
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి రూరల్/: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది గురువారం అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులపాటు వర్షాల ప్రభావం అక్కడక్కడా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అల్పపీడనం కారణంగా.. నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలుపడే సూచనలున్నాయని తెలిపారు. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కోస్తాంధ్ర మత్స్యకారులు శుక్రవారం వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం
గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది.
