భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి, ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో ఉన్న నేలమాళిగ గ్రంథాలయంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యా ర్థులు జల సమాధి కావటం యావత్ దేశాన్ని కలచివేసింది. చని పోయిన ముగ్గురిలో ఒకరు బిహార్ లోని ఔరంగాబాద్‌కు చెందిన తానియా సోనీ తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానియా సోనీ మృతదేహాన్ని తరలించడంలో తండ్రి విజయ్ కుమార్‌కు సహాయ సహకా రాలు అందించాల్సిందిగా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఆదే శాలు జారీ చేశారు.
ఢిల్లీలోని పలు కోచింగ్ సెంట ర్లలో కనీస సౌకర్యాలు లేవనీ, కోచింగ్ సెంటర్లు నరక కూపాలుగా ఉన్నా యనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి అవినాష్ దూబే అనే సివిల్స్ ఆశావహ అభ్యర్థి లేఖ రాయటంతో అందరి దృష్టి కోచింగ్ సెంటర్లపై పడింది. ప్రధానంగా మన తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి వరంగల్, ఇతర జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్ నగర్, దిల్‌సుఖ్ నగర్, అమీర్ పేట్ నిరుద్యోగుల కూడళ్ళుగా పేరుపొందాయి. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు కోచింగ్ సెంటర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. సంవత్సరానికి 70 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగు తున్నట్లు అంచనా.
అడ్డూ అదుపూ లేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది. కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు. 2024 జనవరి 18న కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నామ మాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించరు. గృహ అవస రాలకు అని అనుమతి తీసుకుని ఆ భవనాలనే కోచింగ్ సెంటర్లుగా వాడుతూ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందు తున్నారు, ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు అనే లెక్కలు ఉండవు. తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పైన జీఎస్టీ వంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. పైగా వెలుతురు లేని గదుల్లో 100 మంది కూర్చోవాల్సిన చోట 500 మందికి బోధిస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాలు ఉండవు. వీటి కన్నా కన్నా జైళ్ళు నయమనే భావన కలుగుతుంది. జైళ్ళలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా జైలు గదుల్లో వెలుతురు ఉంటుంది. నిబంధనల ప్రకారం గదిలో లెక్కకు మించి ఖైదీలను ఉంచరు.
అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమా ణాలు పాటించని కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇటీవల హరి యాణా ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు–2024ను తెచ్చి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. అట్లాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చట్టం తెచ్చి, తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా విద్యార్థి నిరు ద్యోగుల శ్రేయస్సుకు పాటుపడాలి.
– కోటూరి మానవతా రాయ్, వ్యాసకర్త టీపీసీసీ అధికార ప్రతినిధి; తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, 90009 19101
Comments
Please login to add a commentAdd a comment