
నేడు భారీ వర్ష సూచన..
నాలుగు రోజులుమోస్తరు వర్షాలు
♦ బోథ్‌లో అత్యధికంగా 7 సెం.మీ. వర్షపాతం
♦ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
♦ ఈ సీజన్లో ఇప్పటివరకు 54 శాతం అధిక వర్షపాతం
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడు రోజులు చాలాచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో బోథ్‌లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కోయిదాలో 6, నిజాంసాగర్‌లో 5, ఉట్నూరు, హసన్‌పర్తి, జుక్కల్, శాయంపేట, పిట్లం, వెంకటాపూర్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి, సత్తుపల్లి, పర్కాల్, రామాయంపేట, భీంగల్, సారంగాపూర్, నాగరెడ్డిపేట, ఆత్మకూర్, ఖానాపూర్, బాన్స్‌వాడ, మధిర, బిక్నూర్‌లలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
54 శాతం అధిక వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తుండటంతో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 117.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఏకంగా 181 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ మేరకు 54 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పాత జిల్లాల ప్రకారం మహబూబ్‌నగర్‌లో సాధారణంగా 79.7 మి.మీ. కురవాల్సి ఉండగా, 152.2 మి.మీ. (91 శాతం అధికంగా) కురిసింది. రంగారెడ్డి జిల్లాలో సాధారణంగా 96.2 మి.మీ. కురవాల్సి ఉండగా, 173.8 మి.మీ. (81 శాతం అధికంగా) కురిసింది.
అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే అధికంగా కురవడంతో ఈ వ్యవసాయ సీజన్ రైతులకు మరింత కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు గతేడాది జూన్‌లో అధికంగా వర్షాలు కురిసినా, జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం ముఖం చాటేశాయి. దీంతో రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తినా నీరు లేక వాడిపోయాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక రెండు మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఈసారి జూలై, ఆగస్టు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. జూలైలో ఇదే మోస్తరు వర్షాలు కురిస్తే రైతు వేసిన పంటలకు ఢోకా ఉండదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.