ఇవీ మన కొత్త చట్టాలు–4
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.
నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.
ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.
కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్‌లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.
రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.
– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment