India Meteorological Department (imd)
-
వాతావరణం.. ఇక ఎంతో కచ్చితం
సాక్షి, అమరావతి: వాతావరణ పరిస్థితులను మరింత సమర్థంగా.. కచ్చితంగా అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సరికొత్తగా సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘మిషన్ మౌసం’ పేరుతో అత్యాధునిక ప్రాజెక్టును ప్రారంభించింది. పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనూహ్య వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వాతావరణ పరిస్థితులను ముందుగానే గుర్తించి.. కచ్చితమైన అంచనాలను విడుదల చేయడం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవడానికి సన్నద్ధమయ్యారు. ‘మిషన్ మౌసం’ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.2 వేల కోట్లను ఖర్చు పెట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.కచ్చితమైన అంచనా కోసం..వాతావరణ ప్రక్రియల్లో సంక్లిష్టత, పరిశీలనలు, మోడలింగ్ ప్రక్రియల్లో పరిమితుల కారణంగా ఉష్ణ మండల వాతావరణం ముందస్తుగా అంచనా వేయడం ఇబ్బందికరంగా మారింది. సమాచారం విస్తృతంగా లేకపోవడం, సంఖ్యా వాతావరణ (న్యూమరికల్ వెదర్) పరిధిలో 12 కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో స్వల్పకాలిక వాతావరణ మార్పులను అంచనా వేయడం సవాల్‌గా మారిందని వాతావరణ శాఖ భావిస్తోంది. అందువల్లే భారీ వర్షాలు, వరదలు, కరువు, మేఘాల విస్ఫోటాలు, ఉరుములు, పిడుగుపాట్లు, కుంభవృష్టి వంటి వాటిని కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యంగా మారుతోంది. ఇందుకోసమే సంఖ్యా వాతావరణ సూచనల్ని(ఎన్డడబ్ల్యూపీ–న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్) పరిధిని 6 కిలోమీటర్లకు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ‘ఫోర్కాస్ట్’ స్థానంలో ‘నౌకాస్ట్’కాగా.. గ్రామీణ ప్రాంతాలకు వాతావరణ అంచనాలను చేర్చడం మరో ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తద్వారా వ్యవసాయానికి అవసరమైన కచ్చితమైన అంచనాలు అందించాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఫోర్కాస్ట్ (ముందస్తు అంచనాలు) స్థానంలో నౌకాస్ట్ (తక్షణ అంచనాలు) వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం నౌకాస్ట్ను మూడు గంటలు ముందుగా ఇస్తుండగా.. దాన్ని ఒక గంటకు తగ్గించాలని భావిస్తున్నారు. వాతావరణ మార్పులపై సమర్థ అవగాహన, ముందస్తు అంచనాల నిర్వహణకు సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఉష్ణమండల వాతావరణ కేంద్రం (ఐఐటీఎం), మధ్యస్థ శ్రేణి వాతావరణ ముందస్తు అంచనాల కేంద్రం (ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్) కలిసి ఈ మిషన్లను అమలు చేయనున్నాయి.కృత్రిమ మేఘాల కోసం ల్యాబ్మిషన్ మౌసంలో భాగంగా కృత్రిమ మేఘాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక లేబొరేటరీని ఐఎండీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న రాడార్ల సంఖ్యను భారీగా పెంచడం, కొత్త శాటిలైట్ వ్యవస్థలు, అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్లు వంటి వాటిని సమకూర్చుకోనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ మిషన్‌ను రెండు దశల్లో చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.తొలి దశలో 70 డాప్లర్ రాడార్లు, 10 విండ్ ప్రొఫెలర్లుతొలి దశలో మార్చి 2026 నాటికి పరిశీలనాత్మక నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావిస్తున్నారు. వీటిలో దాదాపు 70 డాప్లర్ రాడార్లు, సూపర్ కంప్యూటర్లు, 10 విండ్ ప్రొఫెలర్లు, 10 రేడియో మీటర్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు 39 డాప్లర్ రాడార్లను ఐఎండీ ఏర్పాటు చేసింది. విండ్ ప్రొఫెలర్లు మాత్రం అందుబాటులో లేవు. రెండో దశలో పరిశీలనాత్మక కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు శాటిలైట్లు, విమానాలను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ.. మెటీయరాలజీ (ఐఐటీఎం)లో క్లౌడ్ చాంబర్ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాదిన్నరలో దీన్ని పూర్తి చేయనున్నారు. మధ్యస్థ శ్రేణి వాతావరణ అంచనాల కచ్చితత్వాన్ని ఐదు నుంచి పది శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్‌ను చేపట్టనున్నారు. -
కూలీల బాగే వ్యవసాయ బాగు
అనేక కారణాల వల్ల వ్యవసాయ కూలీలు ఊర్లో ఉండి పని చేసుకుని బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులు పని అవకాశాలను తగ్గించాయి. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. వ్యవసాయేతర అవసరాల కొరకు భూసేకరణ జరిగి, భూమి వినియోగం మారినప్పుడు, దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధానికి తగిన ప్రభుత్వ మద్దతు, ఉపశమనం కలిగించే పథకాలు ఉంటేనే వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది.వ్యవసాయంలో 2018–19 నాటికి సగటు రోజువారీ ఆదాయం 27 రూపాయలు మాత్రమే. ఆర్థిక సర్వే 2021–22 ప్రకారం, 2019 నాటికి వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం రూ.10,218. రైతు ఆదాయమే అంత తక్కువ ఉండగా, వ్యవసాయ కూలీ ఆదాయం అంతకంటే ఘోరంగా ఉన్నది. ఉపాధి హామీ పథకంలో సగటు రోజు కూలీ రూ.179.70 చూపించి రైతు కన్నా వాళ్లకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. పథకంలో అమలు అవుతున్న పని దినాలు చాలా తక్కువ. కూలీల వలసలు తగ్గకపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సగటు రైతు ఆర్థిక పరిస్థితే బాగాలేనప్పుడు సగటు రైతు కూలీ పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం లేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరం మొత్తం పని ఉండదు. కూలీ సరిపోక చాలా కుటుంబాలు పిల్లలను బడికి కాకుండా పనికి పంపిస్తున్నాయి. భారతదేశంలో బాల కార్మి కుల సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 1.75 నుండి 4.4 కోట్లు.అప్రకటిత నిర్లక్ష్యం2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికుల సంఖ్య 2001లో ఉన్న 23.41 కోట్ల (12.73 కోట్ల సాగు దారులు, 10.68 కోట్ల వ్యవసాయ కూలీలు) నుండి 2011లో 26.31 కోట్లకు (11.88 కోట్ల సాగుదారులు, 14.4 కోట్ల వ్యవసాయ కూలీలు) పెరిగింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 45.5 శాతం మంది 2021–22 నాటికి వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని శ్రామిక శక్తి ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 2020–21లో 46.5 శాతం ఉండగా, 2021–22 నాటికి 45.5 శాతానికి తగ్గింది. పల్లెలలో సాగుదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాలని గత 40 యేండ్ల నుంచి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కొందరు అపర మేధావులు కూడా ఉత్పాదకత పేరు మీద, ఇంకేవో లెక్కల ఆధారంగా వ్యవసాయంలో ఇంత మంది ఉండొద్దు, తగ్గించే కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వా నికి పదేపదే చెబుతుంటారు. వ్యవసాయ కూలీలను నిర్లక్ష్యం చేసే అప్రకటిత ప్రభుత్వ విధానం ఆ కోణం నుంచే వచ్చింది. రైతులు, కూలీల సంఖ్య తగ్గించాలనుకునేవారు వారికి ఇతర మార్గాల ఏర్పాటు గురించి ఆలోచనలు చేయడం లేదు.వ్యవసాయమే ఆధారంగా ఉండే పల్లెలలో వ్యవసాయం ఆదాయాన్ని బట్టి, అందులో ఉన్న మార్పులను బట్టి ఇతర వృత్తుల మీద ప్రభావం ఉంటున్నది. రోడ్లు, విమానాశ్రయం, పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరాలకు కొరకు భూసేకరణ జరిగి, భూమి ఉపయోగం మారినప్పుడు, ఆ ఊర్లో ఆ మేరకు వ్యవసాయం తగ్గుతుంది. దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. బహుళ పంటలు ఉంటే నిరంతరం పని ఉంటుంది. ఒక్కటే పంట ఉంటే విత్తనాలప్పుడు, కోతలప్పుడు తప్పితే పని ఉండదు. ఇదివరకు రైతులు పండించి కొంత తమ దగ్గర పెట్టుకుని మిగతాది మార్కెట్‌కు తరలించేవారు. ఇప్పుడు మొత్తం నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. రైసు మిల్లులు అధునాతనం అయినాక వాటి సగటు సామర్థ్యం పెరిగింది, కూలీ పని తగ్గింది. తగ్గుతున్న పనికాంట్రాక్ట్ వ్యవసాయం, యాంత్రీకరణ, రసాయనీకరణ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం డిజిటలీకరణ అంటున్నది. సబ్సిడీలు ఇచ్చి తెస్తున్న ఈ మార్పులు ఖర్చులను పెంచడంతో పాటు వ్యవ సాయ కూలీలకు పని అవకాశాలు తగ్గించాయి. కూలీ రేట్లు పెరిగి నందువల్ల కలుపును చంపే రసాయనాల వాడకం పెరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అది పెస్టిసైడ్ కంపెనీల మార్కెట్ మాయ మాత్రమే. సగటు పంట ఖర్చు పెరుగుదలలో విత్తనాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాలు వగైరా అన్ని పెరిగినాయి. వాటి ధరల మీద, నాణ్యత మీద, వాటి కొరకు అయ్యే రవాణా, ఇతర ఖర్చుల మీద రైతులకు నియంత్రణ లేదు. పట్టణవాసులు ఐస్‌క్రీమ్, సబ్బులు, సినిమా టికెట్ కొనేటప్పుడు, హోటల్ బిల్లు కట్టేటప్పుడు పెద్దగా ఆలోచించరు. కానీ, కొత్తిమీర కట్ట రేటు పెరిగితే తెగ బాధపడతారు. అట్లాగే, రైతు బయట సరుకుల రేటు, వాటి కొరకు చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తన ప్రయాణం, సరుకుల రవాణా వగైరా ఖర్చులను లెక్కలోకి తీసుకోడు. కానీ ఊర్లో ఉండే కూలీకి ఎంత ఇవ్వాలి అని మాత్రం ఆలోచిస్తాడు. కూలీ గురించి రైతుకు ఉన్న చింత బయటి నుంచి కొనుక్కొస్తున్న వాటి మీద ఉండటం లేదు. ఎందుకంటే కూలీ ఒక్కటే తన పరిధిలో ఉంటుంది.వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు సంక్షోభంలో ఉన్నాడు. వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. పాడి పశువుల పరిస్థితి భిన్నంగా లేదు. పల్లెలు మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఊర్లోకి రూపాయి రాకడ కంటే పోకడ ఎక్కువ అయినందున సగటు గ్రామీణ కుటుంబం అప్పులలో ఉన్నది. అందుకే వ్యవసాయ కూలీలు వలస పోతున్నారు. స్థానిక వ్యవసాయ కూలీలను కోల్పోతే వారి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు శారీరక శ్రమ చేయగలుగుతారేమో కానీ రైతుకు పూర్తి మద్దతు రాదు. స్థానిక వాతా వరణాన్ని బట్టి ఉండే నైపుణ్యం, జ్ఞానం, అనుభవం ఉన్న స్థానిక వ్యవసాయ కూలీలు రైతుకు అనేక రూపాలలో మద్దతు ఇవ్వ గలుగుతారు. వలస వచ్చిన కూలీలు ఆఫీసుకు వచ్చి పోతున్నట్లు వ్యవహరిస్తారు. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధా నికి తగిన ప్రభుత్వ మద్దతు, సానుకూల విధానాలు, ఉపశమనం కలిగించే పథకాలు, సంక్షేమ నిధులు ఇస్తేనే భారత వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది. లేకపోతే, మన ఆహార భద్రత ఆందోళన కలిగించకమానదు.కూలీలు కేంద్రంగా విధానంఆధునిక వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న ప్రమాదకర కీటకనాశక రసాయనాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల వ్యవ సాయ కూలీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది చనిపోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి వార్షిక ఉరుములు మెరుపుల నివేదిక (2019–2020) ప్రకారం, పిడుగుపాటు మరణాలకు ప్రధాన కారణం చెట్టు కింద నిలబడటం. ఇది మొత్తం పిడుగుపాటు మరణాలలో 71 శాతం. అత్యధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఆరు బయట పని చేస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆయా కుటుంబాలకు ఉపశమనం కల్పించటానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. 2021లో భారతదేశం ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు రూ. 27 వేల కోట్ల నష్టం అయ్యిందని ఒక అంచనా. ఇందులో వ్యవసాయ కూలీల జీవనోపాధికి వచ్చిన నష్టం కలుపలేదు. వీరిని కూడా నష్టాల అంచనాలలో, నష్ట నివారణ చర్యలలో ముఖ్యంగా పరిగణించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా చెప్పింది. ఈ సంస్థ తయారు చేసిన విధి విధానాలు భారతదేశంలో అమలు చేయడానికి ఒక జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చెయ్యాలి. జాతీయ బడ్జెట్లో దీనికి అవసరమైన కేటాయింపులు చేయాలి. వ్యవసాయ కూలీలు కేంద్రంగా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అనుకూల గ్రామీణ విధానాలు తయారు చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
హిమాచల్‌లో భారీ మంచు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 356 ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్ నుంచి ఔత్, కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది.తెల్లని వండర్‌ల్యాండ్‌గా హిమాచల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్‌ల్యాండ్‌గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్‌లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్‌లో 10, సిమ్లాలో 7, పూహ్‌లో 6, జోత్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం–ఆగ్నేయ బంగాళాఖాతంపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో 25న వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు–శ్రీలంక తీరాల వైపు వెళ్లి.. తీరం దాటనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 27 నుంచి మూడురోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయనీ.. వాయుగుండంగా బలపడిన తర్వాత గాలుల ఉద్ధృతి పెరగనుందన్నారు. 26వ తేదీ నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి గరిష్టంగా 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
సగం మంది ఇంటి నుంచే పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సీజన్లోనే అత్యంత చలిరాత్రిని చవిచూసిన ఢిల్లీవాసులు బుధవారం సైతం పొగచూరిన సూర్యోదయాన్నే ఆస్వాదించాల్సిన దుస్థితి దాపురించింది. హస్తినవాసుల చలి, వాయుకాలుష్య కష్టాలు మరింత పెరిగాయి. మంగళవారం రాత్రి 11.1 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 426గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఇంకా ‘తీవ్రం’ కేటగిరీనే కొనసాగిస్తోంది. కాలుష్యం కోరల్లో చిక్కిన ఢిల్లీలో ఇంకా జనం సొంత, ప్రజారవాణా వాహనాల్లో తిరిగితే కాలుష్యం మరింత పెరగొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. రోడ్లపై జనం రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని(వర్క్ ఫ్రమ్ హోం)చేయాలని ఆమ్ ఆద్మీ సర్కార్ సూచించింది. అయితే అత్యయక సేవల విభాగాలైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటిపారుదల, అగ్నిమాపకదళం, పోలీసులు, విద్యుత్, విపత్తు స్పందన దళం వంటి విభాగాల సిబ్బందికి ఈ వర్క్ ఫ్రమ్ హోం నిబంధన వర్తించదు.ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 80 శాఖలు, విభాగాల్లో మొత్తంగా 1.4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ‘‘ ప్రభుత్వ సిబ్బందితోపాటు పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు సైతం 50 శాతం మందిని ఇంటి నుంచే పనిచేయిస్తే మంచిది. మీ వంతుగా నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించినవారవతారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య పనివేళలను కొద్దిగా మార్చండి. దీంతో ఆఫీస్వేళల్లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కాస్తయినా మటుమాయం కావొచ్చు’’ అని ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ‘ఎక్స్’ వేదికగా కోరారు. ‘‘ ఎక్కువ మంది సిబ్బంది రాకపోకల కోసం ప్రైవేట్ సంస్థలు షటిల్ బస్సు సేవలను వినియోగించుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం సైతం గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ఇదే నియమాన్ని అమలుచేస్తోంది’’ అని రాయ్ సూచించారు. ఈ సందర్భంగా పొరుగురాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఢిల్లీ చుట్టూతా బీజేపీపాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఢిల్లీ పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మా సర్కార్ అనుసరిస్తున్న కాలుష్య నివారణ విధానాలనే మీరూ ఆచరించండి’ అని రాయ్ హితవుపలికారు.కొనసాగుతున్న గ్రేప్–4 నిబంధనకాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో సోమవారం అమలుచేసిన నాల్గవ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రేప్)ను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గ్రేప్–4 నియమాల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. స్కూళ్లను మూసేశారు. డీజిల్‌తో నడిచే మధ్యస్థాయి, భారీ రవాణా వాహనాలను ఢిల్లీలోనికి అనుమతించట్లేరు. పాఠశాల ఢిల్లీలో ఉదయం చాలా ప్రాంతాల్లో అరకిలోమీటర్లోపు ఉన్నవి కూడా కనిపించనంతగా మంచు దుప్పటి కప్పేసింది. రన్‌వే సరిగా కనిపించని కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారింది. పలు విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యం సరేసరి. చలి, తీవ్ర కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులు కళ్ల మంటలు, శ్వాస సంబంధ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాయు నాణ్యతా సూచీని గణించే ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలోనూ పరిస్థితి ఇంకా రెడ్‌జోన్‌లోనే కొనసాగుతోంది. ఆదివారం ఢిల్లీలో వాయునాణ్యత మరీ దారుణంగా పడిపోయి ‘సివియర్ ప్లస్’గా రికార్డవడం తెల్సిందే. దీంతో సోమవారం నుంచి గ్రేప్–4ను అమల్లోకి తెచ్చారు. ప్రతి ఏటా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి కాలుష్యవాయు గాఢత అలాగే కొనసాగుతుండటంతో ఢిల్లీ వాసుల వాయుకష్టాలు పెరుగుతుండటంతో 2017 ఏడాది నుంచి ఈ గ్రేప్ నిబంధనలను అమలుచేస్తున్నారు. -
నవంబర్‌లో చలి లేనట్లే!
న్యూఢిల్లీ: సాధారణంగా నవంబర్ మాసం వచి్చందంటే చలికాలం మొదలైనట్లే. చలి గాలులు గిలిగింతలు పెడుతుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబర్‌లో సాధారణంగా 25.69 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 26.92 డిగ్రీలు నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి కలిగిన అక్టోబర్‌గా రికార్డుకెక్కింది. నవంబర్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయే సూచనలు కనిపించడం లేదని మృత్యంజయ్ వివరించారు. చలి పెరగడానికి వీలుగా వాతావరణ పరిస్థితులు లేవని అన్నారు. నవంబర్‌లో చలికి వాయువ్య భారతదేశం నుంచి వీలే గాలులే కీలకమని వివరించారు. అక్కడ రుతుపవనాల ప్రభావం ఇంకా ఉండడంతో గాలులు వీచడం లేదని తెలియజేశారు. వాయువ్య భాగంలో మరో రెండు వారాలపాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు. రెండు వారాల తర్వాత మాత్రమే ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాస్తవానికి వాతావరణ విభాగం దృష్టిలో నవంబర్ నెల చలి మాసం కాదు. జనవరి, ఫిబ్రవరి మాత్రమే చలి మాసాలు. -
వరదను మించిన విపత్తు బాబే!
నీళ్లలో కొట్టుకొస్తున్న మృతదేహాలు.. నేలమట్టమైన గుడిసెలు.. బురద ముంచెత్తిన ఇళ్లు, వాకిళ్లు.. ధ్వంసమైన ఆస్తులు.. నిరాశ్రయులైన లక్షలాది ప్రజలు.. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురుచూపులు.. ఇప్పటివరకు 57 మందికిపైగా మృత్యువాత.. రోదనలతో అలసిన గుండెలు... అంతటా దైన్యం.. శూన్యం.. మానవ తప్పిదానికి విజయవాడ చెల్లించుకున్న మూల్యం ఇదీ! – సాక్షి, అమరావతి వరదకు ముందు..1 . ఐఎండీ ముందే హెచ్చరించినా.. భారీ వరదలు ముంచెత్తడం విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు హఠాత్పరిణామమే... కానీ ప్రభుత్వానికి కాదు. విజయవాడ, ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని భారత వాతావరణ శాఖ (ఐంఎండీ) గత నెల 28నే (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. శుక్రవారం, శనివారం వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్థరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. 2. హఠాత్తుగా అన్ని గేట్లు ఎత్తి... జనాన్ని ముంచేసి చంద్రబాబు సర్కారు మొద్దునిద్రతో పరిస్థితి విషమించి బుడమేరు వాగుకు భారీ వరద పోటెత్తింది. శనివారం అర్థరాత్రి దాటాక తెల్లవారు జాము సమయంలో వెలగలేరు 11 గేట్లను ఒకేసారి ఎత్తి వేశారు. గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంతాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. హఠాత్తుగా గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు గాఢనిద్రలో ఉండగానే కాలనీలు, ఇళ్లను వరద ముంచెత్తి విధ్వంసం సృష్టించింది. 3. ‘ఫ్లడ్ కుషన్’ను పాటించ లేదువరదలు వస్తాయనే అంచనా ఉన్నప్పుడు పాటించాల్సిన విధివిధానాలను ‘ఫ్లడ్ కుషన్’ పేరిట సీడబ్ల్యూసీ నిర్దేశించింది. కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల... ఇలా వరుసగా రిజర్వాయర్లలో నీటిని దిగువకు విడిచి అవసరమైన మేరకు ఖాళీగా ఉంచాలి. ఈ ‘ఫ్లడ్ కుషన్’ నిబంధనను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడమే విజయవాడలో వరద బీభత్సానికి మరో ప్రధాన కారణం. ‘ఫ్లడ్ కుషన్’ పాటించి ఉంటే మున్నేరు, బుడమేరు వరదకు కృష్ణాలో ఎగువ నుంచి వచ్చే వరద జత కలిసేది కాదు. ప్రకాశం బ్యారేజ్‌కి ఆ స్థాయిలో వరద వచ్చేది కాదు. భారీ వరద కృష్ణాలో లేకుంటే బీడీసీ నుంచి వచ్చే నీరు కృష్ణలోకి చేరేది. తద్వారా వరద విపత్తు ఉండేదే కాదు.4 .కరకట్ట బంగ్లా ముంపును కప్పిపుచ్చేందుకే.... వరద ముంచెత్తడంతో చంద్రబాబు తన కరకట్ట బంగ్లాను ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆ బంగ్లా సమీపంలోకి మీడియా ప్రతినిధులు వెళ్లకుండా కట్టడి చేశారు. తన బంగ్లా అక్రమ నిర్మాణమనే గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనన్నదే ఆందోళన మినహా వరదలను సమర్థంగా ఎదుర్కోవాలనే కనీస ధ్యాస ఆయనకు లేకుండా పోయింది.5 . 57 మందికిపైగా మృత్యువాత... అపార నష్టం వాతావరణ పరిజ్ఞానం, సమాచార–సాంకేతిక వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన తరువాత కూడా విజయవాడలో వరదలు ఇంత విధ్వంసం సృష్టించడం పట్ల యావత్ దేశం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇంతటి విపత్తుకు, విషాదానికి కారణం ఎవరంటే?.. అన్ని వేళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబునే దోషిగా చూపిస్తున్నాయి. అవును... ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం... ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడిన నేరం... దుర్మరణాలు కావవి చంద్రబాబు చేసిన హత్యలు... ఇదంతా ప్రభుత్వం సృష్టించిన విలయం. ప్రజలకు వరదలను మించిన విపత్తు చంద్రబాబేనేనది నిరి్వవాదాంశం!6 .వరద వచ్చిన తర్వాత.. వన్‌మేన్ షో.. పబ్లిసిటీ స్టంట్ఒకపక్కన వరద బాధితులు అల్లాడుతుంటే మీడియాలో ప్రచారం కోసం చంద్రబాబు చీప్ ట్రిక్స్‌కు పాల్పడ్డారు. అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించడం ముఖ్యమంత్రి బాధ్యత. చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ సహా యావత్ ఉన్నతాధికారులను తన చుట్టూ మోహరించారు. ఏదో సెమినార్ నిర్వహిస్తున్నట్టుగా దాదాపు 70 మంది ఉన్నతాధికారులను ఎదురుగా కూర్చోబెట్టి గంటల తరబడి ఉపన్యాసాలిచ్చారు. అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన బోటు ఎక్కినా... జేసీబీ ఎక్కినా... కాలి నడకన వెళ్లినా... యావత్ అధికార యంత్రాంగం పిలిస్తే పలికేంత దగ్గరలోనే ఉండాలి. ఇక చంద్రబాబు అడుగుతీసి అడుగు వేస్తే చాలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. మీడియాకు విడుదల చేస్తూ... వీడియో క్లిప్‌లతో రీల్స్ చేస్తూ పబ్లిసిటీ స్టంట్‌ను పతాకస్థాయికి చేర్చారు. దీంతో వరద బాధితులను పట్టించుకునే తీరిక, ఓపిక ఉన్నతాధికారులకు లేకుండా పోయాయి. 7 . సహాయ, పునరావాస చర్యలు శూన్యంవరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితుల కోసం శిబిరాలను ఏర్పాటు చేయలేదు. ఆరు లక్షల మంది వరదలో చిక్కుకుంటే తరలించేందుకు కనీసం 500 బోట్లను కూడా సిద్ధం చేయలేదు. బాధితులకు పట్టెడన్నం పెట్టలేదు. పాల ప్యాకెట్లు, తాగునీరు అందించలేదు. ఆరు రోజులైనా సరే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయింది. బంధువులు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయంపైనే బాధితులు ఆశ పెట్టుకున్నారు. 8 . అధికారులకు బెదిరింపులు.. ప్రతిపక్షంపై నిందలువరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ఆ తప్పును యంత్రాంగంపైకి నెట్టి వేయడంతోపాటు గత ప్రభుత్వ వైఫల్యంతోనే వరదలు వచ్చాయంటూ వితండవాదం వినిపించారు. ‘అధికారులు పని చేయడం లేదు...కొంతమంది ఉద్దేశపూర్వకంగాప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తు న్నారు... సస్పెండ్ చేస్తా... సంగతి తేలుస్తా... అంతుచూస్తా’ అంటూ మీడియా కెమెరాల ముందు హైడ్రామాకు తెరతీశారు. అసలు అధికారులను ఎక్కడ పని చేయనిచ్చారు? ‘అంతా నేనే.. ’ అనే ప్రచార యావతో బాధితులను నిండా ముంచారు. తన తప్పులు దాచిపెట్టి బుడమేరుకు గేట్లే లేవంటూ ప్రతిపక్షాన్ని తప్పుపట్టారు. సహాయ పునరావాసాలపై నిలదీసినందుకు ప్రతిపక్షంపై నిందలతో విరుచుకుపడ్డారు.9 . సచివాలయ, వలంటీర్ వ్యవస్థను పక్కనపెట్టేసి... ప్రతి 2 వేల ఇళ్లకు ఓ గ్రామ/వార్డు సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌తో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలన్న యోచనే చంద్రబాబుకు లేకుండా పోయింది. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను సద్వినియోగం చేసుకుని ఉంటే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉండేది. ఏ వీధిలో ఎంతమంది ఉన్నారు...? వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఎంతమంది? అనే పూర్తి వివరాలు తెలిసేవి. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, తాగునీరు, పాల ప్యాకెట్లు సక్రమంగా సరఫరా చేయగలిగేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దుగ్దతో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు పక్కనపెట్టేశారు. దీంతో సహాయ, పునరావాస సేవల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.10 . మళ్లీ వరదొస్తున్నా తీరుమారని ప్రభుత్వం ఓసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు...కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తుంటే అది కచ్చితంగా ప్రజలపట్ల నిర్లక్ష్యమే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అదే రీతిలో అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుందని ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే లోతట్టు ప్రాంతాలప్రజలను అప్రమత్తం చేయకుండా టీడీపీ ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. కాగా గత రెండు రోజులుగా బుడమేరకు మళ్లీ వరద వస్తున్నా కూడా లోతట్టు ప్రాంతాలవారికి కనీస సమాచారం ఇవ్వడం లేదు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యతి్నంచడం లేదు. గురువారం రాత్రి వరద పెరిగింది... అయినా సరే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయలేదు. శుక్రవారం రాత్రి కూడా వరద పెరుగుతున్నా సరే పట్టించుకోకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, బరితెగింపునకు నిదర్శమని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
సెప్టెంబర్‌లోనూ అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: ఆగస్ట్‌లో మాదిరిగానే సెప్టెంబర్‌లోనూ సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్ట్‌లో సాధారణానికి మించి 16 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపింది. అదేసమయంలో, వాయవ్య భారతంలో రికార్డు స్థాయిలో 253.9 మిల్లీమీటర్ల వర్షం పడిందని, 2001 సంవత్సరం తర్వాత ఆగస్ట్‌లో ఇంత భారీగా వానలు కురియడం ఇది రెండోసారని తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘దేశంలో ఆగస్ట్‌లో 248.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, అంతకుమించి ఈసారి ఆగస్ట్‌లో 287.1 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా, జూన్ ఒకటో తేదీన మొదలైన రుతు పవన సీజన్లో దేశంలో సాధారణంగా 701 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి ఏకంగా 749 మి.మీ. కురిసింది’అని ఆయన వివరించారు. ‘ఆగస్ట్‌లో సాధారణంగా 16.3 రోజులపాటు అల్పపీడన వాతావరణం కొనసాగుతుంది. కానీ, అంతకుమించి 17 రోజుల్లో అల్పపీడనాల ప్రభావం ఉంది. ఆగస్ట్‌లో ఏర్పడిన ఆరు అల్పపీడనాల్లో రెండింటి కారణంగా ఉత్తర, మధ్యభారతంతోపాటు తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు సహా దక్షిణ భారతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆగస్ట్ నెల మొత్తం రుతు పవనాల ప్రభావం కొనసాగింది’అని ఐఎండీ డీజీ మహాపాత్ర తెలిపారు. అయితే, హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఈ సీజన్లో అల్పపీడనాల్లో అధిక భాగం దేశ దక్షిణ ప్రాంతంపైనే కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. వాయవ్య భారతంలో అతిభారీ వర్షాలు వాయవ్య భారతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆగస్ట్‌లో మాదిరిగా∙సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని ఐఎండీ డీజీ మృత్యుంజయ వివరించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానలు పడొచ్చని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో దీర్ఘకాలం సగటు 167.9 మి.మీ. మించి వర్షాలు పడొచ్చని చెప్పారు. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల మీద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశాలున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌పై ఎక్కువగా ఉంటుంది. ఏపీపై ఎలాంటి ప్రభావం చూపదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. అదేవిధంగా.. ఉపరితల ద్రోణి కర్ణాటక, కొమొరిన్ ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమలో నేడు ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. అయితే.. వాయుగుండం తేమగాలుల్ని తీసుకుపోవడం వల్ల మరో మూడు రోజుల పాటు ఉక్కపోత కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. -
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
India Meteorological Department: ఉత్తరాదిన కుండపోత వర్షాలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భీకర వర్షం కురిసింది. ఉత్తరాదిన రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాల ధాటికి మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. వసంత్ విహార్ ప్రాంతంలో కూలిపోయిన ఓ భవనం కింద చిక్కుకున్న ముగ్గురు కార్మికుల మృతదేహాలను శనివారం వెలికి తీశారు. నగరంలో వరుసగా రెండో రోజూ భారీగా వర్షపాతం నమోదైంది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో 8.9 మిల్లీమీటర్లు, లోధీ రోడ్డులో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో 35.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాంగ్రా, కులూ, సోలన్ జిల్లాలో పలు రహదారులను మూసివేశారు. రాష్ట్రంలో ధరంపూర్లో గత 24 గంటల్లో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 2 రోజులు వాయవ్య దిశగా పయనించనుంది. ఫలితంగా వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలకు అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. -
నేడు, రేపు విస్తారంగా వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గురువారం, శుక్రవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని బుధవారం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ప్రస్తుతం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. కాగా బుధవారం అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.4 సెం.మీ, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 7.01 సెం.మీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 6.08 సెం.మీ వర్షం కురిసింది. -
మూడు రోజులు వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశి్చమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, మంగళవారం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.3 సెం.మీ.ల భారీ వర్షం కురిసింది. అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు) 5.2, సాలూరు (పార్వతీపురం మన్యం) 4.7, పెందుర్తి (విశాఖపట్న) 4.5, హరిపురం (శ్రీకాకుళం) 4.5, డి.పోలవరం (కాకినాడ) 4.1, దత్తిరాజేరు (విజయనగరం) 3.8 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు రాయలసీమలో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు స్థిరంగా కదులుతున్నాయి. గాలుల కోత, షీర్ జోన్ ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు మరఠ్వాడా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, బుధవారం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. గురువారం బాపట్ల, కోనసీమ, పశి్చమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చని పేర్కొంది. -
చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ, నెల్లూరులోకి ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం కోస్తాంధ్రలోని కృష్ణా, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల వరకు, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఆవరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. నైరుతి రుతుపవనాలు, ఆవర్తనం ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం.. శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలాగే బుధవారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.నంద్యాలలో కుంభవృష్టిరుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అనేకచోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం 3.50–4 గంటల మధ్య మొదలైన వర్షం 8.30 గంటల వరకు కురిసింది. నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎమ్మిగనూరులో 69.2 మి.మీ., నంద్యాల జిల్లా బనగానపల్లిలో అత్యధికంగా 178.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా జూన్ నెల సాధారణ వర్షపాతం 76.8 మి.మీ. కాగా.. ఒక్కరోజులోనే 56.7 మి.మీ. వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలై తెల్లవార్లూ మోస్తరు నుంచి భారీగా కురిసింది. అనంతపురం జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఏకంగా 31.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్ మండలంలో 91 మి.మీ., బెళుగుప్ప 84.2 మి.మీ., కణేకల్లు 80 మి.మీ., గుత్తి 62.6 మి.మీ. మేర భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లోనూ మోస్తరు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు ప్రవహించాయి. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 43.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. బత్తలపల్లిలో 29.2 మి.మీ., తాడిమర్రిలో 28.4 మి.మీ., గుడిబండలో 23.2 మి.మీ., రొళ్లలో 22.2 మి.మీ., ఎన్పీ కుంట 19.2 మి.మీ., కదిరిలో 18.2 మి.మీ., ధర్మవరంలో 12.4 మి.మీ., తనకల్లు మండలంలో 10.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 10 –1.2 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది. -
ప్రకృతి వికృతి
రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్‌లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు. సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం. ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్‌లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి. గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది. మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి. అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు. అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే! -
Monsoon 2024: నేడు కేరళకు నైరుతి ఆగమనం.. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికే అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఒకటి నుంచి వర్షాలు..రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి వర్షాలు కురవనున్నాయి. జూన్ ఒకటిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను, జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రోహిణి తీవ్రత లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వేళ రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడి ఎప్పట్నుంచో ఉంది. ఈ కార్తె వస్తోందంటేనే జనం బెంబేలెత్తి పోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఏప్రిల్ నుంచే మొదలవడంతో రోహిణి కార్తె ప్రవేశిస్తే ఇంకెంతలా ఉష్ణతాపం పెరిగిపోతుందోనని అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రోహిణి కార్తె ఈనెల 25న ప్రవేశించింది. ఆ సమయానికి బంగాళాఖాతంలో ‘రెమాల్’ తుపాను కొనసాగుతుండడంతో రోహిణి తీవ్రత కనిపించ లేదు. మరోవైపు రాష్ట్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన గాలిలో కొద్దిపాటి తేమ ఇంకా ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంపైకి గంటకు 30–40 కి.మీల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవి భానుడి ప్రతాపాన్ని అదుపు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటున్నాయి. వాస్తవానికి రోహిణి కార్తె రోజుల్లో ఉష్ణోగ్రతలు 42–46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. దీంతో పలు చోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి. ఇవి సాధారణంకంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికం. రానున్న మూడు రోజులు కూడా దాదాపు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగానే పెరగడం వల్ల వడగాడ్పులు గాని, తీవ్ర వడగాడ్పులు కూడా వీచే పరిస్థితులు లేవని చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, నెలాఖరు వరకు వడగాడ్పులకు ఆస్కారం లేదని వెల్లడించింది. రోహిణి కార్తె ఎండలపై భీతిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు ఇది ఊరటనివ్వనుంది. సీమలో పిడుగుల వాన.. మరోవైపు దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నెలాఖరు వరకు రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
Cyclone Remal: ఉరుములు, మెరుపులతో వర్షాలు..
-
ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళ్తున్న వాయుగుండంకు రెమల్ తుపానుగా పేరు
-
కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు భారీ వర్షాలు
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. ఆపై అది తుపానుగా మారే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై నామమాత్రంగానే ఉండనుంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ, శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేడు 26 మండలాల్లో వడగాడ్పులు..రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా మళ్లీ అక్కడక్కడ వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 1 (కూనవరం) వెరసి 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 7 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. -
అండమాన్‌కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసిన విధంగానే నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. రానున్న రెండ్రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ రుతు పవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీలోకి 2–3 తేదీల్లో ప్రవేశిస్తాయి. లా నినా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బలహీనపడ్డ ద్రోణి.. మూడ్రోజులు వర్షాలు..మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో సోమవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో మంగళవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, వీటితో పాటు గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.పెదకూరపాడులో 55 మిల్లీమీటర్ల వర్షంఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో 55.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 40 మిల్లీ మీటర్లు, జగ్గయ్యపేట 39.5, అల్లూరి జిల్లా అడ్డతీగల 38, చింతపల్లి 36, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2, అనకాపల్లి రావికమతం 35.2, అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. తుపానుగా మారనున్న అల్పపీడనం..మరోవైపు.. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
అండమాన్‌కు చేరిన నైరుతి
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలకు ఆధారమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆశావహమైన రీతిలో ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుతం ఇవి చురుకుగా ముందుకు సాగుతున్నాయని.. పరిస్థితి అనుకూలంగా ఉంటే వారం రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మరో వారం, పది రోజుల్లో తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. లానినా పరిస్థితుల నేపథ్యంలో.. గత 150 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే రుతుపవనాల రాకడ ఒకే విధంగా లేదు. 1918లో చాలా ముందుగానే అంటే మే 11వ తేదీనే నైరుతి కేరళను తాకింది. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18వ తేదీన ప్రవేశించాయి. గత ఏడాది జూన్ 8న కేరళను తాకాయి. అంతకుముందు 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ ఒకటో తేదీన నైరుతి ప్రవేశించింది. ఈసారి లానినా పరిస్థితులు ఉండటంతో సాధారణంగా కంటే ఎక్కువే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్టు ఐఎండీ గత నెలలోనే ప్రకటించింది. మన దేశంలో సాగయ్యే పంటల్లో 52 శాతానికిపైగా నైరుతి రుతుపవనాలే ఆధారం. మరో రెండు రోజులు వానలు ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం తగ్గిందని.. వచ్చే రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
వదలని వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని వడగాడ్పులు వదలడం లేదు. మండుటెండలు ప్రజలకు ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అదుపు తప్పుతూనే ఉన్నాయి. సాధారణం కంటే 3నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో వడగాడ్పులు, మరికొన్ని జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం కూడా ఇవి కొనసాగాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42–45 డిగ్రీలు రికార్డయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా డోన్, బనగానపల్లి (నంద్యాల), కొత్తవలస, జామి (విజయనగరం)లలో 44.9 డిగ్రీలు, కాజీపేట (వైఎస్సార్) 44.6, గోస్పాడు (కర్నూలు)లో 44.2, మహానంది, చీడికాడ, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, సారవకోట (శ్రీకాకుళం)లో 43.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఫలితంగా 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 84 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు, గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 109 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు మండలాల్లో 43–45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకు తేలికపాటి వర్షాలు దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని పేర్కొంది. రైల్వేలకు అలర్ట్ వడగాడ్పుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వేలను ఐఎండీ అప్రమత్తం చేసింది. వడగాడ్పుల ప్రభావం రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వీటి పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌లపైన, బోగీల్లోనూ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ప్లాట్‌ఫామ్‌లపై చల్లదనం కోసం కూల్ రూఫ్‌లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది. -
వడగాడ్పుల విజృంభణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఫలితంగా గురువారం రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కాగా.. గురువారం అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నందవరం (నంద్యాల)లో 45.6, జామి (విజయనగరం)లో 45.5, కొవిలం (శ్రీకాకుళం), కొంగలవీడు (వైఎస్సార్)ల్లో 45.4, రేణిగుంటలో, దరిమడుగు (ప్రకాశం)లో 45.3, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 84 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 120 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 39 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 215 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి గురువారం కొమరిన్ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ, అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. ఫలితంగా శుక్ర, శనివారాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. -
AP: ఆగని భగభగలు.. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3–6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దదేవళాపురం (నంద్యాల జిల్లా) 44.9, రావికమతం (అనకాపల్లి), రామభద్రపురం (విజయనగరం), దొనకొండ (ప్రకాశం), మంగనెల్లూరు (తిరుపతి)ల్లో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పు గోదావరి 2, ఎన్టీఆర్ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. ప్రకాశం 24, గుంటూరు 17, తూర్పు గోదావరి 17, పల్నాడు 16, ఎన్టీఆర్ 14, శ్రీకాకుళం 14, కృష్ణా 13, కాకినాడ 12, బాపట్ల 12, ఎస్పీఎస్సార్ నెల్లూరు 11, అల్లూరి సీతారామరాజు 11, ఏలూరు 9, తిరుపతి 7, కోనసీమ 7, అనకాపల్లి 6, విజయనగరం 5, విశాఖ పట్నం 3, పశ్చిమ గోదావరి 3 మండలాల్లోను, పార్వతీపురం మన్యం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కో మండలంలోను వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మూడురోజులు తేలికపాటి వర్షాలు మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. -
మూడు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44నుంచి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల పలుచోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొవిలంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4 ఉష్ణోగ్రత రికార్డయింది. తుమ్మికపల్లి (విజయనగరం)లో 45.2, రావికమతం (అనకాపల్లి)లో 45.1, మక్కువ (పార్వతీపురం మన్యం)లో 44.4, గోస్పాడు (నంద్యాల)లో 44.3 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. 88 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 89 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. కాగా.. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 175 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం 18, పార్వతీపురం మన్యం 12, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 15, కోనసీమ 9, తూర్పు గోదావరి 18, పశ్చిమ గోదావరి 18, ఏలూరు 13, కృష్ణా 10, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 22, బాపట్ల 2, ప్రకాశం 8, ఎస్పీఎస్సార్ నెల్లూరు 1, తిరుపతి జిల్లాలో 3 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. తీవ్ర వడగాడ్పులకు అవకాశం గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోను, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో, ఈనెల 20న అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. తీవ్ర వడగాడ్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
India Meteorological Department: ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది. వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి. గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్‌లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది. అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది. దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
మళ్లీ వడగాడ్పుల దడ
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాడ్పులు మళ్లీ దడ పుట్టించనున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అయితే.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలై వడగాడ్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి. సోమవారం నుంచి ఇవి తీవ్రరూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో ఆదివారం 35 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 139 మండలాల్లో వడగాడ్పులు, మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 113 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న మూడు రోజులు పలుచోట్ల 41నుంచి 44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. కాగా.. ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 63 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 11 మండలాల్లో తీవ్ర, మరో 129 మండలాల్లో వడగాడ్పులు, శుక్రవారం 13 మండలాల్లో తీవ్ర, 79 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గురువారం నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తాలోను, శుక్రవారం నుంచి రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు సంభవించవచ్చని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకింత వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది. చల్లని కబురు చెప్పిన స్కైమేట్ మండే ఎండలో ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. రుతుపవనాల సీజన్లో 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు “స్కైమెట్’ ఎండీ జతిన్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో వాతావరణ పోకడ లానినాగా మారుతోందని పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాల కదలికలు బలపడొచ్చని, ఫలితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. -
రాష్ట్రం నిప్పుల కుంపటి!
సాక్షి, విశాఖపట్నం: వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. మే మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేక చోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వడగాడ్పులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీలకు మించిపోగా, పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా ఆలమూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. లద్దగిరి (కర్నూలు) 44.2, మద్దూరు (వైఎస్సార్), గురజాల (పల్నాడు)ల్లో 44.1, తిప్పాయపాలెం (ప్రకాశం) 44, జి.సిగడాం (శ్రీకాకుళం) 43.8, మాడుగుల (అనకాపల్లి) 43.7, నిండ్ర (చిత్తూరు) 43.6, గుర్ల (విజయనగరం) 43.5, పెదమాండ్యం (అన్నమయ్య) 43.4, ఎం.నెల్లూరు (తిరుపతి), తలుపుల (సత్యసాయి)ల్లో 43, రెంటచింతల (పల్నాడు) 42.6 డిగ్రీలు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు మరింత తీవ్రం రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఈ సంస్థ అంచనా ప్రకారం.. శనివారం 179 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 208 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 193 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 26, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 15, అనకాపల్లి 16, అల్లూరి సీతారామరాజు 9, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పు గోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల 1, తిరుపతి 1, ప్రకాశం జిల్లాలోని 2 మండలాల్లోను తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఆ రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి ఉష్ణతాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించనుంది. -
ఈ రెండు నెలలూ అగ్నిగుండమే
సాక్షి, విశాఖపట్నం: వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అట్టుడుకించనుంది. ఈ సీజన్లో ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు అసాధారణ తాపాన్ని వెదజల్లనుంది. గత ఏడాది ఉష్ణ తీవ్రత అధికంగానే ఉంది. ఈ వేసవిలో అంతకు మించి ఎండలు, వడగాలులకు ఆస్కారం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. సాధారణంగా మే నెలలో ఎండలు మండుతాయి. ఆ నెలలోనే ఎక్కువగా వడగాలులూ వీస్తాయి. కానీ.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు విజృంభిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలాఖరు నుంచే వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాలులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాలులకు దారితీయనున్నాయి. మే నెలలో ఎన్నికల దృష్ట్యా ప్రజలు, నాయకులు వడదెబ్బ బారిన పడకుండా, మరణాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘానికి ఐఎండీ సూచించింది. అంతేకాదు.. తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏప్రిల్, మే నెలల్లో ఏయే రోజుల్లో ఉష్ణతీవ్రత, వడగాలుల ప్రభావం ఎక్కడ, ఎలా ఉంటుందో ముందుగానే తెలియజేస్తామని కూడా వెల్లడించింది. పెరగనున్న వడగాలుల రోజులు మరోవైపు రాష్ట్రంలో ఈ వేసవిలో వడగాలుల రోజులు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో వేసవి కాలంలో సగటున ఐదు రోజులు వడగాలులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ ఆఖరు వరకు వేసవి సీజన్ కొనసాగడంతో మూడు రెట్ల అధికంగా 17 రోజులు వడగాలులు/తీవ్ర వడగాలుల రోజులు నమోదయ్యాయి. 2020లో మూడు, 2021లో మూడు, 2022లో ఒక్కరోజు చొప్పున వడగాలుల రోజులు రికార్డయ్యాయి. 2019లో మాత్రం అత్యధికంగా 25 రోజులు వడగాలులు వీచాయి. ఈ ఏడాది కూడా సగటు కంటే నాలుగు రెట్లు అధికంగా వడగాలులు వీచేందుకు ఆస్కారం ఉందని ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. రాయలసీమలో ఉష్ణతీవ్రత రాష్ట్రంలో వడగాలుల ప్రభావం అప్పుడే మొదలైంది. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఉష్ణతీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మంగళవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది ఐదు డిగ్రీలు అధికం. ఇంకా వగరూర్ (కర్నూలు)లో 43.5, ఒంటిమిట్ట (వైఎస్సార్)లో 43.4, తెరన్నపల్లి (అనంతపురం), ఎం.నెల్లూరు (తిరుపతి), అనుపూర్ (నంద్యాల)లలో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. ఇంకా మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలోనూ.. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2–3 డిగ్రీలు, అక్కడక్కడ 4–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. -
ఏపీకి వడగాడ్పుల వార్నింగ్ బెల్
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేనివిధంగా నెలరోజుల ముందుగానే రాష్ట్రంలో వడగాడ్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. తొలుత ఇవి రాయలసీమతోనే మొదలుకానున్నాయి. దీని ఫలితంగా ఏప్రిల్ ఆఖరి నాటి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే నమోదు కానున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34–39 డిగ్రీలకు మించవు. కానీ, రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38–42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అంటే.. ఇవి సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. అలాగే, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలిపింది. వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంకా పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఉష్ణతాపం, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, కోస్తాంధ్రలో.. మరోవైపు.. వడగాడ్పుల ప్రభావం ఆదివారం నుంచే మొదలైంది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది. -
నేడు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు.. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించాయి. కాగా.. ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడింది. మరోవైపు పశ్చిమ విదర్భ వరకు విస్తరించిన ద్రోణి బుధవారం కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతూ ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో గురువారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం వేడితో కూడిన పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజాం (అనకాపల్లి)లో 5.9 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. చొల్లంగి (కాకినాడ)లో 5.4, జగ్గంపేట (కాకినాడ)లో 5.2, కొత్తకోట (అనకాపల్లి)లో 4.7, కిర్లంపూడి (కాకినాడ) 3.5, రాజానగరం (తూర్పు గోదావరి) 3.4, పెదగంట్యాడలో (విశాఖ) 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
అలర్ట్.. కోస్తాంధ్రలో నేడు, రేపు పిడుగులతో వానలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి కోస్తా ఒడిస్సా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.బుధవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని.. సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉన్న ద్రోణి సముద్రమట్టం నుంచి 1.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీన పడింది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేడి, ఉక్కపోతతో అసౌకర్య వాతావరణం ఉంటుందని తెలిపింది. -
హాట్.. హాట్ సమ్మర్
సాక్షి, విశాఖపట్నం:ఈ ఏడాది వేసవి దడ పుట్టించనుంది. అసాధారణ ఉష్ణోగ్రతలతో అల్లాడించనుంది. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తూ హాట్‌హాట్‌గా ఉండనుంది. రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా అదే అంచనాకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 5–8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇవి ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. అందువల్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లో వేసవికాలంలో సగటున 5–6 రోజులు వడగాడ్పులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ నాలుగో వారం వరకు సుదీర్ఘంగా వేసవి తీవ్రత కొనసాగింది. దీంతో 17 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండాకాలంలో ఉష్ణతీవ్రత కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ ‘సాక్షి’కి చెప్పారు. వేసవిలో రెండు రోజులకు మించి సాధారణం కంటే 4–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే హీట్ వేవ్స్ గాను, 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వడగాడ్పుల (హీట్ వేవ్స్)కు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం.. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం కలిగిస్తుంది. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. దీంతో పగలు (గరిష్ట), రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఎక్కువ ఉష్ణతాపం అనుభూతి కలగనుంది. ఇటీవల ముగిసిన శీతాకాలం సీజన్ కూడా అంతగా చల్లదనం లేదు. సీజన్ మొత్తమ్మీద ఒక్క రోజు కూడా కోల్డ్ వేవ్స్ (అతి శీతల పవనాలు) వీయలేదు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలకు మించి తక్కువగా నమోదు కాకపోవడంతో శీతల ప్రభావం చూపలేదు. దీని ప్రభావం కూడా ఈ వేసవిపై పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఎల్‌నినో పరిస్థితులు కూడా జూన్ ఆరంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధిక ఉష్ణతాపం, వడగాడ్పులు కొనసాగనున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎల్‌నినో ఉంటుంది. ఆ తర్వాత లానినా పరిస్థితులతో సముద్ర ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారనున్నాయి. అనంతపురంతో ఆరంభం రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల అప్పుడే మొదలైంది. వేసవి సీజన్ ఆరంభంలోనే అనంతపురంలో శనివారం 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. కర్నూలు, నంద్యాల, నందిగామ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
భయపెడుతున్న పొగమంచు.. తెలుగు రాష్ట్రాలకూ అలర్ట్
ఎముకలు కొరికే చలి దేశాన్ని గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు (Dense Fog) పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 10-11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక.. శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. మరోవైపు పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు పడాల్సి వస్తోంది. పొగమంచు దట్టంగా పేరుకుపోయి.. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీళ్లు జాగ్రత్త! ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండడంతో.. సీజనల్ డిసీజ్‌లు వ్యాపించే అవకాశాలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్లు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురవొచ్చని అంచనా వేస్తోంది. -
పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం
న్యూఢిల్లీ/బాగ్పట్: ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు వల్ల 8 మంది మృతి విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్‌గంజ్‌లో మోటార్ సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. -
‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది
సాక్షి, అమరావతి: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటింది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను క్రమంగా తుపానుగా బలహీనపడుతూ, ఉత్తర దిశలో ప్రయాణిస్తుంది. తీరం వెంబడి గంటకు 100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడి, వాహనాలు ధ్వంసం అయ్యాయి. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిపడుతున్న అలలు, భారీ వర్షాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసింది. విపత్తు నిర్వహణ శాఖ 4 కోట్ల మంది సెల్ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపింది. 25 మండలాలు, 54 గ్రామాలు, 2 పట్టణాలపై తుపాను అధిక ప్రభావం చూపింది. జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. 10 వేల మందిని పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. తుపాను సహాయ చర్యల కోసం 11 జిల్లాలకు రూ.20 వేల కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. 36 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల్లో పలు చోట్ల వరిపంట, అరటి తోటలు నేలకొరిగాయి. -
తుపాను తీవ్రరూపం!
సాక్షి, అమరావతి/సాక్షి,విశాఖపట్నం/తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి నెల్లూరు/బాపట్ల/రేపల్లె: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపాను (మిచాంగ్)గా మారింది. ఆదివారం రాత్రికి ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 330, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 440, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 450 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 8 కి.మీ.ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇదే దిశలో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర సమీపానికి చేరువవుంది. అనంతరం, ఉత్తర దిశగా తీరానికి సమాంతరంగా పయనిస్తూ సోమవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడనుంది. ఆపై అదే తీవ్రతతో మంగళవారం ఉదయం బాపట్ల–మచిలీపట్నంల మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆపై తుపాను క్రమంగా బలహీన పడుతూ ఉత్తరాంధ్ర వైపు పయనిస్తుందని తెలిపింది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, అందువల్ల ఈ నెల ఆరో తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో సోమవారం నుంచి బుధవారం వరకు గంటకు 60–70 కి.మీ.లు, గరిష్టంగా 90 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు గంటకు 90–100 కి.మీ., గరిష్టంగా 110 కి.మీ.ల వేగంతో పెనుగాలులకు ఆస్కారం ఉందని వివరించింది. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 10 సెం.మీ. వర్షం తుపాను ప్రభావంతో శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరులో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నెల్లూరు కలెక్టర్ ఎం. హరినారాయణన్ జిల్లాలో పూర్తి అప్రమత్తతను ప్రకటించారు. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు వాగులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాలుల ధాటికి విరిగిపడిన చెట్ల వల్ల 178 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎక్కడికక్కడ అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, జేసీ రోణంకి కూర్మనాథ్‌లు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోటలో 10 సెం.మీ., సూళ్లూరుపేట మండలం మన్నార్పోలురులో 8.7, నాయుడుపేట 8.2, అల్లంపాడులో 8 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా ఏర్పేడు, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టెంబేడు, పిచ్చాటూరు, రేణిగుంట, సత్యవేడు, చిత్తూరు జిల్లా నగరి, కార్వేటినగరం, నిండ్ర తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సాగరమిత్రల సిబ్బందితో ఎప్పటికప్పుడు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నిండుకుండల్లా రిజర్వాయర్లు.. తిరుపతి జిల్లాలో ఇప్పటికే మల్లెమడుగు, కాళంగి రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. పెద్దఎత్తున వీటిల్లోకి ఇన్‌ఫ్లో రావడంతో శనివారం రాత్రి నుంచి 50% గేట్లను అధికారులు ఎత్తివేశారు. అరణియార్ ప్రాజెక్టుకు వరదనీరు ఉధృతంగా రావడంతో ఆదివారం ఉదయం గేట్లు ఎత్తివేశారు. కళ్యాణి డ్యామ్ ఆదివారం అర్ధరాత్రికి నిండనుండడంతో దీని గేట్లను సైతం ఎత్తివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి మీదుగా పెళ్లకూరు, చెంబేడు వైపు నుంచి వాకాడు వరకు స్వర్ణముఖీ నది ఆదివారం ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక గస్తీ బాపట్ల తీరంలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే సముద్రం వద్దకు పర్యాటకులను పోలీనులు అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా రక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. రహదారులు, విద్యుత్ తదితర శాఖలతో సమీక్షించారు. మత్స్యకార గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాకుండా ప్రత్యేక గస్తీ ఏర్పాటుచేశారు. పడవలను సముద్రం ఒడ్డుకు చేర్చారు. ఆలలు ఎక్కువగా రావటంతో ఒడ్డునున్న పడవులు కూడా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి మరోవైపు.. తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వోలకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ ఆదేశాలు జారీచేశారు. మారుమూల ప్రాంతాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లలో సరిపడా మందులను ముందుగానే నిల్వచేసుకోవాలని సూచించారు. ఈ వారంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని, అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది హెడ్ క్వార్టర్లలో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ తుపానుపై ఆరా.. అన్ని విధాల సహకరిస్తామని హామీ సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్ర«ధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేశారు. ఏపీలో ‘మిచాంగ్’ తుపాను పరిస్థితిపై ఆయన ఆరా తీసి అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తుపాను ప్రభావిత ఎనిమిది జిల్లాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అందుకు సంబంధించిన సహాయక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదు జిల్లాలకు రెడ్అలర్ట్.. తుపాను ప్రభావం సోమవారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఇంకా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్అలెర్ట్ ప్రకటించింది. 4వ తేదీన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు... కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఇక మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ పేర్కొంది. 5వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రభుత్వం అప్రమత్తం.. పర్యవేక్షణ నిరంతరం.. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే తగిన చర్యలు చేపట్టింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తాడేపల్లిలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం తుపాను గమనం, తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్లకు సూచనలు ఇస్తున్నారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం నాలుగు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు తుపాను హెచ్చరిక సందేశాలను పంపుతున్నారు. ప్రజలకు అత్యవసర సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 ఏర్పాటుచేశారు. -
India Meteorological Department: చలి తీవ్రత ఈసారి తక్కువే
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో ఈసారి డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కాస్తంత అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈసారి డిసెంబర్లో చలి తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్–ఫిబ్రవరి సీజన్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా కాస్తంత ఎక్కువ నమోదవ్వొచ్చు. ఈసారి ఎల్‌నినో పరిస్థితులు ఉండటమూ ఇందుకు మరో ప్రధాన కారణం’’ అని విశ్లేషించింది. -
కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ తుపాను ప్రభావం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలపై ఉంటుందని చెప్పారు. మిగతా జిల్లాల్లోను ఒక మాదిరి వర్షాలు పడే అవకాశముందన్నారు. కావున అధికారులు అంతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని సీఎస్ చెప్పారు. కోతకోసి పనలపై ఉన్నవారి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో కూడా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. వివిధ నిత్యావసర సరుకులను జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని.. ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్ అండ్ బీ, విద్యుత్, టెలికం తదితర శాఖలను ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత వాతావరణ శాఖ అమరావతి డైరెక్టర్ స్టెల్లా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ హైఅలర్ట్ మరోవైపు.. మిచాంగ్ తుపానుపై విద్యుత్ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను పీడిత ప్రాంతాల్లోని మండలాల్లో 11కేవీ స్తంభాలు, లైన్లు, డీటీఆర్లు దెబ్బతింటే వాటిని పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇక తుపాను సమయంలో లైన్మెన్ నుంచి చైర్మన్ వరకు ఎవరికీ సెలవులు ఉండవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబుతో మిచాంగ్ తుపాను సంసిద్ధతపై శనివారం ఆయన సమీక్ష జరిపారు. -
ముంచుకొస్తున్న మిచాంగ్
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/సాక్షి, అమలాపురం/భీమవరం/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రేపల్లె/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కి.మీ., చెన్నైకి 420 కి.మీ., నెల్లూరుకు 520 కి.మీ., బాపట్లకు 620 కి.మీ., మచిలీపట్నానికి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరోవైపు తుపాను తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సముద్రంలో ఉష్ణోగ్రతలు, భూమి మీద ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలను బట్టి ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తీరం దాటితే తుపాను బలహీనపడి మళ్లీ కోనసీమ ప్రాంతంలో తిరిగి సముద్రంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత ఆదివారానికి వచ్చే అవకాశముంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. కోస్తా జిల్లాల్లో 4, 5 తేదీల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 75 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90, గరిష్టంగా 100 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, 5న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఎస్పీఎస్సార్ నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా∙భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ తెలిపింది. 6న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. తుపాను నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టరేట్లు, ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. తుపాను సమాచారం, హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం అందిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకట రామారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు తిరిగి ఒడ్డుకు చేరాయన్నారు. తిరుపతి జిల్లాలో వర్షాలు.. కోనసీమలో బలమైన గాలులు.. మిచాంగ్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమ్తతం చేశారు. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆదేశించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో తీరం కోతకు గురవుతోంది. సముద్రంలో కలిసే మొగల ద్వారా నీరు డ్రెయిన్లలోకి వస్తోంది. ఖరీఫ్ కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుపానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సార్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యాన్ని మెరక ప్రాంతంలో భద్రపర్చుకోవాలని రైతులకు సూచించారు. లోతట్టు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. నెల్లూరులో సముద్రం అల్లకల్లోలం తుపాను తీరం వైపు దూసుకొస్తుండడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చాలాచోట్ల దాదాపు యాభై మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరులలో శనివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జన జీవనం దాదాపు స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు ముంపునకు గురయ్యాయి. మరో 48 గంటల్లో బాపట్ల, నెల్లూరు మధ్య తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక సూచనలు జారీచేశారు. జిల్లా అంతటా ఉదయం నుంచి ముసురుతో ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. 144 రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ)/హైదరాబాద్: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉండటంతో రైల్వే అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రైళ్ల కార్యకలాపాలు, ట్రాక్‌ల పటిష్టత, ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు ముందుజాగ్రత్తగా ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా నడిచే 144 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మరికొన్ని రైళ్లు రద్దు తుపాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే రైళ్లలో హైదరాబాద్–తాంబరం(చెన్నై), సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. -
2 నుంచి ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా.. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనే ఎక్కువగా పడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. అంతకుముందు డిసెంబరు నాలుగో తేదీ నుంచి తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ డిసెంబర్ రెండో తేదీ నుంచే భారీ వర్షాలు మొదలవుతాయని తాజాగా వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ రెండో తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని ఐఎండీ బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడెక్కడ? తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగానూ, ఉత్తర కోస్తాలో స్వల్పంగానూ ఉండనుంది. డిసెంబర్ రెండు నుంచి ఐదో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ రెండున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో, మూడున తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, నాలుగున తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, ఎన్టీఆర్, ఐదున ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కాగా, తుపాను ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కోతలకు సిద్ధమైన వరి పంటలను సత్వరమే కోసుకోవాలని రైతులకు ఐఎండీ సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని పేర్కొంది. తుపానుకు మిచాంగ్‌గా నామకరణం డిసెంబర్ రెండున ఏర్పడబోయే తుపానుకు మిచాంగ్‌గా నామకరణం చేయనున్నారు. ఈ పేరును మయన్మార్ దేశం సూచించింది. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే దాని పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. -
ఏపీపై తుపాను ప్రభావం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండనుంది. మరో ఐదారు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలను కురిపించనుంది. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరువ వరకే తుపాను గమ్యాన్ని తెలిపే సైక్లోన్ ట్రాక్ పరిమితం కావడంతో ఈ నిర్ధారణకు వచ్చింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకే వాతావరణం పరిమితమవుతుందని పేర్కొంది. కానీ మంగళవారం నాటికి పరిస్థితిలో ఒకింత మార్పు కనిపించింది. సోమవారం దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా ఆ ప్రాంతంలోనే కొనసాగుతోంది. ఐఎండీ ముందస్తు నివేదిక ప్రకారం ఈ అల్పపీడనం బుధవారానికే వాయుగుండం గాను, డిసెంబర్ ఒకటిన తుపాను గాను బలపడాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఒక రోజు ఆలస్యంగా గురువారం నాటికి వాయుగుండంగా, డిసెంబర్ 2న తుపానుగా మారనుంది. ఇది కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి రాకపోయినా దాని ప్రభావం మాత్రం రాష్ట్రంపై ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫలితంగా డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా తెలిపారు. భారీ వర్షాలకు వరితో పాటు ఇతర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కోతకు వచ్చిన వరి పంటను వెనువెంటనే కోసి భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఒకవేళ తుపాను కోస్తాంధ్ర వైపు పయనిస్తే వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాలకు ఈదురుగాలులు తోడై పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొంటున్నారు. కాగా, రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
తీవ్రం కానున్న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది బుధవారం రాత్రి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తరదిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యదిశగా వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ గురువారం ఉదయానికి ఒడిశా తీరానికి, 18వ తేదీ ఉదయానికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వివరించింది. మరోవైపు ఉత్తర శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, అక్కడినుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా రెండురోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
నేడు వాయుగుండం.. రేపటికి తీవ్రం
సాక్షి, విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి కాస్త దూరంలో గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా మలుపు తిరిగి 17వ తేదీకి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించి.. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీ.లు, గరిష్టంగా 60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
15న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. మరోవైపు 14వ తేదీ నుంచి ఈశాన్య, తూర్పు గాలులు బలోపేతం కానున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతలో 15న అల్పపీడనం ఏర్పడడం, ఈశాన్య, తూర్పు గాలులు తోడవడం వంటి కారణంతో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే నెలకొంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. -
మూడు రోజులు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈశాన్య రుతుపవనాలు ఒక మోస్తరు చురుకుదనాన్ని సంతరించుకున్నాయి. వీటన్నింటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. కాగా, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. నగరి (చిత్తూరు)లో 5.5 సెం.మీ.లు, యలమంచిలి (అనకాపల్లి) 5.2, సత్తెనపల్లి (పల్నాడు) 5.1, ముతుకుల (ప్రకాశం) 4.3, బ్రాహ్మణపల్లి (ఎస్పీఎస్సార్ నెల్లూరు) 4.2, మొగులూరు (ఎన్టీఆర్) 4.1, వడమాలపేట (తిరుపతి) 3.4, చిన్నతిప్పసముద్రం (అన్నమయ్య), పెందుర్తి (విశాఖపట్నం)లో 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం (22) నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం మూడు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్తుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఈ రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా భావించే తూర్పు, ఈశాన్య గాలులు రాష్ట్రంపైకి బలంగా వీస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్ 18 – 22 తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులో ప్రవేశిస్తాయి. ఆ వెంటనే దక్షిణ కోస్తాంధ్రలోనూ ప్రభావం చూపుతాయి. దీంతో అక్కడ వర్షాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈశాన్య రుతుపవనాల ప్రారంభ దశ బలహీనంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఫలితంగా వీటి ప్రవేశ సమయంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే తప్ప భారీ వర్షాలకు ఆస్కారం ఉండదని వివరించింది. -
Andhra Pradesh: 20న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 20 నాటికి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం నివేదికలో వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈనెల 23 నుంచి రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ మచిలీపట్నం, కర్నూలు మీదుగా పయనిస్తున్నది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా ని్రష్కమించే పరిస్థితులున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకున్న వెనువెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇందుకు బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం వంటివి ఏర్పడితే మరింత అనుకూలతకు దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని చెబుతున్నారు. అనంతరం రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వీరు పేర్కొంటున్నారు. -
‘ఈశాన్యం’లో చల్లని కబురు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒకింత నిరాశపరిచిన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ ఆందోళనకు తెరదించుతూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వల్ల రాష్ట్రంలో సాధారణం కంటే ఒకింత అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా ప్రకటించింది. దీనిని బట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగనున్న ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలతో రబీ పంటలకు ఎంతో మేలు జరగనుంది. ఐఎండీ అంచనాల ప్రకారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణానికి మించి, ఉత్తర కోస్తాంధ్రలో సాధారణంగాను వర్షాలు కురవనున్నాయి. ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 20 నాటికల్లా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల మాదిరిగా ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిస్తే కుండపోత వర్షాలు కురుస్తాయని.. ఒకవేళ అధిక వర్షాలు కురవకపోయినా వర్షాభావ పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ నెలలో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, నవంబర్‌లో మాత్రం విస్తారంగా కురవనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. నైరుతి నిష్క్రమణలో జాప్యం! రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన అనంతరం ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. సాధారణంగా రాష్ట్రంలోకి ఇవి అక్టోబర్ 18–22 తేదీల మధ్య ప్రవేశిస్తాయి. ఇప్పటికే వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు సెపె్టంబర్ 25న రాజస్థాన్ నుంచి క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయి. అక్టోబర్ 15 నాటికల్లా ఇవి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. మరో రెండు రోజుల్లో ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఉపస0హరించుకుంటాయని ఐఎండీ తెలిపింది. ఈ తరుణంలో సిక్కిం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర పరిసరాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. గాలిలో తేమ తగ్గి పొడి గాలులు ఏర్పడితే ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుత ద్రోణి, ఆవర్తనాల వల్ల గాలిలో తేమ పెరిగి నైరుతి రుతుపవనాల నిష్క్రమణను ఒకింత మందగించేలా చేస్తాయని అంచనా వేస్తున్నారు. ‘నైరుతి’లో సాధారణమే కానీ.. ఐఎండీ నివేదిక ప్రకారం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ నాలుగు నెలల సమయంలో రాష్ట్రంలో 521.6 మి.మీ.కు గాను 454.6 మి.మీ. వర్షపాతం రికార్డయింది. అంటే కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ వర్షపాతం అన్నమాట. సాధారణం కంటే 20 శాతం తక్కువ కురిస్తే అది సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. రాష్ట్రంలోని కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో లోటు, కృష్ణా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతమే రికార్డయింది. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు సకాలంలో వర్షించకపోగా, కొన్ని సమయాల్లో కుండపోతగా వర్షాలను కురిపించాయి. ఆగస్టులో రుతుపవన ద్రోణి మూడు వారాలకు పైగా హిమాలయాల్లోనే తిష్ట వేసుకుని ఉండిపోయింది. ఫలితంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడక వర్షాలు కురవకుండా పోయాయి. -
ఎల్‌నినో ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ మొత్తమ్మీద సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ ముగిసిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. నాలుగు నెలల వర్షాకాలంలో దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, ఈసారి ఎల్‌నినో పరిస్థితులను నిలువరించే సానుకూల కారకాల ప్రభావంతో 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది 94.4 శాతమని ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 94–106 శాతం మధ్య నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల్లో అస్థిరత ఏర్పడినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం మీడియాతో అన్నారు. దేశంలోని 36 వాతావరణ సబ్ డివిజన్లకుగాను మూడింటిలో అధిక వర్షపాతం, 26 సబ్ డివిజన్లలో సాధారణ, ఏడింట్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, జార్ఖండ్, బెంగాల్, బిహార్, యూపీలో కొంత భాగం, కర్ణాటక దక్షిణ ప్రాంతం, కేరళ ఉన్నాయన్నారు. అదేవిధంగా, దక్షిణాది రాష్ట్రాల్లో 8% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు (హిందూ మహా సముద్రం డైపోల్), గాల్లో మేఘాలు, వర్షాలు తూర్పు దిశగా కదిలే తీరు(మాడెన్–జులియన్ ఆసిలేషన్) ఈ దఫా రుతుపవనాలను ప్రభావితం చేశాయని మహాపాత్ర విశ్లేషించారు. ఈ రెండు పరిస్థితులు ఎన్ నినో ప్రభావాన్ని తగ్గించాయని వివరించారు. నైరుతి రుతు పవనాల సమయంలో ఏటా సాధారణంగా 13 వరకు అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి, ఈసారి 15 అల్ప పీడనాలు ఏర్పడినప్పటికీ వాటి వృద్ధి సక్రమంగా లేదన్నారు. ఎల్‌నినో కారణంగానే 1901 తర్వాత అత్యంత వేడి మాసంగా ఈ ఏడాది ఆగస్ట్ రికార్డు సృష్టించిందన్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈసారి 8 రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 25వ తేదీన పశ్చిమ రాజస్తాన్ నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. -
భారీ వర్షం.. హైదరాబాద్ అతలాకుతలం..
-
‘నైరుతి’ నిష్క్రమణ షురూ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమవుతోంది. సాధారణంగా సెప్టెంబర్ మూడో వారం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలై అక్టోబర్ రెండో వారం నాటికి పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది నైరుతి రాక ఆలస్యమైంది. జూన్ నాలుగో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు మందకొడిగానే కదలడం వల్ల సాదాసీదా వర్షాలే పడ్డాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం రాజస్తాన్‌లో ప్రారంభమవగా వచ్చే నెల 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భారత వాతావరణ విభాగం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ వర్షాలతోనే సగటును దాటి... ఈసారి నైరుతి సీజన్లో రాష్ట్రంలో కేవలం నాలుగు అల్పపీడనాలే ఏర్పడ్డాయి. అవి కూడా స్వల్పంగానే ప్రభావం చూపడంతో భారీ వర్షాలు నమోదు కాలేదు. వాయుగుండాలు, తుపానులు ఏర్పడితే సమృద్ధిగా వానలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో ఒక్క వాయుగుండం లేదా తుపాను కూడా ఏర్పడలేదు. దీంతో రాష్ట్రంలో ఈ సీజన్ సాధారణ వర్షాలతోనే ముగుస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో భాగంగా ఈ నెల 25 నాటికి 71.73 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 84.01 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 17 శాతం అధికంగా వర్షాలు కురిసినప్పటికీ అతితక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడంతో డ్రైస్పెల్స్ (వర్షాల మధ్య అంతరం) ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలోనూ వర్షాలు నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలకు ఆస్కారం ఉంటుందని... రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటే భారీ వార్షాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలా తిరోగమనంలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో మరింత సమృద్ధిగా వర్షపాతం గణాంకాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. తిరగమన ప్రభావం వచ్చే నెల 15 వరకు ఉంటుందని, అప్పటివరకు వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
India Meteorological Department: 25 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ నెల 25వ తేదీ తర్వాత వాయవ్య భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశంలో వర్షాలు తగ్గిపోతాయని తెలియజేసింది. పశి్చమ రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనానికి అనువుగా పరిస్థితులు మారుతున్నాయని పేర్కొంది. ఈ రుతుపవనాలతో సాధారణంగా 832.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, ఈసారి 780.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. -
కొనసాగుతున్న అల్పపీడనం.. రెండ్రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందీనికి అనుబంధంగా సముద్ర మట్టానిక7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌లోని జైసల్మేర్ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గురువారంకి పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ప్రస్తుత అల్పపీడన ప్రాంతం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వెళ్తోంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. -
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి ఉపరితల ఆవర్తనం ప్రాంతం వరకు మరో ద్రోణి పయనిస్తోంది. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణకోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరకోస్తాలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవవచ్చని పేర్కొంది. కోస్తాంధ్రలో గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో రానున్న రెండు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నిన్నటి కుండపోత నుంచి నగరవాసులు ఇంకా తేరుకోలేదు. ఈలోపు మళ్లీ వర్షం కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్లో పురాతన భవనం కూలిపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు. మొత్తమ్మీద మంగళవారం రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. Moderate - Heavy downpours expected today in North, Central, East Telangana today and light - moderate rains ahead in South Telangana Moderate rains expected in Hyderabad city today but yesterday type huge rains not expected — Telangana Weatherman (@balaji25_t) September 6, 2023 జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు సికింద్రాబాద్ జోన్లో పలు చోట్ల నీరు నిలిచిన ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం ఉదయం పరిశీలించారు. నీరు వెంటనే తొలగించాలని, మ్యాన్ హోల్స్ వద్ద మట్టి, చెత్తచెదారాన్ని వెంటవెంటనే తీసేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. మయూర మార్గ్ అల్లం తోట బావి, ద్వారక దాస్ నగర్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, యస్ పి రోడ్డు పెట్రోల్ పంప్, అల్లాగడ్డ బావి రైల్వే అండర్ బ్రిడ్జి, లాలా పేట్ సత్య నగర్ లలో నాలాలను సైతం ఆయన పరిశీలించారు. -
నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ఉత్తర–దక్షిణ ద్రోణి బలహీనపడింది. మరోవైపు దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో అనేకచోట్ల, ఆదివారం కొన్నిచోట్ల, రాయలసీమలో శని, ఆదివారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. కాగా.. శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా వెలివాడలో 9.8 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 8.5, సంతబొమ్మాళిలో 7.9, గరికిపాలెంలో 7.1, తులుగులో 6.8, ఎచ్చెర్లలో 6.3, గొట్టా బ్యారేజి (శ్రీకాకుళం) వద్ద 6.1, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 6.2, విజయనగరంలో 5.3, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 4.6, ఆనందపురంలో 4.1 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. -
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో.. తెలంగాణలో రెండు రోజులపాటు భారీవర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది. @balaji25_t sirpur Kaghaznagar today morning 9.30 am. pic.twitter.com/trKHQyrWPb — SIDDIQUI (@siddiquiindia) August 19, 2023 వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుకుగా ఉంది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Heavy rain in jagtial district pic.twitter.com/x1q6Mlkzaz — Laxman Thota (@LaxmanPatels1) August 19, 2023 భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్‌లను నిర్వహించి.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మొన్నటి వర్షాలు, వరదల సమయంలో కలిగిన భారీ ప్రాణ-ఆస్తి నష్టం, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో అధికార యంత్రాంగ వైఫల్యంపై తెలంగాణ హైకోర్టు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం.. వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెంలో అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్‌లోనూ ఓ మోస్తరు వాన కురిసింది. ఇదీ చదవండి: కేసీఆర్‌కు నేనంటే భయం! -
వానలుండవ్! అప్పటివరకు ఉష్ణతాపమే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానల కోసం కొన్నాళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మారిన వాతావరణం నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. కొద్దిరోజుల నుంచి రాష్ట్రంపైకి పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ కూడా తక్కువగా ఉంటోంది. అలాగే బంగాళాఖాతంలో గాని, భూ ఉపరితలంలో గాని ఆవర్తనాలు/ద్రోణులు ఏర్పడటం లేదు. వర్షాలు కురవడం లేదు. అంతేకాదు.. మేఘాల జాడ కనిపించడం లేదు. వీటన్నిటి ఫలితంగా గాలిలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతోంది. దీనికి పశ్చిమ/వాయవ్య గాలులు తోడై ఉష్ణతాపానికి, అసౌకర్య వాతావరణానికి కారణమవుతోంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకు వెళ్తున్నాయి. బుధవారం పల్నాడు జిల్లా శావల్యాపురంలో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. కావలిలో 39.1, బాపట్లలో 39, ఒంగోలులో 38.9, విశాఖపట్నంలో 38 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని, వర్షాలకు ఆస్కారం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా కురిసినా తేలికపాటి వర్షం లేదా చిరు జల్లులకే పరిమితమవుతుందని పేర్కొంటున్నారు. అల్పపీడనాలు ఇప్పట్లో లేనట్టే.. సాధారణంగా ఆగస్టు ఆరంభం నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ప్రభావం చూపుతుంటాయి. వాటికి ద్రోణులు, ఆవర్తనాలు తోడై ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ.. ఇప్పటివరకు వాటి జాడ లేదు. దీంతో వానలు ముఖం చాటేశాయి. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ముందస్తు అంచనాల్లో స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
తీవ్ర వాయుగుండం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం మధ్యాహ్ననికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి సాయంత్రం 3.30–4.30 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా వద్ద తీరాన్ని దాటింది. ఆపై ఈ వాయుగుండం మళ్లీ పశ్చిమ బెంగాల్లో తీరంలోని దిఘా సమీపంలోకి ప్రవేశించి కోల్‌కతాకు తూర్పున 120 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ గురువారం నాటికి బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి బులెటిన్‌లో తెలిపింది. చదవండి: విశాఖలో కారు బీభత్సం.. మద్యం మత్తులో మహిళ రాష్ డ్రైవింగ్ మరోవైపు రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. -
ఆగస్ట్–సెప్టెంబర్ నెలల్లో సాధారణ వర్షాలు: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వర్షాకాలం రెండో అర్ధభాగం(ఆగస్ట్–సెప్టెంబర్)లో సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. జూలైలో దేశవ్యాప్తంగా అధిక వర్షాలు నమోదయ్యాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో పరిస్థితులు ప్రభావితం చేయలేకపోయాయని తెలిపింది. ఆగస్ట్, సెప్టెంబరు నెలల్లో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేసినప్పటికీ, సాధారణ (422.8 మిల్లీమీటర్ల కంటే తక్కువగా (94 శాతం నుంచి 99 శాతం) కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మీడియాతో అన్నారు. జూన్‌లో సాధారణం కంటే 9% లోటు వర్షపాతం నమోదవగా, జూలై వచ్చే సరికి 13% అదనంగా వానలు పడ్డాయని చెప్పారు. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో 1901 తర్వాత మొదటిసారిగా అత్యల్ప వర్షపాతం 280.9 మిల్లీమీటర్లు నమోదైందని చెప్పారు. గత అయిదేళ్లలోనే అత్యధికంగా ఈసారి 1,113 భారీ వర్షపాతం ఘటనలు, 205 అత్యంత భారీ వర్షపాతం ఘటనలు జూలైలో నమోదయ్యాయని చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. పలు జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
-
ఉత్తర ఒడిశాపై అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిల వరకు విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ఇది రెండురోజుల్లో జార్ఖండ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించనుంది. మరోవైపు సగటు సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంతం కేంద్రం.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు ఆనుకుని ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది ఆ మరుసటి రోజుకి అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారనుంది. తరువాత ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం రెండురోజుల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా మధ్య భారతదేశం వైపు వెళ్లనుంది. ఫలితంగా రుతుపవన ద్రోణి చురుకుదనం సంతరించుకోనుంది. దీంతో ఈనెల 18 నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమ మినహా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీవర్షాలకు ఆస్కారం ఉంది. -
ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
-
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్‌లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
IMD Alert: మూడు రోజులు వానలు.. వర్షం కురిసే జిల్లాలివే..
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నేడు వానలు కురిసే జిల్లాలు మంగళవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎక్కడెక్కడ కురుస్తాయంటే.. బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉంది. మూడో రోజు మోస్తరు వర్షాలు గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏఎస్ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా.. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 9.3, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 8.2, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 8.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో అమర్నాథ్ యాత్ర మూడు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం వల్ల పంజ్తరణి, శేష్నాగ్ బేస్‌క్యాంపుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు ఆదివారం మంచు శివలింగ దర్శనానికి తరలివెళ్లారు. భారీ వర్షాలకుతోడు కొండ చరియలు విరిగిపడుతుండడంతో అమర్నాథ్ యాత్రను అధికారులు మూడు రోజుల క్రితం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పవిత్ర గుహ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను అనుమతించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను అనుమతించడం లేదు. జమ్మూకశ్మీర్‌లో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్లో మంచు సైతం కురిసింది. సోమవారం నుంచి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ వాసి దుర్మరణం రాజాం సిటీ(ఆంధ్రప్రదేశ్): ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవి రావు మృతి చెందారు. బొద్దాం గ్రామానికి చెందిన రవి రావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఐదు నెలల క్రితమే వివాహమైంది. భార్య కల్యాణితో కలిసి వారం క్రితం కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో రవి రావు ప్రాణాలు కోల్పోయారు. కల్యాణితో పాటు మరికొందరిని సహాయక సిబ్బంది రక్షించారు. -
ఏపీకి అలర్ట్.. మరో 3 రోజులు వర్షాలు..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం మధ్య బంగాళాఖాతం వైపునకు కదలింది. దీని ప్రభావంతో మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. బుధవారం విజయనగరం జిల్లా సారధిలో 9.8 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. చదవండి: దిగివచ్చిన కేంద్రం.. ఫలించిన సీఎం జగన్ ఒత్తిడి -
Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, విజయనగరం, కాకినాడ జిల్లాల్లో సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నాతవరంలో 8.8, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 8.5 సెంటీమీటర్ల వర్షం పడింది. రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, వర్షాలు పడుతున్నా వేడి వాతావరణం ఉంటుందని వివరించింది. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! -
62 ఏళ్ల తర్వాత..!
న్యూఢిల్లీ/ముంబై: దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలను 62 ఏళ్ల తర్వాత రుతుపవనాలు ఒకేసారి ఆదివారం తాకాయి. రెండు నగరాలపైకి ఇలా ఒకేసారి వ్యాపించడం 1961 జూన్ 21వ తేదీ తర్వాత ఇదే మొదటిసారని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీకి ముందుగా ఊహించిన దాని కంటే రెండు రోజులు ముందు రాగా, ముంబైకి మాత్రం రెండు వారాలు ఆలస్యంగా చేరుకున్నాయని వివరించింది. హరియాణా, చండీగఢ్, ఢిల్లీలపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. రుతుపవనాలు మహారాష్ట్రలోని మిగతాప్రాంతాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌వైపు కదులుతున్నాయని వివరించింది. రానున్న రెండు రోజుల్లో మిగతా ప్రాంతాలకూ విస్తరించేందుకు అనువైన పరిస్థితులున్నాయని తెలిపింది. సాధారణంగా రుతు పవనాలు కేరళను జూన్ 1న, ముంబైని జూన్ 11న, ఢిల్లీని జూన్ 27న తాకుతాయి. -
నేడు అల్పపీడనం.. మూడు రోజులు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని, ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. -
సగం రాష్ట్రాలకు వడగాల్పుల వెతలు
న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్అలర్ట్ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్‌లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్‌గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే. ► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్‌లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి. ► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి. ► పశ్చిమబెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్‌లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి. ► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి. ► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి. ► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు. ► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు.