సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒకింత నిరాశపరిచిన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ ఆందోళనకు తెరదించుతూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వల్ల రాష్ట్రంలో సాధారణం కంటే ఒకింత అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా ప్రకటించింది. దీనిని బట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగనున్న ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో కురిసే వర్షాలతో రబీ పంటలకు ఎంతో మేలు జరగనుంది.
ఐఎండీ అంచనాల ప్రకారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణానికి మించి, ఉత్తర కోస్తాంధ్రలో సాధారణంగాను వర్షాలు కురవనున్నాయి. ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 20 నాటికల్లా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నైరుతి రుతుపవనాల మాదిరిగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో కురిస్తే కుండపోత వర్షాలు కురుస్తాయని.. ఒకవేళ అధిక వర్షాలు కురవకపోయినా వర్షాభావ పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ నెలలో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, నవంబర్‌లో మాత్రం విస్తారంగా కురవనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
నైరుతి నిష్క్రమణలో జాప్యం!
రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన అనంతరం ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. సాధారణంగా రాష్ట్రంలోకి ఇవి అక్టోబర్ 18–22 తేదీల మధ్య ప్రవేశిస్తాయి. ఇప్పటికే వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు సెపె్టంబర్ 25న రాజస్థాన్ నుంచి క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయి. అక్టోబర్ 15 నాటికల్లా ఇవి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. మరో రెండు రోజుల్లో ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఉపస0హరించుకుంటాయని ఐఎండీ తెలిపింది.
ఈ తరుణంలో సిక్కిం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర పరిసరాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. గాలిలో తేమ తగ్గి పొడి గాలులు ఏర్పడితే ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుత ద్రోణి, ఆవర్తనాల వల్ల గాలిలో తేమ పెరిగి నైరుతి రుతుపవనాల నిష్క్రమణను ఒకింత మందగించేలా చేస్తాయని అంచనా వేస్తున్నారు.
‘నైరుతి’లో సాధారణమే కానీ..
ఐఎండీ నివేదిక ప్రకారం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ నాలుగు నెలల సమయంలో రాష్ట్రంలో 521.6 మి.మీ.కు గాను 454.6 మి.మీ. వర్షపాతం రికార్డయింది. అంటే కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ వర్షపాతం అన్నమాట. సాధారణం కంటే 20 శాతం తక్కువ కురిస్తే అది సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు.
రాష్ట్రంలోని కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో లోటు, కృష్ణా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతమే రికార్డయింది. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు సకాలంలో వర్షించకపోగా, కొన్ని సమయాల్లో కుండపోతగా వర్షాలను కురిపించాయి. ఆగస్టులో రుతుపవన ద్రోణి మూడు వారాలకు పైగా హిమాలయాల్లోనే తిష్ట వేసుకుని ఉండిపోయింది. ఫలితంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడక వర్షాలు కురవకుండా పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment