్, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
నైపుణ్యాభివృద్ధి ఫలించేందుకు సవాళ్లెన్నో...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఒక విప్లవాత్మకమైన యోజనను ప్రకటించింది. రాష్ట్రంలోని ఐటీఐల (పారిశ్రామిక శిక్షణ సంస్థలు)ను క్రమేణా అధునాతన సాంకేతిక కేంద్రాలు (అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్ – ఏటీసీలు)గా రూపాంతరం చేస్తూ మార్కెట్ అవసరాలకి మానవవనరులని తయారుచేస్తామని వెల్లడించింది.ఈ రంగంలో పనిచేసేవారికి ఇదొక తియ్యని వార్త. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. పారిశ్రామిక రంగానికి ఉన్నత స్థాయి ప్రమాణాలతో మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్న ఆశ ముఖ్యమంత్రి ప్రసంగం విన్నవారికి కలుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే సంవత్సరాల్లో బంగారు తెలంగాణ ఆవిష్కృతమౌతుంది!సాంకేతిక రంగంలో నైపుణ్యాభివృద్ధి అనేది కొత్త అంశమేమీ కాదు. మన దేశంలో ఐటీఐలు, పాలిటెక్నిక్లూ దశాబ్దాల నుండి పనిచేశాయి, చేస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలు, 255 ప్రైవేట్ ఐటీఐలు శిక్షణనిస్తున్నాయి. ప్రకటించిన యోజన ప్రకారంగా 65 ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలు మార్చుతూ వచ్చే పదేళ్ళలో వివిధ విషయాల్లో సాంకేతిక నైపుణ్యతను సాధించిన నాలుగు లక్షల నిపుణలను తయారు చేయాలన్నది లక్ష్యం.ఈ లక్ష్యాల్ని నెరవేర్చడానికి రాష్ట ప్రభుత్వం ‘టాటా టెక్నాలజీస్ లిమిటెడ్’ సంస్థతో పదేళ్ల ఒప్పందం చేసుకొంది. వీరు స్వల్ప, దీర్ఘ కాలిక శిక్షణా కార్యక్రమాలతో ప్రతి ఏటా 30 వేలకు పైగా యువతను నిపుణులుగా తయారుచేసి పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి పొందేలా చేస్తారు. అలాగే విదేశాలకు వెళ్లి బతకడానికి సంసిద్ధుల్ని చేస్తారు.శిక్షణను కేవలం పుస్తక, అనుభవ సిలబస్సులకే పరిమితం చేయకుండా దాని చుట్టూతా ఆవరించి ఉన్న జీవకళలను కూడా జోడించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ అవసరాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. జిల్లాలవారీగా ఈ అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఆ యా ప్రాంతాల్లో ఉన్న ఏటీసీలు కోర్సుల్ని రూపొందించాలి. ఉదాహరణకు తెలంగాణలోని కొన్ని జిల్లాల నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలస వెళతారు.ముఖ్యమంత్రి చెప్పినట్టుగా గల్ఫ్ దేశాల అవసరాలకు అనుకూలంగా నైపుణ్యాభివృద్ధి జోడైతే వలసదారులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారే కాకుండా, తిరిగివచ్చిన వారికి సైతం స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు తక్షణమే అందుబాటులో ఉండాలి. వీరు మాతృదేశానికి వచ్చి స్థిరపడి పోవాలనుకొంటారు. గల్ఫ్ దేశాల్లో చేసిన పని, అనుభవం తిరిగివచ్చినవారి ఊళ్లలో పనికిరాకపోతే వారిలో నిరుత్సాహం మొదలై మళ్ళీ వలసపోవాలనే ఆలోచనలతో సతమతమౌతారు.జెండర్ వివక్ష ఎక్కువ ఉన్న మన సమాజంలో సమతుల్యం తేవడానికి అమ్మాయిలు సంప్రదాయేతర కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలి. జనవరి 2001లో భుజ్ (గుజరాత్) లో భయంకర భూకంపం వచ్చాక పునరావాసానికి వేల సంఖ్యలో ఇళ్లను కట్టడానికి తీవ్రమైన మేస్త్రీల కొరత ఏర్పడింది. అహమ్మదాబాద్‌కు చెందిన సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ వారు గ్రామీణ మహిళలకు నిర్మాణరంగంలో శిక్షణనిచ్చి పునరావాస కార్యక్రమాలను వేగంగా అమలుపరచడంలో చేయూతనిచ్చారు. నిర్మాణ రంగంలో ఎప్పుడూ మానవవనరుల కొరత ఉంటుంది. మహిళలు కేవలం అల్పస్థాయి పనులకే పరిమితమౌతున్నారు. ఇప్పుడు ఐటీఐల ప్రక్షాళన మొదలవుతుంది కాబట్టి పెద్దయెత్తున ప్రయత్నాలు చేపట్టి మహిళలకు సాంకేతిక రంగంలో సముచిత స్థానం కల్పించాలి.1980వ దశాబ్దంలో భారత ప్రభుత్వం ‘కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీస్’(ïసీఏఆర్టీ– కార్ట్) అనే సంస్థని ఢిల్లీలో స్థాపించింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థను 25 ఏళ్లుగా పనిచేస్తున్న మరో సంస్థ, ‘పీపుల్స్ ఆక్షన్ ఫర్ డెవలప్మెంట్ ఇండియా’ (పీఏడీఐ)తో విలీనం చేసింది. రెండు పేర్లలో ఉన్న మూలసూత్రాలను కలుపుకొని ‘కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ ఆక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీస్’– కపార్ట్ పేరుతో దేశమంతా ఎన్జీవోలకి ఆర్థిక సహాయన్నందిస్తూ చాలా సంవత్సరాలు పనిచేసింది (వ్యాస రచయిత ఈ సంస్థలో ఆరు సంవత్సరాలు పనిచేశారు).ఈ రెండు సంస్థలూ గ్రామీణాభివృద్ధి విభాగం (వ్యవసాయ మంత్రిత్వ శాఖ) కింద పనిచేసేవి. అప్పుడు కపార్ట్ ఒక వినూత్న ప్రయోగాన్ని– ‘రీజినల్ రిసోర్స్ సెంటర్స్ ఫర్ రూరల్ టెక్నాలజీస్’ (ఆర్ఆర్సీఆర్టీ) ఆరంభించింది. కపార్ట్ స్వచ్ఛందసేవా సంస్థలకు ఆర్థిక సహాయంచేసే సంస్థ కాబట్టి ఉన్నతశ్రేణి ఎన్జీవోలకు ఇది గొప్ప అవకాశంగా అందుబాటులోకి వచ్చింది. ఎన్నో పేరున్న సంస్థలు ఏళ్లనుండి గ్రామీణాభివృద్ధికి అంకితమై యువతకి ఉపాధికోసం శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్ని జరుపుకున్నాయి.ఈ యోజన ద్వారా పలు సంస్థలకి పెద్ద మొత్తాల్లో 3–5 సంవత్సరాల ప్రాజెక్టులను ఇచ్చారు. లబ్ధి పొందిన ఈ సంస్థలు తమ తమ ప్రాంతీయ అవసరాలను తెలుసుకొని మంచి శిక్షణా కార్యక్రమాలను రూపొందించి గ్రామ యువతకు శిక్షణ ఇచ్చాయి. మరింత బలపర్చడానికి గాను ఈ యోజన ఎంతో తోడ్పడి యువత భవిష్యత్తు నిర్మాణంలో గణనీయమైన పాత్ర వహించాయి. అయితే కాలక్రమేణా కపార్ట్ మూతపడింది. తెలంగాణ ప్రభుత్వం పైవిషయాలనూ దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సాగించాలి.– డా. టి. సంపత్ కుమార్, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు. ఢిల్లీలోని కెనడియన్ హై కమిషన్ మాజీ సీనియర్ సలహాదారు -
పాఠ్యాంశంగా నటి తమన్నా జీవితం!!
సాక్షి బెంగళూరు: సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడంపై బెంగళూరులో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలపై బాలల హక్కుల రక్షణ సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఏడో చాప్టర్లో సింధీ వ్యక్తుల గురించి అంశాన్ని పొందుపరిచారు. ఇందులో నటి తమన్నా భాటియా, నటుడు రణ్వీర్ సింగ్ గురించి పాఠ్యాంశంగా చేర్చారు. పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రులు మండిపడ్డారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను ఇచ్చినట్లు తెలిపింది. స్వాతంత్య్రం అనంతరం సింధూ ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపింది. -
ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ తప్పదు..
బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇది దేశంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బిహార్ నమునాగా ఇతర రాష్ట్రాలు కూడా కులగణన చేసి శాస్త్రీయంగా బీసీల జీవన స్థితిగతుల లెక్కలు తీసుకుని విద్యా–ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంపుదల చేసుకోవచ్చని ఆశగా ఎదురు చూసిన వారు విస్మయానికి గురైనారు. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా ఓబీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుదల జరుగదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం 69 శాతానికి పెంచిన మొత్తం రిజర్వేషన్ శాతం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం గమనార్హం. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా సీఎం జయలలిత ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అప్పటి పీవీ నరసింçహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... తమ శాసన సభ చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా చేశారు. దీంతో తమిళనాడులో అమలు జరుగుతున్న 69 శాతం రిజర్వేషన్లపై ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండాపోయింది.బిహార్ రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బీసీలకు అధిక రిజర్వేషన్లు అందేలా చూడాలి. బిహార్‌తో పాటుగా అన్ని రాష్ట్రాలూ ఇదే దారిలో ప్రయాణించవలసి ఉంది. ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చవలసి ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా బీసీల రిజర్వేషన్లు పెంచాలనే తలంపుతో ఏ విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ 1992లో ‘ఇందిరా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాద’నే తీర్పును అడ్డుపెట్టుకుని ఆధిపత్య వర్గాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నాయి. బిహార్‌లో మాదిరిగా మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు మించి ఇచ్చాయని సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే విధిగా రాజ్యాంగసవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం చేయడానికి వేరే మార్గం లేదని అర్థమవుతుంది.బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 50 శాతానికి మించి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా అంగీకరించిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు.ఈ డబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జనాభా గణన చేయలేదు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయకుండా అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దేశజనాభాలో అగ్రవర్ణాలు ఎంతమంది? వారిలో పేదరికం ఎంత శాతం? ఈ లెక్కలు లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో కేంద్రమే చెప్పాలి. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 85 శాతం మంది ఉంటే వీరిలో 56 శాతంగా ఉన్న బీసీలలో పేదలు ఎంతమందో ఎవరి దగ్గరా లెక్కలు లేవు. అందుకే ఓబీసీ రిజర్వేషన్లలో ఎలాంటి పరిమితి విధించకుండా అత్యవసరంగా రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్‌ను సవరించాలి. అపుడే బీసీలకు విద్యా– ఉద్యోగ రంగాలలో న్యాయం జరుగుతుంది.పట్నా హైకోర్టు తీర్పు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇపుడు దేశంలోని ఓబీసీలంతా స్పష్టంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలతో తమిళనాడులో రామస్వామి పెరియార్ కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ ఉద్యమం కొనసాగించవలసి ఉంది. నితీష్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున తమిళనాడులాగా ఒక చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చుకుని బిహారు రాష్ట్రం వరకు రిజర్వేషన్ల పెంపును అమలు జరుపుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రత్వం బిహారుకు కలిసివచ్చే విధంగా ఉంది.దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి బడుగులందరి తరఫున నిలిచి కేంద్రంపై బీసీ రిజర్వేషన్లు పెంచడానికై రాజ్యాంగ సవరణ చేయాలని ఒత్తిడి పెంచాలి. ఓబీసీల హక్కుల సాధన కోసం జాతీయోద్యమం రూపుదాల్చే సమయం ఆసన్నమయ్యింది.దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పాటు పడిన బీఆర్ అంబేడ్కర్ తర్వాత అంతగా కృషి చేసినవారు తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు విద్యా–ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదల కోసం తమిళనాడులో మహోద్యమాలు జరిగాయి. పెరియార్ రామస్వామి చేసిన కృషి మరువలేనిది. రిజర్వేషన్లను న్యాయస్థానం అడ్డుకోకుండా చేయడంలో పెరియార్ రామస్వామి జరిపిన పోరాటం మరిచిపోలేనిది. అంబేడ్కర్ రిజర్వేషన్ల రక్షణ కోసం చేసిన పోరాటానికి కొనసాగింపుగా తమిళనాడులో పెరియార్, ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్లు చేసిన ఉద్యమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశవ్యాపితంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ ఉద్యమం రూపుదాల్చవలసి ఉంది. నేటి ఓబీసీ యువతరం, విద్యావంతులు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొనాలి. బడుగు వర్గాల నుంచి వచ్చిన యువతరం బీసీలకు జరిగిన అన్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలను ఐకమత్యం చేసే పనిలో పాలుపంచుకోవాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలలో బీసీలకు న్యాయం జరిగేదాకా ఉద్యమపథంలో ముందుకు సాగక తప్పదు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం విధిగా చేయాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ -
కాలుష్య జలాలతో సాగు.. ఆరోగ్యానికి కీడు!
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడిన మంచినీటి చెరువులు జల కాలుష్యం వలన ప్రస్తుతం మురికి నీటి కూపాలుగా మారిపోయాయి. ఈ మురికినీటితో కూర కాయల సాగు అనేది విరివిగా జరుగుతోంది. ఈ విధంగా కూరగాయల సాగు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 11 చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కలుషితం అయిన చెరువు నీటితో కూరగాయలను సాగు చేయడం వలన కూరగాయల లోనికి రసాయన కాలుష్య కారకాలు ప్రవేశించి ఆహారపు గొలుసు ద్వారా ‘బయో మాగ్నిఫికేషన్’ చెందడం వలన అనేక అనారోగ్య, పర్యావరణం సమస్యలు తలెత్తుతాయి.భారతదేశం అంతటా... ముఖ్యంగా దేశంలోని పెద్ద మెట్రోపాలిటన్ నగరాలలో, లెక్కలేనన్ని సంఖ్యలో రైతులు తమ పంటలను శుద్ధి చేయని మురుగునీటితో పెంచుతున్నారు. ఉపరితల నీటికి శుద్ధి చేయని వ్యర్థపదార్థాలు వచ్చి కలిసినట్లయితే ఆ నీరు కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన నీటిని రైతులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. దీని వలన డయేరియా, చర్మవ్యాధులు, కంటి వ్యాధులు వంటివి రైతులకు సంక్రమించే అవకాశం ఉంది. కలుషిత నీటితో వ్యవసాయం చేయడం వలన వ్యవసాయ భూములను సారవంతం చేసే విలువైన సూక్ష్మజీవులు, డీకంపోజర్స్, వానపాములు వంటివి నశించిపోయి సారవంతమైన వ్యవసాయ భూమి నిస్సత్తువ వ్యవసాయ భూమిగా మారిపోతుంది.శుద్ధి చేయని వ్యర్థ జలాల వలన వ్యర్థ జలాలలోని భారీ లోహాలు మొక్కలను విషపూరితం చేస్తాయి. అలాగే ఇది ఆహార కాలుష్యానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ కూరగాయలలో విటమిన్లు లోపిస్తాయి. శరీరంలో రసాయన కాలుష్యకారకాలు పేరుకుపోతాయి. దీని ఫలితంగా క్యాన్సర్లు, జన్యు ఉత్పరివర్తనలు, పోషకాహార లోపం ఏర్పడవచ్చు.2000 నుండి 2003 వరకు పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగంగా యూకే డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఢిల్లీలోని వివిధ మార్కెట్ల నుండి ఆజాద్‌పూర్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌నుండి సేకరించిన బచ్చలికూరలో భార లోహాల కాలుష్యాన్ని గుర్తించింది.2015 అధ్యయనంలో, భారతీయ పరిశోధకుల బృందం ఢిల్లీలోని ఐదు మార్కెట్లలో కూరగాయలలో కాడ్మియం, సీసం, జింక్, రాగి అవశేషాలను అంచనా వేసింది. విషపూరిత కలుషితాలకు గురైన కూరగాయలు, పండ్లు వంటి ప్రాథమిక ఉత్పత్తులను పరీక్షించడానికి ఈ రోజు వరకు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఇండియాకు లేదు. ఆహార రంగంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణ లేకపోవడం, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో నిరంతర వైఫల్యం భారతదేశ రైతులు, ఆహార కంపెనీలకు ఇబ్బందిగా మారింది.రైతులు తమ పంటలను పెంచడానికి మురుగునీటిని ఉపయోగించటానికి కార ణాలు అనేకం: వేగవంతమైన జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్, తీవ్రంగా క్షీణిస్తున్న స్వచ్ఛమైన నీటి నిల్వలు. భూగర్భ జలాలు పడిపోవడం వలన బోర్లు పడక రైతులు కలుషితమైన నీటితో వ్యవసాయం చేస్తున్నారు.నీరు కాలుష్యమయం కాకుండా ఉండటానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. పండగల సందర్భాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను మంచినీటి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితం అవుతోంది. దీనికి మంచి ఉదాహరణ హుస్సేన్ సాగర్. అందువల్ల మట్టి బొమ్మలనే నిమజ్జనం చేయాలి. గృహ వ్యర్థాలను, పారిశ్రామిక వ్యర్థాలను మంచి నీటి చెరువులలోనికి విడుదల చేయకూడదు. చెరువులను కబ్జా చేసి నివాస స్థలాలుగా మార్చడాన్ని నిరోధించాలి.డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను అవలంబించాలి. కలుషితమైన చెరువులను పునరుద్ధరించి తిరిగి మంచినీటి చెరువులుగా మార్చాలి. కలుషితమైన నీటితో వ్యవసాయ చేసే ప్రదేశాలను గుర్తించి అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మంచి నీటి చెరువులు విలువైన సహజ సంపద కాబట్టి ప్రభుత్వం, ప్రజలు సమష్టి కృషితో వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.– డా. శ్రీదరాల రాము, వ్యాసకర్త ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, 9441184667 -
వామపక్షాలకు నూతనోత్తేజం!
పార్లమెంటు ఎన్నికలలో సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండు సీట్లు గెలుపొంది వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బిహార్‌లోని అరా, కరాకట్ లోక్‌సభ స్థానాల నుండి లిబరేషన్ అభ్యర్థులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు విజయ బావుటా ఎగురవేశారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషి చేస్తూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా మారింది.అరా, కరాకట్, నలందా, కొడర్మ సీట్లలో బరిలో నిలిచింది. నలందా నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సందీప్ సౌరభ్ రెండో స్థానంలో నిలిచారు. జార్ఖండ్‌లో కొడెర్మలో వినోద్ సింగ్ (బాగోదర్ ఎమ్మెల్యే) రెండో స్థానంలో నిలిచారు. బిహార్‌లో అజియాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా దానిని లిబరేషన్ నిలబెట్టుకుంది. ఇక్కడ శివ్ ప్రకాష్ రంజన్ విజయం సాధించారు.మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ కాలక్రమంలో తన పంథాను మార్చుకుంది. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్)ను ఏర్పాటు చేసి 1985 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంది. 1989 పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్‌ను అరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి పంపింది. ఆ తర్వాత జయంతా రోంగ్పి అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బిహార్ నుంచి పార్లమెంట్‌కు పంపింది.1995 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ పేరుతో పోటీ చేస్తోంది. 2010 ఎన్నికల్లో తప్ప మినహా ఆ పార్టీ ప్రతినిధులు మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన చరిత్ర లిబరేషన్‌కు ఉంది. జైలులో ఉండి శాసన సభకు గెలిచిన చరిత్రా ఉంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంది.19 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఒక మహిళా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. సీట్ల సంఖ్యలో తరుగుదల, పెరుగుదల ఉన్నప్పటికీ నికరమైన, స్థిరమైన ఓటు బ్యాంకు, బలమైన ప్రజా పునాది కలిగి ఉండటం విశేషం. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సుదీర్ఘ కాలంగా ఉంది. గతంలో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 25 రాష్ట్రాలలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం కలిగి ఉంది.‘రణవీర్ సేన’ లాంటి ప్రైవేటు సైన్యాలను ఎదుర్కొన్న వీరోచిత చరిత్ర లిబరేషన్ది. అణచివేతలపైనా, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, భూమిలేని పేదల కోసం, రైతుల హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నడిపింది. నిరంతరం పేదల కోసం పోరాడిన సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు పేదల హక్కుల్ని కాపాడడం కోసం పార్లమెంట్లో తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారు. – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 78932 30218. -
ముస్లిం కోటా చుట్టూ రాజకీయాలు
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ముస్లింల కోటా అంశం తెరపైకి వస్తూ... గతం తాలూకు గాయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ముస్లింలు వెనుకబడిపోయారన్న అంశం కోటా కోరడానికి ప్రాతిపదిక. వీరు వెనుకబడిపోయారన్న కారణంతోనే 1906లో ‘ఆలిండియా ముస్లిం లీగ్’ ఏర్పడింది. అలాగే ముస్లింలకు వేరుగా ఓటరు జాబితా (1909), ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేకంగా 25 శాతం కోటా (1926)లు అందుబాటులోకి వచ్చేందుకూ ఇదే కారణం. వీటివల్ల అష్రాఫ్‌ల వంటి ఉన్నతవర్గాలతో ‘ముస్లిం సమాజం’ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. లాభపడింది కూడా ఈ సమాజమే. అనవసరమైన చేర్పులతో కాంగ్రెస్ పార్టీ ; దళిత మూలాలున్న ముస్లింలను ఎస్సీ కోటాలో చేర్చడాన్ని వ్యతిరేకించిన బీజేపీ... రెండూ ముస్లింల వెనుకబాటుకు కారణమయ్యాయి.ముస్లింలకు కోటా విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ కొట్లాటకు దిగుతూండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కొట్లాటల మూలం మాత్రం బ్రిటిష్ పాలకుల కళ్లముందు జరిగిన దేశ విభజన గాయాలే అని మేధో వర్గంలోనూ అటు ఏకాభిప్రాయం, ఇటు భిన్నాభిప్రాయమూ ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ముస్లింల కోటా అంశం తెరపైకి వస్తూ... గతం తాలూకూ గాయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. తద్వారా రాజకీయం మొత్తం హిందూ–ముస్లిం, మెజార్టీ–మైనార్టీ, సెక్యులర్–కమ్యూనల్, ఇస్లామోఫోబియా అన్న అంశాలకే పరిమితమవుతూ ఉంటుంది. ఈ భావజాలం కాస్తా కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయం వంటి విస్తృతాంశాలపై జరగాల్సిన చర్చను కట్టడి చేసేందుకు ఒక వర్గానికి చక్కగా ఉపయోగపడుతోంది.వలస పాలన ముగింపు దశలో ప్రభుత్వ పాలన వ్యూహాలు, అంతులేని మత ఘర్షణలు, మత పునరుజ్జీవన యత్నాల ఫలితంగానే దేశంలో హిందు, ముస్లిం సమాజాలన్న భావన పుట్టుకొచ్చింది. ఈ వర్గాల్లోని ఉన్నత వర్గాలు ‘ద్విజులు’, ‘అష్రాఫ్’లు ఈ భావజాలాన్ని పెంచి పోషించారు. ఈ కారణంగా మతం ఆధారంగా కొనసాగిన రాజకీయాలు... మతానికి వ్యతిరేకంగా నడిచిన ఉద్యమాలతో వైరం పెంచుకున్నాయి. గతంలో పాల్బ్రాస్ చెప్పినట్లు ‘ముస్లింలు వెనుకబడిపోయారన్న భ్రమ’ పునాదులు 1882 నాటి హంటర్ కమిషన్ నాటి నుంచే కనిపిస్తుంది.అప్పట్లో కేవలం బెంగాల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముస్లిం సమాజం మొత్తం వివక్షకు గురైనట్లు చిత్రీకరించారు. ఉదాహరణకు 1881 – 1921 మధ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లోని ముస్లింల శాతం 34.8 నుంచి 47.2కు వెళ్లింది. అయితే ఈ మధ్యకాలంలోనే దేశంలో ముస్లింల జనాభా కూడా 19 శాతం (1881) నుంచి 23 శాతానికి (1921) పెరిగింది. మతానికీ, సామాజిక స్థాయికీ మధ్య సంబంధం ఉందన్న దృష్టికోణం నుంచి ఈ సమాచారాన్ని పరిశీలిస్తే వలసపాలకుల ప్రాపకంతో వచ్చిన లబ్ధిని ముస్లింలలోని ఉన్నత వర్గాలైన అష్రఫీలు అందుకున్నట్లు స్పష్టమవుతుంది. సాంస్కృతిక అంశాలను పెట్టుబడిగా పెట్టి వీరు సాధారణ ముస్లింలను పక్కకు తోసి ఈ లాభాలు పొందారు.ముస్లింలు వెనుకబడిపోయారన్న భ్రమే 1906లో ‘ఆలిండియా ముస్లిం లీగ్’ ఏర్పాటుకు కారణమైంది. అలాగే ముస్లింలకు వేరుగా ఓటరు జాబితా (1909), ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేకంగా 25 శాతం కోటా (1926)లు అందుబాటులోకి వచ్చేందుకూ ఇదే కారణం. వీటి వల్ల అష్రాఫ్‌ల వంటి ఉన్నతవర్గాలతో కూడిన ‘ముస్లిం సమాజం’ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. లాభపడింది కూడా ఈ సమాజమే. ‘ముస్లింలు ముప్పును ఎదుర్కొంటున్నారు’... ‘ముస్లింల మెప్పు పొందే ప్రయత్నాల’న్న భావజాలం కూడా ఈ అష్రాఫ్‌ల వంటి ఉన్నత వర్గాలు సమాజంలోకి చొప్పించినవే.భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా తొలినాళ్ల నుంచి వలసపాలకుల ‘ముస్లిం ఫస్ట్’ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగువ తరగతి ముస్లింలతో ‘మోమిన్ కాన్ఫరెన్స్’ను స్థాపించిన అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. 1930ల్లో ఏర్పడ్డ మోమిన్ కాన్ఫరెన్స్ ముస్లిం లీగ్‌ను అష్రాఫ్ ముస్లిం కూటమిగా వ్యవహరించేది. అలాగే మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ‘టూ నేషన్ థియరీ’ని తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. 1939లో దేశంలోని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనీ, దిగువ తరగతి ముస్లింలకు వేరుగా జాబితా, ప్రాతినిధ్యం కల్పించాలనీ మోమిన్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేసింది.పన్నులు కట్టే, విద్యార్హతలు, ఆస్తులుండే వారికి మాత్రమే ఓటుహక్కు ఉండేది అప్పట్లో. వీరు ముస్లిం లీగ్‌కు ప్రాతినిధ్యం వహించేవారు. ముస్లిం ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసేవారు. అయితే 1946 ఎన్నికల్లో ముస్లింలీగ్ విజయం సాధించడంతో దేశ విభజన అడ్డుకునేందుకు మోమిన్ కాన్ఫరెన్స్ ప్రయత్నాలు సరిపోలేదు. స్థూలంగా చూస్తే ముస్లిం అష్రాఫ్‌లు జిన్నా దేశ విభజన పిలుపునకు ఊ కొట్టారనీ, దిగువస్థాయి ముస్లింలు వ్యతిరేకించడంతోపాటు గాంధీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పని చేశారనీ అర్థమవుతుంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ముస్లిం లీగ్ భాగమైపోయింది. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి వారితో కలిసి ముస్లింలను జనజీవన స్రవంతిలోకి చేర్చేందుకు ఇది అవసరమన్న మిష చూపింది. కాలక్రమంలో ఈ అష్రాఫ్ నేతలు కాంగ్రెస్‌లో ముస్లిం వ్యవహారాలపై వ్యాఖ్యాతలుగా మారారు. ఈ క్రమంలోనే దిగువ జాతి ముస్లింల అభివృద్ధి నలిగిపోయింది.స్వాతంత్య్రం తరువాత రెండుసార్లు (1955, 1979) ఏర్పాటైన వెనుకబడిన వర్గాల కమిషన్లు (కాకా కేల్కర్, మండల్ కమిషన్లు) కూడా ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా పరిగణించలేదు. మండల్ కమిషన్ నివేదిక 82 కులాల ముస్లింలు సామాజికంగా వెనుకబడి ఉన్నారని చెప్పడంతో... మతాలకు అతీతంగా అణచివేతకు గురైన కులాల అంశంపై విస్తృత చర్చకు మార్గం ఏర్పడింది. అలీ అన్వర్ నేతృత్వంలోని ‘పస్మాందా ఉద్యమం’ ముస్లిం కోటాను వ్యతిరేకిస్తూనే దళిత, ఆదివాసీల వంటి సామాజిక వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న కులాలకు న్యాయం చేయాలనీ, ఇది మతాలకు అతీతంగా జరగాలనీ డిమాండ్ చేస్తూ వచ్చింది.1990 తొలి నాళ్లలో భారతీయ ముస్లింలలో 85 శాతం వరకూ ఉన్న దిగువ తరగతి ముస్లింలకు వేర్వేరు రాష్ట్రాల్లోని ఓబీసీ కోటాల్లో రిజర్వేషన్లు లభించేవి. అయితే కాంగ్రెస్‌లోని అష్రాఫ్ ముస్లింలు పస్మాంద వర్గాలకు లభిస్తున్న చిన్నపాటి సౌకర్యాలను కూడా పట్టాలు తప్పించే ప్రయత్నం చేసేవారు. ముస్లిం కోటాను డిమాండ్ చేయడం, ఓబీసీ వర్గాల్లో మతం ప్రస్తావన తేవడం ద్వారా ఇది జరిగేది. 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం కోటా ప్రస్తావన, కేంద్ర ఓబీసీ కోటాలో మైనార్టీల్లోని వెనుకబడిన వర్గాల వారికి 4.5 శాతం సబ్‌కోటా ఏర్పాటు వంటివన్నీ పస్మాందా వర్గాలకు లభిస్తున్న సౌకర్యాలను తప్పించే ప్రయత్నాలకు నిదర్శానాలు. దళితుల కంటే ముస్లింలు వెనుకబడి పోయారన్న తప్పుడు అంచనాకు సచార్‌కమిటీ వచ్చిందంటారు. నిజానికి దీన్ని అష్రాఫ్ వర్గాలు ముందుకు తెచ్చాయి.ముస్లిం కోటాపై కాంగ్రెస్ వైఖరిని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ చెబుతున్నా... దాన్ని అష్రాఫ్ వర్గం మెప్పుకు మాత్రమే కాంగ్రెస్ ప్రయత్నించిందన్నట్లుగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని తప్పులు చేసిందని రాహుల్ గాంధీ పరోక్షంగా ఒప్పుకున్నప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తారా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. హంటర్ నుంచి సచార్ వరకూ ఏర్పాటైన కమిషన్ల నివేదికలను అధ్యయనం చేసి ముస్లింల వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుందా? అనవసరమైన చేర్పులతో కాంగ్రెస్ పార్టీ ముస్లింల వెనుకబాటు తనానికి కారణమైతే; బీజేపీ... ముస్లింలు, క్రిస్టియన్లు, దళిత మూలాలున్న ముస్లింలను ఎస్సీ కోటాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా ముస్లింల వెనుకబాటు తనానికి కారణమైందని చెప్పాలి. – వ్యాసకర్త అజీమ్ ప్రేమ్‌జీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)విశ్లేషణ: ఖాలిద్ అనీస్ అన్సారీ -
గొప్ప పరిపాలనా దక్షురాలు..
దేశమంతా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది మే 31 దాకా అహిల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తెలివి, మేధస్సు, ధైర్యసాహసాలతో ఆమె మహారాణిగా ఎదిగారు. సువిశాల భూభాగంలో పరిపాలన చేసి ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బాలిక విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఆమె.మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వద్ద గల చోండి గ్రామంలో అహిల్యాబాయి 1725 మే 31న జన్మించారు. ఆమె తల్లి సుశీలా షిండే, తండ్రి మంకోజీ షిండే. నేటి రాజకీయ భాషలో సంచార తెగల కుటుంబం ఆమెది. చిన్న నాటనే ఆమెకు గల భక్తి, నిర్భీతి చూసి మల్హార రావు హోల్కర్(మరాఠా సుబేదారు) ముగ్ధుడయ్యారు. తన కుమారుడు ఖాండేరావు హోల్కర్కు ఇచ్చి వివాహం చేశారు. అప్పుడామె వయస్సు పదేళ్లు, పెళ్లి కొడుకు వయస్సు పన్నెండేళ్లు. అలా రాజ కుటుంబంలోకి ప్రవేశించింది. అక్కడే యుద్ధ విద్యలు, ప్రజా పాలనా విద్యలు నేర్చింది. వారి మామగారి వెంట అనేక యుద్ధాలకు వెళ్లి, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించింది. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరింది.అయితే, భర్త ఖాండే రావు 1754లో, తండ్రి వంటి మామ మల్హార రావు 1766లో, తర్వాతి ఏడాది కుమారుడు మాలే రావు... ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు. ఈ పిడుగుపాటు ఘటనలతో అహిల్య కుంగిపోలేదు. 16 యేండ్ల కుమారుణ్ణి కోల్పోయిన దుఃఖంలోనే 1767లో సింహాసనం అధిరోహించారు. శివ భక్తురాలుగా శివుని ప్రతినిధిగా పరిపాలన చేపట్టారు. ఇండోర్‌కు దూరంగా, నర్మదా నదీ తీరాన ఉన్న మహేశ్వర్ (మధ్య ప్రదేశ్) గ్రామాన్ని తన ముఖ్య పట్టణంగా నిర్మించారు. అది సమగ్ర పట్టణాభివృద్ధి యోజనకు మంచి ఉదాహరణ.గొప్ప సంస్కరణ వాది..మహిళలకు విద్య, భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, వితంతువులకు పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు... ఇలా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు ఆమె తీసుకున్నారు. ఆమె పాలనలో అడవుల నరికివేతను నిషేధించారు. ఆదాయం ఇచ్చే చెట్లను నాటించారు. త్రాగుడును నిషేధించారు. వరకట్నాన్ని నిషేధించారు. ఆమె కోట తలుపులు సామాన్యులు తమ గోడు చెప్పుకోడానికి ఎప్పుడూ తీసే ఉండేవి. వ్యవసాయం కొరకు నూతన చెరువుల నిర్మాణం, నీటి నిల్వకు ట్యాంకులు, నదులపై ఘాట్లు నిర్మించారు. వస్త్ర పరిశ్రమ, పట్టు పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలకు వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహేశ్వరీ చీరలు అంటే ఇప్పటికీ మంచి పేరే ఉంది!భిల్లులు, గోండులు వంటి గిరిజనులకు భూములను ఇచ్చి వారిని వ్యవసాయం వైపు మళ్లించారు. అటవీ ప్రాంతంలో ప్రజలకు దారి చూపుతూ ఉండే భిల్లులకు ప్రజల నుండి భిల్ కావడి వంటి పన్నును సేకరించుకునేట్లు ప్రోత్సహించారు. ఆ ఆదాయంతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, అభివృద్ధి పథకాలు చేపట్టారు.హిందూ ఆలయాల పునరుజ్జీవనం కోసం..తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే, గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణరంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత ఆమె. 1783లో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన చంద్రావంత్ను అణిచి వేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యాన్ని నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూనాలో గాలిలో శతఘ్నులను పేల్చాడు.ఆమె హిందూధర్మ పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారు. విదేశీ పాలకుల వల్ల దేశ వ్యాప్తంగా ధ్వంసం అయిన 82 మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి, శ్రీశైలం... ఇలా అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారు. అన్నదాన సత్రాలను కట్టించారు. తన రాజ్యంలో అన్ని కులాల, మతాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించారు. కనుకనే టిప్పు సుల్తాన్ వంటి ముస్లిం రాజులు సైతం ఆమె ధార్మిక నిర్మాణాలకు అడ్డు చెప్ప లేకపోయారు. ఆమె సంస్థానంలో దేశంలోని 13 రాజ్యాలకు చెందిన ప్రతినిధులు ఉండేవారు. వివిధ రాజులతో మిత్రత్వం నడిపి, నూతన దౌత్య విధానాలకు దారి చూపారు. కనుకనే దేశ వ్యాప్తంగా వివిధ రాజుల రాజ్యాలలోని హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయగలిగారు.సాధారణంగా కవులు... రాజులను పొగిడి ధన సేకరణ చేసుకుంటూ ఉంటారు. కవులు ఆమెను పొగుడుతూ కవిత్వం రాయడాన్ని ఆమె అంగీకరించేది కాదు. ‘నన్ను పొగుడుతూ కవిత్వం చెబితే మీకు ఆదాయం ఉండదు. ఆ శివుడిని పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్న సైనికులను పొగుడుతూ కవిత్వం రాయండి’ అనేది. అయినా ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు గౌరవించారు. 1795 ఆగస్ట్ 13న తన 70వ ఏట తనువు చాలించిన ఆమెను ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా పాశ్చాత్య చరిత్రకారులు కొనియాడారు. ఆమె జన్మించి 300 ఏళ్లయింది. కర్మ యోగిగా, మాతృత్వం నిండిన రాణిగా ఆమెను పేర్కొనడం సముచితం. – శ్యాంప్రసాద్ జీ, అఖిల భారతీయ సంరసతా ప్రముఖ్ (నేటి నుంచి అహిల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాలు ప్రారంభం) -
ఎన్నికలు vs ఏఐ
ఈ వేసవి ఎంత వేడిగా వుందో ప్రస్తుత ప్రపంచ రాజకీయ వాతావరణం అంతే వేడిగా వుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఎన్నికలు పూర్తి కాగా మరికొన్ని దేశాలలో త్వరలో జరగనున్నాయి. ఇదే మే నెలలో దక్షిణాఫ్రికాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా నవంబరులో అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఇంతటి మహాయజ్ఞంలో ఇప్పుడు మానవ మేధస్సు కంటే ఎక్కువగా ఎన్నికల్లో ఏఐ (అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పాత్ర పెరిగింది.ఏఐ అంటే ఏంటీ?ఆర్టీఫిషియల్ ఇంటెలిజన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో కూడిన యంత్రాంగం. అంటే మనిషి లానే ఆలోచించి ఇంకా చెప్పాలంటే మనిషి కన్నా వందల రెట్లు వేగంగా ఆలోచించి జవాబులు చెప్పే యాంత్రిక సాధనం. ఈ సాంకేతిక విప్లవం ఇప్పుడు ఎన్నికలలో విపరీతంగా వాడుకలోకి వచ్చింది. అభ్యర్ధులు తమ ప్రచారం కోసం ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేశారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజల మనోభావాలను ఇట్టే పసిగట్టేయడానికి, సోషల్ మీడియాలో పోస్టులను విశ్లేషించడానికి, ప్రచార వ్యూహాలను, క్యాంపెయిన్లను రూపొందించడానికి ఏఐ సాంకేతికతను విపరీతంగా వాడేశారు. అక్కడితే ఆగిపోయారా.. అంటే లేదు అని చెప్పాలి. లెక్కకు మిక్కిలి ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలను అసలు కంటే మిన్నగా ఏఐతో రూపొందిస్తున్నారు.ఏఐ ఎలా పని చేస్తోంది?ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (AI) మానవ మేధస్సు నుంచి వేగంగా నేర్చుకుంటుంది. సమస్య - పరిష్కారం, ఎలాంటి అవసరాలు వస్తాయి? ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఆలోచించడానికి, అనుకరించడానికి, పోల్చుకోడానికి దేన్ని పరిశీలించాలి? వీటన్నింటిని ఒక కోడింగ్ పద్ధతిలో AI తనలో దాచుకుంటుంది. ఒకసారి AI పూర్తిగా నేర్చుకుంది అంటే.. తన దగ్గర ఉన్న డాటా నుంచి అద్భుతాలు సృష్టిస్తుంది. మానవులు ఆలోచించేదానికంటే వేగంగా, ఎన్నో అంశాలను పరిశీలించి జవాబులు చెబుతుంది. ఇది ఎంత సహజంగా ఉంటుందంటే.. సాధారణ మనుష్యులు గుర్తించలేదు. నమూనాలను గుర్తించడం, అంచనాలను రూపొందించడం, కొత్త సమాచారాన్ని స్వీకరించడం ఇవన్నీ అత్యంత సులువుగా చేస్తుంది.ఎన్నికలలో ఏం చేసింది?ముఖ్యంగా డేటాను విశ్లేషించడానికి ఏఐని అన్ని పార్టీలు వాడాయి. అలాగే ప్రచార వ్యూహాలను మెరుగుపరచడానికి, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కూడా ఏఐ వాడేశారు. సోషల్ మీడియాను మానిటరింగ్ చేయడం, ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకోవడం, కీలక సమస్యలను గుర్తించడం, దానికి అనుగుణంగా ప్రచారాన్ని మార్చుకోవడం, తమ ఎజెండాను ప్రజలు ఒప్పుకునేలా చేయడం వంటి వాటిని ఏఐ సాయంతో పార్టీలు చేసేశాలయి. అలాగే చారిత్రక డేటా, పోలింగ్ డేటా తదితర సంబంధిత అంశాల ఆధారంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి AIను వాడారు.ఇటీవల అమెరికాలో న్యూహాంప్‌షైర్‌లోని ఓటర్లు ప్రైమరీలలో ఓటు వేయవద్దని నేరుగా ప్రెసిడెంట్ బైడ్‌న్ నుంచి కాల్ వచ్చింది. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సమయంలో ఇమ్రాన్ లైవ్ చాట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి, జైల్లో ఉన్న ఇమ్రాన్ వీడియోల్లో లైవ్‌లో జనం అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానాలిచ్చారో అర్థం కాక ఆశ్చర్యపోయారు చాలా మంది.భద్రత కోసం ఏఐఎన్నికల ప్రక్రియలో మోసాన్ని అరికట్టేందుకు ఏఐను వాడారు. అలాగే సాంకేతికత వ్యవస్థ ధృడంగా ఉండేందుకు హ్యాకింగ్ బారి నుంచి కాపాడుకునేందుకు ఏఐని వాడుకున్నారు. ఫేక్ వీడియోలను అరికట్టడానికి, తప్పుడు పోస్టింగ్‌లను నిరోధించడానికి ఏఐని వాడారు. సిసి కెమెరాల విశ్లేషణను, పోలింగ్ డాటా అప్డేట్స్కు ఏఐను వాడారు.కొత్త, కొంగొత్తస్పీచ్, టెక్స్ట్అనాలిసిస్‌లో ఏఐ వాడకం బాగా పెరిగింది. మనతో ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్టుగానో, లేక అభ్యర్థి స్వయంగా మనకు ఫోన్ చేసి పలకరించినట్టుగానే మాడ్యుల్స్ తయారు చేశారు. AI-పవర్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) పద్ధతులను ఏఐ వాడి అనుసరించారు. ఓటర్ ఎంగేజ్మెంట్, చాట్బోట్లలో వీపరీతంగా ఏఐని దించేశారు. వర్చువల్ అసిస్టెంట్లు రియలిస్టిక్‌గా మారిపోయాయి. ఓటర్లతో పరస్పరచర్చలు జరిపాయి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి. పైగా ఇవన్నీ చాలా సులభంగా జరిగిపోయాయి. యాక్సెసిబిలిటీ, వాయిస్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ తదితర ఫీచర్లతో ఓటర్లు గుర్తించలేనంతగా సర్వీసులనిచ్చాయి.ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్ల మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు, పాల్గొంటున్నారు. ఏఐ వల్ల అంతా మంచేనా అంటే ఒప్పుకోలేం. ఏఐ వల్ల ఎంత మంచి ఉందో, అంతకు రెట్టింపు ముప్పు ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసిరావాలి. యంత్ర మేధస్సు మంచిదే కానీ, ఆ వలయంలోనే మనుష్యులు మునిగిపోకూడదు. ఎన్నికలలో ఎన్నికయ్యే నాయకుడు ప్రజల నాడీ అయి ఉండాలి కానీ ఆర్టీఫిషియల్ బాడీ అవకూడదు. మనం దేవుడిని భౌతికంగా చూడలేం కాని దివ్యత్వాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే యంత్ర మేధస్సు మనం చెబితే ఆచరించాలి తప్ప మన భావోద్వేగాలలో భాగం కాకూడదు.- హరికృష్ణ ఇంటూరు, సాక్షి యూట్యూబ్ -
బదిలీల తర్వాతే హింస!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.కౌంటింగ్ రోజు జాగ్రత్త..రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించినట్లు తెలిసింది. -
నేషనల్ లవర్స్ డే : ఈ అందమైన జంటల్ని చూడండి (ఫోటోలు)
-
Tamilnadu : ధర్మపురిలో తెలుగు ఓటరు కీలకం
సాక్షి, చైన్నె: పర్యాటకంగానే కాకుండా మామిడి ఉత్పత్తికి ధర్మపురి ప్రసిద్ధి చెందింది. కావేరి నదీ తీరంలోని తీర్థాదీశ్వర ఆలయంలో రాముడు, హనుమంతుడు పూజలు చేసినట్టుగా ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ ఆలయంలోని స్వామి వారికి అభిషేకం నిర్వహించడం కోసం రాముడు ఓ జలపాతాన్ని ఇక్కడ సృష్టించినట్టుగా, దీనిని నేడు హనుమంత తీర్థంగా పేర్కొంటుంటారు. భారత నయాగారాగా పిలవబడే ‘హొగ్నేకల్’ జలపాతం కూడా ఇక్కడే ఉంది. ఈ ధర్మపురిలో లోక్ సభ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు చెమటోడ్చుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏకంగా 20శాతం ఓటర్లు తెలుగు మాట్లాడే వారు కావడంతో ఇక్కడి ఎన్నికపై ఆసక్తి నెలకొంది. డీఎంకే డిపాజిట్ గల్లంతు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే హవా కొనసాగింది. అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ధర్మపురిలో ఆపార్టీ నేతృత్వంలోని కూటమికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క సీటు ఇక్కడ గెలువలేదు. ఈ లోక్‌సభ పరిధిలో పాలక్కోడు, పెన్నాగరం, ధర్మపురి, పాపిరెడ్డి పట్టి, హారూర్, మెట్టూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మేట్టూరు నియోజకవర్గం సేలం జిల్లాలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో పాలక్కోడు నుంచి అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ ఐదోసారిగా గెలిచారు. అలాగే, అదే పార్టీకి చెందిన గోవిందస్వామి పాపిరెడ్డిపట్టి నుంచి, వి.