
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రూతుపవనాలు రానున్నాయని.. దేశమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105 శాతం వర్ష శాతానికి ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.
జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.
కాగా, రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.