Northeast monsoon
-
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. రాబోయే రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.ఇది దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు చేరుతుందని.. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలవైపు చేరే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.నేడు వర్షం కురిసే జిల్లాలుఅల్పపీడనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.16న భారీ వర్షాలుదీని ప్రభావం వల్ల బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.17న వర్షాలు కురిసే జిల్లాలు17వ తేదీన గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కలెక్టర్లకు సీఎస్ సూచనలుభారీ వర్షాల హెచ్చరికలతో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ సోమవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో కలిసి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండరాదన్నారు. పాత భవనాలను వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఏపీకి మళ్లీ తుఫాను ముప్పు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైన క్రమంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాస్తవానికి ఏటా అక్టోబర్ 20న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతుంటాయి. ఈసారి చురుగ్గా ముందుకు కదులుతుండటంతో.. 15 నాటికి దక్షిణ కోస్తాలోకి వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు జోరందుకోనున్నాయని వెల్లడించారు. మరోవైపు.. దక్షిణ బంగాళాఖాతంలో ఈనెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 16 నాటికి బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే.. దీని ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉండే సూచనలున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయనీ.. అదేవిధంగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. -
వర్షాలకు ఇక విరామం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి మరికొద్ది రోజుల్లోనే ఈశాన్య రుతుపవనాలు ఉపసంహరించుకోనున్నాయి. ఈనెల 15కల్లా వీటి సీజను పూర్తిగా ముగియనుంది. దీంతో వర్షాలకు విరామం దొరకనుంది. ఫలితంగా కొద్దిరోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగనుంది. నిజానికి.. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సీజనుగా పరిగణిస్తారు. ఏటా అక్టోబరు 18–22 తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రెండుమూడ్రోజుల్లో రాష్ట్రంలోకి విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు నిర్ణీత సమయాని కంటే వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. కానీ, అరకొర వర్షాలను మాత్రమే కురిపించాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడునెలల్లో రాష్ట్రంలో 287.2 మి.మీల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 219 మి.మీల వర్షపాతం మాత్రమే రికార్డయింది. అంటే.. సాధారణం కంటే 24 శాతం తక్కువ వర్షం కురిసిందన్న మాట. కోస్తాంధ్ర కంటే రాయలసీమలో మరింత తక్కువ వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 18 శాతం (322.9 మి.మీలకు గాను 265.8 మి.మీలు), రాయలసీమలో 30 శాతం (236.4కి 164.7 మి.మీలు) చొప్పున లోటు వర్షపాతం రికార్డయింది. ఈ సీజనులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఏలూరు జిల్లాలో 42 శాతం అధిక వర్షపాతం కురవగా, అత్యల్పంగా నంద్యాల జిల్లాలో 89 శాతం లోటు వర్షపాతం కురిసింది. ఇక కోస్తాంధ్రలోని 18 జిల్లాలకు గాను అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బీఆర్ ఆంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, ఏలూరు, కృష్ణా, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఒక్క తిరుపతి మినహా మిగిలి ఏడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే రికార్డయింది. రాక.. పోక ఆలస్యమే.. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ఆగమనం, తిరోగమనం (నిష్క్రమణ) కూడా ఆలస్యంగానే జరగడం విశేషం. ఈశాన్య రుతుపవనాల సీజను డిసెంబర్ ఆఖరుతో ముగియాల్సి ఉన్నా జనవరిలోనూ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయానికి దాదాపు పక్షం రోజులు ఆలస్యంగా ఈ రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో.. ఈనెల 15 తేదీ నాటికి ఈశాన్య రుతుపవనాలు ఉపసంహరణతో అవి బలహీనపడతాయని, ఫలితంగా రాష్ట్రంలో ఇప్పట్లో వర్షాలు కురవవని భారత వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. కొనసాగనున్న మంచు, చలి.. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పొగమంచు, చలి కొనసాగనుంది. సాధారణం కంటే కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, చలి తీవ్రత అంతగా ఉండదని.. పొగ మంచు ప్రభావం మాత్రం ఉంటుందన్నారు. -
ఈనెలా అరకొర వానలే!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమై దాదాపు పది రోజులవుతోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురవాల్సి ఉంది. కానీ వాటి జాడ కనిపించకుండా పోతోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్–సెపె్టంబర్) కూడా రాష్ట్రంపై మిశ్రమ ప్రభావాన్ని చూపింది. కొన్ని ప్రాంతాల్లో సంతృప్తికరంగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ సీజనులో 521.6 మి.మీలకు గాను 454.6 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ కురిసిందన్న మాట. సెప్టెంబర్ లోనూ 16 శాతం తక్కువగా సాధారణ వర్షపాతం (20 శాతం కంటే తక్కువ నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు) రికార్డయింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే అక్టోబర్‌లో వర్షాలు మరింతగా ముఖం చాటేశాయి. ఈ నెలలో ఏకంగా 90 శాతం భారీ లోటు నమోదైంది. అక్టోబర్ 1 నుంచి 31 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 99 శాతం లోటుతో కర్నూలు జిల్లా అట్టడుగున నిలిచింది. ఆ జిల్లాలో అక్టోబర్‌లో 112.2 మి.మీలు కురవాల్సి ఉండగా కేవలం 0.1 మి.మీలు మాత్రమే కురిసింది. ఈశాన్య రుతుపవనాల ఆగమనం వేళ (అక్టోబర్ మూడో వారం) బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను వాటి చురుకుదనానికి బ్రేకు వేసింది. గాలిలో తేమను ఆ తుపాను బంగ్లాదేశ్ వైపు లాక్కుని పోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా మారాయి. అప్పట్నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోలేక వర్షాలు కురవడం లేదు. నవంబర్లోనూ అంతంతే.. సాధారణంగా రాష్ట్రంలో నవంబర్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ నెలలోనూ ఆశించిన స్థాయిలో వానలు కురిసే పరిస్థితుల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. నవంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సగటున సాధారణ వర్షపాతం నమోదవుతుందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధారణంకంటే తక్కువ వర్షపాతం రికార్డవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. వచ్చే మూడు రోజులు వానలు.. తాజాగా గురువారం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో విస్తరించి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌పైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈనెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
చినుకు చుక్క రాలలేదు!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ సెపె్టంబర్‌తో ముగిసినప్పటికీ.. రుతుపవనాల నిష్క్రమణ సమయమైన అక్టోబర్‌లో వర్షాల నమోదుకు బాగానే అవకాశాలుంటాయి. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే అక్టోబర్‌లో సాధారణం నుంచి రెట్టింపు స్థాయిలో వర్షాలు కురవగా.. ప్రస్తుత అక్టోబర్‌లో మాత్రం తీవ్ర వర్షాభావం నెలకొంది. 8.8 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను, నెల పూర్తయ్యే నాటికి కేవలం 0.53 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. హైదరాబాద్‌లో అయితే.. వర్షం పడనేలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు నమోదవుతాయని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించగా, సాధారణానికి కాస్త ఎక్కువగానే సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో రాష్ట్ర సగటు 73.8 సెంటీమీటర్లు ఉండగా ఈసారి 86.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కానీ మండలాలను యూనిట్‌గా తీసుకుంటే మాత్రం చాలాచోట్ల లోటు వర్షపాతమే నమోదైంది. అక్టోబర్‌లో నైరుతి నిష్క్రమణతో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో నెలకొనే వాతావరణ పరిస్థితులతో సాధారణంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా తీవ్ర వర్షాభావమే నమోదయ్యింది. ‘ఈశాన్య’సీజన్ మొదలైనా.. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల సీజన్ కొనసాగు తోంది. రాష్ట్రంలో నైరుతి, ఈశాన్య సీజన్లో జూన్ నెల నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 82.92 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 86.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపా తం నమోదైనప్పటికీ పలు జిల్లాల్లో లోటు వర్షపా తం ఉంది. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా..మరో 21 జిల్లాల్లో సాధారణం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇక నవంబర్ నెలలోనూ అక్టోబర్ మాదిరి వర్షాభావ పరిస్థితులే ఉంటాయని ఐంఎండీ తాజాగా వెల్లడించింది. ఈ నెలలో కేవలం ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాదిన కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నవంబర్‌లో రాష్ట్రంలో 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పతనమై చలి తీవ్రత పెరగాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం (22) నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం మూడు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్తుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఈ రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా భావించే తూర్పు, ఈశాన్య గాలులు రాష్ట్రంపైకి బలంగా వీస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్ 18 – 22 తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులో ప్రవేశిస్తాయి. ఆ వెంటనే దక్షిణ కోస్తాంధ్రలోనూ ప్రభావం చూపుతాయి. దీంతో అక్కడ వర్షాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈశాన్య రుతుపవనాల ప్రారంభ దశ బలహీనంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఫలితంగా వీటి ప్రవేశ సమయంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే తప్ప భారీ వర్షాలకు ఆస్కారం ఉండదని వివరించింది. -
‘ఈశాన్యం’లో చల్లని కబురు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒకింత నిరాశపరిచిన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ ఆందోళనకు తెరదించుతూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వల్ల రాష్ట్రంలో సాధారణం కంటే ఒకింత అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా ప్రకటించింది. దీనిని బట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగనున్న ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలతో రబీ పంటలకు ఎంతో మేలు జరగనుంది. ఐఎండీ అంచనాల ప్రకారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణానికి మించి, ఉత్తర కోస్తాంధ్రలో సాధారణంగాను వర్షాలు కురవనున్నాయి. ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 20 నాటికల్లా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల మాదిరిగా ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిస్తే కుండపోత వర్షాలు కురుస్తాయని.. ఒకవేళ అధిక వర్షాలు కురవకపోయినా వర్షాభావ పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ నెలలో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, నవంబర్‌లో మాత్రం విస్తారంగా కురవనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. నైరుతి నిష్క్రమణలో జాప్యం! రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన అనంతరం ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. సాధారణంగా రాష్ట్రంలోకి ఇవి అక్టోబర్ 18–22 తేదీల మధ్య ప్రవేశిస్తాయి. ఇప్పటికే వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు సెపె్టంబర్ 25న రాజస్థాన్ నుంచి క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయి. అక్టోబర్ 15 నాటికల్లా ఇవి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. మరో రెండు రోజుల్లో ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఉపస0హరించుకుంటాయని ఐఎండీ తెలిపింది. ఈ తరుణంలో సిక్కిం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర పరిసరాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. గాలిలో తేమ తగ్గి పొడి గాలులు ఏర్పడితే ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుత ద్రోణి, ఆవర్తనాల వల్ల గాలిలో తేమ పెరిగి నైరుతి రుతుపవనాల నిష్క్రమణను ఒకింత మందగించేలా చేస్తాయని అంచనా వేస్తున్నారు. ‘నైరుతి’లో సాధారణమే కానీ.. ఐఎండీ నివేదిక ప్రకారం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ నాలుగు నెలల సమయంలో రాష్ట్రంలో 521.6 మి.మీ.కు గాను 454.6 మి.మీ. వర్షపాతం రికార్డయింది. అంటే కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ వర్షపాతం అన్నమాట. సాధారణం కంటే 20 శాతం తక్కువ కురిస్తే అది సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. రాష్ట్రంలోని కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో లోటు, కృష్ణా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతమే రికార్డయింది. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు సకాలంలో వర్షించకపోగా, కొన్ని సమయాల్లో కుండపోతగా వర్షాలను కురిపించాయి. ఆగస్టులో రుతుపవన ద్రోణి మూడు వారాలకు పైగా హిమాలయాల్లోనే తిష్ట వేసుకుని ఉండిపోయింది. ఫలితంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడక వర్షాలు కురవకుండా పోయాయి. -
కొనసాగుతున్న వర్ష బీభత్సం .. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై మహానగరంలో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు, సబ్‌వేలు వరద నీటిలో నిండిపోయాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో నగరంలో అత్యవసర చర్యలు చేపట్టాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూం సిబ్బంది నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. బాధితులకు అండగా ఉండాలని సూచించారు. చెన్నై కార్పొరేషన్ సిబ్బంది అనేక ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని భారీ మోటార్ల ద్వారా నగరం బయటకు పంపిస్తున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు బుధవారం కూడా బీభత్సం సృష్టించాడు. ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 14 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ వర్షాలు 6వ తేదీ వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక చెన్నై నగరంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రెండు రోజులుగా.. శ్రీలంక నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మంగళ, బుధవారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, రాణిపేట సహా ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధిక శాతంగా తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ ప్రాంతంలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శివగంగై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుదురై, పుదుకోట్టై, కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు తదితర 17 జిల్లాల్లో వరుణ బీభత్సం కొనసాగింది. జాలర్లకు సూచనలు.. నైరుతి బంగాళాఖాతంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తుండడంతో జాలర్లు మరో 2 రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. చెన్నైలో నవంబర్ 1వ తేదీ ఒక్కరోజే 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత 72 ఏళ్లలో నవంబర్ నెలలో నమోదైన మూడో అత్యధిక వర్షపాతం ఇది.. అని వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా బుధవారం చెన్నై, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాల లు, కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు. వేలూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, విల్లుపురం జిల్లాల్లో పాఠశాల స్థాయి విద్యార్థులకు మాత్రమే సెలవులిచ్చారు. అండమాన్‌కు 14 విమానాలు రద్దు చెన్నై విమానాశ్రయం నుంచి రోజూ ఏడు విమానాలు అండమాన్‌కు వెళ్తాయి. అలగే అక్కడి నుంచి చెన్నైకి మరో ఏడు విమానాలు వస్తాయి. అండమాన్ ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడంతో చెన్నై నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు విమానాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే అండమాన్ సముద్రంలో భీకర గాలుల కారణంగా విమానాలు ల్యాండ్ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా అండమాన్ విమానాశ్రయంలో పర్యవేక్షణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా బుధవారం ఉదయం నుంచి 4వ తేదీ వరకు చెన్నై, అండమాన్ మధ్య నడిచే 14 విమానాలను రద్దు చేస్తున్నట్లు చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఆ రోజుల్లో టిక్కెట్లను బుక్ చేసుకున్నవారు మరో రోజుకు మార్చుకోవచ్చని సూచించారు. మంత్రులు, మేయర్ అత్యవసర సమావేశం భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చెన్నై కార్పొరేషన్ కార్యాలయమైన రిప్పన్ బిల్డింగ్‌లో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రులు సుబ్రమణియన్, కేఎన్.నెహ్రూ, మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వర్ష ప్రభావిత జిల్లాల్లో చేపట్టాల్సిన పలు చర్యల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చర్చించారు. కార్పొరేషన్ సిబ్బందికి.. అభినందన చెన్నై నగరంలో అత్యధిక స్థాయిలో వర్షం కురిసినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. చెన్నై నగరంలో 200 చోట్ల తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చెన్నైలో 50 ఏళ్ల నాటి భారీ వృక్షాలు మైలాపూర్, అభిరామపురం, ట్రిప్లికేన్, రాయపురం ప్రాంతాల్లో నేలకొరిగాయని, వాటిని సిబ్బంది వెంటనే తొలగించారని తెలిపారు. మంగళవారం రాత్రి 20 వేల మంది కార్పొరేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి నగరంలో నిలిచిన వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించినట్లు చెప్పారు. బుధవారం కూడా నిల్వ ఉన్న నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షలకు రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగని రీతిలో చర్యలు చేపట్టిన చెన్నై కార్పొరేషన్ సిబ్బందిని దక్షిణ రైల్వే మేనేజర్ ట్విట్టర్లో అభినందించారు. కాల్ సెంటర్.. తాగునీటి బోర్డు ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ నిమిత్తం 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తాగునీరు, మురుగు నీటి సమస్యలపై 044–45674567 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. చెన్నై నగరంలో కురుస్తున్న భారీ వర్షాల ఆరణంగా ప్రజలకు సహాయం అదించేందుకు 900 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే నిమిత్తం 40 పడవలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. పుళల్ – చెంబరంబాక్కం నుంచి నీటి విడుదల భారీ వర్షాల కారణంగా చెన్నైకి తాగు నీటిని అందించే చెరువులకు ఇన్‌ఫ్లో పెరిగింది. పుళల్ చెరువుకు బుధవారం ఉదయం 2 వేల ఘనపుటడుగుల నీరు వచ్చి చేరింది. చెరువు సామర్థ్యం 21 అడుగులు కాగా, 19 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో పుళల్ చెరువు నుంచి బుధ వారం సాయంత్రం 100 ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రకటించారు. అదేవిధంగా చెంబరంబాక్కం చెరువు నుంచి కూడా 100 ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు. నేతన్నను దెబ్బతీసిన వరుణుడు పళ్లిపట్టు: భారీ వర్షాల కారణంగా నేతపరిశ్రమ డీలాపడింది. పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో ముసురు వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అమ్మయార్‌కుప్పం, ఆర్కేపేట పొదటూరుపేట, సొరకాయపేట, అత్తిమా మంజేరిపేట, బుచ్చిరెడ్డిపల్లె, మద్దూరు, శ్రీకాలికాపురం, వెడియంగాడు పరిసర ప్రాంతాల్లో మగ్గం పనులు ఆగిపోయాయి. వర్షం తగ్గితే నూలు ఆరబెట్టి పడుగులు తయారు చేస్తే తప్పా తమకు ఉపాధి ఉండదని నేతన్నలు వాపోతున్నారు. వేలూరు, తిరువణ్ణామలైలో.. వేలూరు: వేలూరు, తిరువణ్ణామలైలో రోడ్లు, వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. నేతాజీ మార్కెట్ జలమయం కావడంతో వ్యాపారులు, కొనుగోలు దారులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వేలూరు జిల్లా ఆంబూరు ప్రాంతంలో ఏళ్ల నాటి చింత చెట్టు నేల కూలిపోవడంతో ట్రాఫి క్ స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఏవా వేలు తెలిపారు. తిరుపత్తూరు కలెక్టరేట్లో కలెక్టర్ అమర్ కుస్వా అధ్యక్షతన వివి ధశాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆకస్మిక పరిశీలన చెన్నై చేపాక్కం.. ఎళిలగంలోని రాష్ట్రస్థాయి అత్యవసర కంట్రోల్ రూమ్‌ను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను సీఎం స్వీకరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వర్షం పరిస్థితులపై సమీక్షించారు. -
కొద్దిరోజుల్లో ఏపీలోకి ఈశాన్య రుతుపవనాలు.. భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. ఇంతలో బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను కూడా ఈశాన్య గాలులను నిలువరించడం ద్వారా రుతుపవనాల ఆలస్యానికి కారణమైంది. ఈ నెల 25తో సిత్రాంగ్ తుపాను పూర్తిగా బలహీనపడింది. చదవండి: కుమారుడు, భార్య.. తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా.. ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రవేశం సాధారణం కంటే వారానికి పైగా ఆలస్యమవుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతటా వర్షాలు కురిపిస్తే ఈశాన్య రుతుపవనాలు మాత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రభావం చూపుతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు ఈ రుతుపవనాలు విస్తారంగా వర్షాలను కురిపిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీమీటర్ల సాధారణ సగటు వర్షపాతం నమోదవుతుంది. ఈ సీజనులో తుపాన్లకు ఆస్కారం.. నైరుతి రుతుపవనాల సీజన్లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తపానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను (అక్టోబర్–డిసెంబర్ల మధ్య)లో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ.. ఈ ఏడాది అంతకు మించి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 30 నుంచి భారీ వర్షాలకు అవకాశం మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో వర్షాలు మొదలు కానున్నాయి. 30వ తేదీ నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అది తీవ్రరూపం దాలిస్తే రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయి. -
నెలాఖరుకు ఈశాన్య రుతు పవనాలు
ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతు పవనాలు అక్టోబర్ 15కల్లా ప్రవేశిస్తాయి. అయితే, నైరుతి రుతు పవనాల ఉపసంహరణలో జాప్యం.. త్వరలో బంగాళాఖాతంలో తుపాను, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుండటం వంటి పరిస్థితులు ఈశాన్య రుతు పవనాల రాక ఆలస్యం కావడానికి కారణమవుతున్నాయి. దీని వల్ల ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 28-31 తేదీల మధ్య ప్రవేశించే వీలుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
28 ఏళ్ల తర్వాత మార్చిలో వాయుగుండం
సాక్షి, అమరావతి బ్యూరో: నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజనులోను, ఈ సీజన్లకు ముందు, తర్వాత అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడడం సర్వసాధారణం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. అలాగే, నైరుతి రుతు పవనాల సీజనుకు ముందు ప్రారంభమయ్యే ప్రీ మాన్సూన్ సీజను (ఏప్రిల్, మే)లోను, ఈశాన్య రుతుపవనాలు ముగిసే పోస్ట్ మాన్సూన్ సీజనుగా పేర్కొనే జనవరిలోనూ అడపాదడపా వాయుగుండాలు, తుపాన్లు సంభవిస్తాయి. కానీ, మార్చి ఆరంభంలోనే అల్పపీడనం, వాయుగుండం వంటివి ఏర్పడడం అరుదైన విషయమే. ఇలాంటి ప్రత్యేకత సంతరించుకునేలా ఈనెల 2న దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగానూ మారనుంది. ఇటీవల కాలంలో మార్చి ఆరంభంలో ఇలాంటివి ఏర్పడిన దాఖలాల్లేవు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1994 మార్చి 21న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆపై వాయుగుండంగా మారింది. ఆ తర్వాత అంటే గత 28 ఏళ్లలో ఇప్పటివరకు మార్చిలో అల్పపీడనం గాని, వాయుగుండంగానీ ఏర్పడిన పరిస్థితిలేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటాన్ని వాతావరణ నిపుణులు అరుదైనదిగా పేర్కొంటున్నారు. ‘నైరుతి’ సీజన్లో మంచి వర్షాలు ఇక సాధారణంగా ఏప్రిల్ నుంచి సముద్ర ఉపరితల జలాలు వేడెక్కుతుంటాయి. ఫలితంగా అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడటానికి దోహదపడతాయి. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇవి నైరుతి రుతుపవనాల సీజనులో మంచి వర్షాలు కురవడానికి సానుకూల సంకేతంగా భావిస్తారు. వీటిని లానినా పరిస్థితులుగా పేర్కొంటారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో లానినా పరిస్థితులుండడమే అకాల అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడటానికి ఒక కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరాన్ని తాకి రీకర్వ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భూమధ్య రేఖకు సమీపంలో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. మార్చి ఆరంభంలోనే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం అరుదైన పరిణామమని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. -
నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. దీనికి తోడు మధ్య భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నాయి. బుధవారం నుంచి చలి గాలుల తీవ్రత పెరుగుతుందని, మొత్తంగా శీతాకాలం పూర్తిగా ప్రవేశించినట్లేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ శీతాకాలంలో రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ పరిస్థితులే కనిపిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం మామూలుగా ఉన్నట్లు కనిపించినా.. ఈశాన్య గాలులు వీస్తుండటం, మంచు ప్రభావంతో చలి వణికించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. -
చెన్నైలో మళ్లీ వరద విలయం
సాక్షి, చెన్నై: తమిళనాడును వర్షాలు వీడటం లేదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నై, శివారు లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీట మునిగాయి. వర్షాలతో ఇప్పటికే రెండుసార్లు చెన్నై, శివారులోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడం తెల్సిందే. శుక్రవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై, ఉత్తర చెన్నై పరిధిలోని సుమారు 500 వీధుల్లో మోకాలిలోతు నీరు చేరింది. శనివారం చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. అనంతరం ఆయన ట్విట్టర్లో..‘కేవలం ఒక్క నెల వ్యవధిలో 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం చెన్నై నగర 200 ఏళ్ల చరిత్రలో ఇది నాలుగోసారి’అని పేర్కొన్నారు. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ప్రకటించారు. పూందమల్లి, ఆవడి, అంబత్తూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల పరిధిలో అనేక చెరువులు తెగడంతో వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలో శనివారం వర్షాల సంబంధిత ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. కాంచీపురం నుంచి జాతీయ రహదారిని కలిపే మార్గం పాలారు నది వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈశాన్య రుతుపవనాలతో ఏటా అక్టోబర్–డిసెంబర్ నెలల్లో తమిళనాట ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది ఇదే సమయంలో సాధారణ వర్షపాతం కంటే 75 శాతం అధికంగా వానలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా 24 గంటల్లో ఆవడిలో 20 సెంటీమీటర్లు, చెంగల్పట్టులో 18 సె.మీ వర్షం కురిసినట్లు ప్రకటించింది. రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. -
26న ఈశాన్య రుతుపవనాల ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 26న దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోందని, ఇప్పటికే దక్షిణ భారత దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ‘నైరుతి’వెనక్కు వెళ్లిందని తెలిపింది. కాగా రాష్ట్రానికి ఉత్తర, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని, వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. -
ముందే ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: మంచి వర్షాలు అందించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ.. మరో చల్లని కబురు అందింది. నైరుతి మాదిరిగానే ఈశాన్య రుతుపవనాలు కూడా ముందే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా అక్టోబర్ చివరి వారంలో రావాల్సిన ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది అక్టోబర్ మూడో వారంలోనే రానున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈశాన్య రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంపై మంచి ప్రభావమే చూపించాయి. 13 జిల్లాలోనూ మంచి వర్షాలు కురిశాయి. ఏడు జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 560 మిల్లీమీటర్లు. ఈ కాలంలో ఈ ఏడాది 8.77 శాతం అధికంగా మొత్తం 609.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరులో 49 శాతం అధికంగా వర్షాలు కురవగా విశాఖపట్నంలో 37, విజయనగరంలో 36, గుంటూరులో 33, వైఎస్సార్ కడపలో 32, తూర్పు గోదావరిలో 29, కృష్ణా జిల్లాలో 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. రెండురోజులు తేలికపాటి వానలు ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో పెనమలూరులో 63.8 మీల్లీమీటర్లు, వేటపాలెంలో 58.5, మచిలీపట్నంలో 55.6, రాజమండ్రిలో 54.8, మంగళగిరిలో 51, టి.నర్సాపురంలో 49, తణుకులో 48.8, ఒంగోలులో 45.6, పెడనలో 43.8, చింతలపూడిలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
జల సిరులు.. కొత్త రికార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టులు గరిష్ట నీటి నిల్వలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ని్రష్కమించాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు మండలాలు, ప్రకాశం జిల్లాలపై మాత్రమే ఉంటుంది. అంటే, వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నట్టు లెక్క. ఈ దశలో రాష్ట్రంలోని చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో 439.361 టీఎంసీలకుగాను 378.738 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో జలాశయాల్లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉండటం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 527.86 టీఎంసీలకుగాను 514.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నవంబర్ మూడో వారంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఈ స్థాయిలో నీటి నిల్వలు ఉండటం కూడా ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదో నిదర్శనమని సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రైతుల ప్రయోజనాలే పరమావధి ► నీటి సంవత్సరం ప్రారంభంలోనే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల్లో వరద జలాలను ఒడిసిపట్టి.. ప్రాజెక్టులను నింపడం ద్వారా ఖరీఫ్, రబీల్లో రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ► గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా ఆయా ప్రాజెక్టుల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు నిధులను విడుదల చేశారు. ► దాంతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీలను ఇప్పుడు నిల్వ చేశారు. గత ఏడాది ఈ సమయానికి 6 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ► సోమశిల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏడాది గరిష్ట స్థాయిలో 77 టీఎంసీల నీరు నిల్వ చేశారు. కండలేరు రిజర్వాయర్‌లో చరిత్రలో తొలిసారిగా 68.03 టీఎంసీలకు గాను 60.28 టీఎంసీలను నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ కేవలం 47 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం. ► వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంసాగర్‌లో 17.74 టీఎంసీలకుగాను తొలి సారిగా 14.299 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 8.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గండికోట రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీలకుగాను 18 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 12 టీఎంసీలు ఉన్నాయి. పైడిపాళెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలకుగాను 5.90 టీఎంసీలను నిల్వ చేశారు. పులిచింతల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏటా 45 టీఎంసీలను నిల్వ చేశారు. ► వరద జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వరుసగా రెండో ఏటా ఖరీఫ్‌లో ఆయకట్టులో కోటి ఎకరాలకు ప్రభుత్వం నీటిని అందించింది. రబీలోనూ రికార్డు స్థాయిలో (గతేడాది రబీలో 22 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు) ఆయకట్టుకు నీటిని అందించే దిశగా అడుగులు వేస్తోంది. యాజమాన్య పద్ధతులతో నీటి వృథాకు అడ్డుకట్ట నీటి విలువ, వ్యవసాయం విలువ, రైతుల శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వల్లే రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగాం. ఖరీఫ్‌లో ఒక్క ఎకరా ఎండకుండా సుమారు కోటి ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాం. రబీలోనూ రికార్డు స్థాయిలో నీళ్లందించడానికి చర్యలు చేపట్టాం. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జల వనరుల శాఖ -
ఎల్లో అలర్ట్: చెన్నై ఉక్కిరిబిక్కిరి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడును మరో మూడురోజులపాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని చెన్నైలోని వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. ప్రజలను, ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికగా బుధవారం ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తమిళనాడులో గతనెల 28న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే నాలుగురోజులు గడిచినా చెప్పుకోదగ్గ అల్పపీడన ద్రోణి ఇంతవరకు ఏర్పడలేదు. సహజమైన ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తొలిరోజునే చెన్నైలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. (చదవండి: విషాదం: నీ వెంటే మేమూ!) ఈనెల 2న కొత్తేరిలో గరిష్టంగా 80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతం, దానికి ఆనుకునే ఉన్న నైరుతి సముద్రం, శ్రీలంక, తూర్పు అండమాన్ దీవుల వద్ద కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా కోవై, తేని, దిండుగల్లు, మదురై, విరుదునగర్, తిరునెల్వేలి, తెన్కాశి, కన్యాకుమారి, తూత్తుకూడి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చెన్నై దాని పరిసరాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు బలపడుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎల్లో ఎలర్ట్‌ను ప్రకటించినట్లు పువియరసన్ తెలిపారు. (చదవండి: బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) చెన్నై ఉక్కిరి బిక్కిరి.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్విచక్రవాహనాలు పూర్తిగా మునిగిపోగా, కార్లలో ప్రయాణించే వారు కూడా జలప్రవాహాన్ని దాటేందుకు కష్టపడ్డారు. బుధవారం ఉదయం ఆఫీసులకు, విధులకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం వల్ల రోడ్లలో నడుములోతు వరద ప్రవాహంతో ప్రజలు నానాయాతన పడ్డారు. వాహనాలు ముందుకు సాగే వీలులేకపోవడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. బెంగళూరులో వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చెన్నై నుంచి ఆరు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అలాగే బెంగళూరు నుంచి చెన్నైకి రావాల్సిన రెండు విమానాల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. -
తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు..
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా వాతావరణం మారింది. ఈ ఏడాది నైరుతి ప్రభావం రాష్ట్రంలో తక్కువే. కేరళ, కర్ణాటకల్లో కురిసిన వర్షాలకు ఇక్కడి జలాశయాలు నిండాయి. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రుతుపవనాల రూపంలో రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారింది. సముద్ర తీర జిల్లాల్లో వర్షం పడడం, వాతావరణం పూర్తిగా మారింది. అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడం, ఈశాన్య రుతుపవనాల రాక వెరసి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది సరాసరి వర్షపాతం ఈ పవనాల రూపంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
రాష్ట్రంలో రెండు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా బుధవారం నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. -
తమిళనాట భారీ వర్షాలు
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. భారీ వర్షాలతో నదులు, చెరువులతో పాటు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పది మంది మరణించారు. శుక్రవారం ఇళ్లు కూలడంతో కడలూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు మరో ఏడుగురు బలి అయ్యారు. వర్షం మరో రెండు రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. తూత్తుకుడి జిల్లాలో వర్ష బీభత్సానికి ప్రధాన రైల్వే స్టేషన్‌ను మూసి వేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది. ప్లాట్‌ఫామ్‌లు సైతం కనిపించనంతగా నీటితో నిండింది. మంత్రులు తమ జిల్లాలకు చేరుకుని అధికార వర్గాలతో కలిసి సహాయక చర్యల్లో మునిగారు. చెన్నైలో మోస్తరుగా వర్షం పడుతుండగా, శివార్లలో భారీగా కురుస్తోంది. 2015 డిసెంబరు 2, 3 తేదీల్లో శివార్లలో కురిసిన భారీ వర్షాల వల్ల చెన్నై నీట మునిగింది. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తూత్తుకుడిలో 19, కడలూరులో 17సెం.మీ వర్షం పడినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ భువియరసన్ తెలిపారు. తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, కడలూరులలో అతి భారీ వర్షాలు కురిశాయి. తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, విల్లుపురం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్, తేని , మదురై, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట్టై, నాగపట్నం, శివగంగై జిల్లాల్లో మోస్తరుగా పడుతోంది. -
నేడు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో శుక్రవారం ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. కోమోరిన్ ప్రాంతం నుంచి లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరో వైపు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావాల కారణంగా శనివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. -
రేపు ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన వర్షాలు బుధవారం నుంచి మొదలయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని కారణంగా రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంలో ఉండదని, రానున్న మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. -
1 నుంచి ఈశాన్య రుతుపవనాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రుతుపవనాలు నవంబర్ 1న ప్రారంభమయ్యే అవకాశముందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనావేసింది. ఈ సీజన్లో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళలలో ఎక్కువగా వర్షపాతం కురుస్తుంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 20నే ప్రారంభమవుతాయి. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ సర్క్యులేషన్ వల్ల ఈసారి కాస్త ఆలస్యమవుతోందని ఐఎండీ తెలిపింది. మరోవైపు, అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వెనుదిరిగాయని వెల్లడించింది. -
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపైకి ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవలే నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడం, ఈశాన్య రుతు పవనాలు ప్రవేశిస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండలో 5 డిగ్రీలు తక్కువగా, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్‌లో 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క ఖమ్మంలోనే సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, డిసెంబర్ నాటికి తీవ్రమైన చలి ఉంటుందని రాజారావు వెల్లడించారు.