సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా.. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనే ఎక్కువగా పడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. అంతకుముందు డిసెంబరు నాలుగో తేదీ నుంచి తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ డిసెంబర్ రెండో తేదీ నుంచే భారీ వర్షాలు మొదలవుతాయని తాజాగా వెల్లడించింది.
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ రెండో తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని ఐఎండీ బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడెక్కడ?
తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగానూ, ఉత్తర కోస్తాలో స్వల్పంగానూ ఉండనుంది. డిసెంబర్ రెండు నుంచి ఐదో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ రెండున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో, మూడున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, నాలుగున తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, ఎన్టీఆర్, ఐదున ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
కాగా, తుపాను ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కోతలకు సిద్ధమైన వరి పంటలను సత్వరమే కోసుకోవాలని రైతులకు ఐఎండీ సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని పేర్కొంది.
తుపానుకు మిచాంగ్‌గా నామకరణం
డిసెంబర్ రెండున ఏర్పడబోయే తుపానుకు మిచాంగ్‌గా నామకరణం చేయనున్నారు. ఈ పేరును మయన్మార్ దేశం సూచించింది. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే దాని పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment