
నేటి నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం
రాయలసీమలో తేలికపాటి వానలు!
గంటకు 40–50 కి.మీ.ల వేగంతో గాలులు..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశి్చమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
బుధ, గురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది.
ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, మంగళవారం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.3 సెం.మీ.ల భారీ వర్షం కురిసింది. అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు) 5.2, సాలూరు (పార్వతీపురం మన్యం) 4.7, పెందుర్తి (విశాఖపట్న) 4.5, హరిపురం (శ్రీకాకుళం) 4.5, డి.పోలవరం (కాకినాడ) 4.1, దత్తిరాజేరు (విజయనగరం) 3.8 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment