రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీవర్షాలు
మహారాణిపేట/కొమ్మాది: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి.
అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. మొత్తం మీద అనేక ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొంది. పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయవ్యదిశగా కదిలే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, ఒకటిరెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment