ముంచుకొస్తున్న మిచాంగ్‌ | An ongoing severe cyclone in the Bay of Bengal | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న మిచాంగ్‌

Published Sun, Dec 3 2023 3:24 AM | Last Updated on Sun, Dec 3 2023 8:56 AM

An ongoing severe cyclone in the Bay of Bengal - Sakshi

సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్‌/సాక్షి, అమలా­పురం/భీమవరం/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రేపల్లె­/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్‌)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కి.మీ., చెన్నైకి 420 కి.మీ., నెల్లూరుకు 520 కి.మీ., బాపట్లకు 620 కి.మీ., మచిలీపట్నానికి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల–­మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలు­న్నాయి. మరోవైపు తుపా­ను తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సముద్రంలో ఉష్ణోగ్రతలు, భూమి మీద ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలను బట్టి ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతు­న్నాయి. ఒకవేళ తీరం దాటితే తుపాను బలహీనపడి మళ్లీ కోనసీమ ప్రాంతంలో తిరిగి సముద్రంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత ఆదివారా­నికి వచ్చే అవకాశ­ముంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. కోస్తా జిల్లాల్లో 4, 5 తేదీల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించే అవకాశా­లున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 75 కిలో మీటర్ల  వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90, గరిష్టంగా 100 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

అదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..  కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే, 5న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, వైఎస్సార్‌ జిల్లాల్లో అక్కడక్కడా∙భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ తెలిపింది. 6న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారా­మరాజు, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. 

స్టేట్‌ ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు..
తుపాను నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్‌ ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టరేట్లు, ఆయా రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూములు ఏర్పాటుచేశారు.

తుపాను సమాచారం, హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం అందిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో 1వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు పోర్టు కన్జర్వేటర్‌ మోకా వెంకట రామారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు తిరిగి ఒడ్డుకు చేరాయన్నారు. 

తిరుపతి జిల్లాలో వర్షాలు.. కోనసీమలో బలమైన గాలులు..
మిచాంగ్‌ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌ అప్రమ్తతం చేశారు. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆదేశించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రా­లను ఏర్పాటుచేయిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి.

పలు ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో తీరం కోతకు గురవుతోంది. సముద్రంలో కలిసే మొగల ద్వారా నీరు డ్రెయిన్లలోకి వస్తోంది. ఖరీఫ్‌ కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు­చేశామని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి.

తుపానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సార్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యాన్ని మెరక ప్రాంతంలో భద్రపర్చుకోవాలని రైతులకు సూచించారు. లోతట్టు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. 

నెల్లూరులో సముద్రం అల్లకల్లోలం
తుపాను తీరం వైపు దూసుకొస్తుండడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చాలాచోట్ల దాదాపు యాభై మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, ఇందుకూరుపేట, తోటపల్లి­గూడూరు, ముత్తుకూరులలో శనివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జన జీవనం దాదా­పు స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాల­యాలు ముంపునకు గురయ్యాయి.

మరో 48 గంటల్లో బాపట్ల, నెల్లూరు మధ్య తుపాన్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక సూచనలు జారీచేశారు. జిల్లా అంతటా ఉదయం నుంచి ముసురుతో ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించడంతో కలెక్ట­రేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పని­చేసేలా ఏర్పాటు చేశారు. మత్స్యకా­రులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.

144 రైళ్లు రద్దు 
రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ)/హైదరాబాద్‌: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉండటంతో రైల్వే అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రైళ్ల కార్యకలాపాలు, ట్రాక్‌ల పటిష్టత, ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు ముందుజాగ్రత్తగా ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా నడిచే 144 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. అన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్‌లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.  

హైదరాబాద్‌ నుంచి మరికొన్ని రైళ్లు రద్దు 
తుపాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు  దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరే రైళ్లలో హైదరాబాద్‌–తాంబరం(చెన్నై), సికింద్రాబాద్‌–కొల్లాం, సికింద్రాబాద్‌–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్‌–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్‌–గూడూరు, సికింద్రాబాద్‌–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement