weather center
-
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. రాబోయే రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.ఇది దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు చేరుతుందని.. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలవైపు చేరే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.నేడు వర్షం కురిసే జిల్లాలుఅల్పపీడనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.16న భారీ వర్షాలుదీని ప్రభావం వల్ల బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.17న వర్షాలు కురిసే జిల్లాలు17వ తేదీన గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కలెక్టర్లకు సీఎస్ సూచనలుభారీ వర్షాల హెచ్చరికలతో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ సోమవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో కలిసి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండరాదన్నారు. పాత భవనాలను వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మండుతున్న భూగోళం, 29 ఏళ్ల రికార్డు బద్ధలు!
ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలుకొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే.. ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు.పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాగ్జిమమ్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమై మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్‌నినోతో పాటు.. మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్ వెల్లడించింది.ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. అంటే.. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ.రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం మేర అవకాశముందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశముందని వివరించింది. 2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. 1850 నుంచి 1900 మధ్యనాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది. -
Hyderabad: మరో మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది. పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట వాతవరణంలో మార్పులు రావొచ్చని తెలిపింది. సోమవారం నాటి పరిస్థితులే మరో మూడు నాలుగు రోజులపాటు కొనసాగొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాభావం కొనసాగొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 110, కరైకల్‌కు తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద చెన్నైకి సమీపంలో శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. శనివారం ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. భారీవర్షాలు పడే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో వడమాలపేటలో 132.75 మిల్లీమీటర్లు, పాకాలలో 110.75, తవణంపల్లెలో 108.25, చిత్తూరులో 106.50, రామచంద్రాపురంలో 104.25, చంద్రగిరిలో 96, శ్రీకాళహస్తిలో 94, కలకడ, రొంపిచర్లల్లో 93, యాదమర్రిలో 91.75, రేణిగుంటలో 90, చిట్వేల్‌లో 85, శ్రీరంగరాజపురంలో 82.75, కొత్తపల్లిలో 82, పలమనేరులో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వరద నీటిలోనే చెన్నై
సాక్షి, చెన్నై: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. 10, 11 తేదీల్లో చెన్నై దాని శివారు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనంతో తమిళనాడులో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. దీంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు తదితర 14 జిల్లాల్లో కొన్నిచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై లోతట్టు ప్రాంతాల్లో ఎటు చూసినా మోకాలి లోతులో నీరు నిల్వ ఉండడంతో ఆ పరిసరాల్లోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన మార్గాల్లో వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినా, వీడని వాన కారణంగా అనేక మార్గాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నైలో సహాయక చర్యలు విస్తృతం చేశారు. రెండో రోజు సోమవారం కూడా సీఎం ఎంకే స్టాలిన్ చెన్నై నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఆరణియారు పొంగి పొర్లుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో పిచ్చాటూరు – ఊత్తుకోట – తిరువళ్లూరు మార్గంలో రెండు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కాగా, రాష్ట్రంలో వర్ష సంబంధ ఘటనల్లో నలుగురు చనిపోయారు. -
నెలాఖరున బంగాళాఖాతంలో అల్పపీడనం?
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు రోజులపాటు భిన్న వాతావరణం ఏర్పడనుంది. రాజస్థాన్ నుంచి పొడి గాలులు వీస్తుండటం.. అదే సమయంలో సముద్రం నుంచి తేమ గాలులు రావడంతో బుధ, ఆదివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పగలు ఎండలు, సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గాలిలో తేమ పెరుగుతూ పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోందని, వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో 28వ తేదీ తర్వాత నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గడచిన 24 గంటల్లో బొబ్బిలిలో 55.75 మి.మీ., పరవాడలో 49, లేమర్తిలో 46.25, నాగులుప్పాలపాడులో 44, ఆరిలోవలో 39.25, పరవాడ ఫార్మాసిటీ, మల్లంపేట, నర్సీపట్నంలో 39, దర్శిలో 36 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
బాబోయ్ ఉక్కపోత! మరోవారం ఇంతేనట!!
సాక్షి, సిటీబ్యూరో: రుతుపవనాలకు బ్రేక్ పడడంతో నగరంలో మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ వేడిమితో ఒక్కసారిగా ఉక్కపోత పెరిగింది. రుతుపవనాలు వెస్ట్ బెంగాల్ వైపు మళ్లాయని..శీతల గాలులు సైతం ఉత్తరదిశ వైపు వీస్తున్నందున నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 33 నుంచి 35 డిగ్రీల వరకు పెరిగాయని..గాలిలో తేమ శాతం 50 శాతానికంటే తక్కువగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మరో వారం రోజులపాటు నగర వాతావరణ పరిస్థితిలో పెద్దగా తేడాలుండవని..ఆ తర్వాత రుతుపవనాల దిశ మారే అవకాశం ఉందని, గాలిలో తేమ శాతం పెరగడం, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలిక పాటి వర్షాలుకురిసే అవకాశాలున్నట్లు వివరించారు. కాగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత పెరగడంతో విద్యుత్ వినియోగం సైతం పెరిగింది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో సిటీజనులు సేదదీరారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఎండవేడిమితో సతమతమయ్యారు. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరుస నగరంలో పలు మండలాల్లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం అధిక వర్షపాతం నమోదైన విషయం విదితమే. -
వర్షాకాలమా? ఎండాకాలమా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పై వరుసగా మూడో రోజూ భానుడు ప్రతాపం చూపించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగస్టులో గతంలో ఎన్నడూ లేనంతగా పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖలో 1989 ఆగస్టు తర్వాత రికార్డు స్థాయిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తునిలో సాధారణం కంటే 6.5 డిగ్రీలు అత్యధికంగా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖలో 39.0, బాపట్లలో 38.2, నెల్లూరులో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారం చివరి వరకు ఇవే పరిస్థితులుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఏపీ తీరంలో బుధవారం స్వల్ప ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనివల్ల అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసి.. ఎండల నుంచి కొంత ఉపశమనాన్ని అందించాయి. మరోవైపు మచిలీపట్నం సమీపంలో ఈనెల 8న అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడనుంది. ఆ తర్వాత 12న మరో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రం మీదుగా కదులుతూ ఛత్తీస్‌గఢ్ వైపు ప్రయాణించనుంది. వీటి వల్ల వర్షాలు విస్తరించే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
నేడు, రేపు ఉత్తర కోస్తాకు వర్ష సూచన
సాక్షి విశాఖపట్నం: తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాయలసీమలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. -
బలహీన పడిన అల్పపీడనం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/పాడేరు: గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బలహీన పడింది. ఇది ఆగ్నేయ ఆరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో దానికి అనుకుని అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మినుములూరులో 8 డిగ్రీలు విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మినుములూరులో సోమవారం ఈ సీజన్లోనే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక్కడి కాఫీ బోర్డులో ఆదివారం 12 డిగ్రీలు నమోదు కాగా సోమవారానికి 8 డిగ్రీలకు పడిపోయింది. అరకులోయలో 12.7 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఏజెన్సీలో ఉదయం 9.30 గంటల వరకు మంచు కురుస్తోంది. -
రాష్ట్రంలో పెరుగుతున్న చలి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తున్నాయి. కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా రెండు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. -
నేడు, రేపు రాష్టంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షా లు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, బిహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, పేర్కొంది. ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు, ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. -
నేడు పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రుతుపవనాల కారణంగా ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అదే జిల్లా ఎల్లారెడ్డిలో 8, బాన్సువాడలో 7, లింగంపేటలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలావుండగా తెలంగాణలో జూన్ ఒకటో తేదీ నుంచి 22వ తేదీ వరకు 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అందులో నిర్మల్ జిల్లాలో అత్యంత ఎక్కువగా 78 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. జగిత్యాల జిల్లాలో మాత్రం 5 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. రుతుపవనాలు మొదలైన రోజు రంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే ఏకంగా 479 శాతం అధిక వర్షపాతం నమోదైంది. -
భానుడి ప్రతాపంతో ప్రజలు బెంబేలు
సాక్షి, హైదరాబాద్: భానుడి ప్రకోపానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు విలవిలలాడుతున్నారు. రోహిణి కార్తె నేపథ్యంలో ఎండలు, వేడి గాలులు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మెదక్‌లో 45 డిగ్రీలు, రామగుండంలో 45, ఖమ్మంలో 44, భద్రాచలంలో 42, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బకు 35 మంది మృతి రాష్ట్రంలో వడదెబ్బకు బుధవారం 35 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. -
వడగాడ్పులు.. పిడుగుల వానలు!
సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క ఉష్ణతీవ్రతతో వడగాడ్పులు కొనసాగుతుండగా మరోపక్క పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. సాధారణంకంటే 3–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం వడగాడ్పులకు 8 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో, రెండు రోజులు రాయలసీమలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో ఆళ్లగడ్డ, గుత్తిలో 5, వింజమూరు, అర్థవీడు, జియ్యమ్మవలస, మార్కాపురం, కోయిలకుంట్ల, రాయదుర్గం, పమిడిల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి విశాఖలో ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలా.. - మే 28న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీలు, శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. - మే 29న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. - మే 30న ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. - మే 31వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉంది. జూన్ ఒకటిన.. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు, విశాఖ, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంత జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. -
రామగుండం అగ్నిగుండం!
సాక్షి, హైదరాబాద్: ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 4 నుంచి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, జూన్ రెండో వారం వరకు ఇదే రకమైన పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడే అవకాశముందని వాతావరణ కేంద్రం వర్గాలు వెల్లడించాయి. సోమవారం అత్యధికంగా రామగుండంలో 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 45.8, నిజామాబాద్‌లో 45.3, మెదక్‌లో 44.8, ఖమ్మంలో 44.6, హన్మకొండలో 44, భద్రాచలంలో 43.2, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో 42.5 డిగ్రీ సెల్సియస్‌ల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఉరుము లు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. -
నేడు రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పొడివాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గంటకు 40 కి.మీ. నుంచి 50 కి.మీ.)లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఇం టీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తాంధ్ర మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. వడదెబ్బకు ఏడుగురు మృతి వడదెబ్బకు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన మాజీ ఉప సర్పంచ్ బచ్చు పురుషోత్తం (82), ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన పొన్నెకంటి వెంకమ్మ (75),, వైరా మండలం కేజీ సిరిపురంలో దుప్పటి సత్యం (63), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ప్రకాశ్‌నగర్ కాలనీకి చెందిన చింతలచెరువు వీరస్వామి (59) మృతి చెందారు. అలాగే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బురగల్ల వెంకటయ్య (65), సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కొమ్ముల చిన్నమల్లయ్య (55), ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సందెవేణి మల్లయ్య (55) మృతి చెందిన వారిలో ఉన్నారు. -
రాష్ట్రం... నిప్పుల కుంపటి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిగా మండిపోతోంది. వడగాడ్పులు వీస్తుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. నల్లగొండలో 45 డిగ్రీలు, ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంల్లో 44 డిగ్రీలు, మహబూబ్‌నగర్, మెదక్‌ల్లో 43 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్‌ల్లో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిలలాడిపోతున్నారు. పలుచోట్ల కలుషిత నీటి వల్ల వాంతులు, విరోచనాల బారిన పడుతున్నారు. మే నెల మొత్తం దాదాపు వడగాడ్పుల రోజులు అధికంగా ఉంటాయని, రానున్న రోజుల్లో 47–48 డిగ్రీలకూ ఉష్ణోగ్రతలు పెగోచ్చని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇదిలావుండగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఏమీ ఉండదని, రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని రాజారావు తెలిపారు. వడదెబ్బతో ఐదుగురి మృతి సాక్షి నెట్వర్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో సోమవారం ఐదుగురు మృతి చెందారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో ఓ గుర్తు తెలియనివ్యక్తి, అశ్వారావు పేట మండలం నారాయణపురం కాలనీకి చెందిన బుర్రి వెంకటేష్(40), అదే మండలం తిరుమల కుం టకు చెందిన మడకం నాగేశ్వరరావు (55), బూర్గంపాడు గౌతమీపురం కాలనీకి చెందిన మేకల రామలక్ష్మి(65), సత్తుపల్లి మండలం గౌరీగూడెంకి చెందిన పట్లె కుమారి(44) వడదెబ్బతో మృతి చెందారు. -
28, 29 తేదీల్లో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిలోకి వెళ్లిపోయింది. ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో తెలంగాణలో వడగాడ్పులు వీస్తున్నాయి. మరోవైపు గ్రేటర్‌ను కూడా మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్రంగా వీచే ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ‘గ్రేటర్’ నగరంపైనా వడగాల్పులు పంజా విసురుతాయని స్పష్టం చేసింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా గాలిలో తేమ 43 శాతం కంటే తగ్గడంతో వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, శుక్రవారం నగరంలో 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. వడగాడ్పులు, అధిక ఎండల నేపథ్యంలో పగటి వేళ ఇంటి నుంచి బయటికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పగటి వేళల్లో వృద్ధులు, రోగులు, చిన్నారులు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని పేర్కొంది. కాగా ఇటీవల హైదరాబాద్ గాలిలో తేమ శాతం 50 శాతానికి పైగా నమోదైందని, అందుకే మధ్యాహ్నం గాలుల్లో వేడి తీవ్రత అంతగా లేదని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. కానీ వచ్చే ఆది, సోమవారాల్లో వేడిగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తం ఉండాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. చిన్నారుల విషయంలో..: పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా చూడాలి. ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లితే ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. రోజు రెండుసార్లు చన్నీటితో స్నానం చేయించాలి. వేసవిలో పిల్లలకు చికెన్‌ఫాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలి. మంచినీరు తాగాలి... నగరంలో చాలామంది ప్రతిరోజు టూవీలర్‌పై ప్రయాణిస్తుంటారు. దీంతో అతినీలలోహిత కిరణాలు నేరుగా ముఖానికి తగలడం వల్ల ముఖం, చేతులు నల్లగా వాడిపోయే ప్రమాదం ఉంది. చలివేంద్రాలు, హోటళ్లలో కలుషిత నీరు తాగితే వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది. శరీరానికి వేడిమినిచ్చే నల్లని దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ పెట్టుకోవడం ఉత్తమం. సొమ్మసిల్లితే... వడదెబ్బ కొట్టి పడిపోయిన వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీళ్లు లేదా కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్లు, తలకు టోపీ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి జావ తదితర తీసుకోవడం మంచిది. వీధి కుక్కలతో జాగ్రత్త... ఎండ ప్రభావం వీధి కుక్కలపై ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోతే కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి పాల్పడతాయి. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదు అవుతుండటానికి ఇదే కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండా నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. నిజామాబాద్‌లో అత్యధికంగా 45 డిగ్రీలు... ఈ సీజన్లోనే అత్యధికంగా శుక్రవారం నిజామాబాద్‌లో ఏకంగా 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం, ఆదిలాబాద్‌లలో 44 డిగ్రీల రికార్డు అయింది. మహబూబ్‌నగర్‌లో 43 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మంలో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొనసాగుతున్న వాయుగుండం.. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1,720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా.. ఆ తరువాత 12 గంటలకు తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. ఏప్రిల్ 30 తేదీ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాల దగ్గరకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. -
అకాల వర్షం..పంటకు నష్టం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ.. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులతో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులకు మామిడి, జీడిమామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలు చోట్ల కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్క జొన్న పంట తడిసి ముద్దయ్యింది. ఈదురు గాలులకు కొన్ని గ్రామాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిడదవోలు–బ్రాహ్మణగూడెం రహదారిలో తాటిచెట్టు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాగల్లులో ఐదు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలగా..కొవ్వూరు మండలంలోని పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆరికిరేవుల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఈదురు గాలులకు నేలకూలింది. కృష్ణా జిల్లాలో.. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జాతీయ రహదారి పక్కనే చెట్లు కూలిపడ్డాయి. నందిగామ శివారు అనాసాగరంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మామిడికాయలు రాలిపోయాయి. దాళ్వా రైతులు ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మైలవరం, మచిలీపట్నంలో కొద్ది పాటి వర్షం పడింది. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ, మాచర్ల, రెంటచింతల, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. పల్నాడు ప్రాంతంలో కల్లాల్లో మిర్చి ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. మాచర్ల ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పాలకొండలో వడగళ్ల వాన.. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వడగళ్ల వాన కురిసింది. కాగా, ఇప్పటి వరకు మండుటెండలతో విలవిల్లాడిన జనాలు ఈ వర్షంతో కొంతమేర ఊరట చెందారు. -
రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల నుంచి తెలంగాణ వరకు ఇంటీరియర్ తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉండటంతో ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకొని బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం క్రమేనా బలహీన పడే అవకాశం ఉందని వాతావరణశాఖా అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. సముద్రపు అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెల్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెల్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
వచ్చే మూడు రోజులు వడగాడ్పులు
-
3 రోజులు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ తీవ్రమైన ఎండలుంటాయని పేర్కొన్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. అయితే మళ్లీ ఎండలు పుంజుకున్నాయి. ఆదివారం భానుడు విజృంభించాడు. ఆదిలాబాద్‌లో ఏకంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 44.5 డిగ్రీలు, మెదక్‌లో 44 డిగ్రీలు, రామగుండంలో 43 డిగ్రీలు రికార్డయ్యాయి. ఖమ్మం, నల్లగొండలలో 42 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 41 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం తగ్గడం, ఉపరితల ద్రోణుల ప్రభావం లేకపోవడంతో ఒక్కసారిగా ఎండలు పెరిగాయని రాజారావు వెల్లడించారు. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వెల్లడించారు. ప్రజలు విలవిల.. ఎండలు మండుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, చర్మం పొడిబారడం, మత్తు నిద్ర, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉండటం వంటివి వడదెబ్బ లక్షణాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వడగాడ్పులు, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. పెద్దలు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మరోవైపు ఎండల తీవ్రత, వడగాడ్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పినా, జిల్లాల్లో యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. -
వాన..వడగళ్లు..
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల దెబ్బకు పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో 150 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు కొన్ని గంటలపాటు అంతరాయం కలిగింది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజగుట్ట, బేగంపేట, ప్యాట్నీ, మేడ్చల్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా, ఏఎస్‌రావునగర్, నాచారం, చర్లపల్లి, ముషీరాబాద్, అశోక్‌నగర్, లాలాపేట్, చిలకలగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, పార్శిగుట్ట, మారేడుపల్లి, తుకారాంగేట్, కార్ఖానా, బోయిన్పల్లి, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అర్ధగంటకు పైగా వర్షం కురవడంతో పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచింది. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరవాసులకు ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగింది. నిలిచిన విద్యుత్ సరఫరా ఈదురుగాలులు, వడగళ్ల వానతో హబ్సిగూడ, తార్నాక, ఉప్పల్, హయత్‌నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, మెహదీపట్నం, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఆదివారం నగరంలో గరిష్టంగా 38.7 డిగ్రీలు, కనిష్టంగా 25.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం ప్రాంతం వర్షపాతం ముషీరాబాద్ 2.7 సెం.మీ అంబర్పేట్ 1.7 సెం.మీ. మౌలాలి 1.3 సెం.మీ. బేగంపేట్ 6.3 మి.మీ. ఎల్బీనగర్ 3.5 మి.మీ. బండ్లగూడ 6 మి.మీ. -
ఆదిలాబాద్‌లో 12 డిగ్రీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు, భద్రాచలం, హకీంపేటల్లో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
151 మండలాల్లో వర్షాభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 151 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 292 మండలాల్లో సాధా రణ, 141 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు అంచనాల ప్రకారం ఈ లెక్కలు వేశారు. అక్టోబర్‌లో ఇప్పటివరకు అధిక వర్షం నమోదైనా.. సీజన్ మొత్తంగా సరాసరి వర్షాభావ మండలాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. అత్యధికంగా మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 17 మండలాల చొప్పున వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా వాతావరణంలో తేమ కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. స్వైన్ ఫ్లూతో బాలింత మృతి హైదరాబాద్: మేడ్చల్‌లోని కటికె బస్తీలో రాజ్యలక్ష్మి(32) అనే బాలింత శనివారం స్వైన్ ఫ్లూతో మరణించింది. రాజ్యలక్ష్మి తన భర్త చిట్టిబాబు, ఇద్దరు పిల్లలతో కలసి స్థానికంగా నివాసముంటోంది. ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన కామారెడ్డికి వెళ్లింది. అక్కడ జలుబు, దగ్గు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఈ నెల 17న యశోద ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షల్లో స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయింది. అనంతరం 18న సిజేరియన్ ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన పాప ఆరోగ్యంగానే ఉన్నా.. రాజ్మలక్ష్మికి స్వైన్ ఫ్లూ తీవ్రం కావడంతో 20న గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. రాజ్యలక్ష్మి మరణంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. -
100 మండలాల్లో అధిక వర్షపాతం
నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటివరకు వంద మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపి నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ సీజన్ మధ్యలో డ్రైస్పెల్ కారణంగా 174 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం, 310 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణంగా సరాసరి 56.8 సెం.మీ. వర్ష పాతానికి 52.1సెం.మీ. నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఏకంగా 40 శాతం లోటు రికార్డయింది. ఈ నెలలో ఇప్పటివరకు 6 శాతం లోటు నమోదైంది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు స్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గడిచిన 24 గంటల్లో దామరగిద్దలో అత్యధికంగా 7 సెం.మీ. వర్షం కురిసింది. కోయిదా, జడ్చెర్ల, మహబూబ్‌నగర్‌లలో 6 సెం.మీ., మక్తల్, రుద్రూరు, మద్నూరు, నారాయణపేట్‌లలో 5సెం.మీ., ఎల్లారెడ్డి, అశ్వారావుపేట, పినపాక, మొగుళ్లపల్లి, గండీడ్ 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
-
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు
► నేడు, రేపు మోస్తరు.. తర్వాత రెండ్రోజులు భారీ వర్షాలు ► ఇప్పటివరకు 16 శాతం లోటు వర్షపాతం సాక్షి, హైదరాబాద్: కోస్తాంధ్రలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఈ నెల 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురు స్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో 50 శాతం భూభాగంలో వర్షాలు కురుస్తాయని ఆ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ఆదివారం తెలిపారు. గత 24 గంటల్లో హైదరాబాద్‌లోని గో ల్కొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోథ్, నాగరెడ్డిపేటల్లో 3 సెంటీమీటర్లు, సరూర్‌నగర్, సంగారెడ్డి, ఉట్నూరులలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఈ వానలతో వర్షాధార పంటలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. పత్తి, సోయా, మొక్కజొన్న, కంది తదితర పంటలకు ప్రాణం పోసినట్లయింది. అయితే చెరువులు, కుంటలు, జలాశయాలపై ఆధారపడిన చోట్ల అవి ఇంకా నిండకపోవడంతో వరి నాట్లు పూర్తిస్థాయిలో పడలేదు. దీంతో చాలామంది రైతులు ఆందోళనలో ఉన్నారు. ఆగస్టులో 36 శాతం లోటు వర్షపాతం... రాష్ట్రంలో మోస్తరుగా వర్షాలు కురుస్తున్నా సాధారణంతో పోలిస్తే ఇప్పటికీ లోటు వర్షపాతమే రికార్డయింది. కాగా జూన్ నుంచి ఇప్పటివరకు 16 శాతం లోటు నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదవ్వగా, జూలైలో ఏకంగా 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 13 వరకు సాధారణం కంటే 36 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. జూన్‌లో సాధారణంగా 128.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 188.8 మి.మీ.లు నమోదైంది. జూలైలో 242.7 మి.మీ.లు కురవాల్సి ఉండగా, కేవలం 146.2 మి.మీ. వర్షమే కురిసింది. ఇక ఈ నెల 13 రోజుల్లో 91.6 మి.మీ. కురవాల్సి ఉండగా, కేవలం 58.3 మి.మీ. కురిసింది. రాష్ట్రంలోని మొత్తం 584 మండలాల్లో 259 మండలాల్లో సాధారణ వర్ష పాతం, 236 మండలాల్లో లోటు వర్షపాతం నమో దైంది. రెండు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెల కొన్నాయి. దీంతో ప్రస్తుత వర్షాలు వర్షాభావ పంటలకే ప్రయోజనం కలిగిస్తున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండే పరిస్థితి లేకుండా పోయింది. ఆ 2 జిల్లాలు మినహాయిస్తే.. పాత జిల్లాల ప్రకారం జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే కురవాల్సిన దానికన్నా అధిక వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో కురవాల్సిన దాని కన్నా.. తక్కువ వర్షపాతమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు పాత జిల్లాల ప్రకారం కురిసిన వర్షం (మి.మీ.లలో) జిల్లా కురవాల్సింది కురిసింది తేడా (శాతం) ఆదిలాబాద్ 626.3 420.7 –33 హైదరాబాద్ 370.4 409.6 +11 కరీంనగర్ 512.4 390.6 –24 ఖమ్మం 555.0 588.1 +6 మహబూబ్‌నగర్ 316.6 264.5 –16 మెదక్ 459.5 388.8 –15 నల్లగొండ 318.2 287.6 –10 నిజామాబాద్ 579.9 403.7 –30 రంగారెడ్డి 369.8 326.9 –12 వరంగల్ 522.2 486.1 –7 మొత్తం 470.6 396.7 –16 -
నేడు, రేపు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ► వాతావరణ కేంద్రం వెల్లడి సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, వచ్చే రెండు రోజుల్లో ఇది మరింత బలపడుతుం దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిం ది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురు స్తాయని వెల్లడించింది. ఆ తర్వాత రెండ్రోజు లు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంది. 18వ తేదీన కోస్తాంధ్రకు ఆనుకుని ఉన్న.. తెలం గాణలోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు (20 సెంటీమీటర్ల వరకు) కురిసే అవకాశ ముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిం ది. అల్పపీడన ప్రభావంతో కురిసే భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 12 శాతం అధిక వర్షపాతం నమోదైనా వరదలు రాక పోవడంతో ఎక్కడా జలాశయాలు, చెరువులు, కుంటలు నిండలేదు. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణంగా కురవా ల్సిన వర్షం 245.5 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 275.8 మి.మీ. నమోదైంది. మణుగూరులో 7 సెంటీమీటర్ల వర్షం... గత 24గంటల్లో మణుగూరులో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పినపాక, శాయం పేటల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయిం ది. ఆత్మకూర్, నల్లబెల్లిల్లో 5 సెంటీమీటర్లు, కోయిదా, భద్రాచలంలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. బిక్నూరు, నర్సం పేట, మెదక్, చెన్నారావుపేట, గూడూరు, హుజూరాబాద్, దుమ్ముగూడెం, ధర్మాసాగర్, హసంపర్తి, పాల్వంచ, నాగారెడ్డిపేట, గార్ల, బూర్గుంపాడు, అశ్వాపురం, కొత్తగూడెం, ఖానాపూర్, మహబూబాబాద్‌లలో 3 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండితేనే నాట్లు అధిక వర్షపాతం నమోదైనా రైతులు ఆరుతడి పంట విత్తనాలు మాత్రమే చల్లుకున్నారు. వరి నాట్లు మాత్రం ఊపందుకోలేదు. బోర్లు, బావుల కిందే వరి నాట్లు పడుతున్నాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 2.32 లక్షల ఎకరాల్లో (10%) మాత్రమే సాగైంది. అలాగే ఆరుతడి పంటలు వేసినా ప్రస్తుతం వర్షాలు అనుకున్నంత మేర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.12 లక్షల ఎకరాల్లో (84%) సాగైంది. సోయాబీన్ 58 శాతం సాగైంది. వీటికి కీలకమైన సమయంలో వర్షాలు కావల్సి ఉంది. ఆయా పంటలు సాగు చేసిన రైతులంతా ఇప్పుడు భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. -
నేడు భారీ వర్ష సూచన..
నాలుగు రోజులుమోస్తరు వర్షాలు ♦ బోథ్‌లో అత్యధికంగా 7 సెం.మీ. వర్షపాతం ♦ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ♦ ఈ సీజన్లో ఇప్పటివరకు 54 శాతం అధిక వర్షపాతం హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడు రోజులు చాలాచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో బోథ్‌లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కోయిదాలో 6, నిజాంసాగర్‌లో 5, ఉట్నూరు, హసన్‌పర్తి, జుక్కల్, శాయంపేట, పిట్లం, వెంకటాపూర్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి, సత్తుపల్లి, పర్కాల్, రామాయంపేట, భీంగల్, సారంగాపూర్, నాగరెడ్డిపేట, ఆత్మకూర్, ఖానాపూర్, బాన్స్వాడ, మధిర, బిక్నూర్లలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 54 శాతం అధిక వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తుండటంతో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 117.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఏకంగా 181 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ మేరకు 54 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పాత జిల్లాల ప్రకారం మహబూబ్‌నగర్‌లో సాధారణంగా 79.7 మి.మీ. కురవాల్సి ఉండగా, 152.2 మి.మీ. (91 శాతం అధికంగా) కురిసింది. రంగారెడ్డి జిల్లాలో సాధారణంగా 96.2 మి.మీ. కురవాల్సి ఉండగా, 173.8 మి.మీ. (81 శాతం అధికంగా) కురిసింది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే అధికంగా కురవడంతో ఈ వ్యవసాయ సీజన్ రైతులకు మరింత కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు గతేడాది జూన్‌లో అధికంగా వర్షాలు కురిసినా, జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం ముఖం చాటేశాయి. దీంతో రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తినా నీరు లేక వాడిపోయాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక రెండు మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఈసారి జూలై, ఆగస్టు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. జూలైలో ఇదే మోస్తరు వర్షాలు కురిస్తే రైతు వేసిన పంటలకు ఢోకా ఉండదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
4 రోజులు భారీ వర్షాలు
► చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు ►ఉట్నూరులో 10 సెం.మీ.ల వర్షపాతం ►ఊపందుకున్న నైరుతి ►రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు భారీ వర్షాలు సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఊపందుకున్నాయి. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, అందుకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని తెలిపారు. రుతుపవనాలు ప్రవేశించాక వెంటనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవంగా రుతుపవనాలు ప్రవేశించాక రాష్ట్రమంతటా విస్తరించేందుకు ఒక్కోసారి ఐదారు రోజులు పడుతుంది. కానీ మొదటి రోజు నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు సాధారణంగా 39.2 మి.మీ. వర్షపాతం నమోదవాల్సి ఉండగా 87.5 మి.మీ. రికార్డయింది. ఈ 13 రోజుల్లో ఏకంగా 123 శాతం వర్షపాతం నమోదైంది. జూన్ నెల మొత్తం సాధారణంగా 135.9 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా ఇప్పటికే 87.5 మి.మీ. రికార్డయింది. కాగా, గత 24 గంటల్లో ఉట్నూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూరు, నారాయణఖేడ్లలో 9, ఆదిలాబాద్‌లో 8, గుండాల, మాచారెడ్డిలలో 7, సిరిసిల్ల, ముస్తాబాద్‌లలో 6, పాలకుర్తి, తాడ్వాయి, తిమ్మాపూర్, జుక్కల్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున రికార్డయింది. మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం హైదరాబాద్, మెదక్, హన్మకొండలలో పగటి ఉష్ణోగ్రత 29 డిగ్రీలు నమోదైంది. రామగుండంలో సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా 31 డిగ్రీలు రికార్డయింది. -
మరో నాలుగు రోజులు శగలే శగలు
► హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాడ్పుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రోహిణీ కార్తె దగ్గర పడుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్నిచోట్లా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలోనూ సాధారణం కంటే 4.8 డిగ్రీలు ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఏడు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మంగళవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. భద్రాచలం, ఖమ్మం, నల్లగొండల్లో సోమవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
-
నడినెత్తిన నిప్పులే..
- రాష్ట్రంలో మండుతున్న ఎండలు - ఆదిలాబాద్‌లో 44.4 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఆదివారం అనేక చోట్ల 43, 44 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధి కంగా ఆదిలాబాద్‌లో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో 44 డిగ్రీలు, రామగుండంలో 43.4, నల్ల గొండ, మెదక్‌లో 43, ఖమ్మం, భద్రాచలంలో 42, హకీంపేట 41, హన్మకొం డలో 40.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వడగాడ్పులు వీస్తాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోద వుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నగరంలో 42.4 డిగ్రీలు.. గ్రేటర్‌పైనా ప్రచండభానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆదివారం హైదరా బాద్‌లో గరిష్టంగా 42.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణో గ్రత ఇదే. మండుటెండకు వేడి గాలులు తోడవ్వడంతో నగరవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. ఎండతీవ్రత పెరగ డంతో ఆదివారం మధ్యాహ్నం పలు ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిం చాయి. మరోవైపు రాగల 48 గంటల పాటు నగరంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బతో ముగ్గురు మృతి సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకకు చెందిన తాళ్లపల్లి దానయ్య(70) శనివారం పశువుల మేతకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం వేకువజామున మృతి చెందాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామానికి చెందిన మామిడాల మల్లయ్య(68) ఆదివారం వ్యవసాయ పనుల కోసం వెళ్లి ఎండతీవ్రతతో అస్వస్థతకు గురై చనిపో యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన ఒగ్గు బుచ్చిరాజం (55) శనివారం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చి నలతగా ఉందని చెప్పాడు. ఉదయం చూడగా, చనిపోయి ఉన్నాడు. -
రేపు వడగాడ్పులు వీచే అవకాశం
హైదరాబాద్: తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో ఒకటి రెండుచోట్ల వడగాడ్పులు వీస్తాయని, పలుచోట్ల ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర మంతటా పలుచోట్ల, ఉష్ణోగ్రతలు 41 పైనే నమోదై, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-4 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశముందన్నారు. నేడు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో ఆదిలాబాద్ జిల్లా నిప్పులగుండంలా మారింది. ఆదిలాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వీడని ముంపు
- ఇంకా జల దిగ్బంధంలోనే చాలా కాలనీలు - భండారీ లేఅవుట్ వాసులకు తప్పని ఇబ్బందులు - విద్యుత్ పునరుద్ధరణపై చేతులెత్తేసిన అధికారులు - రంగంలోకి దిగిన సైనిక, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు - సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు - మరో మూడు రోజులు భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణ శాఖ సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వర్షాలు, వరద నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం వర్షాల జోరు తగ్గినా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఆహారం, తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. నాలాలు పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. కూకట్పల్లి, నిజాం పేట్, భండారీ లేఅవుట్, మల్కాజిగిరి, అల్వాల్ ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. భారీగా నీరు చేరడంతో రహదారులు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గోతులు పడడం తో వాహనాలు ప్రమాదాల బారినపడుతున్నాయి. జీడిమెట్ల ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గొయ్యిలో పడి శనివారం ఒక వ్యాన్ బోల్తా పడింది. ఇక ప్రభుత్వం కూడా సహాయ చర్యలను ముమ్మరం చేసింది. సైన్యంతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగాయి. పలు చోట్ల బాధితులకు అవసరమైన సహాయం అందించడంతోపాటు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.. మందులు అందించారు. మరోవైపు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలు పాఠశాలల యాజ మాన్యాలు స్కూళ్లను నడుపుతున్నాయి. శనివారం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ఓ ప్రైవేటు స్కూలు బస్సు పిల్లలను తీసుకెళుతూ ధరణీ నగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి దాదాపు 40 మంది చిన్నారులను కాపాడారు. మరో 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రంగంలోకి దిగిన సైన్యం వర్షాలతో అల్లాడుతున్న నగరంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు శనివారం సైన్యంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందా లు రంగంలోకి దిగాయి. అల్వాల్, నిజాంపేట్, బేగంపేట్, హకీంపేటలలో నాలుగు ప్రత్యేక బృందాలు ప్రత్యేక బోట్లు, మెడికల్ కిట్లు, ఇతర సామగ్రితో సహాయక చర్యలు ప్రారంభించాయి. బాధితులకు ఆహార పదార్థాలు అందించడం, వైద్య శిబిరాలకు తరలించడంతో పాటు ఇళ్లు, బస్తీల్లో నిలిచిపోయిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. మరో సైనిక బృందం హుస్సేన్‌సాగర్ వద్ద పరిస్థితిని పరిశీలించింది. దిగువకు నీటిని వదులుతున్నందున.. ఆయా ప్రాంతాల్లో నాలాలను ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీలు ముంపునకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించింది. బేగంపేట నాలా పరిధిలోని వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడి, పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్, మక్తా తదితర ప్రాంతాల్లో పరిశీలన జరిపారు. నాచారం, లాలాపేట్ తదితర ప్రాంతాల్లోని బాధిత ప్రజలకు ఆహార పదార్థాలు అందజేశారు. చీకట్లోనే భండారీ లేఅవుట్: జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన భండారీ లేఅవుట్లో పరిస్థితి దుర్భరంగానే ఉంది. 80 శాతం మంది ఫ్లాట్లకు తాళాలు వేసి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా... మిగతావారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సెల్లార్లలో నీటిని తోడేస్తున్నా.. వరద నీటితో మళ్లీ నిండిపోతుండడంతో విద్యుత్ పునరుద్ధరణ విషయంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో అనేక అపార్ట్మెంట్లు చీకట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఇళ్ల మధ్య, రహదారులపై దాదాపు అడుగు లోతున బురద, డ్రైనేజీ చెత్త నిండిపోవడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో అంటువ్యాధులు తలెత్తుతాయేమోనన్న భయంలో ఇక్కడివారు గడుపుతున్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ ఆరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.. మందులు పంపిణీ చేసింది. ఇంకా వీడని భయం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని బస్తీల నిండా మురుగునీరు, చెత్తా చెదారం పేరుకుపోయాయి. అయోధ్యనగర్, గంపల బస్తీ, సుభాష్‌నగర్ నాలా ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. నాచారం ప్రధాన మార్గంలోని కల్వర్టు నాలుగు రోజులుగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూనే ఉంది. దీంతో శనివారం కూడా ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. ఇక్కడి రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల నిండా నీరే.. వర్షం కాస్త తగ్గినా అల్వాల్ ప్రాంతంలో చాలా కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మోత్కులకుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయుని చెరువుల్లో నీటి చేరిక తగ్గింది. వెంకటాపురంలోని దినకర్‌నగర్, రాంచంద్రయ్య కాలనీ, వెస్ట్ వెంకటాపురం కాలనీ, శివానగర్, కానాజిగూడ ప్రాంతాల్లో వరద కొద్దిగా తగ్గింది. అయితే ఓల్డ్ అల్వాల్‌లోని భారతీనగర్, శ్రీనివాసనగర్, ఆనందరావునగర్, బొల్లారం తుర్కపల్లి, బుడగ జంగాల కాలనీ, బటన్‌గూడ ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. అల్వాల్‌లోని ముంపు ప్రాంతాల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. -
మరో ఐదు రోజులు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణ వ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ఏర్పడటంతో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. హైదరాబాద్ నగరంలోనూ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇటీవల నగరంలో ఏకధాటిగా మూడు గంటల పాటు 7 సెంటీమీటర్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఒకేసారి అంత వర్షం కురవడంతో నగరం అతలాకుతమైంది. ఈసారి కూడా ఒకేసారి ఏకధాటిగా వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదని... కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ శాఖలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరద సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం లను మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చూడాలని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు, జోనల్ అధికారులకు, ఇంజనీర్లకు ప్రత్యేకంగా సూచనలు పంపారు. వరద సహాయ బృందాలు, వాహనాలను అందుబాటులో ఉంచేలా చూడాలని అన్నారు. అనుకోని సంఘటలను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బక్రీద్, గణేశ్ నిమజ్జనం ఉన్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
-
మరో 48 గంటలు వర్షాలు..!
- తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని దీని కారణంగా నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. రుతుపవనాల కారణంగా తెలంగాణ తో పాటు.. కోస్తా, రాయల సీమలలో సైతం వర్షాలు పడే అవకావం ఉందరన్నారు. కాగా.. బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. -
నెలాఖరు వరకు వానలు పడతాయ్
నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయన్నారు. ఫలితంగా పలుచోట్ల గాలులతో కూడిన వానలు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే నెల నుంచి మళ్లీ రుతుపవనాలు పుంజుకుంటాయని, దీంతో మళ్లీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. తమ అంచనా ప్రకారం ఈ సారి సీజన్ ఆశాజనకంగానే ఉందని చెప్పారు. రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర భారతం వైపు వెళ్లాయని, అది సాధారణంగా సీజన్లో జరిగే ప్రక్రియేనని పేర్కొన్నారు. -
మత్య్సకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక
విశాఖ: ఆంధ్రప్రదేశ్ లో ఈశాన్య రుతుపవనాలు బలంగా వీస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు గాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్య్స కారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
ఆంధ్రప్రదేశ్‌కు ఈశాన్య రుతుపవనాల రాక
హైదరాబాద్/చెన్నై: రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో శనివారం ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించాయి. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో రాయలసీమ,కొన్ని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిశాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారి నరసింహారావు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రవేశించాయని, దీంతో వచ్చే 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని చెప్పారు. -
కుప్పకూలిన సమాచార వ్యవస్థ
విశాఖపట్నం:హుదూద్ తుపాను సృష్టించిన ప్రళయం విశాఖలోని వాతావరణ కేంద్రానికీ ఆటంకం కలిగించింది. సిబ్బంది విధులు నిర్వహించలేని పరిస్థితిని కల్పించింది. ఆదివారం హుదూద్ తుపాను తీరం దాటిన కొద్దిసేపటికే ఇక్కడి సమాచార వ్యవస్థ కుప్పకూలింది. కైలాసగిరిపై ఉన్న రాడార్ వ్యవస్థకూ ఆ సెగ తాకింది. తుపాను అనంతరం వచ్చిన వర్షం, గాలుల కారణంగా అప్పటికే రాడార్ కార్యాలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది బయటకు రాలేకపోయారు. కార్యాలయం వద్ద భారీగా నీరు చేరింది. చెట్లు కూలిపోయాయి. అద్దాలు పగిలిపోయాయి. ఫలితం గా రాడార్ సాయంతో గ్రాఫ్, మ్యాప్‌ల ద్వారా వాతావరణ సమాచారాన్ని సేకరించాల్సిన అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సమీపంలో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ కేబుల్ వ్యవస్థ నిలిచిపోవడంతో తుపాను అనంతరం వాతావరణంలో కలిగే మార్పుల్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇన్వర్టెర్ ద్వారా మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా కీలక సమాచారాన్ని తెలియజేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారులకు వాతావరణశాఖ అధికారులు విజ్ఞప్తి చేసినా సమీపంలో ఉన్న కేబులింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని, మరో 24 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ట్రాన్స్మిషన్ పనిచేస్తున్నా ఫలితాలు రావడం లేదని కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. నేడూ వర్షాలు!: హుదూద్ తుపాను ప్రభావం మంగళవారం కూడా కొనాసాగే అవకాశం ఉందని, ఫలితంగా తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంటుందన్నారు. -
మత్స్యకారులకు వాతావరణ కేంద్రం హెచ్చరిక
విశాఖపట్నం: రాగల 24 గంటలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం తదితరప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది మరింత బలపడి ఒకటి, రెండు రోజులలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ, కోస్తాఆంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ** -
పగలు గరం గరం - సాయంత్రం వర్ష రాగం
రోజూలాగే మంగళవారం పగలంతా భానుడు భగభగలాడి నగరజీవుల్ని ‘ఉక్క’రి బిక్కిరి చేశాడు.42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రతాపం చూపాడు. సాయంత్రం నాలుగు గంటల వరకూ నిప్పులు చెరిగాడు. అప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లని మేఘాలు దట్టంగా అలముకుని చల్లటి గాలులతో ఆహ్లాదాన్ని కలిగించాయి. ఉరుములు, మెరుపులతో అరగంటపాటు భారీగానే వర్షం కురిసి వెలిసింది. మండు వేసవిలో ఈ అనుకోని వాన నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. - సాక్షి, విశాఖపట్నం ఎండ.. వాన పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు వర్షపాతం 2 సెం.మీ. సాయంత్రం సేదతీరిన జనం విశాఖపట్నం : భానుడి భగభగలకు పగలంతా నగరంలో సెగలు రేగాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జనం భయపడ్డారు. వాల్తేరులో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదుకాగా, విమానాశ్రయం వద్ద 42 డిగ్రీలు నమోదయింది. తీవ్ర వడగాల్పులు కూడా ఆవరించి ఉండడంతో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. ఇదంతా సా యంత్రం వరకే. సాయంత్రానికి ఆకాశం మబ్బుల ముసుగేసుకుంది. ఆరంభంలో ఉరుములు.. మెరుపులు.. ఈదురు గాలులతో కాసేపు బీభత్స వాతావరణం అలముకుంది. అనంతరం మొదలైన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. రోడ్లు కాల్వలు పొంగిపొర్లాయి. వెంకటేశ్వరమెట్ట, కనకలదిబ్బ, నీలమ్మవేపచెట్టు, సీ హార్స్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో మంగళవారంనాటి భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగాయి. సాయంత్రం కురిసిన వర్షపాతం విమానాశ్రయం వద్ద 2 సెం.మీ.గా నమోదయినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ కోతలు తోడయ్యాయి పగటి పూట ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ కోతలతో నగరవాసులు నరకం చవి చూశారు. గత కొన్ని రోజులుగా వడగాల్పుల వాతావరణంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యవసర కోతలు అమలు చేస్తున్నారు. నగరంలో పగటిపూట విడతలవారీ సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ కోతలు విధించారు. సాయంత్రం వాన బీభత్సానికి ముందు జాగ్రత్త చర్యలుగా విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆ సమయంలో వర్షం పడుతుండటం.. అంతకు ముందు నుంచే వాతావరణం చ ల్లబడటంతో కాస్త ఉపశమనం కలిగినట్టయింది. -
బెంగాల్, ఒడిశాల్లో తెరిపినివ్వని వర్షాలు
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలు ఇంకా తెరిపినివ్వడం లేదు. ఒడిశాలోని 13 జిల్లాలు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, పరిసర జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వర్షాలు, వరదల కారణంగా ఒడిశాలో మరణించిన వారి సంఖ్య అరవైకి చేరుకుంది. పై-లీన్ తుపాను తాకిడి తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిన కొద్దిరోజులకే వర్షాలు ముంచెత్తడంతో ఒడిశా అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా నయాగఢ్, జాజ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో శనివారం ఇద్దరేసి మృతి చెందగా, మయూర్భంజ్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. కోల్‌కతాలో ఇద్దరు, బుర్ద్వాన్ జిల్లాలో ఒకరు మరణించారు. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుషికుల్యా, గొడాహడ, వంశధార వంటి నదులు వరదలతో పొంగి పొర్లుతుండటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించగా, కొన్ని రైళ్లు రద్దయ్యాయి. భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, హౌరా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసినట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రకటించింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని పింఛనుదారులకు వచ్చేనెల అదనంగా ఒకనెల పింఛను చెల్లించనున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.