చెన్నైలో జలమయమైన రోడ్డు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడును మరో మూడురోజులపాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని చెన్నైలోని వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. ప్రజలను, ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికగా బుధవారం ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తమిళనాడులో గతనెల 28న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే నాలుగురోజులు గడిచినా చెప్పుకోదగ్గ అల్పపీడన ద్రోణి ఇంతవరకు ఏర్పడలేదు. సహజమైన ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తొలిరోజునే చెన్నైలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. (చదవండి: విషాదం: నీ వెంటే మేమూ!)
ఈనెల 2న కొత్తేరిలో గరిష్టంగా 80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతం, దానికి ఆనుకునే ఉన్న నైరుతి సముద్రం, శ్రీలంక, తూర్పు అండమాన్ దీవుల వద్ద కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా కోవై, తేని, దిండుగల్లు, మదురై, విరుదునగర్, తిరునెల్వేలి, తెన్‌కాశి, కన్యాకుమారి, తూత్తుకూడి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చెన్నై దాని పరిసరాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు బలపడుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎల్లో ఎలర్ట్‌ను ప్రకటించినట్లు పువియరసన్ తెలిపారు. (చదవండి: బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..)
చెన్నై ఉక్కిరి బిక్కిరి..
మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్విచక్రవాహనాలు పూర్తిగా మునిగిపోగా, కార్లలో ప్రయాణించే వారు కూడా జలప్రవాహాన్ని దాటేందుకు కష్టపడ్డారు. బుధవారం ఉదయం ఆఫీసులకు, విధులకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం వల్ల రోడ్లలో నడుములోతు వరద ప్రవాహంతో ప్రజలు నానాయాతన పడ్డారు. వాహనాలు ముందుకు సాగే వీలులేకపోవడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. బెంగళూరులో వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చెన్నై నుంచి ఆరు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అలాగే బెంగళూరు నుంచి చెన్నైకి రావాల్సిన రెండు విమానాల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment