సోమవారం వేకువజాము నుంచే మొదలు
నీటి ముంపులో లోతట్టు ప్రాంతాలు
పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు అత్యవసర సెలవు
సాక్షి నెట్‌వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్‌ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.
తిరుమలలో హై అలర్ట్
తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.
కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు.
రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్‌లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు.
చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment