హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడిన మంచినీటి చెరువులు జల కాలుష్యం వలన ప్రస్తుతం మురికి నీటి కూపాలుగా మారిపోయాయి. ఈ మురికినీటితో కూర కాయల సాగు అనేది విరివిగా జరుగుతోంది. ఈ విధంగా కూరగాయల సాగు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 11 చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కలుషితం అయిన చెరువు నీటితో కూరగాయలను సాగు చేయడం వలన కూరగాయల లోనికి రసాయన కాలుష్య కారకాలు ప్రవేశించి ఆహారపు గొలుసు ద్వారా ‘బయో మాగ్నిఫికేషన్’ చెందడం వలన అనేక అనారోగ్య, పర్యావరణం సమస్యలు తలెత్తుతాయి.
భారతదేశం అంతటా... ముఖ్యంగా దేశంలోని పెద్ద మెట్రోపాలిటన్ నగరాలలో, లెక్కలేనన్ని సంఖ్యలో రైతులు తమ పంటలను శుద్ధి చేయని మురుగునీటితో పెంచుతున్నారు. ఉపరితల నీటికి శుద్ధి చేయని వ్యర్థపదార్థాలు వచ్చి కలిసినట్లయితే ఆ నీరు కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన నీటిని రైతులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. దీని వలన డయేరియా, చర్మవ్యాధులు, కంటి వ్యాధులు వంటివి రైతులకు సంక్రమించే అవకాశం ఉంది. కలుషిత నీటితో వ్యవసాయం చేయడం వలన వ్యవసాయ భూములను సారవంతం చేసే విలువైన సూక్ష్మజీవులు, డీకంపోజర్స్, వానపాములు వంటివి నశించిపోయి సారవంతమైన వ్యవసాయ భూమి నిస్సత్తువ వ్యవసాయ భూమిగా మారిపోతుంది.
శుద్ధి చేయని వ్యర్థ జలాల వలన వ్యర్థ జలాలలోని భారీ లోహాలు మొక్కలను విషపూరితం చేస్తాయి. అలాగే ఇది ఆహార కాలుష్యానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ కూరగాయలలో విటమిన్లు లోపిస్తాయి. శరీరంలో రసాయన కాలుష్యకారకాలు పేరుకుపోతాయి. దీని ఫలితంగా క్యాన్సర్లు, జన్యు ఉత్పరివర్తనలు, పోషకాహార లోపం ఏర్పడవచ్చు.
2000 నుండి 2003 వరకు పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఢిల్లీలోని వివిధ మార్కెట్‌ల నుండి ఆజాద్‌పూర్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌నుండి సేకరించిన బచ్చలికూరలో భార లోహాల కాలుష్యాన్ని గుర్తించింది.
2015 అధ్యయనంలో, భారతీయ పరిశోధకుల బృందం ఢిల్లీలోని ఐదు మార్కెట్లలో కూరగాయలలో కాడ్మియం, సీసం, జింక్, రాగి అవశేషాలను అంచనా వేసింది. విషపూరిత కలుషితాలకు గురైన కూరగాయలు, పండ్లు వంటి ప్రాథమిక ఉత్పత్తులను పరీక్షించడానికి ఈ రోజు వరకు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఇండియాకు లేదు. ఆహార రంగంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణ లేకపోవడం, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో నిరంతర వైఫల్యం భారతదేశ రైతులు, ఆహార కంపెనీలకు ఇబ్బందిగా మారింది.
రైతులు తమ పంటలను పెంచడానికి మురుగునీటిని ఉపయోగించటానికి కార ణాలు అనేకం: వేగవంతమైన జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్, తీవ్రంగా క్షీణిస్తున్న స్వచ్ఛమైన నీటి నిల్వలు. భూగర్భ జలాలు పడిపోవడం వలన బోర్లు పడక రైతులు కలుషితమైన నీటితో వ్యవసాయం చేస్తున్నారు.
నీరు కాలుష్యమయం కాకుండా ఉండటానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. పండగల సందర్భాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను మంచినీటి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితం అవుతోంది. దీనికి మంచి ఉదాహరణ హుస్సేన్ సాగర్. అందువల్ల మట్టి బొమ్మలనే నిమజ్జనం చేయాలి. గృహ వ్యర్థాలను, పారిశ్రామిక వ్యర్థాలను మంచి నీటి చెరువులలోనికి విడుదల చేయకూడదు. చెరువులను కబ్జా చేసి నివాస స్థలాలుగా మార్చడాన్ని నిరోధించాలి.
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను అవలంబించాలి. కలుషితమైన చెరువులను పునరుద్ధరించి తిరిగి మంచినీటి చెరువులుగా మార్చాలి. కలుషితమైన నీటితో వ్యవసాయ చేసే ప్రదేశాలను గుర్తించి అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మంచి నీటి చెరువులు విలువైన సహజ సంపద కాబట్టి ప్రభుత్వం, ప్రజలు సమష్టి కృషితో వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
– డా. శ్రీదరాల రాము, వ్యాసకర్త ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్,
శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, 9441184667
Comments
Please login to add a commentAdd a comment