సంపత్‌కుమార్ హారూర్ నుంచి రెండుసార్లు గెలిచారు. మూడు స్థానాలను అన్నాడీఎంకే కై వసం చేసుకోగా, మిగిలిన మూడు స్థానాలలో పెన్నాగరం నుంచి పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, ధర్మపురి నుంచి పార్టీకి చెందిన ఎస్పీ వెంకటేశ్వరన్, మేట్టూరు నుంచి పి.సదాశివం విజయఢంకా మోగించారు. అన్నాడీఎంకే, పీఎంకే అభ్యర్థుల ముందు డీఎంకే కూటమి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందుకు డీఎంకే సిట్టింగ్ ఎంపీ డాక్టర్ ఎస్ సెంథిల్‌కుమార్ పనితీరు కారణంగా ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. చేజారకుండా జాగ్రత్తగా.. అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైనా లోక్‌సభ ఎన్నికలలో తమ పట్టు చేజారకుండా జాగ్రత్తగా వ్యూహాలకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదునుపెట్టారు. ఇక్కడ ఇప్పటి వరకు డీఎంకే 3 సార్లు, ఆ కూటమిలోని కాంగ్రెస్ మరో మూడుసార్లు గెలిచాయి. తమకు బలం ఉన్న చోట డిపాజిట్లు గల్లంతు కావడం ఆ కూటమిని జీర్ణించుకోలేకుండా చేసింది. దీంతో ఈసారి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి స్థానిక నేతగా ఉన్న ఎ.మణిని పోటీలో పెట్టారు. ఈయన గెలుపు లక్ష్యంగా సీఎం స్టాలిన్, యువజన నేత, మంత్రి ఉదయనిధిస్టాలిన్ ధర్మపురిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో కోల్పోయిన ఓట్లను, పట్టును తిరిగి సొంతం చేసుకునేందుకు డీఎంకే కూటమిలోని పార్టీలు తీవ్రంగా కుస్తీలు పడుతున్నాయి. పట్టు బిగిస్తామంటోన్న పీఎంకే.. ప్రస్తుతం డీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకుని తీరుతామన్న ధీమాను పీఎంకే, అన్నాడీఎంకేలు వేర్వేరుగా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు పీఎంకే నాలుగు సార్లు గెలిచింది. 2014లో ఆపార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలలో 70 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. గతంలో కంటే తమకు బలం పెరగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వ్యూహాత్మకంగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన వారసుడు, పార్టీ అధ్యక్షుడు అన్బుమణి అడుగులు వేశారు. తొలుత ఓ అభ్యర్థిని ప్రకటించినా, హఠాత్తుగా అతడ్ని మార్చి తన కోడలు సౌమ్య అన్బుమణిని అభ్యర్థిగా రాందాసు ప్రకటించారు. గతంలో అన్బుమణి ఎంపీగా ఉన్న సమయంల, ఆ తర్వాత కానీయండి తన నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ద్వారా సౌమ్య అన్బుమణి ఇక్కడి ప్రజలకే కాదు, తన సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణస్వామి కుమార్తెగా, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణిగా ప్రచారంలో సౌమ్య అన్బుమణి ముందంజలో ఉన్నారు. పీఎంకే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పట్టు బిగించే విధంగా ముందుకు సాగుతున్నారు. పాగా వేస్తామంటున్న అన్నాడీఎంకే.. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్థానికంగా బలం కలిగిన నేతలు. ఇందులో ఒకరు ఐదుసార్లు, మరో ఇద్దరు రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. తమకు బలం ఉన్న నేపథ్యంలో ఈసారి తప్పకుండా పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం కేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ అశోకన్‌ను గెలిపించేందుకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఒకే సామాజిక వర్గ అభ్యర్థుల మధ్య జరుగుతున్న ఈ రసవత్తర సమరంలో తాము సైతం అంటూ నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా డాక్టర్ అభినయ పొన్నివలవన్ సైతం ఓట్ల చీలికతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. న్యూస్‌రీల్ ధర్మపురి లోక్‌సభను మళ్లీ కై వసం చేసుకోవడంమే లక్ష్యంగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. తమ గుప్పెట్లో నుంచి చేజారిన ఈ స్థానంపై పట్టుకు పీఎంకే తీవ్ర కుస్తీలు పడుతోంది. ఇక్కడ తమకు సైతం బలం ఉండడంతో పాగా వేసి తీరుతామన్న ధీమాను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రేసులో తామూ ఉన్నామన్నట్టు నామ్ తమిళర్ కట్చి ప్రచారంలో ఉంది. వన్నియర్ సామాజిక వర్గం, తెలుగు మాట్లాడే వారే న్యాయనిర్ణేతలుగా ఉన్న ఈ లోక్‌సభలో ఓటరు నాడి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఓటరు ఎటో.. ఈ నియోజకవర్గంలో 15,12,732 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటే, ఈ నియోజకవర్గంలో మాత్రమే పురుషులు ఓట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఓటర్లలో వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ 50 శాతం, తెలుగు మాట్లాడే వారి సంఖ్య 20%, ఇతర సామాజిక వర్గాలు 30 శాతం మేరకు ఉన్నాయి. ఈ ఓటరు నాడి ఎటో అనేది అంతు చిక్కని పరిస్థితి. 2019 లోక్‌సభ ఎన్నికలలో డీఎంకేను ఆదరించిన ఓటర్లు, 2021 అసెంబ్లీ ఎన్నికలలో తిరస్కరించడం గమనార్హం. తాజాగా ఓటరు నాడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వన్నియర్ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చెల్లా చెదురయ్యే అవకాశాల నేపథ్యంలో తెలుగు మాట్లాడే వారు, ఇతర సామాజిక వర్గాల ఓట్లే గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయనున్నాయి. దీంతో ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నువ్వా..నేనా అంటూ అభ్యర్థులు ఉరకలు, పరుగులు తీస్తున్నారు. -
సిబ్లింగ్స్ డే: సెలబ్రెటీ సిబ్లింగ్స్..ఆ బంధం ఏం చెబుతోందంటే..!
తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు/కూతురు ఉంటే హ్యాపీ అనుకుంటారు గానీ. అది అస్సలు నిజం కాదు. తమ్ముడో, చెల్లో ఉంటే ఆ దారే వేరు. ఆ బలమే వేరు. అలాంటి తోబుట్టువులకు సంబంధించిన ఒక రోజు ఉందని తెలుసా... ఈ బిజీ లైఫ్‌లో ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు బంధాలు ఉంటున్నాయి. అందుగురించే ఓ రోజుని ఏర్పాటు చేసి మనతో పాటు అమ్మ కడుపున పుట్టిన వాళ్లను అస్సలు విస్మరించొద్దు అని చెబుతున్నారు. దీన్ని మనం ప్రతి ఏటా ఏప్రిల్ 10న తోబుట్టువుల దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీ తోబుట్టువులు జాబితా గురించి చర్చిద్దామా? రక్త సంబంధాలను ఎలా బలంగా పదిలపర్చుకోవాలో కూడా సవివరంగా తెలుసుకుందాం..! ఎంతటి వ్యక్తికైనా తన భాగస్వామి తోపాటు తోడబుట్టిన వాళ్లతో సత్సంబంధాలు బాగుండాలి. మన తోపాటు పుట్టిన వాళ్లని విస్మరించకూడదు. అంతెందుకు మన రామాయణంలో లక్ష్మణుడి కోసం రాముడు ఎంతగా పరితపిస్తాడో చక్కగా వివరించి ఉంటుంది. అందులో భార్య లేదా భర్త విధి వశాత్తు దూరమైతే మరొకరు ఆ స్థానం భర్తీ చేయగలరు గానీ మన తోడబుట్టినోడు దూరమైతే మరోకరు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని ఎంతో ఉద్విగ్నంగా రాసి ఉంటుంది. అంత గొప్ప రక్త సంబంధం అది. మృత్యువు తప్ప ఆ బంధాన్ని ఏదీ విడదీయలేదు అన్నంత దృఢంగా ఉంచుకోవాలి. అలానే మన సినీ సెలబ్రెటీల తోబుట్టువులు ఒకరికొకరం అన్నంతగా ఉన్న వారెవరో చూద్దామా..! షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్ ఇద్దరు స్టైలిష్ లుక్‌లో ఉండే సోదరులు ద్వయం. ఇరువు మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌తో కూడిని బంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి ఉండే గౌరవం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీరి రిలేషన్ నుంచి తోబుట్టువని చిన్న చూపు కాకుండా గౌరవప్రదంగా చూసుకోవాలనే విషయం తెలుస్తుంది. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించాలంటే ముందు పెద్దవాళ్లే సరైన విధంగా ప్రవర్తించాలని చెబుతోంది. జాన్వీ కపూర్ -ఖుషీ కపూర్ టాలీవుడ్ అందాల రాశి దివంగంత నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. ఇద్దరూ అమ్మకు తగ్గ అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇరువురు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. వారి తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడూ జాన్వీ తల్లిలా మారి తన చెల్లి ఖుషీకి ధైర్యం చెబుతూ మార్గ నిర్దేశించిన విధానం గురించి సోషల్ మీడియాల్లో విన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా ఇద్దర్ని కోల్పోయినప్పుడు మన తోడబుట్టిన వారికి ఎలా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాలన్నది తెలియజేస్తుంది. అవసరమైతే తల్లిదండ్రులు రోల్‌ని తీసుకుని మరీ వారిపట్ల బాధ్యతతో వ్యవహరించాలనే విషయాన్ని తెలియజేబుతోంది. కరిష్మా కపూర్ -కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ స్టార్ నటుల అయిన ఈ సిస్టర్స్ ద్వయం ఎక్కడకు వెళ్లిన కలిసే వెళ్తుంటారు. కెరీర్ పరంగా మీడియా ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలు తెప్పించే ప్రయత్నం చేసినా..మాలో ఎవరికి స్టార్డమ్ వచ్చినా హ్యాపీనే అని హుందాగా చెప్పి ఆశ్చర్యపరిచిన పలు సందర్భాలు అనేకం. కష్టకాలంలో తోబుట్టువుకి ఎలా మద్దతు ఇవ్వాలన్నది కూడా వారిని చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. కేవలం సంతోషంగా ఉంటేనే తోబట్టువులు గుర్తు తెచ్చుకోకూడదు. బాధలో ఉన్నప్పుడు తరచి తరచి వారి బాగోగులు తెలుసుకోవాలి, వారికి కావాల్సినంత అండ దండ ఇవ్వాల్సి కూడా ఉంటుందనే విషయం తప్పక గ్రహించాలి. సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అన్నా-చెల్లెలు అంటే ఇలా ఉండాలి అని సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ల ద్వయంని చూస్తే తెలుస్తుంది. ఇద్దరు రాజకుటుంబానికి చెందిన వారి వల్లే మంచి అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తారు. ఇరువురు స్నేహితులేమో అనుకునేలా ఉంటారు. చెబితేగాని తెలియదు అన్నాచెల్లెళ్లు అని. మన తోడబుట్టిన వాళ్లతో ఇంతలా సరదాగా ఓ స్నేహితుడితో ఉన్నంత చనువుగా ఉండాలని చెప్పకనే చెబుతోంది వీరి బంధం. కృతి సనన్- నూపూర్ సనన్ అక్కా చెల్లెళ్లు ఎలా ఉండాలనేందుకు ఈ ఇద్దరే ఆదర్శం. అక్కా చెల్లెళ్లు అనంగానే కాస్త రాగద్వేషాలు, అసూయలు రాజుకుంటాయి. అది అందం లేదా కెరీర్ పరంగానైనా ఉండొచ్చు. కానీ వీళ్ల మధ్య వాటికి స్థానం లేదు. ప్రేమగా మెలుగుతున్న వారిని చూస్తే ఎవ్వరికైన అసూయాగా అనిపిస్తుంది. అబ్బా నాకు ఓ అక్క లేదా చెల్లి ఉంటే బాగుండును అనిపిస్తుంది. తగాదాలకు తావివ్వకుండా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటూ మంచి సోదరీమణుల్లా మెలుగుతుంది ఈ సిస్టర్స్ ద్వయం. చివరిగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ ఈ ముగ్గురు అన్నదమ్ములు విచిత్ర సోదరులు సినిమాలోని సోదరుల్లా కలిసి మెలిసి ఉంటారు. ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉంటారు. వీరినుంచి ఐక్యమత్యంగా ఎలా ఉండాలనేది నేర్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే తోబుట్టువుల మధ్య ఉండాల్సింది ఐక్యమత్యమే!. (చదవండి: ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..)